neeraja
-
బీజేపీ సేవలో ప్రభుత్వ వైద్యుని భార్య
ధర్మవరం: ప్రభుత్వ వైద్యుని భార్య బీజేపీ సేవలో తరిస్తున్నారు. ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప దంతవైద్యునిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య నీరజ కూడా డాక్టరే. అయితే ఆమె ప్రైవేట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున భార్య త్రివేణి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డాక్టర్ వివేక్ ఇంటివద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా దంతవైద్యుని సమక్షంలోనే ఆయన భార్య డాక్టర్ నీరజకు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ డాక్టర్ భార్య రాజకీయ పార్టీలో చేరడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ సమయంలో సమర్పించిన వివరాలలో భార్య పేరు ప్రస్తావించలేదు. పిల్లలు మాత్రమే ఉన్నట్లు పొందుపరిచారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం సత్యకుమార్ భార్యగా త్రివేణి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. -
ఫండే: పిల్లల కథ.. 'అందమైన చెవులు'
ఒక చిట్టెలుక అలా షికారుకి బయలుదేరింది. దాని ముందు నుంచే వేగంగా ఒక కుందేలు వెళ్లింది. అది అలా వెళ్తుంటే దాని చెవులు అటూ ఇటూ ఊగుతూ అందంగా ఉన్నాయనుకుంది ఎలుక. ఒకచోట కుందేలు విశ్రాంతిగా కూర్చొన్నప్పుడు ఎలుక దానితో ‘నీ చెవులు చాలా అందంగా ఉన్నాయ’ని మెచ్చుకుంది. కుందేలు నవ్వి ‘నా చెవులనే మెచ్చుకుంటున్నావా! జింక చెవులను చూస్తే ఏమంటావో మరి’ అంది. ఎలుక ఆశ్చర్యంతో ‘నీకన్నా పెద్ద చెవులా జింకవి?’ అని ప్రశ్నించింది. జింకకు పొడుగాటి చెవులు, దాని వెనుక కొమ్మల్లాగా ఒంపు తిరిగిన కొమ్ములూ ఉంటాయి.. చూడముచ్చటగా’ చెప్పింది కుందేలు. దాంతో చిట్టెలుకకు జింక చెవులను చూడాలనిపించింది. కుందేలుతో ‘నాకు జింకను చూపించగలవా?’ అని అడిగింది. ‘ఈ అడవిలో నాకు పరిచయం ఉన్న జింక ఉండాలి. వెతుకుదాం.. పద’ అంది కుందేలు. ‘సరే’ అంటూ ఉత్సాహంగా కుందేలు వెంట బయలుదేరింది ఎలుక. కొంత దూరం వెళ్లాక.. దూరంగా కొమ్ములున్న జింక కనిపించింది. కుందేలు, ఎలుక రెండూ జింక దగ్గరికి వెళ్లాయి. కుందేలు జింకతో ‘మిత్రమా! ఈ చిట్టెలుక నీ అందమైన చెవులను చూడాలనుకుంది. అందుకే వచ్చాం’ అని చెప్పింది. జింకను చూడగానే దాని పొడవాటి కొమ్ములు, వాటి ముందున్న చెవులు పెద్దగా.. అందంగా కనిపించాయి చిట్టెలుకకు. అదే విషయాన్ని జింకతో చెప్పింది. అప్పుడు జింక ‘నా చెవులనే పెద్దవంటున్నావా? ఇంక ఏనుగు చెవులను చూస్తే ఏమంటావో? ఏనుగు చెవులంటే నాకు చాలా ఇష్టం.. భలే ఉంటాయి’ అంది జింక. ‘అవునా.. మరైతే మాకూ చూపించవా ఏనుగును?’ అని అడిగాయి కుందేలు, ఎలుక. ‘పదండి.. పక్కనే ఉన్న కొండ దగ్గర ఏనుగు ఉంటుంది. చూసి, పలకరించి వద్దాం’ అంటూ వాటిని వెంటబెట్టుకుని ముందుకు నడిచింది జింక. అలా ఆ మూడూ ఏనుగును చేరాయి. ఏనుగును చూడగానే చిట్టెలుక, కుందేలు ‘జింక చెప్పినట్టే భలే ఉన్నాయి దీని చెవులు చేటల్లా! విసనకర్రల్లా ఊగుతున్నాయి’ అనుకుంటూ ఆశ్చర్యపోయాయి. అంతలో అక్కడికి ఒక కోతి వచ్చింది. అవి కోతిని ‘మాలో ఎవరి చెవులు అందమైనవి?’ అని అడిగాయి. అప్పుడే భయంగా అరుస్తూ ఒక నెమలీ అక్కడికి వచ్చింది. ‘ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావ్? నీకొచ్చిన ఆపదేంటీ’ అని అనునయంగా అడిగాయి ఆ జంతువులన్నీ! ‘నా శరీరంపై ఉన్న ఈ ఈకల కోసం నన్ను చంపడానికి వేటగాళ్లు వెంటపడుతున్నార’ ని చెప్పింది నెమలి. వెంటనే ఎలుక ‘నువ్వు వలలో చిక్కుకున్నా దాన్ని కొరికి నిన్ను కాపాడుతాను. భయపడకు’ అని అభయం ఇచ్చింది. ‘నాతో పాటు నువ్వూ నా పొదలో ఉండొచ్చు. అక్కడ నీకు ఏ ఆపదా రాదు’ అంటూ కుందేలు ధైర్యం చెప్పింది. జింకేమో ‘మేమంతా నీకు అండగా ఉంటాం’ అని మాటిచ్చింది. ‘ఆ వేటగాళ్లను నా తొండంతో ఎత్తి పడేస్తాను. మళ్లీ నీ జోలికి రాకుండా చేస్తాను’ అంటూ హామీ ఇచ్చింది ఏనుగు. వాటి భరోసాతో నెమలి స్థిమితపడింది. అప్పుడు కోతి ‘మొదట నెమలి అరుపును విన్నది ఎవరు?’ అని అడిగింది అన్నిటినీ! ఏనుగు, జింక, కుందేలు, ఎలుక నేనంటే నేనని చెప్పాయి. అలాగే నెమలిని ఆపద నుండి కాపాడుతామని ముందుగా చెప్పింది ఎవరని అడిగింది. అన్నీ ‘నెమలిని రక్షించాలనుకున్నామ’ని చెప్పాయి. ‘ఎదుటివారి బాధను విని, అర్థం చేసుకుని వారికి సాయం చేయలనుకునే వారందరి చెవులూ అందమైనవే’ అంటూ కోతి తీర్పు చెప్పి వెళ్లిపోయింది. — డా. నీరజ అమరవాది ఇవి కూడా చదవండి: మిస్టరీ: ఓక్చా వోర్ట్మన్! -
బీఆర్ఎస్లో గౌరవం దక్కడం లేదు
కామారెడ్డి: బీఆర్ఎస్లో సరైన గౌరవం దక్కడం లేదని, స్థానిక నాయకులు పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని బీబీపేట బీఆర్ఎస్ ఎంపీటీసీ 2 కొరివి నీరజ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన కనీస గౌరవంగా పిలువడం లేదని, పార్టీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని ఆమె వాపోయారు. ప్రొటోకాల్ ప్రకారం కూడా పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవ మాన పరుస్తున్నారన్నారు. బీ ఆర్ఎస్ మండల నేతల వల్లే ఇలాంటి అవమానం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమె భర్త నర్సింలు వీడియోలో మాట్లాడుతూ స్థానిక పార్టీ నేతలతోనే అవమానం ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. -
మెంటల్ హెల్త్ యాక్టివిజం
మనసుకు వైద్యం చాలా ముఖ్యం మానవ హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం పని చేసే యాక్టివిస్టులు ఉన్నారు. కాని ‘మెంటల్ హెల్త్’ బాగుండాలని పని చేసే యాక్టివిస్టులు తక్కువ. నీరజా బిర్లా– కుమార మంగళం బిర్లా భార్యగా కంటే ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్టు’గా వచ్చే గుర్తింపును ఎక్కువ ఇష్టపడతారు. ‘ఎంపవర్’ అనే సంస్థను స్థాపించి బాలల, మహిళల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్నారామె. ఇటీవల హైదరాబాద్‌లో జరిపిన సర్వేలో ఎమర్జెన్సీ నంబర్లకు కేవలం ఒక శాతం మాత్రమే మానసిక సమస్యలు చెప్పుకునే కాల్స్ వచ్చాయి. అంటే మనసుకు వచ్చిన ఆపదను ఇంకా ధైర్యంగా బయటకు చెప్పే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నీరజా బిర్లా ఏమంటున్నారో విందాం. ‘నా తొలి కాన్పు జరిగి కూతురు (అనన్యా బిర్లా) పుట్టాక నిజానికి అదొక పండగ వాతావరణంగా ఉండాలి. అదంరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఉన్నారు కూడా. కాని నేను మాత్రం ఎలాగో అయిపోయాను. నా ఒడిలో చందమామలాంటి బిడ్డ ఉన్నా నా మనసు రకరకాలుగా ఉండేది. ఊరికే ఏడుపు వచ్చేది. చాలా నిరాశగా అనిపించేది. చిరాగ్గా ఉండేది. ఇలా ఎందుకుందో నాకు తెలియలేదు. దీని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కాని చివరకు తెలిసింది అది ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అని! ఇలా చాలామంది స్త్రీలకు అవుతుందని. ఆ సంగతి నాకు ముందే తెలిస్తే నేను ఆ సమస్యను సరిగ్గా ఎదుర్కొని ఉండేదాన్ని. ధైర్యంగా ఉండేదాన్ని. బహిరంగంగా మాట్లాడేదాన్ని. నాలా ఎంతమంది బాధ పడుతున్నారో అనిపించింది. అప్పటి నుంచి దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఉన్న చైతన్యాన్ని గమనించడం మొదలుపెట్టాను. దాని గురించి ఎవరో పని చేయడం కాదనీ, మనమూ మనకు వీలైన పని చేయవచ్చని ఆరేళ్ల క్రితం ఎంపవర్ సంస్థ స్థాపించాను. పూర్తిగా మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం, సహాయం చేసే సంస్థ ఇది. ఈ సంస్థ వల్ల మంచి జరగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు 51 ఏళ్ల నీరజా బిర్లా. ఎన్నో ఏళ్లు సామాజిక సేవ, విద్య రంగాల్లో పని చేస్తున్న నీరజా బిర్లా ఇప్పుడు పూర్తిగా ‘ఎంపవర్’ (మైండ్ పవర్) సంస్థ ద్వారా చేయాల్సిన పని గురించే శ్రద్ధ పెడుతున్నారు. తనను తాను ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్’గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇద్దరు జర్నలిస్టులు ఆరేళ్ల క్రితం నీరజా బిర్లా ‘ఎంపవర్’ ఆవిర్భావం గురించి ప్రెస్‌మీట్ పెడితే ఇద్దరే జర్నలిస్టులు హాజరయ్యారు. ‘చూడండి... మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఎంత నిర్లక్ష్యం ఉందో. అదొక నిషిద్ధ విషయంగా కూడా ఉంటోంది. ఎవరైనా తమకు మానసిక అనారోగ్యం ఉందంటే పిచ్చి అని సమాజం ముద్ర వేస్తుందనే భయం ఇప్పటికీ పోలేదు. దీని గురించే ఎక్కువగా చైతన్యం కలిగించాలి. జ్వరం వస్తే ఎంత సులభంగా చెప్పుకుంటామో అంత సులభంగా చెప్పుకోగలగాలి. బండి మీద నుంచి కింద పడితే అందరూ పరిగెత్తి వెళ్లి ఎంత సహజంగా సాయం చేస్తారో... ‘‘యాంగ్జయిటీగా ఉంది, పానిక్‌గా ఉంది, డిప్రెషన్‌గా ఉంది’’ అంటే కూడా అంతే సహజంగా సాయం చేసేలా ఉండాలంటారు నీరజ. పిల్లల స్థాయి నుంచి ‘ఎంపవర్’ మొదలెట్టినప్పుడు నీరజ ఆలోచనలు స్కూలు స్థాయి నుంచి మానసిక ఆరోగ్యం గురించి చైతన్యం కలిగిస్తే చాలు అనేంతవరకే ఉన్నాయి. లెక్కల సిలబస్, సైన్స్ సిలబస్ ఉన్నట్టే మానసిక ఆరోగ్యం గురించి కూడా సిలబస్ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉండాలని ఆమె అనేక స్కూళ్లలో ఆ సిలబస్ పెట్టించారు. అంతే కాదు, పిల్లల కోసమే ప్రత్యేకమైన వర్క్‌షాప్స్ నిర్వహించారు. ‘అసలు అందరి కంటే ఎక్కువగా కౌమార దశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. ఆ వయసులోనే బాడీ షేమింగ్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్... ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా తలనొప్పి, జ్వరం లాంటి సమస్యలే అని వారికి తెలిస్తే వారు సులువుగా వాటిని ఎదుర్కొంటారు’ అంటారు నీరజా. అయితే పని కొనసాగే కొద్దీ ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు పిల్లలు, స్త్రీలు అని కాకుండా అన్ని దశల, వయసుల్లో ఉన్నవారికి అవసరం అనే అవగాహనకు వచ్చారు. ఆ మేరకు పనిచేస్తున్నారు. ఈమె సాగిస్తున్న ఈ ఉద్యమంలో కుమార్తె అనన్యా బిర్లా కూడా భాగస్వామి అయ్యింది. ఇటీవల జరుగుతున్న డిప్రెషన్ ఆత్మహత్యలను పరిశీలిస్తే మానసిక ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రతి చోటా చర్చలు, చైతన్య శిబిరాల అవసరం తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు, సంస్థలు ఆ దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. నగరాల్లో క్లినిక్‌లు ‘ఎంపవర్’ ఆధ్వర్యంలో నేరుగా వైద్య సహాయం అందించే క్లినిక్‌లను ముంబైలో 3 ఏర్పాటు చేశారు నీరజ.. ఆ తర్వాత కోల్కటా, బెంగళూరు, హైదరాబాద్, గోవా, పిలానీలలో క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీరు నేరుగా వైద్య సహాయం అందిస్తే కౌన్సిలర్ల వ్యవస్థను కూడా విస్తృతం చేసుకుంటూ వెళుతున్నారు. ‘మన దేశంలో సమస్య ఏమిటంటే మనకు మానసిక సమస్య ఉందని తెలిశాక వైద్యానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సైకియాట్రిస్ట్‌లు పెద్దగా అందుబాటులో కూడా ఉండరు. యాంగ్జయిటీ సమస్య ఉన్న మనిషి జీవితంలోని సమస్యలు ఎదుర్కొంటూ యాంగ్జయిటీని కూడా ఎదుర్కొంటూ బతకాల్సి రావడం చాలా కష్టం. కాని మన దగ్గర అలాగే జరుగుతుంటుంది. నడక, వ్యాయామం ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మన దగ్గర బలం అంటే శారీరక బలమే. కాని మానసిక బలం ముఖ్యం. శరీరానికి ఎలా వ్యాయామం అవసరమో మనసుకు అంతే వ్యాయామం అవసరం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటారు నీరజ . -
కమలం భవితవ్యానికి అసలు పరీక్ష
ప్రజలు ఆర్థికంగా తామెదుర్కొంటున్న కష్టనష్టాలను మర్చిపోవచ్చు కానీ ప్రభుత్వ అసమర్థత కారణంగా కోవిడ్–19 సమయంలో తమ ప్రియతములను కళ్లముందే కోల్పోవలసి రావడాన్ని మర్చిపోవడం కాదు కదా.. క్షమించడం కూడా కష్టసాధ్యమే. బాగ్ పట్, లక్నో.. యూపీలోని ఏ పట్టణంలోని ప్రజలనైనా కదిలించి చూడండి.. బీజేపీపై తీవ్ర ఆగ్రహం చోటుచేసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు బీజేపీ భవితవ్యాన్ని తేల్చివేయనున్నాయి. యోగిని ఢిల్లీకి పిలిపించడం ద్వారా యూపీలో ఇప్పటికే బీజేపీకి కలిగిన నష్టాన్ని పూడ్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ఒక్క చర్యద్వారా యూపీలో పరిస్థితి మొత్తంగా మారిపోతుందా? దేశ రాజకీయాల్లో మార్పు చేసుకోబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు బీజేపీ భవితవ్యాన్ని తేల్చివేయనున్నాయి. ఇంతవరకు జరి గిన తప్పులు సరిదిద్దుకుని బీజేపీ రాజకీయ రణరంగంలో పుంజుకుని తిరిగి లేచి నిలబడుతుందా లేదా అని నిర్ధారణ అయ్యేందుకు యూపీ ఎన్నికలు గీటురాయి కాబోతున్నాయి. ఇది అంత సులభం కాదు. మీరు మమతా బెనర్జీ అయినట్లయితే ప్రధానమంత్రిపైనే తీవ్ర విమర్శలు గుప్పించవచ్చు. కానీ మీరు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అయితే, ప్రత్యేకించి మీరు యోగి ఆదిత్యనాథ్ అయినట్లయితే మీకు అలాంటి అవకాశం ఉండదు. నరేంద్ర మోదీ తర్వాత హిందుత్వకు ప్రతీకగా యోగికి జాతీయస్థాయి గుర్తింపు ఉంది. గత వారం ఢిల్లీకి వెళ్లిన యోగి కేంద్రంతో సర్దుబాటుకోసం ప్రయత్నించారు. యోగి సందర్శన తక్షణ పలితం ఏమిటంటే, యూపీ కేబినెట్లో మార్పులు చేయాలన్న డిమాండును తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చిన యోగి.. కాస్త చల్లబడి మంత్రిమండలిలో మార్పులకు అంగీకరించారు. యూపీలో జరుగుతున్న తప్పులను మొత్తంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఏకరువుపెడుతూ యోగిని నిలదీసినంత పనిచేసింది. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పనంత కాలం యోగి యూపీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగవచ్చు, వచ్చే ఏడాది ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించవచ్చు. పైగా మరో ఏడు, ఎనిమిది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున నాయకత్వాన్ని మార్చడం అనేది నష్టదాయకంగా పరిణమించవచ్చు. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉమ్మడిగా యూపీలో పార్టీకి కలుగుతున్న నష్టనివారణను తమ చేతుల్లోకి తీసుకున్నారు. యూపీలో పరిస్థితిని అంచనా వేయడానికి లక్నో వెళ్లిన బీజేపీ నాయకులు బీఎల్ సంతోష్, రాధామోహన్ ముందు అతికొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడారు. ప్రధానంగా కోవిడ్ సెకండ్ వేవ్‌ని ఎదుర్కోవడంలో యోగి వైఫల్యంపై వీరు ధ్వజమెత్తారు. కొద్దిమంది బ్యూరోక్రాట్లకు బాధ్యతలు అప్పగించిన యోగి అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని వీరు ఆరోపించారు. యోగి తనకులానికి చెందిన రాజపుత్రుల పట్ల పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నారట. గతంలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాదవులు ప్రదర్శించిన దూకుడును ఇప్పుడు రాజపుత్రులు అవలంబిస్తున్నారని వీరి ఆరోపణ. దీంతో బీజేపీకి సాంప్రదాయికంగా మద్దతుదారులుగా నిలుస్తూ వచ్చిన బ్రాహ్మణులు పార్టీలో ప్రాధాన్యం కోల్పోయారని ఆరోపణ. ఈ నేపథ్యంలో యూపీ మంత్రిమండలిలో మార్పులు చోటు చేసుకోవడం తప్పదనిపిస్తుండటంతో ప్రధానికి అత్యంత విశ్వసనీయుడైన బ్యూరోక్రాట్–రాజకీయనేత ఏకే శర్మకు కీలక స్థానం కట్టబెట్టవచ్చు. లక్నోలో జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు ప్రధానికి చెప్పాలనే ఉద్దేశంతోనే శర్మను యూపీకి పంపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్రప్రభుత్వ కార్యదర్శి పదవికి శర్మ రాజీ నామా చేశారు. వెంటనే తనను బీజేపీ ఎమ్మెల్సీగా చేశారు. తనను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసి హోంశాఖను కట్టబెట్టాలని మోదీ కోరుకున్నారు. కానీ యోగి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత జితిన్ ప్రసాదకు కేబినెట్లో అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో పరాజయం నుంచి బయటపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జితిన్ ప్రసాద నిష్క్రమించారు. 2014, 2017, 2019 సంవత్సరాల్లో పోటీ చేసిన మూడు ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల ప్రయోజనాలను తాను పట్టించుకుంటానని సంకేతం పంపడానికి బీజేపీ జితిన్ ప్రసాద్ చుట్టూ హైప్ సృష్టించింది. ఎవరైనా పార్టీ మారి బీజేపీలో చేరితే సాధ్యమైనంత మేరకు వారి ప్రయోజనాలు కాపాడతామంటూ బలమైన సందేశాన్ని కూడా పంపినట్లయింది. రానున్న ఎన్నికల్లో తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఇతర పార్టీలకు చెందిన కీలకమైన నేతలను లాగేసుకోవడం అనేది బీజేపీ పోల్ వ్యూహంలో ఒక అంతర్గత భాగంగా ఉంటోంది. మాజీ కాంగ్రెస్ నేత హిమంతా బిశ్వ శర్మను అస్సాం సీఎంగా నియమించడం కూడా ఈ సందేశంలో భాగమే. కేంద్రమంత్రిగా జ్యోతిరాదిత్య సింధియాను తీసుకోవాలని బీజేపీ భావిస్తుండటం కూడా దీంట్లో భాగమే. గత సంవత్సరం 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చెక్కేయడం ద్వారా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన సింధియా తనకు బీజేపీ చేసిన పెద్ద వాగ్దానం ఫలించే రోజు కోసం నిరీక్షిస్తున్నారు. శివసేన, అకాలీదళ్, రామ్ విలాస్ పాశ్వాన్ వంటి మిత్రపక్షాలు కూటమి నుంచి నిష్క్రమించిన తర్వాత వాటిని భర్తీ చేసే అనేక వ్యాక్సిన్లు బీజేపీకి అందుబాటులో ఉంటూం డటం విశేషం. దేశంలో మరో ఎన్నికల సీజన్ సమీపిస్తోంది. 2022లో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజ రాత్, జమ్మూకశ్మీర్‌లలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటన్నింటిలో యూపీ ఎన్నికలే 2024లో బీజేపీ అవకాశాలను తేల్చివేయనున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. వీటికి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ వంటి రాష్ట్రాలను కూడా కలుపుకోవచ్చు. వీటికి తోడుగా ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారం కోల్పోయినట్లయితే 250 కంటే ఎక్కువ లోక్‌సభా స్థానాలున్న రాష్ట్రాలు ఆ పార్టీకి దూరమవుతాయి. ఇన్ని స్థానాలు తన చేతుల్లోచి చేజారితే బీజేపీకి చాలా కఠిన పరిస్థితి ఎదురవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలు చతుర్ముఖ పోరాటాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే కుర్మీల ఆధిపత్యంలోని అప్నాదళ్, నిషాద్ పార్టీ వంటి చిన్నాచితకా పార్టీలతో అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని యాదవేతర బీసీలు, అత్యంత వెనుకబడిన కులాలకు సంబంధించిన ఓటర్లు బీజేపీకి చాలా ముఖ్యంగా మారారు. ఇకపోతే మాయావతి ఒంటరిగానే పోటీ చేయవచ్చు. అన్ని లెక్కలు తేలాక బీజేపీ అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ సంఖ్య తగ్గినపక్షంలో ఆమె బీజేపీకే మద్దతు చేయవచ్చు. మరోవైపున సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్డీ ఇప్పటికే పొత్తుపట్ల అవగాహనకు వచ్చేశాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు ప్రత్యేకించి జాట్ రైతులు కిసాన్ ఆందోళనకు మద్దతు పలికిన ఆర్ఎల్డీ కొత్త చీఫ్ జయంత్ చౌదరికి మద్దతివ్వాలని చూస్తున్నారు. ఇక అఖిలేశ్ యాదవ్ విషయానికి వస్తే 2017లో లాగా కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తనకు ఎవరు ఎన్ని సీట్లు ఇవ్వగలరు అని వెతుకులాడుకునే స్థితిలో పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితంపై రాజకీయ పక్షాల భవితవ్యం ఆధారపడి ఉంది. బీజేపీ తన లోపాలను సరిదిద్దుకుని ఎంత సత్వర చర్యలు చేపడుతుందనే అంశంపైనే యూపీ–2022 ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇదంత సులభం కాదు. ముందే చెప్పినట్లు ప్రజలు ఆర్థిక నష్టాలు, కష్టాలను తట్టుకుంటారు, మర్చిపోతారు కానీ తమ ప్రియతములు తమ కళ్లముందే చనిపోవడాన్ని భరించలేరు. ఈ విషయంలో ప్రభుత్వాల అసమర్థతను వారు అసలు క్షమించరు. యోగిని ఢిల్లీకి పిలిపించడం ద్వారా యూపీలో ఇప్పటికే బీజేపీకి కలిగిన నష్టాన్ని పూడ్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ఒక్క చర్య ద్వారా యూపీలో పరిస్థితి మొత్తంగా మారిపోతుందా? ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ బీజేపీకి యూపీలో నిజమైన సవాలు విసరనుందా అనేది తేలాల్సి ఉంది. నీరజా చౌదరి, సీనియర్ రాజకీయ వ్యాఖ్యాత (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
మన నైపుణ్యమే మనకు గుర్తింపు
నా జీవితాన్ని నాలుగు సెగ్మెంట్లుగా విభజించుకున్నాను. మొదటిది నా ప్రొఫెషన్, రెండు భార్యగా తల్లిగా నా ఇంటి బాధ్యత, మూడవది నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి దోహదం చేసే నా ప్యాషన్, నాలుగవది సాటి మహిళల కోసం స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సామాజిక బాధ్యత. ప్రొఫెషన్లో మన సర్వీస్ నూటికి నూరు శాతం ఇవ్వగలగాలంటే మన పర్సనల్ స్పేస్‌ను సంతృప్తి పరుచుకుంటూ ఉండాలి. తొమ్మిది భారతీయ భాషల్లో త్యాగరాజ కృతులు పాడినా, ఇంట్లో సీతారామ కల్యాణం చేసినా అవన్నీ నా సంతోషం కోసమే. పారిశ్రామికవేత్తగా కష్టపడేది నన్ను నేను గెలిపించుకోవడం కోసం. లా నన్ను నేను గెలిపించుకోవడం సాధ్యమయ్యేది నన్ను నేను సంతోషంగా ఉంచుకున్నప్పుడే. ఈ చిన్న చిట్కా తెలిస్తే జీవితంలో అసంతృప్తులు ఉండవన్నారు నీరజ గొడవర్తి. ఇటీవలే ఎమినెంట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్న నీరజ తన ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మాది మద్రాసులోని తెలుగు కుటుంబం. మా తాతగారు మద్రాసు నుంచి బాపట్ల వచ్చి స్థిరపడ్డారు. మా నాన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగరీత్యా తెలంగాణలో పెరిగాను. పెళ్లితో పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. సంగీతంలో ప్రవేశం ఉన్న కుటుంబం కావడంతో నేను కూడా కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న క్రమశిక్షణ నాలో ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆ క్రమశిక్షణే జీవితాన్ని సక్రమంగా చక్కదిద్దుకునే నైపుణ్యాన్నిచ్చింది. టైప్, షార్ట్ హ్యాండ్ అర్హతలు కూడా ఉండడంతో బీకామ్ పరీక్షలు రాసిన వెంటనే ఓ పెద్ద కంపెనీలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. చదువు మాత్రమే సరిపోదు, లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలని నాకు తెలిసిన సందర్భం అది. ఉద్యోగం చేస్తూనే కరస్పాండెన్స్లో పీజీ చేశాను. ఎనిమిదేళ్ల ఉద్యోగానుభవం నాకు పెళ్లి తర్వాత నా భర్త కంపెనీని నిర్వహించడంలో చాలా బాగా దోహదం చేసింది. మావారి ఏకశిలా కెమికల్స్ లిమిటెడ్‌లో మొదట కంప్యూటర్ విభాగం బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు అదే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... సక్సెస్‌కి ఎప్పుడూ షార్ట్ కట్ ఉండదు. కంపెనీ మనదైనా సరే, అందులో ఉన్నత స్థాయిలో నిలదొక్కుకోవాలంటే మన శ్రమ, మనం కంపెనీకి ప్రయోజనకరంగా ఉండడం వల్లనే సాధ్యమవుతుంది. అంతేతప్ప మనలో అంకితభావం, పట్టుదల, నైపుణ్యం లేకపోతే పెద్ద బాధ్యతలు అప్పగించే సాహసాన్ని భర్త కూడా చేయడు. మొక్కలు పెంచాను మా బాబు కోసం మూడేళ్లపాటు నా కెరీర్లో గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు నాకు టైమ్ వృథా చేస్తున్నానా అనిపించేది. అప్పుడు హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను. బాబు స్కూల్‌కెళ్లడం మొదలైన తర్వాత బంజరుగా పడి ఉన్న రెండెకరాల పొలాన్ని సాగులోకి తెచ్చే బాధ్యత తీసుకున్నాను. అమెరికా వెళ్లినప్పుడు న్యూయార్క్‌లో చూసిన బటర్ ఫ్లై పార్క్‌ను దృష్టిలో పెట్టుకుని పొలం మధ్యలో వాకింగ్ ట్రాక్ నిర్మాణంతోపాటు సీతాఫలం, గోరింటాకు, అశ్వత్థ, రుద్రాక్ష, ఖర్జూరం, అంజూర్ చెట్లు వేశాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రెండేళ్లు అవార్డు అందుకున్నాను. హార్టికల్చర్ అవార్డుకి గీటురాయి ప్రధానంగా ఒక్కటే. మనం పెంచిన ప్రతి చెట్టుకీ ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. చూడడానికి అందంగా కనిపించడం కోసం క్రోటన్స్ నాటానంటే ఒప్పుకోరు. పువ్వులు, కాయలు, ఔషధ గుణాల వంటి ఉపయోగకరమైనవే అయి ఉండాలి. గార్డెన్‌కి నేను రోజూ చేయాల్సిందేమీ లేదిప్పుడు. కంపెనీ పనులు చూసుకుంటున్నాను. ఒకప్పటి పురుష సామ్రాజ్యం పరిశ్రమ నిర్వహణలో ఉన్న మహిళలు సక్సెస్‌బాట పట్టిన తమ విజయాలను చూసుకుని సంతోషపడితే సరిపోదు. తమ వంతుగా సామాజిక బాధ్యతను చేపట్టి తీరాలి. ఎందుకంటే ఓ దశాబ్దం వరకు కూడా ఇది పూర్తిగా మగవాళ్ల సామ్రాజ్యం. ఇప్పుడు మహిళలు ముందుకు వస్తున్నారు. ముందుతరం మహిళాపారిశ్రామిక వేత్తలు తాము నడిచిన దారితో కొత్తవారికి మార్గదర్శనం చేయగలగాలి. పరిశ్రమ నిర్వహణలో దాగిన మెళకువలను కొత్త వారికి నేర్పించాలి. కేవలం అందుకోసమే కోవే (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) లో మెంబర్‌గా చేరాను. ఇందులో వందల సంఖ్యలో మహిళలున్నారు. తమ పరిశ్రమలను విజయవంతంగా నడిపించుకుంటున్న వాళ్లు దాదాపుగా ఎనభై మంది ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు పెట్టి కొత్తవాళ్లకు దిశానిర్దేశం చేయడం, కుటీర పరిశ్రమలు నడుపుతున్న వాళ్ల ఉత్పత్తులను మార్కెట్ చేయడం కోసం కోవే మార్ట్లు నిర్వహించడం నాకు చాలా సంతృప్తినిస్తున్నాయి. సమాజంలో ఒకింత విస్తృతమైన పరిచయాలు ఉండడంతో నోటి మాట ద్వారా మా కోవే నెట్‌వర్క్‌లో ఉన్న మహిళలకు ఆర్డర్లు ఇప్పించగలుగుతాం. అవసరం ఉన్న వాళ్లకు– సర్వీస్ ఇవ్వగలిగిన వాళ్లకు మధ్య వారధిగా పని చేయడం అన్నమాట. ఇందుకోసం ఓ పది నిమిషాల ఫోన్ కాల్ మినహా మాకు ఖర్చయ్యేది ఏమీ ఉండదు. సక్సెస్ బాటలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను నేను కోరేది ఒక్కటే... మీరు ఎక్కిన నిచ్చెన మెట్లు మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చాయి. తొలి అడుగు ఎలా వేయాలో తెలియక దిక్కులు చూస్తున్న మహిళలెందరో ఉన్నారు. వారికి చేయి అందించండి. ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది కొత్త తరం యువతులు ఉత్సాహంగా ఉంటున్నారు. కానీ చదువుకుని కూడా గృహిణిగా ఉండిపోయిన వాళ్లలో చాలా మంది పిల్లలు పెద్దయ్యే కొద్దీ జీవితంలో తెలియని వెలితి ఫీలవడాన్ని చూస్తున్నాం. ఈ వ్యాక్యూమ్ అనేది ఎవరికి వాళ్లు ఏర్పరుచుకునేదే. వాళ్లకు నేను చెప్పగలిగిన చిన్న సలహా ఏమిటంటే... ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి, దానినే మీకు గుర్తింపుగా మలుచుకోండి. ఇంటిని అందంగా అలంకరించడం, చక్కగా చీర కట్టుకోవడం, రుచి వంట చేయడం... ప్రతిదీ ఇప్పుడు మార్కెట్ వస్తువులే. స్నేహితులకు, బంధువులకు హాబీగా చేసివ్వచ్చు. ఆర్థిక అవసరాలుంటే వీటినే ఉపాధిగా మార్చుకోవచ్చు. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. గడచిన తరం మహిళలకు ఇన్ని అవకాశాల్లేవు. ఇప్పుడు అవకాశాలకు ఆకాశమే హద్దు’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : గాలి అమర్ పూలకు పాట ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ ఆర్ట్ గురించి ఒక ఫ్రెండ్ చెప్పింది. ఆ కళను నేర్చుకోవడమే కాకుండా అందులో అడ్వాన్స్ కోర్సు కూడా చేశాను. ఇకబెనా మీద పాట రాసి, స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేసి రెండేళ్ల కిందట హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఏషియన్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో పాడాను. కోవే మహిళలను ఉత్తేజితం చేయడానికి కూడా పాట రాశాను. మార్కులు తక్కువగా వచ్చాయని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, దిశ సంఘటన మీద కూడా పాట రాశాను. మనసులో అలజడి రేగినప్పుడు పాట రాయడం, మనసు బాగున్నప్పుడు పూలు అలంకరించుకోవడం, కీర్తనలు పాడడం ఇవన్నీ నాకు జీవితం మీద ఇష్టాన్ని పెంచే పనులు. ఏ ఉద్వేగాన్నీ అణుచుకోకూడదు. ఉద్వేగం ఏదో ఒక కళ రూపంలో బయటకు తీసుకురావాలి. అప్పుడే జీవితంలో ప్రతి క్షణాన్నీ ఫలవంతంగా జీవించగలుగుతాం. – నీరజ గొడవర్తి, ఎమినెంట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు గ్రహీత -
టీనేజ్ లవ్‌స్టోరీ
‘‘కేర్ ఆఫ్ వాట్సప్’ ట్రైలర్ చూస్తుంటే టీనేజ్ లవ్‌స్టోరీ అని అర్థం అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పుడే సినిమా బాగా ఆడుతుంది. అవి ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ సముద్ర అన్నారు. ‘బాహుబలి’ చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్ పాత్ర చేసిన నిఖిల్ హీరోగా, సాహితి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. నీరజ ప్రధాన పాత్రలో నటించారు. అల్లాడి రవీందర్ రెడ్డి దర్శకత్వంలో లక్ష్మికాంత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ సముద్ర రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను నటుడు నోయల్ విడుదల చేశారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాట్సప్‌తోనే రోజు మొదలవుతుంది.. వాట్సప్‌తోనే రోజు ముగుస్తుంది. ఇలాంటి తరుణంలో మా సినిమా అందరికీ ప్రతి రోజూ గుర్తుకు రావాలనే ఈ టైటిల్ పెట్టాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. మంచి కథాం శంతో తెరకెక్కింది. అతి త్వరలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. ఈ చిత్రానికి సమర్పణ: రామ్ రెడ్డి, సహ నిర్మాత: కొండా రాఘవేంద్ర రెడ్డి (దేవ కర్ర), సంగీ తం: రాజేష్ తేలు, కెమెరా: భాస్కర్ దోర్నాల. -
కాగితం ఖాదీ
పత్తిని వడికి దారం చేసి మగ్గం మీద నేస్తే అది ఖాదీ. అదే రాట్నం, అదే మగ్గం మీద కాగితాన్ని వడికి వస్త్రాన్ని నేస్తే అది కాగితం ఖాదీ. ఆ ప్రయోగం చేసిన ఖాదీ ఇంటి అమ్మాయి పాలిశెట్టి నీరజ.. చేనేతలకు జీవాన్ని, పునరుజ్జీవాన్నీ ఇస్తోంది. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో రాజేంద్రప్రసాద్ పెళ్లి కోసం పరమ పిసినారిగా నటిస్తుంటాడు. ఈ వెధవ దేహాన్ని కప్పుకోవడానికి దుస్తులెందుకు దండగ? కాగితంతో కప్పుకుంటే చాలదూ... అంటూ పేపర్ లుంగీ కట్టుకుంటాడు. అది చూసిన కోట శ్రీనివాసరావు (మామ పాత్ర) పేపర్ చీర ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడతాడు. ఇది జంధ్యాల హాస్య చతురతకు పరాకాష్ట. ఆ సీన్‌కి హాలంతా పొట్టపట్టుకుని మరీ నవ్వేసింది. ఇప్పటికీ ఎప్పుడు టీవీలో ఆ సినిమా వచ్చినా ఆ సీన్ గుర్తొచ్చి... అప్పటి వరకు మునిగితేలుతున్న స్ట్రెస్‌ను చుట్టచుట్టి డస్ట్‌బిన్‌లో పడేసి, ఓ చిరునవ్వు నవ్వుతుంటాం. కాగితం నుంచి వస్త్రం అది సినిమా కోసం రాసుకున్న కామెడీ సీన్. అయితే ఆ ఫార్ములాతో క్లాత్ తయారవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు పాలిశెట్టి నీరజ అనే తెలుగమ్మాయి ఓ ప్రయోగం చేసింది. పేపర్ని సన్నని పోగులుగా చేసి రాట్నంలో వేసి వడుకుతోంది. మగ్గం మీద నేసి కంప్లీట్ క్లాత్‌ను తయారు చేస్తోంది. ఇలా ఎకో ఫ్రెండ్లీ టెక్స్‌టైల్‌తో ఓ చిన్న వ్యాపార సామ్రాజ్యానికి తొలి అడుగు వేసింది. ఇప్పుడామె వీవింగ్ స్టూడియోలో ఫొటో ఫ్రేమ్‌లు, కుషన్ కవర్లు, ఫోల్డర్లు, పెన్ స్టాండ్, ల్యాంప్ షేడ్, పౌచ్‌లు, హ్యాండ్ బ్యాగ్, రూమ్ పార్టిషన్స్, కర్టెన్స్, సోఫా కవర్ వంటివి తయారవుతున్నాయి. ఇవన్నీ హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులే. వీటి తయారీలో కరెంట్ వాడకం తక్కువ. వేస్ట్ పేపర్, రీసైకిల్డ్ పేపరే వీటికి ముడిసరుకు. పొందూరు నుంచి జైపూర్ నీరజ పాలిశెట్టిది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబం. మగ్గం చప్పుళ్ల మధ్యనే పెరిగిందామె. నేతకారుల వారసులు కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో ఆమె తన మూలాలను వదలకుండా అందులోనే కొత్త రూపాలను సృష్టిస్తోంది. మరి కొందరికి ఉపాధినిస్తోంది. టెక్స్టైల్ కోర్సులనే చదివింది. కానీ ప్రయోగాలు చేయడానికి చదువొక్కటే సరిపోదు కదా. ఆచరణలో ఎదురయ్యే కష్టాలు తెలియాలి. ఆ అనుభవం కోసం తమిళనాడు, తిర్పూర్ వస్త్ర వ్యాపార సంస్థలలో పనిచేశారు. కోయంబత్తూర్, జైపూర్లలో డిజైన్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పారు. మరోవైపు వస్త్ర ప్రపంచంలో కొత్తగా మరేదైనా చేయాలనే తపన ఆమెను వెంటాడుతూనే ఉంది. పొందూరు నేత నైపుణ్యాన్ని, జైపూర్ సూత్రకార చేనేతల కళాత్మకతను జోడించి ఓ ప్రయోగం చేశారు. తన ప్రయోగానికి జపాన్ టెక్నాలజీని అనుసంధానం చేశారు. పేపర్ వస్త్రం తయారైంది. పేపర్ క్లాత్ తయారీకి పేపర్ని రెండు నుంచి నాలుగు మిల్లీమీటర్ల పోగులుగా కత్తిరిస్తారు. వాటిని చరఖా మీద వడికి దారాన్ని తయారు చేస్తారు. ఆ దారాలతో వస్త్రాన్ని నేస్తారు. నేతకారులకు బతుకు ఇప్పుడు నీరజ దగ్గర నాలుగు మగ్గాల మీద పని జరుగుతోంది. ఉత్పత్తులు ఫేస్బుక్ ద్వారా మార్కెట్ అవుతున్నాయి. ‘నేత నిలవాలి. నేతకారులు బతకాలి. పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రయోగాలు జరగాలి. నేతకారులకు మేలు చేయడంతోపాటు భూమాతకు హాని చేయని మెథడ్ కోసం ప్రయత్నించాను. విజయవంతమయ్యాను కూడా. ఇప్పుడు దీనిలో వీలయినంత ఎక్కువ మందిని మమేకం చేయాలి. సమాజంలో వచ్చే మార్పులకు తగ్గట్టు మన ప్రొఫెషన్లో మార్పులు చేసుకుంటూ ప్రొఫెషన్ని బతికించుకోవాలి. అప్పుడే అది మనకు బతుకునిస్తుంది’’ అంటారు నీరజ. – మంజీర చేనేత చేతుల్లో పెరిగింది మా తాత మగ్గం మీద నేయడాన్ని చూశాను. స్కూల్‌డేస్‌లో ప్రాజెక్ట్ కోసం జ్యూట్‌తో స్వయంగా నేశాను కూడా. మా నాన్న టెక్స్టైల్ డిజైనింగ్‌లో కోర్సు చేశారు. అహ్మదాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తొలి బ్యాచ్ స్టూడెంట్ ఆయన. చిన్నప్పుడు ఇంట్లో చూసిన వాతావరణం, నాన్న ప్రభావంతో నేను కూడా టెక్స్టైల్ రంగంలోకే రావాలనిపించింది. బరోడాలోని మహారాజా షాయాజీరావు యూనివర్సిటీలో క్లోతింగ్ అండ్ టెక్స్టైల్స్ కోర్సు చేశాను. పీజీ తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ సెక్టార్లలో మొత్తం పదిహేడేళ్లు పనిచేశాను. ఈ రంగంలో మా తాత, నాన్నలకంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. – నీరజ పాలిశెట్టి, ఫౌండర్, సూత్రకార్ క్రియేషన్స్ -
సహజత్వానికి దగ్గరగా కదిర్
తమిళసినిమా: సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతున్న చిత్రం కదిర్. వీఆర్.కంబైన్స్ పతాకంపై మహిళా నిర్మాత విమలారాజనాయగం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తోళర్ అరంగం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన ఈయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కదిర్. కుంభకోణం గుణగా నటుడు కిశోర్ నటిస్తుండగా ఆయన్ని ఢీకొనే పాత్రలో కుంగ్‌ఫూ మాస్టర్ రాజనాయగం నటిస్తున్నారు.ఈయన కుంగ్‌ఫూలో 8 సార్లు బ్లాక్‌బెల్ట్ పొందారన్నది గమనార్హం. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నవ జంట విశ్వ, నీరజ పరిచ యం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో గంజాకరుప్పు, గోలీసోడా పాండి, సుబ్బరాజు, పసంగ శివకుమార్, సెంథి, సింధూ, పరుత్తివీరన్ సుజాత, నూతన నటి సంఘవి నటిస్తున్నారు. చేరన్‌పాండియన్, సింధూనదిపూ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సౌందర్యన్ సంగీత బాణీలు కడుతున్న 50వ చిత్రం కదిర్. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కదిర్ అని చెప్పారు. కుంభకోణంలో బస్టాప్ గుణ అంటే తెలియని వారుండరన్నారు. అతని పాత్రలో నటుడు కిశోర్ నటిస్తున్నారని తెలిపారు. సామాజిక సేవా దృక్పథంతో జీవించే ఒక యువకుడి జీవితంలోంచి ప్రేమ అనే అంశం దాటి పోతే తను ఏంచేశాడన్నదే చిత్ర ప్రధాన అంశం అన్నారు. ఇందులో కుంభకోణం గుణ, కుంగ్‌ఫూ మాస్టర్ల మధ్య పోరాట దృశ్యం హాలీవుడ్ చిత్రాలన్ని తలపించే విధంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి పలు అంశాలతో జనరంజకంగా కదిర్ ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను కుంభకోణం, మైలాడుదురై, చెన్నై ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
భర్త వివాహేతర సంబంధాలు.. భార్య ఆత్మహత్య
జీడిమెట్ల: భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సూరారం టీఎస్ఐఐసీ కాలనీకి చెందిన సత్తిరెడ్డి కుమార్తె నీరజా(26), అల్వాల్‌కు చెందిన సుచిన్రెడ్డి లకు ఫిబ్రవరి 16 న వివాహం జరిగింది. సుచిన్రెడ్డికి పెళ్లికి ముందే పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి. పెళ్లయిన తరువాత కూడా అతను తన వైఖరి మార్చుకోకపోగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను నీరజకు ఫోన్ చేసి తిట్టడంతో మనస్థాపానికి గురైన ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సత్తిరెడ్డి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క ఫోన్ చేసుంటే...
నీరజ కృష్ణవేణి... ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో సాక్షి ‘ఫ్యామిలీ’... షీ-టీమ్‌తో మాట్లాడింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఆకతాయిలను కట్టడి చేసేందుకు గత ఏడు నెలలుగా పనిచేస్తున్న ‘షీ టీమ్’కు నీరజ ఒక్క ఫోన్‌కాల్ చేసి ఉంటే ఈరోజు ఆమె పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు ఆ టీమ్‌లకు నేతృత్వం వహిస్తున్న అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా. మేమున్నదందుకే! ఒకే ఒక్క ఫోన్ కాల్... 100 నెంబర్‌కి ఫోన్ చేసి షీటీమ్‌తో మాట్లాడాలని చెబితే చాలు... మాకు చెప్పిన విషయాలన్నింటినీ గోప్యంగా ఉంచి ఇబ్బంది పెడుతున్నవారి నుంచి ఎలాంటి ముప్పులేకుండా చేస్తాం. షీటీమ్ లక్ష్యం కూడా అదే. మాకు ఇప్పటి వరకూ కాల్ చేసినవారిలో యాభైశాతం నీరజలాంటి వారే. ప్రేమ పేరుతో ఏడాదిగా వేధిస్తున్నారని, ఆరు నెలలుగా వేధిస్తున్నారని, నాలుగురోజులుగా వెంటపడుతున్నారని... ఇలా అమ్మాయిల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకుని మా టీమ్‌లు గుట్టుచప్పుడు కాకుండా నిందితులను ఇంటరాగేట్ చేసి అమ్మాయిలకు ఎలాంటి సమస్యలూ లేకుండా చేస్తున్నాయి. ఇంటరాగేషన్ అంటే... అబ్బాయిలకు కౌన్సెలింగ్ మొదలు పనిష్మెంట్ల వరకూ అన్నీ ఉంటాయి. చాలామంది అమ్మాయిలు మంచికి పోయి ‘పట్టించుకోకపోతే వదిలేస్తారులే..’ అనే భావనతో కూడా మౌనంగా భరిస్తుంటారు. అలాంటివారు ఇంట్లో చెప్పక్కర్లేదు... మాతో చెబితే చాలు మా డ్యూటీ మేం చేస్తాం. ‘అమ్మాయి నోరు విప్పి చెప్పుకోలేదు, తల్లిదండ్రులకు తెలిసినా నలుగురికీ చెప్పుకోలేరు... ఇక మమ్మల్ని ఎవరేం చేస్తారు?’ అనే ధైర్యంతో రెచ్చిపోతున్న అబ్బాయిల మనస్తత్వం మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న మాకు నీరజ ఫోన్ చేసి ఉంటే కచ్చితంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. నగరంలో దాదాపు 500 షీటీమ్లున్నాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులున్నారు. కనీసం తల్లిదండ్రుల నుంచి మాకు ఫిర్యాదు అందినా చాలు, వెంటనే రంగంలోకి దిగుతాం. గుట్టుగా ఉంటే పరిష్కారం అయ్యే సమస్యలు కావివి. మేమున్నది ఇలాంటి సంఘటనలు జరగ క్కుండా చూసుకోడానికే. వేధింపులకు పాల్పడేవారి నుంచి కాపాడటానికి తల్లిదండ్రులతో పాటు షీటీమ్ కూడా ఉందన్న విషయాన్ని నీరజ లాంటివారు గుర్తించాలి. కాకపోతే వారి నుంచి మేం ఆశిస్తున్నది ఒక్కటే.. 100 నంబర్‌కు ఒక్క ఫోన్ కాల్. ...::: భువనేశ్వరి అది యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్! మానసిక రుగ్మతల కోణం నుంచి చూస్తే నీరజపై దాడికి పాల్పడ్డ వ్యక్తికి ‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్’ ఉందని భావించవచ్చు. మామూలు మానసిక రుగ్మతలు ఉన్నవారు అవతలివారిపై ఇంత ఉగ్రంగా (ఎగ్రెషన్‌తో) ప్రవర్తించలేరు. అలా వ్యవహరించారంటే వారిలో అసాంఘిక ధోరణి ఎక్కువగా ఉందని అర్థం. ఇలాంటి వ్యక్తులకు అవతలివారి బాధలపై స్పందన ఉండదు. ఎవరి విషయంలోనూ సహానుభూతితో ఉండలేరు. తాము అనుకున్న లక్ష్యం పూర్తికావడమే వారికి ముఖ్యం. -
‘టీనేజ్’ విలవిల!
కామారెడ్డి, న్యూస్‌లైన్: కామారెడ్డి పట్టణానికి సమీపంలో అడ్లూర్ అర్శ గురుకులం వద్ద రైలు పట్టాలపై కోటగిరి మండలం చేతన్నగర్కు చెందిన అనురాధ (15), జ్ఞానేశ్వర్(18) ఆత్మహత్య కు పాల్పడడం కలకలం రేపింది. అనురాధ గత ఏప్రిల్‌లో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతిలోకి అడుగు పెట్టాల్సి న సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన జ్ఞా నేశ్వర్ జీవితంలో ఉన్నత లక్ష్యం కోసం ముం దుకు సాగేందుకు ప్రయత్నించకుండా ప్రేమ మైకంలో పడిపోయి తనతో పాటు అనురాధ ను వెంట తీసుకెళ్లాడు. ఈ ఇద్దరి వయస్సు, వారి పరిస్థితిని చూస్తే ఆకర్షణలకు లోనై పెద్దలకు విషయం తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో ఇంటి నుంచి బయటపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. గతంలో కూడా గత ఏడాది కామారెడ్డి పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీరజ (15) ఒంటిపై కి రోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. రెండు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. ఈ అ మ్మాయి ఇంటికి సమీపంలో జార్ఖండ్ రాష్ట్రాని కి చెందిన టింకు అనే యువకుడు నివసించేవాడు. నీరజ అతడి ఆకర్షణలో పడిపోయిం ది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు సదరు యువకున్ని మందలించారు. దీంతో నీరజ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. నీరజ మరణం ఆమె కుటుంబ సభ్యులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. చదువుకోవడానికి వచ్చిన ఓ యువతి కా మారెడ్డి పట్టణంలోని ఓ హాస్టల్లో ఉండేది. ఓ రోజు హాస్టల్‌కు రాకపోవడంతో నిర్వాహకులు ఆమె కుటుం బ సభ్యులకు సమాచారమందించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తరువాత పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా ఆ చూకీ కనిపెట్టారు. ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసిన ఓ యువకుని ప్రే‘మాయ’లో పడి అ దృశ్యమైనట్టు గుర్తించారు. తరువాత అమ్మాయి తల్లి చెంతకు చేరడంతో కథ సుఖాంతమైంది. మూడేళ్ల క్రితం కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో ఓ ఇం ట్లో అద్దెకున్న యువకుడు ఇంటర్ చదివే ఇంటి యజమాని కూతురుని ప్రేమపేరుతో వేధించి గొంతుకోసి చంపాడు. ఆ యువకుడు జైలుపాలవగా, విచారణ జరిపిన కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. క్రమశిక్షణ కావాలి నిత్యం ఎక్కడో ఒక చోట యువతో, యువకుడో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కౌమారం, యవ్వన దశలలో యువత దారితప్పకుండా క్రమ శిక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు పేర్కొంటున్నారు. జీవిత లక్ష్యం నిర్దేశించుకు నే విధంగా ప్రోత్సహించాలని, వారికి సానుకూల దృక్ఫథాన్ని అవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని జూచిస్తున్నారు. తద్వారా ఇతర ఆలోచనలు రాకుండా నిరోధించవచ్చని పేర్కొంటున్నారు.