అండగా ఆదిశక్తి | Andhra is safe for Womens | Sakshi
Sakshi News home page

అండగా ఆదిశక్తి

Published Fri, Mar 8 2024 5:33 AM | Last Updated on Fri, Mar 8 2024 2:58 PM

Andhra is safe for Womens - Sakshi

అతివలకు ఆంధ్రా సురక్షితం

లైంగిక వేధింపులు.. ఆకతాయిల ఆగడాలపై పాశుపతాస్త్రం ‘దిశ’ 

ఫోన్‌లో ‘దిశ’యాప్‌ ఉంటే మగువలకు నిశ్చింతే..  

మహిళలకు సత్వర న్యాయం కోసం ‘దిశ’పోలీసు స్టేషన్లు 

ఇంతవరకూ 31,607 కేసుల్లో తక్షణ పోలీసు భద్రత 

60 రోజుల్లోనే 96.07 శాతం కేసుల్లో చార్జ్‌షీట్ల దాఖలు 

85 కేసుల్లో దోషులకు శిక్షలు ఖరారు 

1.50 కోట్ల దిశ యాప్‌ డౌన్‌లోడ్లు.. 1.29 కోట్ల రిజిస్ట్రేషన్లు 

జాతీయ స్థాయిలో దిశకు పలు అవార్డులు, ప్రశంసలు 

మహిళలపై గృహ హింస, లైంగిక వేధింపులు.. అమ్మాయిల పట్ల ఆకతాయిల ఆగడాలు, ర్యాగింగ్‌ భూతం బాలికలపై వికృత చేష్టలు.. ఇలాంటి వాటికి చాలా వరకు మహిళలు బలయ్యాకగానీ స్పందన, న్యాయం జరిగేది కాదు. ఇదంతా గతం. మగువలు బాధితులుగా మారక ముందేరక్షణ ఛత్రంగా నిలవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. 

ఆ ఆలోచనల్లో నుంచే అలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆయన సంధించిన పాశుపతాస్త్రం ‘దిశ’ అన్ని సమస్యలకూ ఒక్కచోటే పరిష్కారం లభించేలా రూపొందించిన ఈ యాప్‌ మన ఆడపిల్లల రక్షణ ‘దిశ’గా ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం. అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు.. వారికి తక్షణ భరోసాగా పోలీసుల అభయహస్తం.. ఆపత్కాలంలో దిశ యాప్‌లోని బటన్‌ నొక్కితే.. మహిళలకు నిశ్చింతే..  సత్వర సాయమే కాదు.. దిశ పోలీసు స్టేషన్లతో సత్వర న్యాయమూ..    –సాక్షి, అమరావతి

సీఎం జగన్‌ మది నుంచి పుట్టిన ‘దిశ’ 
అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామంటే చాలు క్షణాల్లో పోలీసులు చేరుకుని భద్రత కల్పించే వ్యవస్థ ఏర్పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన. అందులో నుంచి పుట్టిందే దిశ మొబైల్‌ యాప్‌. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రవేశపెట్టిన దిశ మొబైల్‌ యాప్‌ మహిళల భద్రతకు పర్యాయపదంగా మారింది. మగువలకు అనుక్షణం రక్షణగా నిలిచే దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్లు ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టాయి.

యావత్‌ దేశానికి ఇవి దిక్సూచిగా నిలిచాయి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరు కుని రక్షణ కవచంలా నిలుస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘దిశ’కు జాతీయస్థాయిలో ఎన్నో ప్రశంసలు దక్కాయి. అవార్డులు వరించాయి. ఎన్నో రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.  

రికార్డు స్థాయిలో 1.50 కోట్ల డౌన్‌లోడ్లు 
2020 డిసెంబర్‌ 15న అందుబాటులోకి వచ్చిన దిశ యాప్‌ ఫోన్‌లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. ఈ యాప్‌ను ఇంతవరకు కోటీ 50 లక్షల 10 వేల 15 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా కోటీ 29 లక్షల 8 వేల 530 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఓ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల పరిధిలోనైతే 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాలైతే 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

దిశ యాప్‌ ద్వారా ఇంతవరకు 10 లక్షల 80 వేల 454 ఎస్‌ఓఎస్‌ కాల్‌ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి, రెండుసార్లు ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కి చూస్తారు. వాటిని మినహాయిస్తే పోలీసు చర్యలు తీసుకునే కాల్స్‌ 31,607 ఉన్నాయి. వీటన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన న్యాయం అందించారు. దిశ యాప్‌లో సగటున రోజుకు 250 కాల్స్‌ వస్తున్నాయి. 

దశ‘దిశ’లా నిఘా 
లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్‌ చేశారు. లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2 లక్షల 17 వేల 467 మంది నేర చరితుల డేటా బేస్‌ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆన్‌లైన్‌ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచారు.

నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలు సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్‌ లాŠయ్‌బ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లే»ొరేటరీలు నిర్మిస్తున్నారు. గతంలో ఫోరెన్సిక్‌ నివేదికకు మూడు నాలుగు నెలలు పడితే.. ప్రస్తుతం 48 గంటల్లోనే వస్తున్నాయి. 

చార్జ్‌షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమం 
దిశ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇంతవరకు 3,009 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా సరే.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్‌లో ప్రవేశపెట్టారు. దిశ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్‌షీట్ల నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.  

అక్కచెల్లెమ్మల రక్షణకు దిశ పోలీస్‌ స్టేషన్లు  
♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్‌ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. 
♦ మహిళలకు హెల్ప్‌ డెస్క్, వెయిటింగ్‌ హాల్, కౌన్సెలింగ్‌ రూమ్, వాష్‌ రూమ్స్, క్రచ్‌–ఫీడింగ్‌ రూమ్‌లతో ఈ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో దిశ పోలీస్‌ స్టేషన్లకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ లభించింది.  
♦  ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటు చేశారు.  
♦  పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం 
♦  పెట్రోలింగ్‌ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలు 
♦  18 దిశ క్రైమ్‌ మేనేజ్‌మెంట్‌ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చారు.  



60 రోజుల్లోనే దర్యాప్తు 
2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. 

జాతీయ స్థాయిలో ప్రశంసలు 
దిశ వ్యవస్థకు ఇంతవరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించాయి. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్‌ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి.

నేరం చేస్తే శిక్ష ఖాయం 
మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. ఇంతవరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement