ఒక చిట్టెలుక అలా షికారుకి బయలుదేరింది. దాని ముందు నుంచే వేగంగా ఒక కుందేలు వెళ్లింది. అది అలా వెళ్తుంటే దాని చెవులు అటూ ఇటూ ఊగుతూ అందంగా ఉన్నాయనుకుంది ఎలుక. ఒకచోట కుందేలు విశ్రాంతిగా కూర్చొన్నప్పుడు ఎలుక దానితో ‘నీ చెవులు చాలా అందంగా ఉన్నాయ’ని మెచ్చుకుంది. కుందేలు నవ్వి ‘నా చెవులనే మెచ్చుకుంటున్నావా! జింక చెవులను చూస్తే ఏమంటావో మరి’ అంది. ఎలుక ఆశ్చర్యంతో ‘నీకన్నా పెద్ద చెవులా జింకవి?’ అని ప్రశ్నించింది. జింకకు పొడుగాటి చెవులు, దాని వెనుక కొమ్మల్లాగా ఒంపు తిరిగిన కొమ్ములూ ఉంటాయి.. చూడముచ్చటగా’ చెప్పింది కుందేలు.
దాంతో చిట్టెలుకకు జింక చెవులను చూడాలనిపించింది. కుందేలుతో ‘నాకు జింకను చూపించగలవా?’ అని అడిగింది. ‘ఈ అడవిలో నాకు పరిచయం ఉన్న జింక ఉండాలి. వెతుకుదాం.. పద’ అంది కుందేలు. ‘సరే’ అంటూ ఉత్సాహంగా కుందేలు వెంట బయలుదేరింది ఎలుక. కొంత దూరం వెళ్లాక.. దూరంగా కొమ్ములున్న జింక కనిపించింది. కుందేలు, ఎలుక రెండూ జింక దగ్గరికి వెళ్లాయి. కుందేలు జింకతో ‘మిత్రమా! ఈ చిట్టెలుక నీ అందమైన చెవులను చూడాలనుకుంది. అందుకే వచ్చాం’ అని చెప్పింది.
జింకను చూడగానే దాని పొడవాటి కొమ్ములు, వాటి ముందున్న చెవులు పెద్దగా.. అందంగా కనిపించాయి చిట్టెలుకకు. అదే విషయాన్ని జింకతో చెప్పింది. అప్పుడు జింక ‘నా చెవులనే పెద్దవంటున్నావా? ఇంక ఏనుగు చెవులను చూస్తే ఏమంటావో? ఏనుగు చెవులంటే నాకు చాలా ఇష్టం.. భలే ఉంటాయి’ అంది జింక. ‘అవునా.. మరైతే మాకూ చూపించవా ఏనుగును?’ అని అడిగాయి కుందేలు, ఎలుక. ‘పదండి.. పక్కనే ఉన్న కొండ దగ్గర ఏనుగు ఉంటుంది. చూసి, పలకరించి వద్దాం’ అంటూ వాటిని వెంటబెట్టుకుని ముందుకు నడిచింది జింక. అలా ఆ మూడూ ఏనుగును చేరాయి.
ఏనుగును చూడగానే చిట్టెలుక, కుందేలు ‘జింక చెప్పినట్టే భలే ఉన్నాయి దీని చెవులు చేటల్లా! విసనకర్రల్లా ఊగుతున్నాయి’ అనుకుంటూ ఆశ్చర్యపోయాయి. అంతలో అక్కడికి ఒక కోతి వచ్చింది. అవి కోతిని ‘మాలో ఎవరి చెవులు అందమైనవి?’ అని అడిగాయి. అప్పుడే భయంగా అరుస్తూ ఒక నెమలీ అక్కడికి వచ్చింది. ‘ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావ్? నీకొచ్చిన ఆపదేంటీ’ అని అనునయంగా అడిగాయి ఆ జంతువులన్నీ! ‘నా శరీరంపై ఉన్న ఈ ఈకల కోసం నన్ను చంపడానికి వేటగాళ్లు వెంటపడుతున్నార’ ని చెప్పింది నెమలి.
వెంటనే ఎలుక ‘నువ్వు వలలో చిక్కుకున్నా దాన్ని కొరికి నిన్ను కాపాడుతాను. భయపడకు’ అని అభయం ఇచ్చింది. ‘నాతో పాటు నువ్వూ నా పొదలో ఉండొచ్చు. అక్కడ నీకు ఏ ఆపదా రాదు’ అంటూ కుందేలు ధైర్యం చెప్పింది. జింకేమో ‘మేమంతా నీకు అండగా ఉంటాం’ అని మాటిచ్చింది. ‘ఆ వేటగాళ్లను నా తొండంతో ఎత్తి పడేస్తాను. మళ్లీ నీ జోలికి రాకుండా చేస్తాను’ అంటూ హామీ ఇచ్చింది ఏనుగు. వాటి భరోసాతో నెమలి స్థిమితపడింది.
అప్పుడు కోతి ‘మొదట నెమలి అరుపును విన్నది ఎవరు?’ అని అడిగింది అన్నిటినీ! ఏనుగు, జింక, కుందేలు, ఎలుక నేనంటే నేనని చెప్పాయి. అలాగే నెమలిని ఆపద నుండి కాపాడుతామని ముందుగా చెప్పింది ఎవరని అడిగింది. అన్నీ ‘నెమలిని రక్షించాలనుకున్నామ’ని చెప్పాయి. ‘ఎదుటివారి బాధను విని, అర్థం చేసుకుని వారికి సాయం చేయలనుకునే వారందరి చెవులూ అందమైనవే’ అంటూ కోతి తీర్పు చెప్పి వెళ్లిపోయింది. — డా. నీరజ అమరవాది
Comments
Please login to add a commentAdd a comment