ఇంకా దొరకని 6,468 మంది ఆచూకీ
2014 నుంచి 2019 వరకు ఇదే కథ..
2020–2024 మధ్య అత్యధికం
అదృశ్యమైన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువని అప్పట్లో పిటిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు మందలింపు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ‘అదృశ్యం’ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వయోభేదాలు లేకుండా ఇంటినుంచి బయటికి వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకుండా తప్పిపోతుండటం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో కొందరు, ఇంట్లో పెద్దలు మందలించారని ఇంకొందరు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో మరికొందరు కనిపించకుండా పోతున్నారు. ఇలా తప్పిపోతున్న వారి కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేక.. చివరకు పోలీసుస్టేషన్లలో ‘మిస్సింగ్’కేసులు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసి కళ్లు కాయలు కాయేలా ఎదురుచూసిన కొందరికి తమ కుటుంబసభ్యుల ఆచూకీ దొరకగా.. మరికొందరికీ ఎదురుచూపులే మిగిలాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మాత్రం దొరకడం లేదు.
అదృశ్యం కేసులపై హైకోర్టు తీవ్ర స్పందన
అప్పట్లో రాష్ట్రంలో పెరిగిన మిస్సింగ్ కేసులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. ఏటా తొమ్మిది వరకు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఆ కేసులు రెట్టింపు అయ్యాయని హైకోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలైంది. అదృశ్యమైన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నట్టు కేసులు నమోదయ్యాయని పిటిషనర్ వివరించారు.
చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా?
దీనిపై ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో షీ టీమ్, దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఆ తర్వాత కూడా 2020 నుంచి 2024 అక్టోబర్ 19 వరకు రాష్ట్రంలో 1,03,496 మంది బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీలు తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. 2023లో అత్యధికంగా 23,509 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 20,403 కేసులు నమోదయ్యాయి. అదృశ్యమైన 1,03,496 మందిలో 97,028 మంది ఆచూకీ లభించగా, ఇంకా 6,468 మంది ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియని పరిస్థితి నెలకొంది.
‘అదృశ్యం’కేసుల్లో మహిళలే ఎక్కువ..
తెలంగాణవ్యాప్తంగా ఐదేళ్లలో అదృశ్యమైన 1,03,496 మందిలో మహిళలే 54,744 మంది ఉన్నారు. పురుషులు 34,643 మంది, బాలురు 5,750 మంది కాగా బాలికలు 8,359 మంది. ఇదే సమయంలో ఆచూకీ లభ్యమైన వారి జాబితాలోనూ 52,312 మంది మహిళలు ఉండగా, 31,291 మంది పురుషులు, 5,450 మంది బాలురు, 7,070 మంది బాలికలు ఉన్నారు. ఆచూకీ దొరకని 6,468 మందిలో పురుషులు 3,352 మంది, మహిళలు 2,432 మంది, బాలురు 295 మంది, బాలికలు 389 మంది ఉన్నారు.
పరిష్కారం చూపాలి
రాష్ట్రంలో ప్రతీరోజు ఎంతోమంది తప్పిపోతున్నారు. కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మా త్రం దొరకడం లేదు. బాలికలు, బాలురు, మహిళలు, పురుషుల ఆచూకీ దొరక్క.. వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారు చాలామంది ఉన్నారు. వారు బతికి ఉన్నారో, లేదో తెలియక క్షణక్షణం బాధ అనుభవిస్తూ ఉంటారు. వారి బాధకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉంది. ఇప్పటికైనా వారి ఎదురుచూపులకు పరిష్కారం చూపాలి.
– రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్
Comments
Please login to add a commentAdd a comment