సీతారామాపురంలో పోలీసులకు పచ్చమూకల హెచ్చరిక.. ‘రెడ్‌బుక్’ పాలనకు ఇదే నిదర్శనం
మహిళలని కూడా చూడకుండా చేయి చేసుకున్న గూండాలు
పెరాలసిస్‌తో బాధ పడుతున్న వ్యక్తినీ లాక్కొచ్చి ఇంటి బయట పడేసిన ముఠా
కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వైనం
సుబ్బరాయుడి ఇంటి వద్దకు చేరుకుని ఆరుపులు, కేకలు, దాడి
చనిపోయాడనుకుని వెనుదిరుగుతూ పరీక్షించి చూసిన వైనం
‘వీడింకా బతికే ఉన్నాడు’ అంటూ మళ్లీ బండరాయితో తలపైమోది హత్య
సాక్షి, నంద్యాల: అధికారం అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా విచక్షణ రహితంగా హత్యకు తెగించారు. ఇష్టానుసారం దాడులకు పాల్పడ్డారు. కొడవళ్లు, కర్రలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ‘అడ్డు వస్తే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం..’ అంటూ పోలీసులను సైతం బెదిరించారు. సీతారామాపురం గ్రామంలో టీడీపీ ముఖ్యనేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి సుమారు 30 మంది అనుచరులతో శనివారం రాత్రి విధ్వంసం సృష్టించిన తీరు నివ్వెర పరుస్తోంది. ‘రెడ్డిబుక్’ పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది.
శనివారం రాత్రి 11.30 గంటలకు శ్రీనివాసరెడ్డి సమీప బంధువైన బుడ్డారెడ్డి గారి పెద్దిరెడ్డి ఇంట బీభత్సం సృష్టించారు. శేఖర్‌రెడ్డి ముందుండి దౌర్జన్యకాండను నడిపించాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి లక్ష్మిదేవిని దుర్భాషలాడుతూ దాడి చేశారు. వాడు (పెద్దిరెడ్డి) ఎక్కడున్నాడో చెప్పండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తామని హెచ్చరించారు. ఇంట్లోనే ఉన్న ఆమె కుమార్తె పద్మజపైనా చేయి చేసుకున్నారు. వాడిని వదిలేసే ప్రసక్తే లేదని, కచి్చతంగా చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తూ పెద్దిరెడ్డి ఇంటి నుంచి బయటికి వచ్చారు.
తర్వాత 12 గంటల ప్రాంతంలో పల్లపు శేఖర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శేఖర్ ఇంట్లో లేడు. ఆయన తండ్రి పల్లపు సుబ్బరాయుడు పెరాలసిస్‌తో బాధ పడుతున్నాడు. మంచంలో ఉన్న అతన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి పడేశారు. ఇంటి ముందున్న బైక్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత 12.20 గంటలకు పసుపులేటి సుబ్బరాయుడు ఇంటికి శ్రీనివాస్‌రెడ్డి, మరో 30 మంది వెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య పసుపులేటి బాలసుబ్బమ్మ సోపాలో పడుకుని ఉంది. ఆమెను బలవంతంగా బయటికి లాక్చొచ్చారు. భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డారు.
ఇంటి తలుపులు గట్టిగా తట్టడంతో ఇంట్లో నిద్రిస్తున్న సుబ్బరాయుడు తలుపులు తెరవగానే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రోడ్డు మీదకు లాక్కొచ్చి మరోసారి కొడవలి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తలకు దెబ్బలు తగలడంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్పృహ తప్పిపడిపోయాడు. చనిపోయాడనుకుని వెళ్లిపోతూ.. మళ్లీ వెనక్కి వచ్చి పరీక్షించి చూశారు. ‘వీడు చావలేదు’ అంటూ పక్కనే ఉన్న బండరాయితో తల మీద గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న రెండో కుమారుడు జమాలయ్య, మూడో కుమారుడు నాగ ప్రసాద్‌తో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్లను చంపేందుకు ప్రయతి్నస్తే వాళ్లు తప్పించుకుని పారిపోయారు. దీంతో ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదని ఈ ఐదేళ్లలో అందరినీ అంతమొందిస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు.
పోలీసులకూ హెచ్చరిక
సుబ్బరాయుడిని హత్య చేసే సమయంలో మహానంది ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ముఠాకు వారు నచ్చజెప్పేందుకు ప్రయతి్నంచగా.. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం’ అని హెచ్చరించారు. వారిని పక్కకు తోసేసి ముందుకెళ్లారు. కాగా, దాడిలో గాయపడిన పసుపులేటి బాలసుబ్బమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సుబ్బరాయుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం 7.30 గంటలకు పోస్టుమార్టం కోసం నంద్యాలకు తీసుకొచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేత బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బుడ్డారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగాల లక్ష్మిరెడ్డి, బుడ్డారెడ్డి శేఖర్‌రెడ్డి, వంగాల పుల్లారెడ్డి, కంటరెడ్డి భరత్‌రెడ్డి, తాలూరి శ్రీనివాస్, మరికొంత మందిపై హత్య, హత్యాయత్నం, ఆస్తి ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలి్పంచడం తదితరాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
టీడీపీకి ఓటెయ్యలేదని చంపేశారు
నా భర్త సుబ్బరాయుడు ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మాపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి 30 మంది టీడీపీ గూండాలు మా ఇంటి వద్దకు వచ్చి బయట నిద్రిస్తున్న నన్ను లేపి నీభర్త ఎక్కడున్నాడు అని అడిగారు. లేడని చెప్పడంతో నాపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. చేతిని కత్తితో నరికారు. ఇంట్లోకి దూసుకెళ్లి నిద్రిస్తున్న నా భర్తను నడిరోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లు కర్రలతో, రాళ్లతో, కత్తులతో దాడి చేశారు. నా భర్త తలపై పెద్ద బండరాయి వేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. వదిలేయాలని కాళ్లావేళ్లా పడినా వినిపించుకోలేదు. – పసుపులేటి బాలసుబ్బమ్మ (మృతుడి భార్య)
ఊళ్లో భద్రత కరువైంది
వైఎస్సార్‌సీపీకి ఓటు వేసినందుకు మా ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బయట నిద్రిస్తున్న మా తల్లి బాలసుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారు. ఇంట్లో నిద్రిస్తున్న మా నాన్నను దుర్భాషలాడుతూ బయటకు లాక్కెళ్లారు. రోడ్డుపై పడేసి కొడవళ్లు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. పథకం ప్రకారం కొట్టి హతమార్చారు. ‘మాకు వ్యతిరేకంగా చేస్తారా.. మీ అంతు చూస్తాం’ అని బెదిరించారు. ఊళ్లో అందరికీ భద్రత కరువైంది. – జమాలయ్య, మృతుడు సుబ్బరాయుడు కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment