ప్రజలు ఆర్థికంగా తామెదుర్కొంటున్న కష్టనష్టాలను మర్చిపోవచ్చు కానీ ప్రభుత్వ అసమర్థత కారణంగా కోవిడ్–19 సమయంలో తమ ప్రియతములను కళ్లముందే కోల్పోవలసి రావడాన్ని మర్చిపోవడం కాదు కదా.. క్షమించడం కూడా కష్టసాధ్యమే. బాగ్ పట్, లక్నో.. యూపీలోని ఏ పట్టణంలోని ప్రజలనైనా కదిలించి చూడండి.. బీజేపీపై తీవ్ర ఆగ్రహం చోటుచేసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు బీజేపీ భవితవ్యాన్ని తేల్చివేయనున్నాయి. యోగిని ఢిల్లీకి పిలిపించడం ద్వారా యూపీలో ఇప్పటికే బీజేపీకి కలిగిన నష్టాన్ని పూడ్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ఒక్క చర్యద్వారా యూపీలో పరిస్థితి మొత్తంగా మారిపోతుందా?
దేశ రాజకీయాల్లో మార్పు చేసుకోబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు బీజేపీ భవితవ్యాన్ని తేల్చివేయనున్నాయి. ఇంతవరకు జరి గిన తప్పులు సరిదిద్దుకుని బీజేపీ రాజకీయ రణరంగంలో పుంజుకుని తిరిగి లేచి నిలబడుతుందా లేదా అని నిర్ధారణ అయ్యేందుకు యూపీ ఎన్నికలు గీటురాయి కాబోతున్నాయి. ఇది అంత సులభం కాదు. మీరు మమతా బెనర్జీ అయినట్లయితే ప్రధానమంత్రిపైనే తీవ్ర విమర్శలు గుప్పించవచ్చు. కానీ మీరు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అయితే, ప్రత్యేకించి మీరు యోగి ఆదిత్యనాథ్ అయినట్లయితే మీకు అలాంటి అవకాశం ఉండదు. నరేంద్ర మోదీ తర్వాత హిందుత్వకు ప్రతీకగా యోగికి జాతీయస్థాయి గుర్తింపు ఉంది. గత వారం ఢిల్లీకి వెళ్లిన యోగి కేంద్రంతో సర్దుబాటుకోసం ప్రయత్నించారు. యోగి సందర్శన తక్షణ పలితం ఏమిటంటే, యూపీ కేబినెట్‌లో మార్పులు చేయాలన్న డిమాండును తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చిన యోగి.. కాస్త చల్లబడి మంత్రిమండలిలో మార్పులకు అంగీకరించారు. యూపీలో జరుగుతున్న తప్పులను మొత్తంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఏకరువుపెడుతూ యోగిని నిలదీసినంత పనిచేసింది. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పనంత కాలం యోగి యూపీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగవచ్చు, వచ్చే ఏడాది ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించవచ్చు. పైగా మరో ఏడు, ఎనిమిది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున నాయకత్వాన్ని మార్చడం అనేది నష్టదాయకంగా పరిణమించవచ్చు. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉమ్మడిగా యూపీలో పార్టీకి కలుగుతున్న నష్టనివారణను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
యూపీలో పరిస్థితిని అంచనా వేయడానికి లక్నో వెళ్లిన బీజేపీ నాయకులు బీఎల్ సంతోష్, రాధామోహన్ ముందు అతికొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడారు. ప్రధానంగా కోవిడ్ సెకండ్ వేవ్‌ని ఎదుర్కోవడంలో యోగి వైఫల్యంపై వీరు ధ్వజమెత్తారు. కొద్దిమంది బ్యూరోక్రాట్లకు బాధ్యతలు అప్పగించిన యోగి అటు ఎమ్మెల్యేలు, ఇటు మంత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని వీరు ఆరోపించారు. యోగి తనకులానికి చెందిన రాజపుత్రుల పట్ల పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నారట. గతంలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాదవులు ప్రదర్శించిన దూకుడును ఇప్పుడు రాజపుత్రులు అవలంబిస్తున్నారని వీరి ఆరోపణ. దీంతో బీజేపీకి సాంప్రదాయికంగా మద్దతుదారులుగా నిలుస్తూ వచ్చిన బ్రాహ్మణులు పార్టీలో ప్రాధాన్యం కోల్పోయారని ఆరోపణ.
ఈ నేపథ్యంలో యూపీ మంత్రిమండలిలో మార్పులు చోటు చేసుకోవడం తప్పదనిపిస్తుండటంతో ప్రధానికి అత్యంత విశ్వసనీయుడైన బ్యూరోక్రాట్–రాజకీయనేత ఏకే శర్మకు కీలక స్థానం కట్టబెట్టవచ్చు. లక్నోలో జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు ప్రధానికి చెప్పాలనే ఉద్దేశంతోనే శర్మను యూపీకి పంపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్రప్రభుత్వ కార్యదర్శి పదవికి శర్మ రాజీ నామా చేశారు. వెంటనే తనను బీజేపీ ఎమ్మెల్సీగా చేశారు. తనను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసి హోంశాఖను కట్టబెట్టాలని మోదీ కోరుకున్నారు. కానీ యోగి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేత జితిన్ ప్రసాదకు కేబినెట్‌లో అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో పరాజయం నుంచి బయటపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జితిన్ ప్రసాద నిష్క్రమించారు. 2014, 2017, 2019 సంవత్సరాల్లో పోటీ చేసిన మూడు ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల ప్రయోజనాలను తాను పట్టించుకుంటానని సంకేతం పంపడానికి బీజేపీ జితిన్ ప్రసాద్ చుట్టూ హైప్ సృష్టించింది. ఎవరైనా పార్టీ మారి బీజేపీలో చేరితే సాధ్యమైనంత మేరకు వారి ప్రయోజనాలు కాపాడతామంటూ బలమైన సందేశాన్ని కూడా పంపినట్లయింది. రానున్న ఎన్నికల్లో తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఇతర పార్టీలకు చెందిన కీలకమైన నేతలను లాగేసుకోవడం అనేది బీజేపీ పోల్ వ్యూహంలో ఒక అంతర్గత భాగంగా ఉంటోంది.
మాజీ కాంగ్రెస్ నేత హిమంతా బిశ్వ శర్మను అస్సాం సీఎంగా నియమించడం కూడా ఈ సందేశంలో భాగమే. కేంద్రమంత్రిగా జ్యోతిరాదిత్య సింధియాను తీసుకోవాలని బీజేపీ భావిస్తుండటం కూడా దీంట్లో భాగమే. గత సంవత్సరం 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చెక్కేయడం ద్వారా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన సింధియా తనకు బీజేపీ చేసిన పెద్ద వాగ్దానం ఫలించే రోజు కోసం నిరీక్షిస్తున్నారు. శివసేన, అకాలీదళ్, రామ్ విలాస్ పాశ్వాన్ వంటి మిత్రపక్షాలు కూటమి నుంచి నిష్క్రమించిన తర్వాత వాటిని భర్తీ చేసే అనేక వ్యాక్సిన్లు బీజేపీకి అందుబాటులో ఉంటూం డటం విశేషం.
దేశంలో మరో ఎన్నికల సీజన్ సమీపిస్తోంది. 2022లో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజ రాత్, జమ్మూకశ్మీర్‌లలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటన్నింటిలో యూపీ ఎన్నికలే 2024లో బీజేపీ అవకాశాలను తేల్చివేయనున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. వీటికి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ వంటి రాష్ట్రాలను కూడా కలుపుకోవచ్చు. వీటికి తోడుగా ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారం కోల్పోయినట్లయితే 250 కంటే ఎక్కువ లోక్‌సభా స్థానాలున్న రాష్ట్రాలు ఆ పార్టీకి దూరమవుతాయి. ఇన్ని స్థానాలు తన చేతుల్లోచి చేజారితే బీజేపీకి చాలా కఠిన పరిస్థితి ఎదురవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలు చతుర్ముఖ పోరాటాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే కుర్మీల ఆధిపత్యంలోని అప్నాదళ్, నిషాద్ పార్టీ వంటి చిన్నాచితకా పార్టీలతో అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని యాదవేతర బీసీలు, అత్యంత వెనుకబడిన కులాలకు సంబంధించిన ఓటర్లు బీజేపీకి చాలా ముఖ్యంగా మారారు. ఇకపోతే మాయావతి ఒంటరిగానే పోటీ చేయవచ్చు. అన్ని లెక్కలు తేలాక బీజేపీ అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ సంఖ్య తగ్గినపక్షంలో ఆమె బీజేపీకే మద్దతు చేయవచ్చు.
మరోవైపున సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీ ఇప్పటికే పొత్తుపట్ల అవగాహనకు వచ్చేశాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు ప్రత్యేకించి జాట్ రైతులు కిసాన్ ఆందోళనకు మద్దతు పలికిన ఆర్‌ఎల్‌డీ కొత్త చీఫ్ జయంత్ చౌదరికి మద్దతివ్వాలని చూస్తున్నారు. ఇక అఖిలేశ్ యాదవ్ విషయానికి వస్తే 2017లో లాగా కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తనకు ఎవరు ఎన్ని సీట్లు ఇవ్వగలరు అని వెతుకులాడుకునే స్థితిలో పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితంపై రాజకీయ పక్షాల భవితవ్యం ఆధారపడి ఉంది. బీజేపీ తన లోపాలను సరిదిద్దుకుని ఎంత సత్వర చర్యలు చేపడుతుందనే అంశంపైనే యూపీ–2022 ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇదంత సులభం కాదు. ముందే చెప్పినట్లు ప్రజలు ఆర్థిక నష్టాలు, కష్టాలను తట్టుకుంటారు, మర్చిపోతారు కానీ తమ ప్రియతములు తమ కళ్లముందే చనిపోవడాన్ని భరించలేరు. ఈ విషయంలో ప్రభుత్వాల అసమర్థతను వారు అసలు క్షమించరు. యోగిని ఢిల్లీకి పిలిపించడం ద్వారా యూపీలో ఇప్పటికే బీజేపీకి కలిగిన నష్టాన్ని పూడ్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ఒక్క చర్య ద్వారా యూపీలో పరిస్థితి మొత్తంగా మారిపోతుందా? ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ బీజేపీకి యూపీలో నిజమైన సవాలు విసరనుందా అనేది తేలాల్సి ఉంది.
నీరజా చౌదరి,
సీనియర్ రాజకీయ వ్యాఖ్యాత
(ట్రిబ్యూన్ సౌజన్యంతో)
కమలం భవితవ్యానికి అసలు పరీక్ష
Published Fri, Jun 18 2021 12:45 AM | Last Updated on Fri, Jun 18 2021 8:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment