
పిఠాపురం: ఏడు నిమిషాల వ్యవధిలో ఓ మహిళకు రక్షణగా నిలిచింది దిశయాప్. తూర్పు గోదావరి జిల్లా అమీనాబాద్‌కు చెందిన ఒక వివాహిత బుధవారం ఇంట్లో బిడ్డకు పాలు ఇస్తోంది. గొడుగు మోషే అనే యువకుడు తాగిన మైకంలో ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు.
అక్కడే ఉన్న ఓ మహిళ తన సెల్‌ఫోన్లో దిశ యాప్ ద్వారా ఎస్‌వోఎస్ కాల్ సెంటర్‌కు కాల్ చేసి జరిగిన ఘటనను తెలిపింది. మహిళా పోలీసులు మంగాదేవి, మాధవి 7 నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలికి రక్షణగా నిలిచారు. కొత్తపల్లి పోలీసులు వచ్చి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.