పోలీసు రక్షణ ఏర్పాటు చేసేలా హైకోర్టులో పిటిషన్ వేద్దాం
హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశామని కక్ష: జయనారపురెడ్డి
నన్నూ చంపుతామని బెదిరించారు: శేఖర్
సాక్షి, నంద్యాల : ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, మీకు ఏ కష్టమొచ్చినా అన్ని విధాలా అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇటీవల హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. పోలీసు రక్షణ ఏర్పాటు చేసేలా హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ గూండాల దాడిలో పాశవికంగా హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు.
నేరుగా సుబ్బరాయుడి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి హత్య ఎలా జరిగిందో తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సుబ్బరాయుడు కోడలు పసుపులేటి కుమారి మాట్లాడుతూ.. ‘ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి 30–40 మంది వచ్చారు సార్.. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే తెలియదేంటే మీకు.. మీరెలా సంసారం చేస్తారో చూస్తా.. మీ ఆటోలు తగలబెడతా.. మీరు ఎలా ఊర్లో బతుకుతారో నేనూ చూస్తా..’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడు సార్. ఇంటి సోఫాలో పడుకున్న మా అత్తను బయటికి లాక్కొచ్చారు.
ఆమె ఎంత బతిమలాడినా వినలేదు. ఇంటి తలుపులు గట్టిగా కొట్టడంతో లోపల పడుకున్న మా మామ వాకిలి (తలుపులు) తీయగానే ఒక్కసారిగా కట్టెలు, రాడ్లతో దాడి చేశారు. ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి రాళ్లతో తలమీద కొట్టారు. నెత్తురు కారి విలవిలలాడుతున్నా వదలలేదు. 25 నిమిషాల పాటు నరకం చూపించారు. చివరికి కొన ఊపిరితో ఉన్నాడని తెలిసి వెనక్కి వచ్చి మళ్లీ నెత్తి మీద బండరాయితో కొట్టి చంపేశారు’ అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది. సుబ్బరాయుడు భార్య పసుపులేటి సుబ్బమ్మ మాట్లాడుతూ.. తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని రోదించారు.
ఆయన్ను చంపుతుంటే కనీసం అరవలేదని.. తన అరుపులు విని కుటుంబ సభ్యులు బయటికి వస్తే వాళ్లను కూడా చంపుతారనే భయంతో నొప్పిని భరిస్తూ ప్రాణాలు వదిలాడని చెప్పింది. అడ్డుకునేందుకు తాను వెళితే వీపు మీద కట్టెలతో కొట్టారని, ఇనుప రాడ్‌తో కొట్టడంతో చేతికి తొమ్మిది కుట్లు పడ్డాయని వైఎస్ జగన్‌కు వివరించారు.
కన్ను పడితే కబ్జానే..
శ్రీనివాసరెడ్డి కన్ను పడిందంటే ఆ స్థలాన్ని కబ్జా చేసే వరకు వదలడని సుబ్బరాయుడు కుమారుడు ప్రసాద్.. వైఎస్ జగన్‌కు వివరించారు. గ్రామంలో కోదండరామాలయం నిర్మిస్తామని చెప్పి రూ.కోటి యాభై లక్షల వరకు వసూలు చేశాడని, అలాగే తమ స్థలాన్ని కబ్జా చేసి వేర్‌హౌజ్, లైట్ వెయిట్ ఇటుకల ఫ్యాక్టరీ నిర్మి0చాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో ఎవరూ అతనికి ఎదురు నిలవకూడదనే కక్షతోనే తన తండ్రిని హత్య చేసినట్లు తెలిపాడు. గ్రామంలో ప్రతి ఇంట్లో శ్రీనివాసరెడ్డి బాధితులు ఉన్నారని, నాన్నను చంపుతుంటే ఊర్లో ఏ ఒక్కరూ బయటికి రాలేదని.. అందరూ తలుపులు మూసుకుని ఉదయం వరకు తీయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆధిపత్యం పోకూడదనే..
గ్రామంలో 35 ఏళ్ల కిందట ఇదే శ్రీనివాసరెడ్డి ఇద్దరిని హత్య చేశాడని, అప్పటి నుంచి గ్రామంలో అతను ఏది చెబితే అదే నడుస్తోందని వైఎస్సార్‌సీపీ కార్యకర్త జయనారపురెడ్డి.. జగన్ దృష్టికి తెచ్చారు. 30 ఏళ్లుగా గ్రామంలో ఎన్నికలు జరగలేదని.. ఈ ఎన్నికల్లో అతని మాట కాదని తాము వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేశామన్నారు. వైఎస్సార్‌సీపీకి భారీగా ఓట్లు రావడంతో ఎక్కడ తన ఆధిపత్యానికి గండి పడుతుందోనన్న భయంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. శనివారం రాత్రి గ్రామంలో ఉండి ఉంటే తనను కూడా చంపేసేవారన్నారు.
మా ఎకరం స్థలాన్ని కబ్జా చేశారు
‘గ్రామంలో మాకున్న ఎకరం పొలాన్ని శ్రీనివాసరెడ్డి కబ్జా చేశాడు. ఇది పద్ధతి కాదని ఎదురు తిరిగితే 2021 నుంచి మమ్మల్ని వేధిస్తున్నాడు’ అని వైఎస్సార్‌సీపీ కార్యకర్త శేఖర్.. వైఎస్ జగన్‌కు వివరించారు. ‘మా స్థలం మాకు ఇవ్వండని అడిగినందుకు మా అన్న పల్లం నాగరాజుపైన రేప్ కేసు పెట్టించాడు. హత్య జరిగిన రోజు మా ఇంటికి కూడా టీడీపీ గూండాలతో కలిసి వచ్చాడు. పెరాలసిస్‌తో బాధ పడుతున్న మా నాన్నను బండబూతులు తిడుతూ మీ కొడుకును చంపేస్తామని బెదిరించారు’ అని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment