
ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని తోసేస్తున్న సీఐ జనార్దన్
వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రెస్‌మీట్‌ను అడ్డుకునే యత్నం
రోడ్డును దిగ్బంధించి నానా రభస ∙టీడీపీ గూండాలకే పోలీసు యంత్రాంగం వత్తాసు
శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలంలో ఘటన
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులపై గూండాగిరి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు మౌనవ్రతం వహించారు. వివరాల్లోకి వెళితే, వైఎస్సార్‌సీపీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం చిలమత్తూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
ప్రెస్‌మీట్ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.
టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఒకానొక దశలో పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించినా కిమ్మనకపోవడం గమనార్హం.
పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోండి..:
వైఎస్సార్‌సీపీ నాయకులకే పోలీసుల సలహా కాగా, దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ నాయకులను వదిలేసి, పార్టీ కార్యాలయం వదిలి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకులకే పోలీసుల సలహా ఇవ్వడం గమనార్హం. ‘‘మీరు పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోతేనే, టీడీపీ నేతలు వెళ్లిపోతారు’’ అంటూ పోలీసులు అనడంతో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కనీ్వనర్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులు ససేమిరా అన్నాయి.
తమకు ప్రెస్‌మీట్ నిర్వహించుకునే హక్కు, పార్టీ కార్యాలయంలో ఉండే హక్కు ఉందని వారు స్పష్టం చేశారు. దీంతో ఒక దశలో సీఐ జనార్దన్ ..ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, మండల కనీ్వనర్ రామకృష్ణారెడ్డిలను బెదిరిస్తూ మాట్లాడారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతలు కూడా వినకపోవడంతో చివరకు పోలీసులు ఎంపీపీ, కనీ్వనర్‌తో మాట్లాడి అక్కడి నుంచి వారిని బందోబస్తు నడుమ పంపించి వేశారు.
ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత వెళ్లేప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండా బాబూరెడ్డి ఎంపీపీని అసభ్య పదజాలంతో దూషించడం గమనార్హం. కాగా, ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసిన అంశంపై ‘సాక్షి’ ఈ నెల 24న ‘ప్రాణం తీసేందుకే ప్లాన్ చేశారా?.. ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై హత్యాయత్నం వెనుక సూత్రధారులెవరు?’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. అయితే.. టీడీపీ నేత నాగరాజు యాదవ్ తనపైనే ఈ వార్త రాశారంటూ ‘సాక్షి’కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బెదిరింపులకు దిగారు.