దశ దిశలా రక్షణ | It has been three years since Disha app was introduced | Sakshi
Sakshi News home page

దశ దిశలా రక్షణ

Published Sun, Dec 24 2023 5:41 AM | Last Updated on Sun, Dec 24 2023 5:41 AM

It has been three years since Disha app was introduced - Sakshi

మహిళలకు రక్షణ, భద్రతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్నవారిని నిమిషాల వ్యవధిలోనే రక్షించడానికి దిశ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను రక్షిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు.

ఈ క్రమంలో దిశ వ్యవస్థకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఎన్నో రాష్ట్రాలు దీన్ని తమ ప్రాంతాల్లోనూ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిశ యాప్‌ను ఆవిష్కరించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం.  – సాక్షి, అమరావతి 

♦ చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఓ బాలికను ఓ యువకుడు∙కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి యత్నించాడు. అతడి ఇంట్లో నుంచి బాలిక అరుపులు వినిపించడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దిశ యాప్‌ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ బాలికను 
రక్షించి  యువకుడిని అరెస్ట్‌ చేశారు.   

♦ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళపై ఆమె భర్త మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. ఆమె వెంటనే అంటే సాయంత్రం 6.39 గంటలకు దిశ యాప్‌ ద్వారా పోలీసులను సంప్రదించారు. పోలీసులు 6.41 గంటలకే అంటే కేవలం రెండు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. 

♦ సమీప బంధువు మోసగించడంతో విజయ­వాడలో ఓ మహిళ అర్ధరాత్రి 12.53 గంటల­కు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప­డ్డారు. తన బిడ్డను కాపాడాల్సిందిగా ఆమె తల్లి దిశ యాప్‌ ద్వారా పోలీసులకు విన్నవించారు. కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది 12.55 గంటలకు విజయవాడ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు 12.58 నిమిషాలకే అంటే కేవలం 5 నిమిషాల్లోనే బాధిత మహిళ నివాసానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.  

♦ ఎన్టీఆర్‌ జిల్లా నవులూరుకు చెందిన ఓ మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లిన తన 15 ఏళ్ల కుమార్తె ఇంటికి తిరిగి రాలేదని దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్టు గుర్తించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బాలిక ఆచూకీ తెలుసుకుని ఆమె తల్లి వద్దకు చేర్చారు. యువకుడిపై కేసు నమోదు చేశారు.  

♦ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 19 ఏళ్ల యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి తనతో తీసుకువెళ్లాడు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా వ్యభిచారం చేయాల్సిందిగా వేధించసాగాడు. దాంతో ఆ యువతి పొరుగింటివారి సహాయంతో దిశ యాప్‌ ద్వారా పోలీసులను సంప్రదించింది. పోలీసులు వెంటనే ఆ నివాసానికి చేరుకుని యువతిని రక్షించి యువకుడిని అరెస్ట్‌ చేశారు.  

చార్జ్‌షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమ స్థానం.. 
దిశ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటివరకు 3,009 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇక పోలీస్‌ స్టేషన్‌ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినా సరే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్‌లో ప్రవేశపెట్టారు. అలాగే దిశ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్‌షీట్ల నమోదులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం విశేషం. 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవ్వడం గమనార్హం. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే.  

అక్కచెల్లెమ్మల రక్షణకు పటిష్ట వ్యవస్థ.. 
♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్‌ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. 
♦  మహిళలకు హెల్ప్‌ డెస్క్, వెయిటింగ్‌ హాల్, కౌన్సెలింగ్‌ రూమ్, వాష్‌ రూమ్స్, క్రచ్‌–ఫీడింగ్‌ రూమ్‌లతో ఈ పోలీస్‌ స్టేషన్లను నెలకొల్పారు. ఈ క్రమంలో దిశ పోలీస్‌ స్టేషన్లకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ లభించడం విశేషం. 
♦  ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు.  
♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించారు. 
♦ పెట్రోలింగ్‌ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలను సమకూర్చారు. 
♦ 18 దిశ క్రైమ్‌ మేనేజ్‌మెంట్‌ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చింది. 
♦ లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్‌ చేసింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2,17,467 మంది నేర చరితుల డేటా బేస్‌ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టింది. మహిళలను ఆన్‌లైన్‌ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచింది.  
♦ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్‌ లాŠయ్‌బ్‌లను ఏర్పాటు చేసింది. తిరుపతి, విశాఖపట్నంలలో ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లే»ొరేటరీలను నిరి్మస్తోంది. గతంలో ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేందుకు మూడు నాలుగు నెలల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం కేవలం 48 గంటల్లోనే నివేదికలు వస్తున్నాయి.  

నేరానికి పాల్పడితే  కఠిన శిక్షే.. 
దర్యాప్తు పూర్తి చేయడమే కాదు దోషులకు న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 తర్వాత మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై శిక్షలు విధించడం పెరిగింది. పోలీసులు ప్రాధాన్యత కేసులుగా తీసుకున్నవాటిలో ఇప్పటివరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది.
 
జాతీయస్థాయిలో.. 
అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దిశ వ్యవస్థకు ఇప్పటివరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించడం విశేషం. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్‌ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి.  

రికార్డు స్థాయిలో 1.46 కోట్ల డౌన్‌లోడ్లు 
దిశ యాప్‌ ఫోన్‌లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. అందుకే ఈ యాప్‌ను ఇప్పటివరకు 1,46,99,012 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా 1,27,06,213 మంది రిజిస్టర్‌ కూడా చేసుకున్నారు. ఓ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్, రిజి్రస్టేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

దిశ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 10,80,454 ఎస్‌వోఎస్‌ కాల్‌ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గవి 31,541 కాల్స్‌ ఉన్నాయి. ఈ కాల్స్‌ అన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకున్నారు. దిశ యాప్‌ ద్వారా సగటున రోజుకు 250 కాల్స్‌ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం.  

దోషులకు సత్వరం శిక్షలు 
మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. దిశ పోలీస్‌ స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా కేసుల దర్యాప్తు, నేర నిరూపణ ప్రక్రియ పక్కాగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement