తొలిసారి నిన్నటి ఎన్నికల్లో సీతారామాపురంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లు
సుబ్బరాయుడి కుమారుడు ప్రసాద్ ఏజెంటుగా కూర్చున్నాడని అక్కసు
సాక్షి ప్రతినిధి కర్నూలు: మహానంది మండలం సీతారామాపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడిది వివాద రహిత కుటుంబం. ఎవ్వరి జోలికి వెళ్లరు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే అభిమానం. సీతారామాపురంలో టీడీపీకి తప్ప మరో పార్టీ తరఫున ఏజెంట్లు కూర్చోలేని పరిస్థితి. ఎన్నిక ఏదైనా టీడీపీ నేతలు రిగ్గింగ్, సైక్లింగ్ చేసుకునే వారు. టీడీపీ నేత బుడ్డారెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గ్రామంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించేవాడు. వేరే వర్గం అంటూ లేకుండా తన గూండాయిజంతో బెదిరింపులకు పాల్పడేవాడు.
గతంలో గ్రామంలో ఓట్లు వేయాలంటేనే భయపడే పరిస్థితి. స్వతంత్రంగా ఓటేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన దుస్థితి. శ్రీనివాసరెడ్డి ఎవరికి చెబితే వాళ్లకే ఓటేయాలి. లేదంటే ఊరు వదిలేసి వెళ్లేలా బెదిరింపులకు పాల్పడేవాడు. గ్రామ పంచాయతీలో 210, 211 పోలింగ్ బూత్‌ల పరిధిలో 1,488 ఓట్లున్నాయి. వీటిలో 1,305 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 733, వైఎస్సార్ సీపీకి 572 ఓట్లు వచ్చాయి. వీటిలో ఒక పోలింగ్ బూత్‌లో మృతుడు సుబ్బరాయుడు కుమారుల్లో ఒకరైన నాగప్రసాద్ ఏజెంట్‌గా కూర్చున్నాడు.
దీంతో వైఎస్సార్‌సీపీకి అన్ని ఓట్లు రావడాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి గ్రామంలో బెదిరింపుల పర్వం ప్రారంభించాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నా, వైఎస్సార్‌సీపీ కోసం పనిచేసినా చంపేస్తానని బెదిరించేవాడు. రెండు నెలల వ్యవధిలోనే మూడు సార్లు వైఎస్సార్ సీపీ నేత నారపురెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. ఇతనిపై నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది మండలాల పరిధిలో 57 కేసులు నమోదయ్యాయంటే ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడో అర్థమవుతోంది. ఇప్పటికీ కొన్ని కేసులపై కోర్టుకు హాజరవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment