అతివకు అండ
మహిళా భద్రత, సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు భద్రత, వారికి సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారానికి 24 గంటలు పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మహిళల సమస్యలను తెలుసుకుని, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించే విధంగా దాన్ని రూపొందించాలని సూచించారు. మహిళల కోసం పనిచేసే వివిధ సంస్థలు, వ్యక్తులు, అధికారులను సమన్వయపరుస్తూ ఈ డెస్క్ ప్రభావవంతంగా పనిచేయాలన్నారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా 181 టోల్‌ఫ్రీ నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కచ్చితంగా మహిళా విభాగం ఉండాలని సూచించారు. పోలీస్ శాఖలోని అన్నిస్థాయిల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు అందించాలని, ఎక్కడైనా వివక్ష చూపితే హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు.
మహిళల సమస్యలు-పరిష్కార మార్గాలపై ఏర్పాటైన మహిళా భద్రత, రక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై గురువారం సచివాలయంలో కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, కమిటీ సభ్యులు పూనం మాలకొండయ్య, శైలజారామయ్యార్, స్మితా సబర్వాల్, చారుసిన్హా, సౌమ్యామిశ్రా, స్వాతిలక్రా, సునీల్‌శర్మ, ఐఏఎస్ అధికారులు రేమండ్ పీటర్, చంద్రవదన్, హరిప్రీత్‌సింగ్, రమణారావుతో పాటు ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జర్నలిస్టు ప్రేమ తదితరులు పాల్గొన్నారు.
హోం, ఐటీ, రవాణా, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, కార్మిక శాఖ, పాఠశాల విద్య, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలపై పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
మహిళలకు గౌరవం దక్కడం లేదు: కేసీఆర్ ఆవేదన కర్మభూమి, వేదభూమి అని చెప్పుకొంటున్నప్పటికీ మహిళలకు సమాజంలో ఏమాత్రం గౌరవం దక్కడం లేదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశమన్నారు. వారి గౌరవాన్ని కాపాడడానికి, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై విస్తృత ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరముందన్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలన్నారు.
సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సమాచార సాధనాలు, సామాజిక వెబ్‌సైట్ల ద్వారా మహిళలను వేధిస్తున్నారని, దీన్ని అరికట్టడానికి ఐటీ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు. చైనా, గల్ఫ్ దేశాల మాదిరిగా సోషల్ మీడియాపై నియంత్రణ ఉంచే అవకాశాలు కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. భ్రూణ హత్యలు, ఆడపిల్లలను వదిలించుకోవడం వంటి వాటిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా వల్ల చాలా మంది చనిపోతున్నారని, దీంతో 25-30 ఏళ్ల వయసులోని యువతులే వితంతువులుగా మారుతున్నారని సీఎం పేర్కొన్నారు. గుడుంబా, నాటుసారాను లేకుండా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ కారణాల వల్ల రెస్క్యూహోంలలో ఉంటున్న వారి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు. వారి పోషణకు ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న రూ. 750 సరిపోదన్నారు. ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉందన్నారు. హెదరాబాద్‌లో మహిళల భద్రతకు చేపడుతున్న కార్యక్రమాలను జిల్లాలకు కూడా విస్తరించాలని ఆయన సూచించారు.
డీఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు
జిల్లాల్లో మహిళల భద్రతా కార్యక్రమాలను చేపట్టేందుకు డీఎస్పీ స్థాయి అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సీఎం చెప్పారు. జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటోరిక్షాలు, ట్యాక్సీల నిర్వహణను కూడా జాగ్రత్తగా పరిశీలించాలని, వాటి యజమానులు, డ్రైవర్ల వివరాలు పోలీసుల వద్ద ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీయాలన్నారు. హైదరాబాద్‌తో పాటు నగరాలు, పట్టణాల్లోనూ ‘షీ’ ఆటోలు, ట్యాక్సీలు నడపాలని సూచిం చారు. మహిళా డ్రైవర్లకు 50 శాతం సబ్సిడీపై వాహనాలను సమకూరుస్తామన్నారు.
హైదరాబాద్‌లో సీసీ కెమెరాల నిఘా
హైదరాబాద్‌లో బస్సులు, బస్టాపులతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపులను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అమ్మాయిలను వేధించే వారిని గుర్తించడానికి నిఘా పెట్టామని, ఇప్పటికే చాలామంది ఈవ్‌టీజర్లను గుర్తించామని చెప్పారు. వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, వారి ఫొటోలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఈవ్‌టీజర్ల త ల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలకు కూడా లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. కోఠి, మెహదీపట్నం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ ఎక్కువగా జరుగుతున్నదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సుల్లో ముందువైపు మహిళలు, వెనకవైపు పురుషులు ఎక్కి, దిగేలా చూడాలని పేర్కొన్నారు. కండక్టర్ రెండువైపులా తిరిగే విధంగా స్లైడర్ ఏర్పాటు చేయాలని సూచించారు.