subbaraidu
-
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
సాక్షి, నంద్యాల : ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, మీకు ఏ కష్టమొచ్చినా అన్ని విధాలా అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇటీవల హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. పోలీసు రక్షణ ఏర్పాటు చేసేలా హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ గూండాల దాడిలో పాశవికంగా హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. నేరుగా సుబ్బరాయుడి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి హత్య ఎలా జరిగిందో తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సుబ్బరాయుడు కోడలు పసుపులేటి కుమారి మాట్లాడుతూ.. ‘ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి 30–40 మంది వచ్చారు సార్.. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే తెలియదేంటే మీకు.. మీరెలా సంసారం చేస్తారో చూస్తా.. మీ ఆటోలు తగలబెడతా.. మీరు ఎలా ఊర్లో బతుకుతారో నేనూ చూస్తా..’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడు సార్. ఇంటి సోఫాలో పడుకున్న మా అత్తను బయటికి లాక్కొచ్చారు. ఆమె ఎంత బతిమలాడినా వినలేదు. ఇంటి తలుపులు గట్టిగా కొట్టడంతో లోపల పడుకున్న మా మామ వాకిలి (తలుపులు) తీయగానే ఒక్కసారిగా కట్టెలు, రాడ్లతో దాడి చేశారు. ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి రాళ్లతో తలమీద కొట్టారు. నెత్తురు కారి విలవిలలాడుతున్నా వదలలేదు. 25 నిమిషాల పాటు నరకం చూపించారు. చివరికి కొన ఊపిరితో ఉన్నాడని తెలిసి వెనక్కి వచ్చి మళ్లీ నెత్తి మీద బండరాయితో కొట్టి చంపేశారు’ అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమైంది. సుబ్బరాయుడు భార్య పసుపులేటి సుబ్బమ్మ మాట్లాడుతూ.. తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని రోదించారు. ఆయన్ను చంపుతుంటే కనీసం అరవలేదని.. తన అరుపులు విని కుటుంబ సభ్యులు బయటికి వస్తే వాళ్లను కూడా చంపుతారనే భయంతో నొప్పిని భరిస్తూ ప్రాణాలు వదిలాడని చెప్పింది. అడ్డుకునేందుకు తాను వెళితే వీపు మీద కట్టెలతో కొట్టారని, ఇనుప రాడ్‌తో కొట్టడంతో చేతికి తొమ్మిది కుట్లు పడ్డాయని వైఎస్ జగన్‌కు వివరించారు. కన్ను పడితే కబ్జానే.. శ్రీనివాసరెడ్డి కన్ను పడిందంటే ఆ స్థలాన్ని కబ్జా చేసే వరకు వదలడని సుబ్బరాయుడు కుమారుడు ప్రసాద్.. వైఎస్ జగన్‌కు వివరించారు. గ్రామంలో కోదండరామాలయం నిర్మిస్తామని చెప్పి రూ.కోటి యాభై లక్షల వరకు వసూలు చేశాడని, అలాగే తమ స్థలాన్ని కబ్జా చేసి వేర్‌హౌజ్, లైట్ వెయిట్ ఇటుకల ఫ్యాక్టరీ నిర్మి0చాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరూ అతనికి ఎదురు నిలవకూడదనే కక్షతోనే తన తండ్రిని హత్య చేసినట్లు తెలిపాడు. గ్రామంలో ప్రతి ఇంట్లో శ్రీనివాసరెడ్డి బాధితులు ఉన్నారని, నాన్నను చంపుతుంటే ఊర్లో ఏ ఒక్కరూ బయటికి రాలేదని.. అందరూ తలుపులు మూసుకుని ఉదయం వరకు తీయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆధిపత్యం పోకూడదనే.. గ్రామంలో 35 ఏళ్ల కిందట ఇదే శ్రీనివాసరెడ్డి ఇద్దరిని హత్య చేశాడని, అప్పటి నుంచి గ్రామంలో అతను ఏది చెబితే అదే నడుస్తోందని వైఎస్సార్సీపీ కార్యకర్త జయనారపురెడ్డి.. జగన్ దృష్టికి తెచ్చారు. 30 ఏళ్లుగా గ్రామంలో ఎన్నికలు జరగలేదని.. ఈ ఎన్నికల్లో అతని మాట కాదని తాము వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేశామన్నారు. వైఎస్సార్సీపీకి భారీగా ఓట్లు రావడంతో ఎక్కడ తన ఆధిపత్యానికి గండి పడుతుందోనన్న భయంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. శనివారం రాత్రి గ్రామంలో ఉండి ఉంటే తనను కూడా చంపేసేవారన్నారు. మా ఎకరం స్థలాన్ని కబ్జా చేశారు ‘గ్రామంలో మాకున్న ఎకరం పొలాన్ని శ్రీనివాసరెడ్డి కబ్జా చేశాడు. ఇది పద్ధతి కాదని ఎదురు తిరిగితే 2021 నుంచి మమ్మల్ని వేధిస్తున్నాడు’ అని వైఎస్సార్సీపీ కార్యకర్త శేఖర్.. వైఎస్ జగన్‌కు వివరించారు. ‘మా స్థలం మాకు ఇవ్వండని అడిగినందుకు మా అన్న పల్లం నాగరాజుపైన రేప్ కేసు పెట్టించాడు. హత్య జరిగిన రోజు మా ఇంటికి కూడా టీడీపీ గూండాలతో కలిసి వచ్చాడు. పెరాలసిస్‌తో బాధ పడుతున్న మా నాన్నను బండబూతులు తిడుతూ మీ కొడుకును చంపేస్తామని బెదిరించారు’ అని వివరించాడు. -
చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు
సీతారామాపురంలో సుబ్బరాయుడు హత్యను చూస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతోంది. లా అండ్ ఆర్డర్ ఎలా ఉండకూడదో అన్నదానికి చరిత్రలో ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. పోలీసుల సమక్షంలోనే హత్య జరిగింది. హత్య జరుగుతుందనే విషయం ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు చెప్పినా అదనపు బలగాలు పంపలేదు. హత్యను ఎస్ఐ, కానిస్టేబుళ్లు నివారించలేకపోయారు. పథకం ప్రకారం పోలీసులు, రాజకీయ నేతలు కలిసి ఇలాంటి ఘటనలతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మండలానికి ఇద్దరిని చంపండని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చెప్పాడు. అయినా అతనిపై కేసులు లేవు. చంపిన వారితో పాటు వారి వెనుక ఉన్న వారిని కూడా కేసుల్లో చేర్చాలి. చంపిన వారికి మద్దతు ఇచ్చిన నారా లోకేశ్, చంద్రబాబు నాయుడులను కూడా ముద్దాయిలుగా చేస్తేనే లా అండ్ ఆర్డర్ బతుకుతుంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి ప్రతినిధి కర్నూలు : రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికార పార్టీ నేతలు ఎవరంతకు వారు రెడ్ బుక్ అమలు చేస్తూ స్వైర విహారం చేస్తున్నారని.. హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ప్రజలు చైతన్యవంతులై వీటిని అరికట్టకపోతే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని, శాంతి భద్రతలు మరింతగా అదుపు తప్పక ముందే అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ ప్రభుత్వం చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వారి వారి రెడ్‌బుక్‌లు తెరిచి ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నిస్తేజులుగా చేసి, వారి సమక్షంలోనే లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేసిన పరిస్థితి సీతారామాపురంలో సుబ్బరాయుడి హత్య, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూస్తే స్పష్టమవుతోందన్నారు. ‘సుబ్బరాయుడు కుటుంబం ఎన్నికల సమయంలో బూత్‌లో ఏజెంట్లుగా కూర్చున్నారు. వీరితో పాటు మరో మూడు కుటుంబాల వారు ఏజెంట్లుగా కూర్చున్నారు. దీంతో పెద్దిరెడ్డి, పల్లం శేఖర్, నారపురెడ్డి వీరందరిని చంపాలనే దారుణ రాజకీయాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది? సుబ్బరాయుడిని హత్య చేసేందుకు బయట నుంచి వచ్చిన వారితో పాటు 35–40 మంది రాడ్లు, రాళ్లు, కత్తులు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసేందుకు ఏకమయ్యారు. ఇది చూసి నారపురెడ్డి 9.30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేశాడు. ‘గ్రామంలో వాతావరణం సరిగా లేదు. బయట నుంచి వ్యక్తులు వచ్చారు. రాడ్లు, తుపాకులు, కత్తులు కన్పిస్తున్నాయి. ఏదో జరగబోతోంది. పోలీసులు త్వరగా రావాలి’ అని చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. ఎస్ఐ గ్రామంలోని పరిస్థితులన్నీ చూశారు. సీఐ, డీఎస్పీలకు ఫోన్ చేశారు. అయినా బందోబస్తు పంపలేదు. ఎస్ఐ, కానిస్టేబుళ్ల ముందు టీడీపీ నేతల స్వైర విహారం కన్పిస్తున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. కత్తులు, కట్టెలు కన్పిస్తున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించారు. అదనపు బలగాలు రాలేదు’ అని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోలీసుల సమక్షంలోనే హత్య నంద్యాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సీతారామాపురం ఉంది. ఎస్పీ, డీఎస్పీ వచ్చేందుకు 10 నిమిషాలే పడుతుంది. సరైన సమయంలో పోలీసులను పంపి ఉంటే ఘటన జరిగేది కాదు. అదనపు బలగాలు రాకపోవడంతో ఎస్ఐ, కానిస్టేబుళ్లు చూస్తుండగానే అర్ధరాత్రి 12.20 గంటలకు సుబ్బరాయుడిని హతమార్చారు. మరో రెండు కుటుంబాలపై దాడి చేశారు. సుబ్బరాయుడు భార్యను నరికి గాయపరిచారు. ఇవన్నీ జరుగుతున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఆపలేదు. లోకేశ్, చంద్రబాబునాయుడు అండదండలతోనే పోలీసులు ఎవ్వరూ గ్రామంలోకి రాకుండా పథకం వేసినట్లు అన్పిస్తోంది. నారపురెడ్డిని పోలీసు స్టేషన్‌కు వెళ్లిపో అని ఎస్ఐ చెప్పాడు. నారపురెడ్డి స్టేషన్‌కు వెళ్లిన తర్వాత హత్య జరిగింది. హత్య ఘటన తెలిసి 12.59కి పోలీసుస్టేషన్ నుంచి ఎస్పీకి నారపురెడ్డి ఫోన్ చేశాడు. ‘మా ఊళ్లో మనుషులను చంపారు. ఇప్పుడే తెలిసింది. మా ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ దృశ్యాలు మీకు పంపిస్తున్నా. చూడండి’ అని చెప్పినా అదనపు బలగాలు రాలేదు. చంపిన వారు దర్జాగా ఊరు వదిలే పరిస్థితి. వాళ్లను పట్టుకున్న నాథుడే లేడు. పట్టుకునేందుకు పోలీసులు రాలేదు. 1.08 గంటలకు మళ్లీ నారపురెడ్డి ఫోన్ చేశాడు. ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని చెప్పారు. ఆపై 3.18 గంటలకు మళ్లీ ఫోన్ చేశాడు. ‘హంతకుల ముఠాలో రమణ అనే వ్యక్తిని అతి కష్టం మీద పట్టుకున్నాం. అతన్ని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని అరెస్టు చేయండి’ అని చెప్పారు. చివరకు 3.28 గంటలకు ఎస్పీ నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణను నంద్యాల త్రీటౌన్‌లో అప్పగించాలని చెప్పారు. చివరకు పోలీసులు రమణను ఎస్పీ ఆఫీసులోపలికి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? » గ్రామంలో ఘటన జరుగుతుందని పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసుల సమక్షంలో హత్య జరుగుతున్నా ఎందుకు అదనపు బలగాలు రాలేదు? » హత్య చేసి పలువురిని గాయపరిచిన వారంతా గ్రామం వదిలిపోయేదాకా వారిని పట్టుకునే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదు? » ఈ హత్య వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరు ఆడిస్తున్నారు? » సీఐ, డీఎస్పీ, ఎస్పీ ఏ ఒక్కరూ అదనపు బలగాలు పంపించకుండా ఆపగలిగారంటే నాయకులు, పోలీసులు కలిసి ఏ స్థాయిలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా? » రాష్ట్రంలో ప్రతీ ఘటన ఇలాగే ఉంది. వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై నరికారు. ఇదే శ్రీశైలం నియోజకవర్గంలోని దాసు (హత్య ఫొటోలు చూపిస్తూ)ను చంపారు. దాసు కుమారుడు నా వద్దకు వచ్చి మా నాన్నను జూన్ 26న పట్టపగలే చంపారు అని చెప్పాడు. నాయకులు, పోలీసులు కలిసే ఘటనలు జరిగేలా చేస్తారు.. భయానక వాతావరణం సృష్టిస్తారు.. తప్పనిసరి కేసు పెట్టాల్సి వచ్చినపుడు చిన్న చిన్న ముద్దాయిలను చేర్చి కేసును ఆపేస్తున్నారు. చేయించిన వారు ఎవరు? ఎమ్మెల్యే పేరు ఎందుకు కేసుల్లో చేర్చడం లేదు? » సుబ్బరాయుడిని చంపిన శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఉండడా? హత్యకు ముందు.. ఆ తర్వాత అతను ఎవరితో మాట్లాడారో కాల్ డేటాను ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? కేసును ఎందుకు వారి వద్దకు పోకుండా ఆపుతున్నారు? ఎమ్మెల్యే బుడ్డాపై ఎందుకు కేసు పెట్టలేదు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. ఈ ఘటనలపై హైకోర్టుతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. కోర్టుల ద్వారా పికెటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు రక్షణ కలిగేలా చేస్తాం. అప్పడే కొద్దోగొప్పో ప్రజాస్వామ్యం బతుకుతుంది. హత్య చేసిన వారితో పాటు చేయించిన వారిని కూడా ముద్దాయిలుగా చేరుస్తూ జైల్లో పెట్టాలి. అప్పుడే రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి విజయోత్సవ సభ అని కౌంటింగ్ తర్వాత మీటింగ్ పెట్టారు. ఆయన ఎలా మాట్లాడారో చూడండి. (ఫోన్లో బుడ్డా మాట్లాడిన వీడియోను చూపుతూ) ‘మాంచి పట్టుడు కట్టెలు పెట్టుకోండి. మండలానికి ఇద్దరిని పీకండి. చేతకాకపోతే చెప్పండి. నేను మనుషులను పంపిస్తా. కండువా వేసుకుని మన పార్టీలో చేరితే మనకు అభ్యంతరం లేదు. లేదంటే తోలు తీయడమే’ అని ఆ పార్టీ వాళ్లను రెచ్చగొట్టారు. మండలానికి ఇద్దరిని చంపండి.. దాడులు చేయండి.. కేసులు, పోలీసులు నేను చూసుకుంటా.. అంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మీటింగ్‌లు పెట్టి ఇంత దారుణంగా చంపమని చెబుతుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు? చంపిన వారిపై మాత్రమే కాదు.. వారికి రక్షణ ఇచ్చే వారిపై కూడా కేసులు పెడితేనే లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించకూడదనే.. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేసి.. వారి మనసులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచనే ప్రభుత్వంలో కన్పి0చడం లేదు. రెండు నెలలుగా రాష్ట్రంలో అరాచకం, మారణహోమం సృష్టించే పాలన నడుస్తోంది. ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు ఏం మాటలు చెప్పారో, ప్రజలను ఎలా మోసం చేస్తూ ఓట్లు వేయించుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రశ్నించకూడదనే ఆలోచనతో భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు క్యాంపెయిన్ చేస్తూ చిన్న పిల్లలు కన్పిస్తే చాలు ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు’ అని చెప్పి ప్రలోభ పెట్టారు. అక్క చెల్లెమ్మలు కన్పిస్తే ‘ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు సంతోషమేనా?’ అని అడిగారు. నిరుద్యోగి కన్పిస్తే ‘రూ.3 వేల నిరుద్యోగ భృతి సంతోషమా?’ అని.. రైతులు కన్పిస్తే ‘మీకు రూ.20 వేలు సంతోషమా?’ అని అడిగారు. ఇలాంటి ఆలోచనలు, మాటలతో ఇంటింటికీ టీడీపీ శ్రేణులను పంపించి చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్నికల తర్వాత చిన్న పిల్లలను మోసం చేశారు. అదే జగనన్న ఉండి ఉంటే ఇప్పటికే రూ.15 వేలు అమ్మ ఒడి అంది ఉండేది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామం పెట్టారు. వ్యవసాయ సీజన్ మొదలైంది. రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తున్నారు. జగన్ ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము అందేది. ఆ సొమ్మూ పోయింది. చంద్రబాబు ఇస్తామన్న రూ.20 వేలు పోయింది. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని చెప్పి అడ్డగోలుగా మోసం చేశాడు.జగనే ఉండి ఉంటే ఈ పథకాలు రావడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద ఫీజులు కూడా కట్టేవాడు. ఇవి కూడా ఇవ్వకుండా, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడు. ఇలా రైతులు, చిన్న పిల్లలు, అక్క చెల్లెమ్మలు అందరినీ మోసం చేశారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు.. రోడ్డుపైకి రాకూడదు.. నిలదీయకూడదు.. అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. దారి పొడవునా ఘన స్వాగతం ఉదయం 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఓర్వకల్లు మీదుగా హుస్సేనాపురం, తమ్మరాజుపల్లె, పాణ్యం డొంక, బలపనూరు, వెంకటేశ్వరపురం, టోల్గేట్, నంద్యాల బైపాస్, అయ్యలూరి మెట్ట, నందిపల్లె మీదుగా సీతారామాపురం చేరుకున్నారు. ఓర్వకల్లు నుంచి సీతారామాపురం చేరుకోవడానికి మామూలుగా గంట పడుతుంది. అలాంటిది అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తడంతో 5 గంటలకు పైగా పట్టింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ 3.20 గంటలకు సీతారామాపురం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, ఇసాక్, ఎమ్మెల్యే విరూపాక్షి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎంపీలు పోచా బ్రహా్మనందరెడ్డి, బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీపైనా పెట్రోల్ పోసి తగలబెడతాం
సాక్షి, నంద్యాల: అధికారం అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా విచక్షణ రహితంగా హత్యకు తెగించారు. ఇష్టానుసారం దాడులకు పాల్పడ్డారు. కొడవళ్లు, కర్రలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ‘అడ్డు వస్తే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం..’ అంటూ పోలీసులను సైతం బెదిరించారు. సీతారామాపురం గ్రామంలో టీడీపీ ముఖ్యనేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి సుమారు 30 మంది అనుచరులతో శనివారం రాత్రి విధ్వంసం సృష్టించిన తీరు నివ్వెర పరుస్తోంది. ‘రెడ్డిబుక్’ పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. శనివారం రాత్రి 11.30 గంటలకు శ్రీనివాసరెడ్డి సమీప బంధువైన బుడ్డారెడ్డి గారి పెద్దిరెడ్డి ఇంట బీభత్సం సృష్టించారు. శేఖర్‌రెడ్డి ముందుండి దౌర్జన్యకాండను నడిపించాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి లక్ష్మిదేవిని దుర్భాషలాడుతూ దాడి చేశారు. వాడు (పెద్దిరెడ్డి) ఎక్కడున్నాడో చెప్పండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తామని హెచ్చరించారు. ఇంట్లోనే ఉన్న ఆమె కుమార్తె పద్మజపైనా చేయి చేసుకున్నారు. వాడిని వదిలేసే ప్రసక్తే లేదని, కచి్చతంగా చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తూ పెద్దిరెడ్డి ఇంటి నుంచి బయటికి వచ్చారు. తర్వాత 12 గంటల ప్రాంతంలో పల్లపు శేఖర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శేఖర్ ఇంట్లో లేడు. ఆయన తండ్రి పల్లపు సుబ్బరాయుడు పెరాలసిస్‌తో బాధ పడుతున్నాడు. మంచంలో ఉన్న అతన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి పడేశారు. ఇంటి ముందున్న బైక్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత 12.20 గంటలకు పసుపులేటి సుబ్బరాయుడు ఇంటికి శ్రీనివాస్‌రెడ్డి, మరో 30 మంది వెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య పసుపులేటి బాలసుబ్బమ్మ సోపాలో పడుకుని ఉంది. ఆమెను బలవంతంగా బయటికి లాక్చొచ్చారు. భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు గట్టిగా తట్టడంతో ఇంట్లో నిద్రిస్తున్న సుబ్బరాయుడు తలుపులు తెరవగానే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రోడ్డు మీదకు లాక్కొచ్చి మరోసారి కొడవలి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తలకు దెబ్బలు తగలడంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్పృహ తప్పిపడిపోయాడు. చనిపోయాడనుకుని వెళ్లిపోతూ.. మళ్లీ వెనక్కి వచ్చి పరీక్షించి చూశారు. ‘వీడు చావలేదు’ అంటూ పక్కనే ఉన్న బండరాయితో తల మీద గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న రెండో కుమారుడు జమాలయ్య, మూడో కుమారుడు నాగ ప్రసాద్‌తో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్లను చంపేందుకు ప్రయతి్నస్తే వాళ్లు తప్పించుకుని పారిపోయారు. దీంతో ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదని ఈ ఐదేళ్లలో అందరినీ అంతమొందిస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. పోలీసులకూ హెచ్చరిక సుబ్బరాయుడిని హత్య చేసే సమయంలో మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ముఠాకు వారు నచ్చజెప్పేందుకు ప్రయతి్నంచగా.. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం’ అని హెచ్చరించారు. వారిని పక్కకు తోసేసి ముందుకెళ్లారు. కాగా, దాడిలో గాయపడిన పసుపులేటి బాలసుబ్బమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్బరాయుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం 7.30 గంటలకు పోస్టుమార్టం కోసం నంద్యాలకు తీసుకొచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేత బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బుడ్డారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగాల లక్ష్మిరెడ్డి, బుడ్డారెడ్డి శేఖర్‌రెడ్డి, వంగాల పుల్లారెడ్డి, కంటరెడ్డి భరత్‌రెడ్డి, తాలూరి శ్రీనివాస్, మరికొంత మందిపై హత్య, హత్యాయత్నం, ఆస్తి ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలి్పంచడం తదితరాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.టీడీపీకి ఓటెయ్యలేదని చంపేశారు నా భర్త సుబ్బరాయుడు ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మాపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి 30 మంది టీడీపీ గూండాలు మా ఇంటి వద్దకు వచ్చి బయట నిద్రిస్తున్న నన్ను లేపి నీభర్త ఎక్కడున్నాడు అని అడిగారు. లేడని చెప్పడంతో నాపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. చేతిని కత్తితో నరికారు. ఇంట్లోకి దూసుకెళ్లి నిద్రిస్తున్న నా భర్తను నడిరోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లు కర్రలతో, రాళ్లతో, కత్తులతో దాడి చేశారు. నా భర్త తలపై పెద్ద బండరాయి వేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. వదిలేయాలని కాళ్లావేళ్లా పడినా వినిపించుకోలేదు. – పసుపులేటి బాలసుబ్బమ్మ (మృతుడి భార్య)ఊళ్లో భద్రత కరువైంది వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు మా ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బయట నిద్రిస్తున్న మా తల్లి బాలసుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారు. ఇంట్లో నిద్రిస్తున్న మా నాన్నను దుర్భాషలాడుతూ బయటకు లాక్కెళ్లారు. రోడ్డుపై పడేసి కొడవళ్లు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. పథకం ప్రకారం కొట్టి హతమార్చారు. ‘మాకు వ్యతిరేకంగా చేస్తారా.. మీ అంతు చూస్తాం’ అని బెదిరించారు. ఊళ్లో అందరికీ భద్రత కరువైంది. – జమాలయ్య, మృతుడు సుబ్బరాయుడు కుమారుడు -
రాజకీయ కక్షతోనే ఈ దారుణం
సాక్షి ప్రతినిధి కర్నూలు: మహానంది మండలం సీతారామాపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడిది వివాద రహిత కుటుంబం. ఎవ్వరి జోలికి వెళ్లరు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే అభిమానం. సీతారామాపురంలో టీడీపీకి తప్ప మరో పార్టీ తరఫున ఏజెంట్లు కూర్చోలేని పరిస్థితి. ఎన్నిక ఏదైనా టీడీపీ నేతలు రిగ్గింగ్, సైక్లింగ్ చేసుకునే వారు. టీడీపీ నేత బుడ్డారెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గ్రామంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించేవాడు. వేరే వర్గం అంటూ లేకుండా తన గూండాయిజంతో బెదిరింపులకు పాల్పడేవాడు. గతంలో గ్రామంలో ఓట్లు వేయాలంటేనే భయపడే పరిస్థితి. స్వతంత్రంగా ఓటేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన దుస్థితి. శ్రీనివాసరెడ్డి ఎవరికి చెబితే వాళ్లకే ఓటేయాలి. లేదంటే ఊరు వదిలేసి వెళ్లేలా బెదిరింపులకు పాల్పడేవాడు. గ్రామ పంచాయతీలో 210, 211 పోలింగ్ బూత్‌ల పరిధిలో 1,488 ఓట్లున్నాయి. వీటిలో 1,305 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 733, వైఎస్సార్ సీపీకి 572 ఓట్లు వచ్చాయి. వీటిలో ఒక పోలింగ్ బూత్‌లో మృతుడు సుబ్బరాయుడు కుమారుల్లో ఒకరైన నాగప్రసాద్ ఏజెంట్‌గా కూర్చున్నాడు. దీంతో వైఎస్సార్సీపీకి అన్ని ఓట్లు రావడాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి గ్రామంలో బెదిరింపుల పర్వం ప్రారంభించాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నా, వైఎస్సార్సీపీ కోసం పనిచేసినా చంపేస్తానని బెదిరించేవాడు. రెండు నెలల వ్యవధిలోనే మూడు సార్లు వైఎస్సార్ సీపీ నేత నారపురెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. ఇతనిపై నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది మండలాల పరిధిలో 57 కేసులు నమోదయ్యాయంటే ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడో అర్థమవుతోంది. ఇప్పటికీ కొన్ని కేసులపై కోర్టుకు హాజరవుతున్నాడు. -
నేడు ఫర్టిగేషన్‌పై అవగాహన సదస్సు
అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఫర్టిగేషన్ అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. అరటి, ఇతర పండ్లతోటలకు డ్రిప్ ద్వారా నీటిలో కరిగే రసాయన ఎరువులు ఇవ్వడంలో మెలకువలు, సాంకేతిక అంశాలు, రైతులకు కలిగే ప్రయోజనాలు గురించి తెలియజేస్తామన్నారు. ఏపీఎంఐపీ ఓఎస్డీ రమేష్‌తో పాటు ఇరుశాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు, రైతులు హాజరవుతున్నట్లు తెలిపారు.