ఆపదలో ఉన్న మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుండగా... మరోవైపు కొందరు ఆకతాయిలు, సంఘ వ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా పోలీసుల పేరుతోనే తప్పుడు సందేశాలు, ఫేక్ నంబర్లను సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకొస్తుండడం గందరగోళానికి గురిచేస్తోంది. దీన్ని గుర్తించిన పోలీసు అధికారులు తక్షణమే స్పందించారు. తమ పేరిట ప్రచారంలోకి వస్తున్న తప్పుడు ప్రకటనలు, సందేశాలు, నంబర్ల వ్యవహారానికి తెరదించుతూ... ఆపదలో ఉన్న మహిళలు పోలీసులను సంప్రదించే విధానాన్ని మరోసారి ప్రకటించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
– సాక్షి, అమరావతి
ఆ నంబర్ పోలీసులది కాదు
‘‘మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంచి సర్వీసు ప్రారంభించారు. మీరు ప్రయాణించే కారు, క్యాబ్ లేదా ఆటో నంబర్‌ను 9969777888కు ఎస్సెమ్మెస్ చేయండి. మీకు ఒక ఎస్సెమ్మెస్ వస్తుంది. మీరు ప్రయాణించే వాహనం జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానం అవుతుంది. మరికొంతమంది ఆడపడుచులకు ఈ సందేశాన్ని పంపండి’’
ఇదీ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి తెచ్చిన మెసేజ్. నిజానికి అది పోలీసులు ఇచ్చింది కాదు. 9969777888 నంబరు అసలు పోలీసులదే కాదు. అది ఫేక్ నంబర్ అని డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. పోలీసు శాఖ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇందుకు కారకులైన వ్యక్తులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం పేర్కొంది. పోలీసు శాఖ విడుదల చేసిన నంబర్లు మినహా ఇతర నంబర్లకు ఫోన్ చేయడం లేదా ఎస్సెమ్మెస్ పంపడం వంటివి చేయొద్దని పోలీసులు కోరుతున్నారు.
ఫోన్ చేయగానే పోలీసులు స్పందిస్తున్నారు
హైదరాబాద్‌లో యువ డాక్టర్ హత్యోదంతం తరువాత పోలీసు నంబర్లపై చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ నంబర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? పోలీసులు తక్షణం స్పందిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ప్రజలు ఉత్సుకత చూపారు. రాష్ట్రంలో ఒక్క ఆదివారం రోజే 112 నంబరుకు 40 వేల మంది ఫోన్ చేయడం గమనార్హం. ఫోన్ చేయగానే పోలీసులు స్పందిస్తున్నారని నిర్ధారించుకున్నారు. ఆపదలో పోలీసుల సహాయం పొందడానికి ఉద్దేశించిన పోలీసు మొబైల్ యాప్‌ను ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 30 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే పోలీసుల పేరిట తప్పుడు మెసేజ్‌లు వైరల్ చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు అధికారికంగా వెల్లడించిన 100, 112, 181 నంబర్లకు మాత్రమే మహిళలు ఫోన్ చేయాలి. మహిళల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.
– గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ
మహిళల రక్షణకు టోల్ ఫ్రీ నంబర్లు
ఆపదలో ఉన్న మహిళలు తక్షణ సహాయం కోసం తమను సంప్రదించాల్సిన నంబర్లను డీజీపీ కార్యాలయం మరోసారి ప్రకటించింది.
- 100కు ఫోన్ చేస్తే కాల్ సెంటర్‌లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వారి నుండి తక్షణమే సహాయం పొందవచ్చు.
- 112కు ఫోన్ చేస్తే బాధితులు ఉన్న లొకేషన్‌తో పాటు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పిస్తారు.
- 181కు ఫోన్ చేస్తే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కాల్ సెంటర్‌కు వెళ్తుంది. మహిళలు తమ సమస్యను చెబితే పోలీసులకు సమాచారం పంపి వెంటనే అప్రమత్తం చేస్తారు.
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మహిళల రక్షణ కోసం పోలీసులు ‘సైబర్–మహిళామిత్ర’ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. వాట్సాప్ నంబర్ 9121211100 అందుబాటులో ఉంచారు. ఈ నంబరుకు వాట్సాప్ చేస్తే, బాధితులు ఉన్న ప్రదేశానికి పోలీసులు వెంటనే చేరుకుంటారు. రక్షణ కల్పిస్తారు. దుండగుల ఆటకట్టిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment