ఒక్క ఫోన్ చేసుంటే...
నీరజ కృష్ణవేణి... ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో సాక్షి ‘ఫ్యామిలీ’... షీ-టీమ్‌తో మాట్లాడింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఆకతాయిలను కట్టడి చేసేందుకు గత ఏడు నెలలుగా పనిచేస్తున్న ‘షీ టీమ్’కు నీరజ ఒక్క ఫోన్‌కాల్ చేసి ఉంటే ఈరోజు ఆమె పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు ఆ టీమ్‌లకు నేతృత్వం వహిస్తున్న అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా.
మేమున్నదందుకే!
ఒకే ఒక్క ఫోన్ కాల్... 100 నెంబర్‌కి ఫోన్ చేసి షీటీమ్‌తో మాట్లాడాలని చెబితే చాలు... మాకు చెప్పిన విషయాలన్నింటినీ గోప్యంగా ఉంచి ఇబ్బంది పెడుతున్నవారి నుంచి ఎలాంటి ముప్పులేకుండా చేస్తాం. షీటీమ్ లక్ష్యం కూడా అదే. మాకు ఇప్పటి వరకూ కాల్ చేసినవారిలో యాభైశాతం నీరజలాంటి వారే. ప్రేమ పేరుతో ఏడాదిగా వేధిస్తున్నారని, ఆరు నెలలుగా వేధిస్తున్నారని, నాలుగురోజులుగా వెంటపడుతున్నారని... ఇలా అమ్మాయిల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకుని మా టీమ్‌లు గుట్టుచప్పుడు కాకుండా నిందితులను ఇంటరాగేట్ చేసి అమ్మాయిలకు ఎలాంటి సమస్యలూ లేకుండా చేస్తున్నాయి. ఇంటరాగేషన్ అంటే... అబ్బాయిలకు కౌన్సెలింగ్ మొదలు పనిష్మెంట్‌ల వరకూ అన్నీ ఉంటాయి.
చాలామంది అమ్మాయిలు మంచికి పోయి ‘పట్టించుకోకపోతే వదిలేస్తారులే..’ అనే భావనతో కూడా మౌనంగా భరిస్తుంటారు. అలాంటివారు ఇంట్లో చెప్పక్కర్లేదు... మాతో చెబితే చాలు మా డ్యూటీ మేం చేస్తాం. ‘అమ్మాయి నోరు విప్పి చెప్పుకోలేదు, తల్లిదండ్రులకు తెలిసినా నలుగురికీ చెప్పుకోలేరు... ఇక మమ్మల్ని ఎవరేం చేస్తారు?’ అనే ధైర్యంతో రెచ్చిపోతున్న అబ్బాయిల మనస్తత్వం మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న మాకు నీరజ ఫోన్ చేసి ఉంటే కచ్చితంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. నగరంలో దాదాపు 500 షీటీమ్‌లున్నాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులున్నారు.
కనీసం తల్లిదండ్రుల నుంచి మాకు ఫిర్యాదు అందినా చాలు, వెంటనే రంగంలోకి దిగుతాం. గుట్టుగా ఉంటే పరిష్కారం అయ్యే సమస్యలు కావివి. మేమున్నది ఇలాంటి సంఘటనలు జరగ క్కుండా చూసుకోడానికే. వేధింపులకు పాల్పడేవారి నుంచి కాపాడటానికి తల్లిదండ్రులతో పాటు షీటీమ్ కూడా ఉందన్న విషయాన్ని నీరజ లాంటివారు గుర్తించాలి. కాకపోతే వారి నుంచి మేం ఆశిస్తున్నది ఒక్కటే.. 100 నంబర్‌కు ఒక్క ఫోన్ కాల్.
...::: భువనేశ్వరి
అది యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్!
మానసిక రుగ్మతల కోణం నుంచి చూస్తే నీరజపై దాడికి పాల్పడ్డ వ్యక్తికి ‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్’ ఉందని భావించవచ్చు. మామూలు మానసిక రుగ్మతలు ఉన్నవారు అవతలివారిపై ఇంత ఉగ్రంగా (ఎగ్రెషన్‌తో) ప్రవర్తించలేరు. అలా వ్యవహరించారంటే వారిలో అసాంఘిక ధోరణి ఎక్కువగా ఉందని అర్థం. ఇలాంటి వ్యక్తులకు అవతలివారి బాధలపై స్పందన ఉండదు. ఎవరి విషయంలోనూ సహానుభూతితో ఉండలేరు. తాము అనుకున్న లక్ష్యం పూర్తికావడమే వారికి ముఖ్యం.