women protection
-
తెలంగాణలో ఐదేళ్లలో 1,03,496 మంది అదృశ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ‘అదృశ్యం’ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వయోభేదాలు లేకుండా ఇంటినుంచి బయటికి వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకుండా తప్పిపోతుండటం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో కొందరు, ఇంట్లో పెద్దలు మందలించారని ఇంకొందరు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో మరికొందరు కనిపించకుండా పోతున్నారు. ఇలా తప్పిపోతున్న వారి కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేక.. చివరకు పోలీసుస్టేషన్లలో ‘మిస్సింగ్’కేసులు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసి కళ్లు కాయలు కాయేలా ఎదురుచూసిన కొందరికి తమ కుటుంబసభ్యుల ఆచూకీ దొరకగా.. మరికొందరికీ ఎదురుచూపులే మిగిలాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మాత్రం దొరకడం లేదు.అదృశ్యం కేసులపై హైకోర్టు తీవ్ర స్పందన అప్పట్లో రాష్ట్రంలో పెరిగిన మిస్సింగ్ కేసులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. ఏటా తొమ్మిది వరకు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఆ కేసులు రెట్టింపు అయ్యాయని హైకోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలైంది. అదృశ్యమైన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నట్టు కేసులు నమోదయ్యాయని పిటిషనర్ వివరించారు.చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా? దీనిపై ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో షీ టీమ్, దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఆ తర్వాత కూడా 2020 నుంచి 2024 అక్టోబర్ 19 వరకు రాష్ట్రంలో 1,03,496 మంది బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీలు తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. 2023లో అత్యధికంగా 23,509 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 20,403 కేసులు నమోదయ్యాయి. అదృశ్యమైన 1,03,496 మందిలో 97,028 మంది ఆచూకీ లభించగా, ఇంకా 6,468 మంది ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియని పరిస్థితి నెలకొంది. ‘అదృశ్యం’కేసుల్లో మహిళలే ఎక్కువ.. తెలంగాణవ్యాప్తంగా ఐదేళ్లలో అదృశ్యమైన 1,03,496 మందిలో మహిళలే 54,744 మంది ఉన్నారు. పురుషులు 34,643 మంది, బాలురు 5,750 మంది కాగా బాలికలు 8,359 మంది. ఇదే సమయంలో ఆచూకీ లభ్యమైన వారి జాబితాలోనూ 52,312 మంది మహిళలు ఉండగా, 31,291 మంది పురుషులు, 5,450 మంది బాలురు, 7,070 మంది బాలికలు ఉన్నారు. ఆచూకీ దొరకని 6,468 మందిలో పురుషులు 3,352 మంది, మహిళలు 2,432 మంది, బాలురు 295 మంది, బాలికలు 389 మంది ఉన్నారు. పరిష్కారం చూపాలి రాష్ట్రంలో ప్రతీరోజు ఎంతోమంది తప్పిపోతున్నారు. కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మా త్రం దొరకడం లేదు. బాలికలు, బాలురు, మహిళలు, పురుషుల ఆచూకీ దొరక్క.. వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారు చాలామంది ఉన్నారు. వారు బతికి ఉన్నారో, లేదో తెలియక క్షణక్షణం బాధ అనుభవిస్తూ ఉంటారు. వారి బాధకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉంది. ఇప్పటికైనా వారి ఎదురుచూపులకు పరిష్కారం చూపాలి. – రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ -
‘కూటమి’ పాలనలో మహిళలకు రక్షణ ఏదీ?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధిత కుటుంబాలను కూటమి నేతలు ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. వైఎస్సార్సీపీ స్పందిస్తేనే కూటమి నేతలు బాధిత కుటుంబాల వద్దకు వెళ్తున్నారన్నారు.‘‘రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని రోజూ రుజువవుతుంది. రాష్ట్రంలో 120కి పైగా ఘటనలు మహిళలపై జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే మహిళలపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు జిల్లాలోనే మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. తిరుపతిలో మరో బాలికపై అత్యాచారం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లితండ్రులు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నలు గుప్పించారు.మద్యం, ఇసుక మీద పెట్టిన చర్చ మహిళల భద్రతపై ఎందుకు పెట్టరు..?. వైసీపీ నేతలు బాధితుల పరామర్శకు వెళ్తే.. ప్రభుత్వం స్పందిస్తుంది. గంజాయి నిర్మూలిస్తామని చెప్పే హోం మంత్రి ఏమి మాట్లాడటం లేదు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే.. హోం మంత్రి ఏమి చేస్తున్నట్టు.. ఏమైనా అంటే నేను లాటీ పట్టుకొని తిరగాలా అని హోం మంత్రి అడుగుతారు. చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి చేతకాని పరిపాలన చేస్తున్నారు. ఆడపిల్లలు ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.. హోం మంత్రి సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న మానవత్వం ఈ ప్రభుత్వానికి లేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్‌లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చాయి. తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్ను ఇంటింటికీ పంపారు. అందులో రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని, మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ అందులో ఇచ్చిన హామీలు అమలయ్యాయా?’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. -
దశ దిశలా రక్షణ
మహిళలకు రక్షణ, భద్రతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్నవారిని నిమిషాల వ్యవధిలోనే రక్షించడానికి దిశ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను రక్షిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో దిశ వ్యవస్థకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఎన్నో రాష్ట్రాలు దీన్ని తమ ప్రాంతాల్లోనూ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిశ యాప్‌ను ఆవిష్కరించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. – సాక్షి, అమరావతి ♦ చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఓ బాలికను ఓ యువకుడు∙కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించాడు. అతడి ఇంట్లో నుంచి బాలిక అరుపులు వినిపించడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దిశ యాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ బాలికను రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. ♦ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళపై ఆమె భర్త మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. ఆమె వెంటనే అంటే సాయంత్రం 6.39 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించారు. పోలీసులు 6.41 గంటలకే అంటే కేవలం రెండు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ♦ సమీప బంధువు మోసగించడంతో విజయవాడలో ఓ మహిళ అర్ధరాత్రి 12.53 గంటలకు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన బిడ్డను కాపాడాల్సిందిగా ఆమె తల్లి దిశ యాప్ ద్వారా పోలీసులకు విన్నవించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది 12.55 గంటలకు విజయవాడ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు 12.58 నిమిషాలకే అంటే కేవలం 5 నిమిషాల్లోనే బాధిత మహిళ నివాసానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నవులూరుకు చెందిన ఓ మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లిన తన 15 ఏళ్ల కుమార్తె ఇంటికి తిరిగి రాలేదని దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్టు గుర్తించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బాలిక ఆచూకీ తెలుసుకుని ఆమె తల్లి వద్దకు చేర్చారు. యువకుడిపై కేసు నమోదు చేశారు. ♦ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి తనతో తీసుకువెళ్లాడు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా వ్యభిచారం చేయాల్సిందిగా వేధించసాగాడు. దాంతో ఆ యువతి పొరుగింటివారి సహాయంతో దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించింది. పోలీసులు వెంటనే ఆ నివాసానికి చేరుకుని యువతిని రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమ స్థానం.. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటివరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. అలాగే దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం విశేషం. 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవ్వడం గమనార్హం. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల రక్షణకు పటిష్ట వ్యవస్థ.. ♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్‌లతో ఈ పోలీస్ స్టేషన్లను నెలకొల్పారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించడం విశేషం. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలను సమకూర్చారు. ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చింది. ♦ లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేసింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2,17,467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టింది. మహిళలను ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచింది. ♦ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి, విశాఖపట్నంలలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలను నిరి్మస్తోంది. గతంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చేందుకు మూడు నాలుగు నెలల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం కేవలం 48 గంటల్లోనే నివేదికలు వస్తున్నాయి. నేరానికి పాల్పడితే కఠిన శిక్షే.. దర్యాప్తు పూర్తి చేయడమే కాదు దోషులకు న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 తర్వాత మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై శిక్షలు విధించడం పెరిగింది. పోలీసులు ప్రాధాన్యత కేసులుగా తీసుకున్నవాటిలో ఇప్పటివరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. జాతీయస్థాయిలో.. అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దిశ వ్యవస్థకు ఇప్పటివరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించడం విశేషం. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. రికార్డు స్థాయిలో 1.46 కోట్ల డౌన్లోడ్లు దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. అందుకే ఈ యాప్‌ను ఇప్పటివరకు 1,46,99,012 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా 1,27,06,213 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజి్రస్టేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 10,80,454 ఎస్‌వోఎస్ కాల్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్ బటన్ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గవి 31,541 కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ అన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ ద్వారా సగటున రోజుకు 250 కాల్స్ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం. దోషులకు సత్వరం శిక్షలు మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా కేసుల దర్యాప్తు, నేర నిరూపణ ప్రక్రియ పక్కాగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా...సవరింపు చట్టం
హాంకాంగ్: లింగ వివక్ష, లైంగిక వేధింపుల నుంచి చైనాలో మహిళలకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంతో చట్టాన్ని సవరించింది. విస్తృతమైన ప్రజాభిప్రేయ సేకరణ, పలు సవరణలు తదనంతరం ఈ చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పించింది. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా, ప్రభుత్వం వారికి తగిన గౌరవం దక్కేలా చేయడం, అబార్షన్ పట్ల వస్తున్న నిర్భంధ వైఖరి తదితరాలపై కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో ఈ చట్టం వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత చైనా మహిళల రక్షణ చట్టాన్ని సవరించడం ఇదే తొలిసారి. ఈ మేరకు మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ చట్టం ముసాయిదాను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) స్టాండింగ్ కమిటీకి సమర్పించింది. ఐతే ఈ ముసాయిదాను ఇంకా అమలు చేయలేదు. సుమారు 10 వేల మంది ప్రజల సలహాలు, సూచనల కోసం పంపినట్లు ఎన్పీసీ తెలిపింది. ఈ ముసాయిదా చట్టం వెనుకబడిన, పేద, వృద్ధ, వికలాంగ మహిళల హక్కుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేస్తోందని స్థానిక జిన్హుహ వార్త సంస్థ పేర్కొంది. ఈ చట్టం ప్రకారం....మహిళల శ్రమ, సామాజిక భద్రత హక్కుల ప్రయోజనాలను ఉల్లంఘిస్తే సదరు యజమానులను శిక్షిస్తుంది. మహిళల అక్రమ రవాణ, కిడ్నాప్, రక్షణను అడ్డుకోవడం తదితరాలను నేరాలుగా పరిగణిస్తుంది. అలాగే అక్రమ రవాణాకు గురైన లేదా కిడ్నాప్‌కి గురైన మహిళలను రక్షించే బాధ్యత అధికారులపై ఉంటుందని స్పష్టం చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనతో తల్లిదండ్రులు పట్టపగలు కూడా ఆడపిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ’బచావో హైదరాబాద్’ పేరుతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మల్లు రవితోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన ఎడిటెడ్, లిమిటెడ్ వీడియోను ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగానే లీక్ చేశారని ఆరోపించారు. గ్యాంగ్‌రేప్ ఎక్కడ జరిగిందో ఇప్పటికీ హైదరాబాద్ సీపీ చెప్పడం లేదని, దేవుని పేరును ఆలంబనగా చేసుకొని ఎదగాలని చూసే పార్టీ కూడా గ్యాంగ్‌రేప్ జరిగిన ప్రదేశం గురించి అడగడం లేదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని, రిటైర్డ్ అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఘటనలో 8 మంది నిందితులుగా ఉంటే ఆరుగురిపై కేసు పెట్టారని, మిగతా ఇద్దరు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్‌లో కేసీఆర్ బంధువులు పబ్‌లు పెట్టి అడ్డగోలుగా నడుపుతున్నారని, ఎయిర్‌పోర్టు పార్కింగ్ వద్ద గల పబ్‌లో అరాచకం నడుస్తోందని, సర్కారును నడిపేవాళ్లే నేరగాళ్లుగా మారారని ధ్వజమెత్తారు. మహిళా సమస్యలపై సమీక్షల్లేవు:కోదండరాం మహిళల సమస్యలపై ఎనిమిదేళ్లుగా ఒక్క సమీక్ష కూడా జరగలేదని, చివరిసారిగా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. జూబ్లీహిల్స్ కేసుతోపాటు ప్రతి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎంకు చెందిన నేతల కొడుకులు, మనవళ్లు ఉన్న జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ఉన్నతమైన సమాజం వస్తుందని ఆశించామని, కానీ పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దాసోజు శ్రావణ్ తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. సమావేశంలో ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మల్లు రవి (కాంగ్రెస్), బాలమల్లేష్ (సీపీఐ), జ్యోత్స్న (టీడీపీ), తూడి దేవేందర్ రెడ్డి (వైఎస్సార్టీపీ), మామిడాల జ్యోతి (బీఎస్పీ) తదితరులు హాజరయ్యారు. -
జనసేనలో మహిళలకు రక్షణలేదు
సీటీఆర్ఐ (తూర్పు గోదావరి): జనసేన పార్టీలో మహిళలకు రక్షణలేదని.. ఇక్కడ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నా పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పట్టించుకోవటంలేదని పార్టీ వీర మహిళా విభాగం సభ్యురాలు సునీత బోయ ఆరోపించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడింది. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సినీ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు 2019 ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరం వచ్చినప్పుడు తనకు పరిచయం అయ్యాడని చెప్పింది. జూనియర్ ఆర్టిస్టుగా చేస్తున్నానని తాను చెప్పడంతో సినిమాల్లో అవకాశమిస్తానని నమ్మబలికాడని తెలిపింది. జనసేనలో తాను క్రియాశీలకంగా ఉండటంతో వీర మహిళ విభాగంలో పనిచేయాలని చెప్పాడని సునీత వెల్లడించింది. నిజానికి, తాను సొంత డబ్బుతో పవన్‌కళ్యాణ్ కోసం పనిచేశానని.. ఎన్నికల సమయంలో బన్నీ వాసు రాజమహేంద్రవరంలో ఆయన వెంట తిప్పుకుని లైంగికంగా లోబరుచుకున్నాడని, డ్రగ్స్ ఎక్కించి పిచ్చిదాన్ని చేయాలని చూశారని ఆరోపించింది. మూడేళ్లుగా ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా తనని మానసిక రోగిగా చిత్రీకరించి తనపై కేసులు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ దృష్టికి కూడా తీసుకెళ్లానని సునీత తెలిపింది. పార్టీలో వీర మహిళ విభాగంలో పనిచేస్తున్న తనకే రక్షణ కల్పించలేని పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించింది. రెండ్రోజుల్లో పవన్ స్పందించకపోతే న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని హెచ్చరించింది. -
ఏడు నిమిషాల్లోనే రక్షణ కల్పించిన 'దిశ'
పిఠాపురం: ఏడు నిమిషాల వ్యవధిలో ఓ మహిళకు రక్షణగా నిలిచింది దిశయాప్. తూర్పు గోదావరి జిల్లా అమీనాబాద్‌కు చెందిన ఒక వివాహిత బుధవారం ఇంట్లో బిడ్డకు పాలు ఇస్తోంది. గొడుగు మోషే అనే యువకుడు తాగిన మైకంలో ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. అక్కడే ఉన్న ఓ మహిళ తన సెల్ఫోన్లో దిశ యాప్ ద్వారా ఎస్‌వోఎస్ కాల్ సెంటర్‌కు కాల్ చేసి జరిగిన ఘటనను తెలిపింది. మహిళా పోలీసులు మంగాదేవి, మాధవి 7 నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలికి రక్షణగా నిలిచారు. కొత్తపల్లి పోలీసులు వచ్చి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్‌పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్‌మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్‌లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్‌లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్‌కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్‌చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్‌ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్‌ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్‌గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్‌క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్‌గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్‌లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్‌కాల్, మెసేజ్‌లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్‌లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్‌కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్‌కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
కడదాం.. 'దిశ' కంకణం
► విద్యార్థినులు, యువతులు, మహిళలు తమ ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్ కోసం తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ వెంటనే ఆ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని కూడా యాప్‌లో నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ► దిశ యాప్‌లో అత్యవసర సహాయం (ఎస్‌వోఎస్) బటన్ ఉంటుంది. యువతులు, మహిళలు ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నారని భావిస్తే వెంటనే యాప్‌ను ఓపెన్ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ► ఆ వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు. ► ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కడం ద్వారా వారి వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపుతుంది. ► విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు అక్కడికి చేరుకుంటారు. పోలీస్ వాహనాల్లో అమర్చిన ‘మొబైల్ డేటా టెర్మినల్’ ఇందుకు సహాయ పడుతుంది. సాక్షి, అమరావతి: వేళ కాని వేళనో.. ఊరు కాని ఊరులోనో.. ఎక్కడైనా కావచ్చు అనుకోకుండా బయటికి వెళ్లినప్పుడో, ఇంటి వద్దనే ఒంటరిగా ఉన్నప్పుడో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే దాని నుంచి ఎలా బయట పడాలి? తొలుత ఎవరికి ఫోన్ చేయాలి? అలా ఫోన్ చేసినప్పుడు వారు లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏమిటి? తిరిగి మరొకరికి ఫోన్ చేసే అవకాశం ఉండకపోతే? కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్. సెల్ ఫోన్లోని ఈ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే సరి.. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి వచ్చి రక్షణ కల్పిస్తారు. వర్తమాన కాలంలో ఆపద వేళ యువతులు, మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన సమాచార సాంకేతిక అద్భుతం ‘దిశ’ మొబైల్ యాప్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం మేరకు పోలీసు శాఖ ఈ యాప్‌ను రూపొందించింది. దీనిని సీఎం వైఎస్ జగన్ గత ఏడాది ఫిబ్రవరి 8న ఆవిష్కరించారు. ఆ యాప్ తమ మొబైల్ ఫోన్లో ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టే. తాము ఆపదలో ఉన్నామని సందేశం ఇస్తే చాలు.. క్షణాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని రక్షిస్తారు. అందుకే అద్భుత ఆవిష్కరణగా ‘దిశ’ యాప్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఏడాదిలోనే నాలుగు జాతీయ అవార్డులను సాధించడం విశేషం. ఇదిలా ఉండగా యాప్ డౌన్లోడ్, ఉపయోగించే విధానం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక ఇంటికి స్వయంగా వెళ్లి వివరించనున్నారని తెలిసింది. యాప్‌తో పూర్తిరక్షణ దిశ యాప్‌తో విద్యార్థినులు, యువతులు, మహిళలకు పూర్తి రక్షణ లభిస్తుంది. వారు ఆపదలో ఉన్నారని యాప్ ద్వారా సమాచారమిస్తే చాలు పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారిని రక్షిస్తారు. మహిళల రక్షణ కోసం ఇతరత్రా అనేక ఫీచర్లు ఈ యాప్‌లో పొందుపరిచారు. కాబట్టి ఈ యాప్‌ను యువతులు, మహిళలు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. – దీపికా పాటిల్, ప్రత్యేక అధికారి, దిశ విభాగం యాప్ వినియోగంపై అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం దిశ యాప్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎల్.ఎన్.పేట, కొత్తూరు, బొద్దాం, బడివానిపేట, చిలకపాలెం, జరజాం, కుప్పిలి, బెజ్జిపుట్టుగ, బూర్జపాడు, కేశుపురం, మండపల్లి పంచాయతీల్లో యాప్ ఆవశ్యకత గురించి పోలీసులు మహిళలకు వివరించారు. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ► తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, ఉప్పలగుప్తం, విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 22 పోలీసుస్టేషన్లలో అవగాహన సదస్సులు నిర్వహించారు. విజయవాడ కమిషనరేట్‌లో జరిగిన సదస్సులో డీసీపీలు విక్రాంత్‌పాటిల్, హర్షవర్ధన్‌రాజు, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకూ సమాచారం, ఇతరత్రా సాయం ► యువతులు, మహిళలు తాము ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతోపాటు తమ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు దిశ యాప్‌లో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఐదు నంబర్లను ఆ యాప్‌లో ఫీడ్ చేసుకోవచ్చు. దాంతో ఆ ఐదు నంబర్లకు కూడా సమాచారం చేరుతుంది. వారు కూడా వెంటనే పోలీసులను సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. ► ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం కూడా దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకోసం ఆ యాప్‌లో ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేయాలి. వారు ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, వారి బంధుమిత్రులకు సమాచారాన్ని పంపుతుంది. దాంతో వారు అప్రమత్తమై రక్షణకు వస్తారు. ► దిశ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లు కూడా ఉంటాయి. పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు 16 లక్షల డౌన్లోడ్లు ► దిశ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 16 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. విపత్తుల్లో చిక్కుకున్న ఎందరో ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానాల ద్వారా వారికి శిక్షలు విధించారు. ► దిశ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. 2 నిమిషాల్లో స్పందన గుంటూరు రూరల్: దిశ యాప్ పని తీరుపై విద్యార్థినులు, యువతులు, మహిళల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని హోం మంత్రి సమక్షంలోనే యాప్ పనితీరును పరిశీలించింది. గుంటూరు నగర శివారులోని నల్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన సభలో విద్యార్థిని దొడ్డా తేజస్విని సభా ప్రాంగణంలోనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఎస్ఓఎస్ బటన్ నొక్కింది. బటన్ నొక్కిన 30 సెకన్లలో కాల్ సెంటర్ నుంచి విద్యార్థినికి కాల్ వచ్చింది. తాను నల్లపాడు సెంటర్లో ఉన్నానని, ఆకతాయిలు వేధిస్తున్నారని విద్యార్థిని చెప్పింది. మరో 30 సెకన్లలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. నీవు ఉన్న ప్రదేశం గుర్తించామని, మరో నిమిషంలో అక్కడకు వస్తున్నామని చెప్పారు. అంతలో మరో అధికారి ఫోన్ చేసి.. భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలా రెండు నిమిషాల్లో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు చెందిన దిశ మహిళా కానిస్టేబుల్ షేక్ ఫాతిమా దిశ, పెట్రోలింగ్ వాహనంతో విద్యార్థిని ఉన్న లొకేషన్‌కు చేరుకుంది. దిశ బృందం స్పందన చూసి, అక్కడ ఉన్న వారందరూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ యాప్ ఉపయోగం ఎంతగా ఉంటుందో తెలిసినందున మహిళలందరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. ‘ఈ యాప్ ఉపయోగం ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. నా స్నేహితులందరితోనూ డౌన్లోడ్ చేయిస్తాను’ అని విద్యార్థిని దొడ్డా తేజస్విని పేర్కొంది. పుష్ బటన్ ఆప్షన్... ‘పుష్ బటన్’ ఆప్షన్ పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా పోలీసులు అందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయవచ్చు. ఈ బటన్‌ను ఒకసారి నొక్కితే చాలు యాప్ ఉపయోగించే వారందరికీ ఒకేసారి పోలీసుల సందేశం చేరుతుంది. -
దిశ యాప్.. డౌన్లోడ్స్ 11 లక్షలు
సాక్షి, అమరావతి: మహిళల రక్షణే ధ్యేయంగా ఏపీ పోలీస్‌శాఖ తెచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్ 11 లక్షల డౌన్లోడ్స్ను అధిగమించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో దిశ ఘటనతో మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసుల సాయం పొందేలా ప్రత్యేకంగా దిశ మొబైల్ అప్లికేషన్ తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ఈ మొబైల్ అప్లికేషన్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తోంది. ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చిన పోలీస్ కృషిని యూజర్లు ప్రశంసిస్తున్నారు. దిశ యాప్ సాధించిన రికార్డులు ► 11లక్షలకుపైగా యాప్ డౌన్లోడ్స్ ► 79,648 మంది యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ఉపయోగించుకున్నారు. తాము ప్రమాదంలో ఉన్నట్టు పోలీసులకు తక్షణ సంకేతాలిచ్చేలా ఈ బటన్ ఉపయోగపడుతోంది. అయితే ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు కొందరు, అనుకోకుండా కొందరు బటన్ ప్రెస్ చేశారు. ► దిశ యాప్ ద్వారా సహాయం కోరిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రంలో 604 మంది మహిళలకు అండగా నిలిచారు. ► దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేసిన పోలీసులు 122 కేసులు నమోదు చేశారు. ► బాధిత మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చుననే వెసులుబాటుతో పోలీసులు 341 జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం 67 అత్యాచార కేసులు, 195 లైంగిక వేధింపుల కేసుల్లో (మొత్తం 262 కేసులు) దిశ బిల్లులో ప్రతిపాదించినట్టు కేవలం ఏడురోజుల్లోనే పోలీసులు చార్జిషీటు వేయడం రికార్డు. 79 కేసుల్లో కోర్టు తీర్పులు దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన కీచకులకు వేగంగా శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు పట్టుసాధిస్తున్నారు. 79 కేసుల్లో తీర్పులు వచ్చాయి. వీటిలో 66 కేసుల్లో జైలుశిక్ష, 12 కేసుల్లో జరిమానా విధించగా ఒక కేసులో జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రతి మహిళా ఉపయోగించుకోవాలి ప్రతి మహిళా తన మొబైల్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. తనతోపాటు ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలి. ఈ యాప్‌ను దుర్వినియోగం చేయకూడదు. సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే 11 లక్షల డౌన్‌లోడ్స్‌తో ఈ యాప్ రికార్డు సృష్టించింది. యాప్ ద్వారా సమాచారం ఇస్తే చాలు.. సమీపంలోని పోలీసులు రంగంలోకి దిగి ప్రమాదం లో ఉన్న మహిళలకు సహాయం అందిస్తున్నారు. ఇబ్బందిపడే ప్రతి మహిళా ఈ యాప్‌ను ఉపయోగించుకునే స్థాయిలో చైతన్యం పెరగాలి. – పాలరాజు, ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్ -
ఎన్నాళ్లిలా: చచ్చినా గౌరవం లేదు
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః... ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారన్నది నానుడి. పూజల మాటేమోగాని.. చచ్చినా కనీస గౌరవం ఇవ్వడంలేదు ఈ సమాజం! మొన్న నిర్భయ... నిన్న ప్రియాంకారెడ్డి.. తాజాగా హాథ్రస్ యువతి.. మహిళలపై హత్యాచారాలు, బెదిరింపులు, వేధింపులు... మన దేశానికి మాత్రమే పరిమితం కాదు.. కానీ... అతి ప్రాచీన సంస్కృతిగా గొప్పలు చెప్పుకుంటున్న భారతావనిలో ఇలాంటి ఘటనలు ఏటికేడాది పెరిగిపోతూ ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమే. మహిళల రక్షణ విషయంలో మనం చేస్తున్నదేమిటి? చేయాల్సిందేమిటి? అన్నది ఒక్కసారి తరచి చూస్తే.. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కరు లైంగిక, భౌతిక హింస ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. దేశాలకతీతంగా ఇది జరుగుతోంది. అయితే వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అకృత్యాల ప్రభావం నేటి మహిళపై ఏమిటి? అంటే.. వారి కదలికలపై ఆంక్షలకు కారణమైంది. వారి స్వేచ్ఛకు అన్ని రకాల పరిమితులు, పరిధులు ఏర్పాటు చేసింది. ఇది ఆయా మహిళలకు మాత్రమే నష్టం చేకూర్చడం లేదు. సమాజం మొత్తానికి తీవ్రమైన లోటుగా మారిందనడం అతిశయోక్తి కాదు. ఆడపిల్లలు తమ సామర్థ్యం మేరకు చదువు పూర్తి చేసుకోగలిగినా, నచ్చిన వృత్తి, ఉద్యోగాలను నెరపగలిగినా కుటుంబం పరిస్థితి, సమాజం తీరుతెన్నులు మరోలా ఉంటాయనడంలో సందేహం లేదు. (న్యాయం జరిగేదాకా పోరుబాటే) 2018లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ జారీ చేసిన జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకు 108. అంతకు మునుపటి ఏడాది కూడా మన స్థాయి ఇంతే. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం, అవకాశం, రాజకీయ సాధికారత, విద్య, ఆరోగ్య సేవలు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసే ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్ ఏమాత్రం ముందుకు వెళ్లినా.. అది మన స్థూల జాతీయోత్పత్తిని అమాంతం పెంచేస్తుందని అంచనా. ఇదంతా ఎందుకూ అంటే.. మహిళల భద్రత, వారి చదువు సంధ్యలు మన సంస్కారాన్ని చాటుకునేందుకు మాత్రమే కాదు.. భారత్ విశ్వగురువుగా ఎదగాలన్న వారి ఆశలకూ అత్యవసరమని చెప్పేందుకు! ’(ఢిల్లీలో ప్రియాంకా గాంధీ ధర్నా) ఆ(యా)ప్కే సాథ్! మహిళల భద్రత అనేది భారత్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ఆడబిడ్డలను సురక్షితంగా ఉంచేందుకు వినూత్న టెక్నాలజీల అభి వృద్ధి కూడా పలు దేశాల్లో జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ సాయంతో విపత్కర పరిస్థితుల్లో మహిళలు కుటుంబ సభ్యులను, పోలీసులను అలర్ట్ చేసేందుకు పలు అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి... నమోలా : దక్షిణాఫ్రికాలో రూపొందించిన అప్లికేషన్ ఇది. పోలీసులే కాకుండా.. అగ్నిమాపక దళం, అంబులెన్ వంటి అత్యవసర సేవలన్నింటినీ అందుబాటులోకి తెస్తుంది. మీరున్న ప్రాంతాన్ని దగ్గరివారితో పంచుకునేందుకు అవకాశం ఉండటం ఈ అప్లికేషన్ లోని ఒక అంశం. మీరు కలవాల్సిన ప్రాంతానికి బంధుమిత్రులు ముందుగానే వచ్చినా.. వారు ప్రయాణం ప్రారంభించినా ఆ సమాచారం మీకు చేరిపోతుంది. అప్లికేషన్ లోనే ఓ ప్యానిక్ బటన్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఒత్తితే చాలు.. పోలీసులకు మీరున్న ప్రాంత వివరాలు తెలుస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నారన్న విషయమూ తెలిసిపోతుంది. లక్షకుపైగా డౌన్లోడ్లు ఉన్న ఈ అప్లికేషన్ రేటింగ్ 4.75/5 గా ఉంది. కవలన్ ఎస్ఓఎస్ : తమిళనాడు పోలీసులు రూపొందించిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ఇది. ఈవ్ టీజింగ్, కిడ్నాప్ వంటి పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించేందుకు వీలు కల్పిస్తుంది. ఫేక్ కాల్స్‌ను నివారించేందుకు తద్వారా పోలీసుల విలువైన సమయాన్ని కాపాడేందుకు కూడా ఈ అప్లికేషన్ లో ఏర్పాట్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ఎంపిక చేసుకున్న నంబరుకు మీరున్న ప్రాంతాన్ని చేరవేస్తుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ పనిచేస్తుంది. ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారం పంపిస్తుంది. ఎస్ఓఎస్ మీట నొక్కగానే ఫోన్ వెనుక భాగంలోని కెమెరా ద్వారా వీడియో రికార్డింగ్ మొదలవుతుంది. ఈ అప్లికేషన్‌కు 10 లక్షలకుపైగా డౌన్ లోడ్లు ఉన్నాయి. గ్రానస్ : మహిళలు, పిల్లలకు అత్యవసర వైద్యసాయం అందించేందుకు రూపొందించిన అప్లికేషన్ ఇది. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా రక్తం అత్యవసరమైనప్పుడు ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్‌లో తయారైన ఈ అప్లికేషన్ ను ఇప్పటివరకూ 50వేల మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. అత్యవసరమైనప్పుడు లేదా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించేందుకు ఇందులో సౌకర్యం ఉంటుంది. గ్రానస్కు అనుబంధంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆపదలో ఉన్న మహిళతో మాట్లాడి అత్యవసర సాయం అందిస్తారు. రక్తం అవసరమైన వారిని, దాతలను కలిపే ఓ ప్లాట్‌ఫాం ఇది. స్మార్ట్‌ఫోన్ లేని వారి కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేకమైన కార్యకర్తల బృందం ఒకటి పనిచేస్తూ ఉండటం విశేషం. ఎక్కడుంది సమస్య? పితృస్వామ్య వ్యవస్థ మొదలుకొని, మన నగరాల్లోని చిన్న చిన్న విషయాల వరకూ అనేక అంశాలు ఈ దేశంలో మహిళల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. చిన్నప్పటి నుంచి అన్ని అంశాల్లోనూ మగపిల్లలకు అధిక ప్రాధాన్యం కల్పించడం.. వారిలో ఆడవారిపై ఒక రకమైన తేలిక భావాన్ని సృష్టిస్తుందని పలువురు సామాజిక నిపుణులు స్పష్టం చేశారు. ప్రతి లక్ష మందికి 125 మంది పోలీసులు మాత్రమే ఉన్న అతి తక్కువ దేశాల్లో భారత్ కూడా ఒకటి కావడం మహిళల భద్రతపై ప్రభావం చూపుతున్న అంశాల్లో రెండోది. భారత్‌లో రోజూ కనీసం 67 మంది అత్యాచారానికి గురవుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై హింస అంటే అది లైంగికమైందే అన్న స్థితికి భారత్ చేరుకుంది. ఫలితంగా భార్యపై భర్త భౌతికంగా దాడి చేయడం సాధా రణమైన అంశంగా మారిపోయింది. చాలా కేసులు పోలీసుల దృష్టికి రాకుండానే తెరమరుగు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న పనులతో పెద్ద తేడా.. ప్రభుత్వం కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా కొంత మార్పును తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. 2012 నాటి నిర్భయ ఘటనలో అత్యాచారానికి పాల్పడ్డ వారికి మరణ శిక్ష విధించినా.. కేసుల విచారణలో జాప్యం, దోషిగా నిరూపణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వంటి అంశాల్లో మార్పు రావాల్సి ఉంది. అత్యాచార నేరాలకు ప్రత్యేక కోర్టులు, చట్టాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసింది. నగరాల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేయడంతో మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు బస్టాపులన్నింటిలో వీధి దీపాల వెలుతురు ఉండేలా జాగ్రత్త పడటం లేదా ఏకాంత ప్రదేశాల్లో కాకుండా.. కొద్దోగొప్పో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు బస్టాపులను తరలించడం. దీంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ అన్ని వీధుల్లో దీపాలు ఏర్పాటు చేయడం మహిళల భద్రత విషయంలో ప్రభావశీలిగా ఉంటుందని అంచనా. 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో పొదుపు లక్ష్యంగా అమెరికాలో వీధి దీపాల వెలుగును తగ్గిస్తే చాలా నగరాల్లో మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళల అవసరాలు తీర్చే ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటివి కూడా మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. మరచిపోలేని నిర్భయలు.. 2013, ముంబై: శక్తి మిల్స్ సామూహిక అత్యాచారం. ఓ కౌమార వయస్కుడితోపాటు ఐదుగురు జరిపిన అమానవీయ ఘటన. 2014, ఉత్తరప్రదేశ్: బడావ్ సామూహిక అత్యాచారం కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారు. 2016, రాజస్తాన్: పదిహేడేళ్ల బాలికపై హాస్టల్ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇది. బాధితురాలి మృతదేహం ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం సమీపంలోని నీటి కొలనులో ప్రత్యక్షమైంది. 2017, ఉత్తరప్రదేశ్: ఓ మైనర్ బాలికపై ఉన్నావ్‌లో జరిగిన సామూహిక హత్యాచారం. బీజేపీ మాజీ సభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌పై కేసు నమోదు. 2018, కథువా: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో మైనర్ బాలికపై ఏడుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదు రోజుల తరువాత బాధితురాలి మృతదేహం లభ్యమయ్యింది. 2020, మధ్యప్రదేశ్: బన్సీపురలో ఆరేళ్ల పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కనుగుడ్లు పెకిలించే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. కిడ్నాపైన కొన్ని గంటలకు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు తాళ్లతో కట్టివేసిన పరిస్థితిలో ఈ బాలిక దొరికింది. -
ఓ కన్నేసి ఉంచండి..
సాక్షి, విశాఖపట్నం: మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ లేనిదే క్షణం కూడా గడవలేని పరిస్థితికి వచ్చేశాడు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విస్తృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు, ఆన్లైన్ షాపింగ్, వివాహ సంబంధాలు పేరిట, సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని మోసాలు, మహిళల గౌరవానికి భంగం కలిగేలా పోస్టింగ్‌లు, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేయడం, ఓఎల్ఎక్స్ పేరిట మోసాలు, వీడియో గేమ్‌ల పేరిట వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేయడం, ఆన్లైన్ లావాదేవీలు, లక్కీ డ్రాలు, లాటరీలు ఇలా.. ఎన్నో మోసాలకు సైబర్ నేరగాళ్లు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘ఈ–రక్షాబంధన్’ పేరుతో నిర్వహిస్తున్న వెబ్‌నార్ తరగతులు, అవగాహన సదస్సులకు అనూహ్య స్పందన వస్తోంది. ‘ఈ–రక్షాబంధన్’కు మంచి స్పందన సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. వాటిని అధిగమించాలంటే మహిళల్లో అవగాహన అవసరమని రాఖీ పౌర్ణమి రోజున ‘ఈ–రక్షాబంధన్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 3వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని మహిళలు, విద్యార్థినులు, మహిళా కో–ఆర్డినేటర్లు, మహిళామిత్రలు, పోలీస్ అధికారులకు పోలీసుశాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా వెబ్‌నార్ తరగతులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. నేరుగా పోర్టల్‌లో లాగిన్ అయ్యేలా ఆయా పోలీస్‌స్టేషన్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాల నుంచి మహిళలు, బాలలకు రక్షణ కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఆయా వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సైబర్ మోసాలెన్నో... విశాఖ నగరంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా కేంద్రాలుగా విశాఖ నగరవాసులపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. సోషల్ మీడియా, ఆన్లైన్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో హనీట్రాప్ పేరుతో బెంగళూరు కేంద్రంగా కొందరు సైబర్ నేరగాళ్లు పలు వెబ్సైట్లు, యాప్‌లలో అందమైన యువతుల ఫొటోలు పెట్టి ఆకర్షించారు. అమ్మాయిలతో ఫోన్ ట్రాప్ చేయించి ముగ్గులోకి దించి నగదు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ముఠాను సైబర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో ఏటీఎంలో చోరీ జరిగిందని ఓ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన క్రైం పోలీసులు.. ఢిల్లీ కేంద్రంగా ఏటీఎంలలో కొత్త తరహాలో దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని రెండు రోజుల కిందట అరెస్ట్ చేశారు. ఆన్లైన్ పెళ్లి సంబంధాల వెబ్‌సైట్‌ల్లో పలువురు మోసగాళ్లు నకిలీ ఫ్రొఫైల్, ఫొటోలు, వివరాలతో ఎన్నారై సంబంధాల పేరిట చేస్తున్న మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. పెళ్లి సంబంధాల ముసుగులో పరిచయం చేసుకుని చాటింగ్ చేస్తూ..బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం, మార్ఫింగ్ చేయడం తదితర ఘటనలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. లింక్‌లు పంపించి గుర్తింపు దొంగతనం, ఆన్లైన్లో ఉద్యోగాలంటూ మనీ ట్రాన్స్ఫర్ మోసాలు, బ్యాంక్‌ల పేరిట నకిలీ వెబ్సైట్లతో మోసాలు ఇలా అడుగడుగునా సైబర్ నేరగాళ్లు మనల్ని ఉచ్చులోకి దింపి.. మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. ‘వర్చువల్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్’పై వెబ్‌నార్ నేడు పెదవాల్తేరు(విశాఖతూర్పు): సైబర్ నేరాలకు పాల్పడే నిందితులకు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు విధిస్తున్నారని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ఈ–రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఐడీ, సైబర్‌పీస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘సైబర్ నేరాలు–శిక్షలు’ అంశంపై జరిగిన వెబ్‌నార్‌లో వారు మాట్లాడారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాంకేతిక నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా వినియోగదారులు, మహిళలు, టీనేజర్లు, నిరుద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా ప్రజలు ఫేస్బుక్, యూట్యూబ్ చానల్ ద్వారా వెబ్‌నార్‌ను వీక్షించారు. కాగా.. ఈ సిరీస్‌లోభాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ‘వర్చువల్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్’అంశంపై జరిగే వెబ్‌నార్‌ను జిల్లా ప్రజలు వీక్షించాలని ఎస్పీ బి.కృష్ణారావు కోరారు. నిపుణుల సూచనలివీ.. ► ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసేటప్పుడు.. హెచ్టీటీపీఎస్లతో ప్రారంభమయ్యే వెబ్సైట్లు సురక్షితం. ►సినిమాలు, వీడియోలు, ఆడియోలు డౌన్లోడ్ చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న అధీకృత యాప్‌లను ఉపయోగించడం మంచిది. ►నీలి చిత్రాలు, అవాంఛిత వెబ్సైట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ► సైబర్ బుల్లియింగ్ జోలికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. ► మైనర్లు స్మార్ట్ఫోన్లు చూసేటప్పుడు.. తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలి.. ► టెక్నాలజీ పరిమితంగా వాడితే ఉపయోగం.. అతిగా వాడితే అనర్థం ► మితిమీరిన ఇంటర్నెట్ వినియోగంతో మానసిక, శారీరక రుగ్మతలతో పాటు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే అవకాశం ఉంటుంది. ►డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ వ్యసనంగా మారకూడదు. ► ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్రైవసీ పాలసీని కచ్చితంగా చదవాలి. ► యువతులు, మహిళలు ఆన్లైన్ మాధ్యమాల్లో వీలైనంత మేరకు వ్యక్తిగత గోప్యత పాటించాలి. ► సోషల్ మీడియాలో అపరిచితులతో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ సరికాదు. ► ఓ ఎల్ఎక్స్ వెబ్సైట్లలో నకిలీ అడ్రస్‌లుంటాయి. వాటిని గుర్తించాలి. ►ఆన్లైన్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం. అసభ్యకరమైన, మహిళలను అగౌరవపరిచేలా, భంగం కలిగించేలా పోస్ట్‌లు పెట్టకూడదు. పిల్లలపై పర్యవేక్షణ తప్పనిసరి రోజు రోజుకూ సాంకేతిక వినియోగం అధికమవుతున్న వేళ.. సాంకేతిక పరిజ్ఞానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలి. పిల్లలకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు ఇచ్చినా.. వారిపై నిఘా ఉంచాలి. ఎంత బిజీగా ఉన్నా.. రోజులో ఏదో సమయంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్/ ట్యాబ్‌లో చేస్తున్న కార్యకలాపాలను పర్యవేక్షించడం ముఖ్యం. –ఎల్.కె.వి.రంగారావు, డీఐజీ, విశాఖ రేంజ్ నిర్భయంగా ఫిర్యాదు చేయండి సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఈ–రక్షాబంధన్ పోర్టల్‌ను ప్రతి ఒక్కరూ వీక్షించాలి. సైబర్ నిపుణులు ఇచ్చే జాగ్రత్తలు పాటిస్తూ.. అవగాహన తరగుతులకు హాజరైన ప్రతి మహిళా.. తమ పరిధిలోని మిగతా వారికి వివరించాలి. ఎవరైనా మహిళలు సైబర్ నేరగాళ్ల బారిన పడితే.. వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది. టోల్‌ఫ్రీ నంబర్ 112కు కాల్ చేసినా/ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. నిర్భయంగా ఫిర్యాదు చేయండి. – బొడ్డేటి కృష్ణారావు, ఎస్పీ సైబర్ నేరాలపై జాగ్రత్తలు అవసరం స్మార్ట్‌ఫోన్ ఎలా ఉపయోగించాలో తెలియక.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతు న్నారు. ఇందులో యువత ఎక్కువగా బలైపోతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. నర్సీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన తరగతులకు హాజరయ్యాను. సైబర్ నేరాలపై అవగాహన వచ్చింది. సచివాలయ పరిధిలో ఉన్న మహిళలు, యువతకు ఈ–రక్షాబంధన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేలా, ఆన్లైన్ క్లాస్‌లు వినేలా చర్యలు తీసుకుంటాను. –పాలెపు అన్నపూర్ణ కామేశ్వరి, సచివాలయ మహిళా పోలీస్, నర్సీపట్నం ఇక నుంచి అప్రమత్తంగా ఉంటాం సైబర్ నేరాల ఎలా జరుగుతున్నాయి.. ఎలా మోసపోతున్నామో తెలిసింది. నాతో పాటు మా వార్డులో ఉన్న మహిళలు, యువతకు వివరించడమే కాకుండా.. ఈ–రక్షాబంధన్ పోర్టల్‌లో లాగిన్ అవుతాం. ఆన్లైన్లో సైబర్ నేరాలు నుంచి రక్షణ పొందుతాం. –వై.మణి, శారదానగర్, వార్డు వలంటీర్ ►మహిళా సంబంధిత మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్ 112 ►వాట్సాప్ నంబర్ 90716 66667 -
ఆన్లైన్ జాబులకు డబ్బు చెల్లించొద్దు..
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు అవగహన కల్పించేలా ఆన్లైన్ శిక్షణా తరుగతులను ప్రభుత్వం చేపడుతోంది. దీనిలో భాగంగానే విజయవాడలో శుక్రవారం 18వ రోజు ‘ఈ రక్షా బంధన్’ శిక్షణ తరగతులు జరిగాయి. పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వెబ్‌నార్‌లో వ్యక్తిగత సమాచార దోపిడి, ఉద్యోగాల మోసాలు వంటి అంశాలపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా వెబ్‌నార్‌లో పాల్గొన్న సైబర్ నిపుణులు విమల్ ఆదిత్య, నందీశ్వర్ పలు కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అలాగే సోషల్ మీడియాలోనూ షేర్ చేయవద్దని సలహాఇచ్చారు. ఆన్లైన్ జాబ్ మోసగాళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా డబ్బు చెల్లించవద్దని నిరుద్యోగులకు సూచించారు. అలాగే వ్యక్తిగత సమాచారం దోపిడికి గురైతే దానిని ఎలా కనుగోవచ్చు అంశపై సుదీర్ఘంగా చర్చించారు. సైబర్ స్థలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వైఖరిని పెంపొందించుకోవాలన్నారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో సర్వే ఫారాలను నింపడం ద్వారా సమాచారం దోపిడి జరుగుతుందన్న అనుమానంపై సైతం సలహాలు ఇచ్చారు. అలాగే ఆన్లైన్ ఉద్యోగ మోసాలు ,పెళ్ళి సంబంధాల మోసాల నుంచి రక్షణ పొందడానికి భద్రతా చిట్కాలను సైతం సైబర నిపుణులు చర్చించారు. కాగా తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్‌కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. -
సైబర్ వల.. తప్పించుకోవడం ఎలా..!
సాక్షి, హైదరాబాద్: మహిళా రక్షణ విభాగం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా విస్తరిస్తోన్న వేళ మనిషి జీవనవిధానం మారిపోయింది. నిత్యావసరాలు, అత్యవసరా లు, విద్య, ఉద్యోగం అన్నీ ఆన్‌లైన్‌కి మారాయి. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులకు సైబర్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. కోవిడ్ తరువాత కూడా ఆన్లైన్ వినియోగం, దానిపై ఆ ధారపడే అవకాశాలు ఏమాత్రం తగ్గేలా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు ఆన్లైన్లో పొంచిన ఉన్న ప్రమాదాలు, ముప్పును ఎలా తప్పిం చాలి? సురక్షిత, ఆరోగ్యకరమైన ఆన్లై న్ వాతావరణం ఎలా పొందాలి? అన్న విషయాలపై విస్తృత చర్చ జరగాలని తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయిం చింది. తెలంగాణ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జూలై 15 నుంచి ఆన్లైన్లో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి యూని సెఫ్ (ఐక్యరాజ్యసమితి చిన్నారుల అత్యవసర నిధి) సహకారం అందించేందుకు ముందుకు రావడం విశేషం. ఆన్లైన్లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఇంతటి విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఉద్దేశం ఏమిటి?: ఆన్లైన్లో పాటించాల్సిన భద్ర త ప్రమాణాలు, పిల్లలకు ఎలాంటి సైబర్ వేధింపు లు, ఎరలు, సవాళ్లు ఉంటాయి? వాటి ని ఎలా అధిగమించాలి? అన్న సందేహాలకు శాశ్వత పరిష్కారాలు సూచిం చడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో పలువురు మహిళా ఐపీఎస్, ఐఏఎస్, డీఎస్పీలు, ఎన్జీవో ప్రతినిధులు, లా యర్లు, సైబర్ నిపుణులు, విద్యార్థులు, మహిళా ఉద్యోగినులు, సైకాలజిస్టు లు, కౌన్సెలర్లు పాల్గొంటారు. రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలు, సీబీఎస్ ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులను భాగస్వాములను చేస్తారు. దీని పై విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తోనూ విమెన్‌సేఫ్టీ వింగ్ వారు చర్చలు జరిపారు. ప్రతీ రోజూ వినూత్నంగా.. జూలై 15 నుంచి ఆన్లైన్లో జరిగే ఈ కార్యక్రమానికి ఒక్కోరోజూ ఒక్కో అం శంపై చర్చలు, విశ్లేషణలు సాగుతా యి. విద్యార్థులు, మహిళా ఉద్యోగుల సందేహాలకు సమాధానాలిస్తారు. పా ల్గొనేవారిలో అధికశాతం విద్యార్థులే ఉంటారు కాబట్టి, వారు విసుగు చెందకుండా..వారిని పూర్తిగా భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించా రు. ఆన్‌లైన్‌భద్రత, సైబర్‌సేఫ్టీపై క్విజ్, వ్యాసాలు, కథల వంటి వాటితో అవగాహన కలిగిస్తారు. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..
సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ఓ అన్నగా తమ భద్రత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్ ద్వారా సాయం కోరగా.. కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇంటర్నెట్ సాయంతో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా ఫోన్ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కడం ద్వారా గానీ, ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఉపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కంట్రోల్ రూమ్‌కు ఎలా ఫిర్యాదు చేయాలో పూర్తి వివరాలు ఓసారి చుద్దాం.. ► ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ► ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. ► ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. ► ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది. ► ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. ► ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. ► అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ► దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. ► ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. ► దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. -
ఆకతాయిల ఆగడాలకు ‘చెప్పు’ దెబ్బ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మాయి కదా అని హద్దుమీరారో అలారం మోగుతుంది. తాకేందుకు ప్రయత్నించారో షాక్ కొడుతుంది. మాన, ప్రాణాలను కాపాడుకునేలా మహిళల పాదరక్షల్లో అమర్చే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులు రూపొందించారు. వివరాలు.. తంజావూరుకు చెందిన బీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పట్టభద్రురాలైన అమృతగణేష్ (33) 600కు పైగా పరికరాలను తయారుచేసింది. తంజావూరులోని ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు సంగీత, సౌందర్య, వినోదిని, విద్యార్థి మణికంఠన్‌లు అమృతగణేష్‌తో కలిసి అనేక పరిశోధనలు చేశారు. వేధింపుల బారినుంచి మహిళలు తమను తాము కాపాడుకునేందుకు వైర్లెస్ రిసీవర్, బ్యాటరీ, ఎలక్ట్రోడులను వినియోగించి పాదరక్షల్లో ఇమిడేలా ఒక పరికరాన్ని తయారుచేశారు. మహిళలు వేధింపులకు గురికాగానే వారు ధరించిన చెప్పుల్లోని ఆ పరికరం నుంచి వంద మీటర్ల వరకు వినిపించేలా అలారం మోగుతుంది. అంతేగాక ఆ చెప్పును నిందితునికి తాకిస్తే షాక్‌కు గురయ్యేలా తీర్చిదిద్దారు. ఈ పరికరానికి చార్జింగ్ చేయాల్సిన పనిలేదు. నడిచేటప్పుడే రీచార్జ్ అవుతుంది. ఈ పరికరాన్ని సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్‌లలో కూడా అమర్చుకోవచ్చు. (చదవండి: ఐటీ అధికారుల ముందుకు అర్చన కల్పత్తి) -
4 రోజుల్లోనే 50 వేల మంది డౌన్లోడ్
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్ యాప్ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. నాలుగు రోజుల్లోనే దిశ యాప్‌ను ఏకంగా 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు స్పందిస్తున్న తీరుకు మెచ్చి గూగుల్ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్ రేటింగ్ ఇచ్చారన్నారు. 9వ తేదీ నుంచి సగటున రోజుకు రెండు వేల మందికిపైగా దిశ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ చేస్తున్నారని వివరించారు. దిశ చట్టాన్ని తెచ్చిన 24 గంటల్లోనే మొదటి కేసులో పోలీసులు వాయు వేగంతో స్పందించిన విధానం, బాధితురాలికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించిన తీరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంతో ఎక్కువ మంది దిశను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి నిపుణులైన, అనుభవము ఉన్నవారి చేత కౌన్సెలింగ్ నిర్వహించి వారు కలసి మెలసి ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి.. ► భార్య, భర్తల మధ్య నెలకొన్న వివాదంలో భర్త విచక్షణ కోల్పోయి కొడుతుండడంతో బాధిత మహిళ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా దిశ కంట్రోల్ సెంటర్‌కు ఫిర్యాదు అందించింది. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకొని భర్త వేధింపుల నుంచి బాధితురాలిని రక్షించారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో వరుసకు సోదరుడైన వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళ ఎస్‌వోఎస్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి తరచుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ బాలిక దిశ ఎస్‌వోఎస్ ద్వారా ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకొని ధైర్యం చెప్పారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. (చదవండి: ఇంటర్నెట్ అవసరం లేకుండానే..) -
వన్ పోలీస్.. వన్ వాట్సాప్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు– 9490616555, సైబరాబాద్ కాప్స్– 9490617444, రాచకొండ కమిషనరేట్– 9490617111.. రాజధాని భౌగోళికంగా కలిసే ఉన్నా.. పరిధుల పరంగా మూడు కమిషనరేట్లు ఉండటంతో వేర్వేరు వాట్సాప్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక అంశాలు తెలియని కొందరు బాధితులు ఫిర్యాదుచేసే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది కమిషనరేట్లు, 19 పోలీసు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఒకే వాట్సాప్ నంబర్ అమల్లోకి తేవాలని నిర్ణయించింది. డీజీపీ కార్యాలయం కేంద్రంగా దీన్ని నిర్వహిస్తారు. ఫిర్యాదుల మానిటరింగ్‌కు పదిమంది ఏదైనా సమస్య ఎదుర్కొంటున్న, నేరాల బారినపడిన వారు పోలీసులకు సమాచారమివ్వడానికి పలు వేదికలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప ‘డయల్–100’ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే ఫోన్‌కాల్ ద్వారా మాత్రమే దీనికి ఫిర్యాదు చేసే ఆస్కారం ఉంది. వాయిస్ రికార్డులు, వీడియోలు, ఫొటోలు వంటివి పంపించడానికి పోలీసు విభాగాలు ట్విట్టర్ వంటివి అందుబాటులోకి తెచ్చినా.. వాట్సాప్ మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకోలేరు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఎవరికి వారుగా వాట్సాప్ నంబర్లు ఇచ్చారు. వీరంతా తమకందే ఫిర్యాదుల్ని మానిటర్ చేయడానికి ఎక్కడికక్కడ ప్రత్యేకంగా సోషల్‌మీడియా సెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేయడానికి కనీసం పదిమందిని కేటాయిస్తున్నారు. సిబ్బంది కొరత, బందోబస్తు సందర్భాల్లో ఈ సోషల్‌మీడియా వింగ్ సిబ్బందినీ అక్కడకు మోహరిస్తున్నారు. అలాకాక, రాష్ట్ర పోలీసు విభాగానికి ఒకే వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెస్తే డీజీపీ కార్యాలయం కేంద్రంగా పదిమందిని నియమిస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీళ్లే రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల్ని సమీక్షిస్తూ సంబంధిత విభాగాలకు పంపిస్తారు. నేరుగా ఆయా పోలీసుస్టేషన్లకే ఈ ఫిర్యాదుల్ని పంపే వీలు కలగనుంది. ఒకే నంబర్‌తో ఎంతో సౌలభ్యం ప్రస్తుతం జిల్లాలు, కమిషనరేట్ల ఆధీనంలోనే వాట్సాప్ నంబర్లు ఉండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. తాము ఫిర్యాదుచేస్తే ఆ సమాచారం తక్షణం సదరు అధికారికి తెలిసిపోతుందని, తమ నంబర్లు సైతం వారికి అందుతాయనే భావనతో పలువురు ఫిర్యాదులకు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్.. అదీ డీజీపీ కార్యాలయం కేంద్రంగా అందుబాటులోకి వస్తే ఎటువంటి ఫిర్యాదులనైనా ప్రజలు ధైర్యంగా చేయగలుగుతారని అధికారులు అంటున్నారు. సాధారణ వాట్సాప్ కంటే ‘వాట్సాప్ బిజినెస్ అకౌంట్’లో అదనపు హంగులున్నాయి. సాధారణ వాట్సాప్‌లో ప్రత్యేక సెట్టింగ్స్ లేనప్పడు ఒకరు పంపిన సందేశానికి వచ్చే బ్లూ టిక్స్ ఆధారంగా ఎదుటివారు చూశారా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. అదే ‘వాట్సాప్ బిజినెస్ అకౌంట్’లో కొన్ని సందేశాలను ఫిర్యాదు అందిన వెంటనే ఆటోమేటిక్‌గా, దానికి జవాబుగా పంపే ఆస్కారం ఉంది. ఈ సదుపాయంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసు నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. నెలలో దీన్ని అమల్లోకి తెచ్చి విస్త్రత ప్రచారం కల్పించనున్నారు. -
దశ 'దిశ'లా స్పందన
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. ఈ నెల 9న ప్లేస్టోర్‌లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను 12 ఉదయం వరకు అంటే.. మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. అదేవిధంగా యాప్ సేవలను మెచ్చి గూగుల్ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.8 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ యాప్ పనిచేస్తుందో.. లేదో తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కాల్స్ వస్తుండటం మరో విశేషం. 9వ తేదీ నుంచి రోజూ రెండు వేల మందికిపైగా దిశ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నెల 8న రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌తోపాటు దిశ మొబైల్ అప్లికేషన్ (యాప్)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. దిశ.. పనితీరు ఇలా.. - ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. - ఇన్స్టాల్ చేసుకోవడానికే ఇంటర్నెట్ అవసరం. తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. - ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం (ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. - ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోనిఫోన్ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. - ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది. - ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. - ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. - ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. - దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. - ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. - దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అవగాహన కల్పిస్తున్నాం మహిళల రక్షణ కోసం చేపట్టిన దిశ కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాం. దిశ యాప్‌నకు తక్కువ సమయంలోనే విశేష స్పందన లభిస్తోంది. యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన మహిళలకు ఆరు నుంచి పది నిమిషాల్లోనే తక్షణ సాయం అందిస్తున్నాం. – డీజీపీ గౌతమ్ సవాంగ్ -
దిశ.. కొత్త దశ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా తీసుకువచ్చిన ‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచి పోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే శిక్షించడం కోసమే ఈ చట్టం తీసుకువచ్చామని చెప్పారు. శాంతి భద్రతలే తమ మొదటి ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. దిశ చట్టం దేశంలోనే ప్రత్యేకమైనదని తెలిపారు. నెలాఖరులోగా రాష్ట్రంలో 18 దిశ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, ఆ మేరకు 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్నామన్నారు. తిరుపతి, విశాఖలో కొత్తగా రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఆయన రాష్ట్రంలోనే తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం నన్నయ వర్సిటీలో ‘దిశ’ చట్టంపై పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొని దిశ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. దేశంలోనే సరికొత్త అధ్యాయం ‘‘రాష్ట్రంలోని 1,349 పోలీసుస్టేషన్లు, అందులోని 1,049 వన్ స్టాప్ సెంటర్లు దిశ పోలీస్ చట్టానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. అక్కడ ఉన్న పోలీస్ అక్క చెల్లెమ్మలు, సోదరులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో మరచిపోలేని రోజుగా ఇది నిలిచిపోతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ జరిగిన రోజున నేను అన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పాను. మహిళల మీద నేరాలను ఏ మాత్రం ఉపేక్షించబోమన్నాం. అక్క చెల్మెమ్మలు అందరికీ తోడుగా ఉంటామని చెప్పాం. మహిళలు, చిన్నారులపై ఎవరు నేరాలకు పాల్పడటానికి సాహసించినా నిర్ధాక్షిణ్యంగా చట్టాన్ని ప్రయోగించాలని చెప్పడానికి దేశంలోనే తొలిసారిగా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. రాజమహేంద్రవరంలోని నన్నయ వర్సిటీలో ‘దిశ’ చట్టంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్‌షాపులో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో దిశ ప్రతిజ్ఞ చేయిస్తున్న చిన్నారులు ఈ రోజు రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్‌ను ఇక్కడ రాజమహేంద్రవరంలో ప్రారంభించినందుకు చాలా గర్వపడుతున్నా. ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. హైదరాబాద్‌లో ఒక చెల్లెమ్మ ‘ఇఫ్ మై మెమొరీ గోస్ టు ఐ థింక్ నేమ్ ఈజ్ ప్రియాంక. 26 ఏళ్ల ఒక డాక్టర్ చెల్లెమ్మ. టోల్ గేట్ దగ్గర నుంచి రాత్రి పోతున్నప్పుడు జరిగిన ఘటన. ఒక చెల్లెమ్మ రాత్రి పూట ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉందని ఆ ఘటన మన కళ్లెదుట కనిపిస్తోంది. ఆ తర్వాత దేశమంతా చర్చనీయాంశమైంది. ఈ అంశం ఒక్కటే కాదు. మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లల్ని సైతం వదలకుండా అఘాయిత్య ఘటనలు జరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మనషులు రాక్షసులవుతుండటం కళ్లెదుట కనిపిస్తోంది. నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులవుతున్నారు. అలా రాక్షసులైనప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థంకాని పరిస్థితి. వెంటనే శిక్షలు పడితే వ్యవస్థలో మార్పు ఇలాంటి ఘటనలకు కారణమైన వాళ్లను ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. సినిమాల్లో అయితే ఇటువంటిæ ఘటనలు ఎక్కడైనా జరిగితే హీరో టప టపా కాల్చేస్తాడు. అప్పుడు మనమంతా కూడా చప్పట్లు కొడతాం. కానీ దురదృష్టవశాత్తు చట్టాలు మనకు ఆ స్వేచ్ఛ ఇవ్వవు. మరోవైపు జరిగిన ఘటనలు చూస్తే విపరీతమైన కోపమొస్తుంది. న్యాయం జరగడం ఆలస్యమవుతోంది. ఇటువంటి పరిస్థితిలో చట్టాల మీద మనకున్న గౌరవం పోతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చాం. చట్టం పరిధిలోనే న్యాయం జరగాలి. ఆ చట్టం త్వరిగతిన న్యాయాన్ని అందించాలి. దోషులకు వెంటనే శిక్షలు పడినప్పుడు వ్యవస్థలో భయమనేది ఒకటి వస్తుంది. అప్పుడే వ్యవస్థ బాగు పడుతుంది. నిర్భయ చట్టం చూశాం. జ్యోతి సింగ్ అనుకుంటా.. 8 సంవత్సరాలవుతున్నా కూడా ఆ ఘటనలో దోషులకు శిక్ష పడని పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ దర్యాప్తు, కోర్టుల విచారణకు సంవత్సరాలకు సంవత్సరాలు పడుతుండటం నేరాలు పెరిగేందుకు దారి తీస్తుంది. ఇలాగే వదిలేద్దామనుకోలేదు.. దిశ చట్టంతో ఏం జరగబోతోంది? ఇంతకు ముందు, ఇప్పటికీ తేడా ఏమిటి? అని ఈ చట్టం గురించి నాలుగు మాటలు చెప్పాలంటే.. మహిళల మీద, పిల్లల మర్యాదకు భంగం కలిగించే నేరాలు ఎక్కడైనా జరిగితే వాటిలో రెడ్ హ్యాండెడ్ కేసులు అంటే కేసెస్ విత్ అడిక్వెట్ కంక్లూసివ్ ఎవిడెన్స్.. ఎక్కడైనా ఉంటే 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం. 14 రోజుల్లోగా విచారణ కూడా పూర్తి చేసి ఏకంగా ఉరిశిక్ష వేయడానికి కూడా అనువుగా ఈ చట్టాన్ని తయారు చేశాం. అంటే ఎక్కడైనా మన కళ్లెదుటనే ఒక పాశవికæ ఘటన జరిగిన తర్వాత కూడా దాన్ని అలానే వదిలేస్తే, న్యాయం జరక్కపోతే ఇక ఆ తర్వాత ఈ వ్యవస్థలో మార్పు అనేది రాదు. మైకులు పట్టుకుని మాట్లాడటమనేది ఉంటుంది కానీ, మార్పు మాత్రం రాని పరిస్థితి. అందుకే సీఆర్పీసీ, ఐపీసీ చట్టాల్లో కావాల్సిన మార్పులు చేశాం. ఈ చట్టం కాంక్రెంట్ లిస్ట్‌లో ఉంది కాబట్టి బిల్లును ఆమోదించి ప్రెసిడెన్సియల్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. హోం మినిస్ట్రీలో ఫైల్ నడుస్తోంది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ బిల్లు చట్టం రూపంలో త్వరలోనే వస్తుందనీ, రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అది పూర్తిగా మన చేతుల్లో ఉన్న అంశం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేశాం. ఒక వైపు ఈ ప్రయత్నం చేయడమన్నది ఒక యాస్పెక్ట్ అయితే రెండవ యాస్పెక్ట్ మన చేతుల్లో రాష్ట్రం పరిధిలో కొన్ని మార్పులు. వీటి మీద ధ్యాస పెట్టాం. 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు పిల్లలు, మహిళల మీద జరిగే నేరాల్లో దోషులకు వెంటనే శిక్ష విధించేందుకు 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పాం. ఇందు కోసం రూ.26 కోట్లు ఇచ్చి హైకోర్టును అభ్యర్థించాం. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రతి జిల్లాలోనూ ఒక డెడికేటెడ్ ఎక్స్క్లూసివ్ కోర్టు దిశ మీదనే పని చేస్తుంది. ఈ 13 కోర్టుల్లోనూ 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించేందుకు రూ.1.65 కోట్లు మంజూరు చేశాం. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణ కోసం డెడికేటెడ్ పోలీసుస్టేషన్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఒక పోలీసుస్టేషన్‌ను ప్రారంభించాం. ఇలాంటి పోలీసుస్టేషన్లు ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా 18 ఉంటాయని చెప్పడానికి గర్వ పడుతున్నా. ఇందులో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఐదుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మొత్తం మీద దాదాపు 36 నుంచి 47 మంది సిబ్బందితో ఈ స్టేషన్లు పని చేస్తాయి. ఇందులో అత్యధికంగా మహిళలే ఉంటారు. రాజమహేంద్రవరం పోలీసుస్టేషన్లో అయితే ఒక అడుగు ముందుకు వేశారు. ఇక్కడి అర్బన్ ఎస్పీ షిమూషి బాజ్‌పేయి మహిళే కాబట్టి ఏకంగా 47 మంది సిబ్బందిని పెట్టేశారు. ఇందుకు ఆమెను అభినందిస్తున్నా. ఫొరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యం పెంచాం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క చోట ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. అక్కడ కూడా సిబ్బంది, ఎక్విప్మెంట్ కూడా సరిగా లేని పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చడానికి రూ.31 కోట్లు కేటాయించాం. మంగళగిరిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్స్‌ను కలుపుతూ విశాఖపట్నం, తిరుపతిలలో ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకువచ్చాం. అందులో 118 మంది సిబ్బంది పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆ చట్టం వచ్చే సరికే అన్ని రకాలుగా మనం ముందడుగులో ఉండాలనే ఉద్దేశంతో ఇలా అడుగులు ముందుకు వేశాం. ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సహాయం చేసే వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం కాసేపటి క్రితమే దిశ కాల్‌సెంటర్, దిశ యాప్‌ను ప్రారంభించాం. 10 సెకన్లలోనే పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం పంపుతుంది. ఆ తర్వాత ఆపదలో ఉన్న వారిని ఎలా కాపాడతారో చూశాం. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుంటాం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా తిరక్క మునుపే 42 లక్షల మంది తల్లులకు తద్వారా 82 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా దేవుడు దయతో గొప్పగా మేలు చేసే అవకాశం లభించింది. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఈ ఉగాది నాటికి అక్క చెల్లెమ్మల చేతుల్లో 25 లక్షల ఇళ్ల పట్టాలు పెట్టి.. వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. నాడు–నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూళ్ల రూపు రేఖలు మార్చబోతున్నాం. ఇంగ్లిష్ మీడియం ద్వారా పిల్లల జీవితాలను మేలి మలుపు తిప్పబోతున్నాం. అక్కచెల్లెమ్మల కుటుంబాలలో ఆనందం నింపేలా మద్యాన్ని నియంత్రిస్తూ అడుగులు ముందుకు వేశాం. రాబోయే రోజుల్లో ఆ అడుగులు ఇంకా గట్టిగా పడతాయి. అక్కచెల్లెమ్మల కోసం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ తప్పక ఉండాలని ఏకంగా చట్టాన్నే తెచ్చిన ప్రభుత్వం మనదేనని గర్వంగా చెబుతున్నా. పొదుపు సంఘాల్లోని, అట్టడుగులో ఉన్న అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమాన్ని మళ్లీ తీసుకువస్తున్నాం. ఆ కార్యక్రమం ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. 2016 అక్టోబర్ నుంచి ఆ కార్యక్రమం పూర్తిగా రద్దయిపోయింది. అందుకే ఆ కార్యక్రమానికి మన ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుడుతోంది. అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే మీ బిడ్డను, మీ అన్నను, మీ తమ్ముడిని దీవించాలని, ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నా’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజిని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ‘దిశ’ పోలీసుస్టేషన్ల ప్రత్యేకాధికారిణి దీపికాపటేల్ తదితరులు పాల్గొన్నారు. దిశ యాప్ ప్లే స్టోర్‌లో అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిని దాదాపు 5,048 మొబైల్ టీమ్స్‌కు లింక్ చేశాం. ఈ యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ అనే బటన్ నొక్కితే కేవలం 10 సెకన్లలో ఆడియో, వీడియో ట్రాన్స్‌మీట్ అవుతుందని ఇంతకు ముందే మనం చూశాం. (సీఎం దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ కనెక్ట్ అవ్వడం.. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ గుర్తించిన కంట్రోల్ రూమ్ సిబ్బంది సమీపంలోని రాజానగరం పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం.. 10 నిమిషాల్లో ఒక ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్ కాల్ చేసిన సీఎం వద్దకు చేరుకోవడం ప్రత్యక్షంగా చూపించారు) నేరం చేస్తే ప్రతి అడుగులోనూ శిక్ష తప్పదని గట్టిగా సందేశాన్ని పంపించడం కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. మూడు నాలుగు నెలల్లో అన్నీ పూర్తిగా అమల్లోకి వచ్చేస్తాయి. నేరాన్ని ఆపడం, నేరం జరిగితే వెంటనే శిక్షించడం.. తద్వారా నేరగాళ్లు, నేర మనస్తత్వం ఉన్న వారికి గట్టిగా సంకేతం పంపాలనేదే నా ఉద్దేశం. మహిళల అక్షరాస్యత, ఆర్థికంగా స్వతంత్రులు కావడం, నిర్భయంగా సంచరించగలగడం వంటివి సమాజం అభివృద్ధికి ప్రామాణికాలు. పురుషులతో సమానంగా వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి అన్ని రకాల అవకాశాలు ఉండాలనే తపన, తాపత్రయం ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఉంది. వారందరి కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, చివరకు వారి పిల్లలకు ఒక మంచి మేనమామగా వారి గురించి ఆలోచించి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచే అవతరించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. -
కేసీఆర్.. ఇప్పటివరకు మాట్లాడలేదు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై హింస పెరగడానికి గల కారణాలను ప్రభుత్వం వెలికితీయాలి... వాటిని అరికట్టాలే తప్ప ఎన్కౌంటర్లు చేయడం సరైందికాదని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. నేరస్తులు ఎవరైనా శిక్షించాలి. బాధితులు ఎవరైనా న్యాయం జరగాలని, అయితే చట్టాలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదని చెప్పారు. మంగళవారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో మహిళా ట్రాన్స్‌జెండర్ ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ... గత రెండు దశాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న హింసకు కారణాలను ప్రభుత్వానికి వివరిస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్పటివరకు మహిళా సంఘాలతో మాట్లాడలేదని, మీ పాలనలో మహిళలు ఉండరా.. మీకు మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పట్టవా అని విమర్శించారు. ఎన్‌కౌంటర్‌తో చేతులు దులుపుకుంటే సరిపోదని, 108 తరహాలో మహిళలకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. భూమిక డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. నేరం చేసిన వారిని న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా మధ్యలోనే చంపడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఎన్కౌంటర్ చేయగానే సంబరాలు చేసుకోవడం ప్రమాదకరమని, చావును సంబరాలు చేసుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇది ఉన్మాదానికి దారితీస్తుందని అన్నారు. తాము రేపిస్టులను సమర్ధించడంలేదని, కానీ ఈ సంఘటన వల్ల అత్యాచారాలు ఆగుతాయా అని ప్రశ్నించారు. ప్రముఖ రచయిత విమల మాట్లాడుతూ... మహిళలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కొండవీటి సత్యవతి, జి.ఝాన్సీ, ఉషా సీతామహాలక్ష్మి, ఖలిదా ఫర్వీన్, మీరా సంఘమిత్ర, బండారు విజయ, శాంతి ప్రబోధ, సుజాత, అనురాధ, ఉషా, తేజస్విని, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్నప్పుడు వెంటనే స్పందించే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తేవాలని, అత్యవసర కాల్స్‌ను పర్యవేక్షించే వారే ప్రతిస్పందన చర్యలకు బాధ్యులుగా ఉండేలా చేయాలని, అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, సైబర్ నేరాలను అరికట్టాలని తీర్మానించారు. -
మహిళలపై దాడులు: కేంద్రం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు పలు కీలక మార్గదర్శకాలను జారీచేసింది. మహిళల రక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. రక్షణలో పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అలాగే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడి కేసులను రెండు నెలల్లో విచారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు శనివారం లేఖను రాశారు. లైంగికదాడి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే మహిళ, రక్షణ కొరకు కేంద్రానికి పలు సూచనలు కూడా చేయవచ్చని హోంశాఖ రాష్ట్రాలను కోరింది. కాగా ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, ఉన్నావ్, ఉత్తర భారత్‌లో పలు ముఖ్య నగరాల్లో సహా అనేక ప్రాంతాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో మహిళలు, ప్రజాసంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అత్యాచార ఘటనలో నిందితులకు క్షమాభిక్ష పెట్టే సాంప్రదాయాన్ని పక్కనపెట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దిశ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చుతున్నాంటూ కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం కూడా ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. -
మహిళల రక్షణకు చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మహిళల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న అత్యాచార ఘటనలు, దాడుల నేపథ్యంలో లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌భల్లా తెలిపారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేయడంలో పోలీసులు విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు వేగంగా స్పందించాలని కోరారు. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) పోర్టల్ ద్వారా ఆయా రాష్ట్రాలలోని అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేసుకోవచ్చని అందులో సూచించారు. -
ప్రైవేటు వాహనాల్లోనూ మహిళలకు 'అభయ'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు ఉద్దేశించిన ‘అభయ’ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు పిలిచిన టెండర్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించే బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించారు. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిటీకి విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్ల ఎంపిక విధానం, అమలు అంశాల్ని ఈ కమిటీ పరిశీలించనుంది. అభయ ప్రాజెక్టు అమలు బాధ్యత రవాణా శాఖదే అయినప్పటికీ పోలీసు శాఖ సహకారం అవసరం ఉంటుంది. దీంతో పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించింది. మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో గతంలోనే రవాణా శాఖ అభయ ప్రాజెక్టును రూపొందించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం 2015లో రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. చివరకు ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్ రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌తో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. తెలుసుకునే వీలుంది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేందుకు అభయ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. ‘అభయ’ అమలు ఇలా.. - రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. - పోలీసుల సహకారంతో రవాణా శాఖ ఐటీ అధికారులు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు. - రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్సులు అమర్చాలి. - ఈ బాక్సులు అమరిస్తే రవాణా, పోలీస్ శాఖ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. - మహిళలు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. - తొలుత విశాఖ, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రవాణా శాఖ గతంలో నిర్ణయించింది. - ఇందుకు రూ.138 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐఓటీ బాక్సుల్ని రవాణా శాఖ సమకూర్చనుంది. - ఈ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. - ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. - ఆటోల్లో/క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే యాప్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారమిస్తే.. వాహనం ఎక్కడుందో తెలుసుకుని ఇట్టే పట్టుకుంటారు. - కమిటీ సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను పట్టా లెక్కిస్తారు.