తమిళసినిమా: సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతున్న చిత్రం కదిర్. వీఆర్.కంబైన్స్ పతాకంపై మహిళా నిర్మాత విమలారాజనాయగం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తోళర్ అరంగం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన ఈయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కదిర్. కుంభకోణం గుణగా నటుడు కిశోర్ నటిస్తుండగా ఆయన్ని ఢీకొనే పాత్రలో కుంగ్‌ఫూ మాస్టర్ రాజనాయగం నటిస్తున్నారు.ఈయన కుంగ్‌ఫూలో 8 సార్లు బ్లాక్‌బెల్ట్ పొందారన్నది గమనార్హం.
ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నవ జంట విశ్వ, నీరజ పరిచ యం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో గంజాకరుప్పు, గోలీసోడా పాండి, సుబ్బరాజు, పసంగ శివకుమార్, సెంథి, సింధూ, పరుత్తివీరన్ సుజాత, నూతన నటి సంఘవి నటిస్తున్నారు. చేరన్‌పాండియన్, సింధూనదిపూ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సౌందర్యన్ సంగీత బాణీలు కడుతున్న 50వ చిత్రం కదిర్. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కదిర్ అని చెప్పారు.
కుంభకోణంలో బస్టాప్ గుణ అంటే తెలియని వారుండరన్నారు. అతని పాత్రలో నటుడు కిశోర్ నటిస్తున్నారని తెలిపారు. సామాజిక సేవా దృక్పథంతో జీవించే ఒక యువకుడి జీవితంలోంచి ప్రేమ అనే అంశం దాటి పోతే తను ఏంచేశాడన్నదే చిత్ర ప్రధాన అంశం అన్నారు. ఇందులో కుంభకోణం గుణ, కుంగ్‌ఫూ మాస్టర్‌ల మధ్య పోరాట దృశ్యం హాలీవుడ్ చిత్రాలన్ని తలపించే విధంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి పలు అంశాలతో జనరంజకంగా కదిర్ ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను కుంభకోణం, మైలాడుదురై, చెన్నై ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.