చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు | YS Jagan mohan Reddy visited Subbaraidus family | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు

Published Sat, Aug 10 2024 5:04 AM | Last Updated on Sat, Aug 10 2024 8:58 AM

YS Jagan mohan Reddy visited Subbaraidus family

వారి తీరు వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాటిపోయే ప్రమాదం 

రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలంతా రెడ్‌బుక్‌ అమలు చేస్తున్నారు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ ఆగ్రహం

సీతారామాపురంలో పోలీసుల సమక్షంలోనే సుబ్బరాయుడి హత్య 

హత్య చేయడానికి వచ్చారని ముందుగానే సమాచారం ఇచ్చినా పోలీసుల నిర్లక్ష్యం  

పోలీసులు, రాజకీయ నేతలు కలిసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు 

మండలానికి ఇద్దరిని చంపండన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదు?  

హత్య చేసిన శ్రీనివాసరెడ్డి కాల్‌ డేటాను పరిశీలించి.. అందుకు మద్దతు ఇచ్చిన వారిని అరెస్ట్‌ చేయాలి

హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి బాధితులకు న్యాయం దక్కేలా అండగా నిలుస్తాం 

ఎన్నికల హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం 

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారు 

ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు.. రోడ్డుపైకి రాకూడదు.. నిలదీయకూడదనే ఇదంతా..

సీతారామాపురంలో సుబ్బరాయుడు హత్యను చూస్తే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉండకూడదో అన్నదానికి చరిత్రలో ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. పోలీసుల సమక్షంలోనే హత్య జరిగింది. హత్య జరుగుతుందనే విషయం ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలకు చెప్పినా అదనపు బలగాలు పంపలేదు. హత్యను ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు నివారించలేకపోయారు. పథకం ప్రకారం పోలీసులు, రాజకీయ నేతలు కలిసి ఇలాంటి ఘటనలతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. 

మండలానికి ఇద్దరిని చంపండని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చెప్పాడు. అయినా అతనిపై కేసులు లేవు. చంపిన వారితో పాటు వారి వెనుక ఉన్న వారిని కూడా కేసుల్లో చేర్చాలి. చంపిన వారికి మద్దతు ఇచ్చిన నారా లోకేశ్, చంద్రబాబు నాయుడులను కూడా ముద్దాయిలుగా చేస్తేనే లా అండ్‌ ఆర్డర్‌ బతుకుతుంది.  – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి కర్నూలు : రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికార పార్టీ నేతలు ఎవరంతకు వారు రెడ్‌ బుక్‌ అమలు చేస్తూ స్వైర విహారం చేస్తున్నారని.. హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలు చైతన్యవంతులై వీటిని అరికట్టకపోతే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని, శాంతి భద్రతలు మరింతగా అదుపు తప్పక ముందే అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ ప్రభుత్వం చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. 

కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వారి వారి రెడ్‌బుక్‌లు తెరిచి ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నిస్తేజులుగా చేసి, వారి సమక్షంలోనే లా అండ్‌ ఆర్డర్‌ను నాశనం చేసిన పరిస్థితి సీతారామాపురంలో సుబ్బరాయుడి హత్య, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూస్తే స్పష్టమవుతోందన్నారు. ‘సుబ్బరాయుడు కుటుంబం ఎన్నికల సమయంలో బూత్‌లో ఏజెంట్లుగా కూర్చున్నారు. 

వీరితో పాటు మరో మూడు కుటుంబాల వారు ఏజెంట్లుగా కూర్చున్నారు. దీంతో పెద్దిరెడ్డి, పల్లం శేఖర్, నారపురెడ్డి వీరందరిని చంపాలనే దారుణ రాజకీయాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఏమైంది? సుబ్బరాయుడిని హత్య చేసేందుకు బయట నుంచి వచ్చిన వారితో పాటు 35–40 మంది రాడ్లు, రాళ్లు, కత్తులు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసేందుకు ఏకమయ్యారు. ఇది చూసి నారపురెడ్డి 9.30 గంటలకు ఎస్‌ఐకి ఫోన్‌ చేశాడు. ‘గ్రామంలో వాతావరణం సరిగా లేదు. బయట నుంచి వ్యక్తులు వచ్చారు. 

రాడ్లు, తుపాకులు, కత్తులు కన్పిస్తున్నాయి. ఏదో జరగబోతోంది. పోలీసులు త్వరగా రావాలి’ అని చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. ఎస్‌ఐ గ్రామంలోని పరిస్థితులన్నీ చూశారు. సీఐ, డీఎస్పీలకు ఫోన్‌ చేశారు. అయినా బందోబస్తు పంపలేదు. ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ముందు టీడీపీ నేతల స్వైర విహారం కన్పిస్తున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. కత్తులు, కట్టెలు కన్పిస్తున్నా ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించారు. అదనపు బలగాలు రాలేదు’ అని నిప్పులు చెరిగారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

పోలీసుల సమక్షంలోనే హత్య 
నంద్యాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సీతారామాపురం ఉంది. ఎస్పీ, డీఎస్పీ వచ్చేందుకు 10 నిమిషాలే పడుతుంది. సరైన సమయంలో పోలీసులను పంపి ఉంటే ఘటన జరిగేది కాదు. అదనపు బలగాలు రాకపోవడంతో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు చూస్తుండగానే అర్ధరాత్రి 12.20 గంటలకు సుబ్బరాయుడిని హతమార్చారు. మరో రెండు కుటుంబాలపై దాడి చేశారు. సుబ్బరాయుడు భార్యను నరికి గాయపరిచారు. ఇవన్నీ జరుగుతున్నా ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు ఆపలేదు. లోకేశ్, చంద్రబాబునాయుడు అండదండలతోనే పోలీసులు ఎవ్వరూ గ్రామంలోకి రాకుండా పథకం వేసినట్లు అన్పిస్తోంది. నారపురెడ్డిని పోలీసు స్టేషన్‌కు వెళ్లిపో అని ఎస్‌ఐ చెప్పాడు. 

నారపురెడ్డి స్టేషన్‌కు వెళ్లిన తర్వాత హత్య జరిగింది. హత్య ఘటన తెలిసి 12.59కి పోలీసుస్టేషన్‌ నుంచి ఎస్పీకి నారపురెడ్డి ఫోన్‌ చేశాడు. ‘మా ఊళ్లో మనుషులను చంపారు. ఇప్పుడే తెలిసింది. మా ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ దృశ్యాలు మీకు పంపిస్తున్నా. చూడండి’ అని చెప్పినా అదనపు బలగాలు రాలేదు. చంపిన వారు దర్జాగా ఊరు వదిలే పరిస్థితి. వాళ్లను పట్టుకున్న నాథుడే లేడు. పట్టుకునేందుకు పోలీసులు రాలేదు. 1.08 గంటలకు మళ్లీ నారపురెడ్డి ఫోన్‌ చేశాడు. ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని చెప్పారు. ఆపై 3.18 గంటలకు మళ్లీ ఫోన్‌ చేశాడు. 

‘హంతకుల ముఠాలో రమణ అనే వ్యక్తిని అతి కష్టం మీద పట్టుకున్నాం. అతన్ని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని అరెస్టు చేయండి’ అని చెప్పారు. చివరకు 3.28 గంటలకు ఎస్పీ నారపురెడ్డికి ఫోన్‌ చేసి మీరు పట్టుకున్న రమణను నంద్యాల త్రీటౌన్‌లో అప్పగించాలని చెప్పారు. చివరకు పోలీసులు రమణను ఎస్పీ ఆఫీసులోపలికి తీసుకెళ్లారు.  

ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?  
»    గ్రామంలో ఘటన జరుగుతుందని పోలీసులకు ఫోన్‌ వచ్చింది. పోలీసుల సమక్షంలో హత్య జరుగుతున్నా ఎందుకు అదనపు బలగాలు రాలేదు?  
»     హత్య చేసి పలువురిని గాయపరిచిన వారంతా గ్రామం వదిలిపోయేదాకా వారిని పట్టుకునే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదు? 
»     ఈ హత్య వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరు ఆడిస్తున్నారు? 
»    సీఐ, డీఎస్పీ, ఎస్పీ ఏ ఒక్కరూ అదనపు బలగాలు పంపించకుండా ఆపగలిగారంటే నాయకులు, పోలీసులు కలిసి ఏ స్థాయిలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అసలు ఇక్కడ లా అండ్‌ ఆర్డర్‌ ఉందా? 
»     రాష్ట్రంలో ప్రతీ ఘటన ఇలాగే ఉంది. వినుకొండలో రషీద్‌ అనే వ్యక్తిని నడిరోడ్డుపై నరికారు. ఇదే శ్రీశైలం నియోజకవర్గంలోని దాసు (హత్య ఫొటోలు చూపిస్తూ)ను చంపారు. దాసు కుమారుడు నా వద్దకు వచ్చి మా నాన్నను జూన్‌ 26న పట్టపగలే చంపారు అని చెప్పాడు. నాయకులు, పోలీసులు కలిసే ఘటనలు జరిగేలా చేస్తారు.. భయానక వాతావరణం సృష్టిస్తారు.. తప్పనిసరి కేసు పెట్టాల్సి వచ్చినపుడు చిన్న చిన్న ముద్దాయిలను చేర్చి కేసును ఆపేస్తున్నారు. చేయించిన వారు ఎవరు? ఎమ్మెల్యే పేరు ఎందుకు కేసుల్లో చేర్చడం లేదు? 
»     సుబ్బరాయుడిని చంపిన శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి ఉండడా? హత్యకు ముందు.. ఆ తర్వాత అతను ఎవరితో మాట్లాడారో కాల్‌ డేటాను ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? కేసును ఎందుకు వారి వద్దకు పోకుండా ఆపుతున్నారు?    

ఎమ్మెల్యే బుడ్డాపై ఎందుకు కేసు పెట్టలేదు?  
రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడి తప్పింది. ఈ ఘటనలపై హైకోర్టుతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. కోర్టుల ద్వారా పికెటింగ్‌ ఏర్పాటు చేసి బాధితులకు రక్షణ కలిగేలా చేస్తాం. అప్పడే కొద్దోగొప్పో ప్రజాస్వామ్యం బతుకుతుంది. హత్య చేసిన వారితో పాటు చేయించిన వారిని కూడా ముద్దాయిలుగా చేరుస్తూ జైల్లో పెట్టాలి. అప్పుడే రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి. 

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి విజయోత్సవ సభ అని కౌంటింగ్‌ తర్వాత మీటింగ్‌ పెట్టారు. ఆయన ఎలా మాట్లాడారో చూడండి. (ఫోన్‌లో బుడ్డా మాట్లాడిన వీడియోను  చూపుతూ) ‘మాంచి పట్టుడు కట్టెలు పెట్టుకోండి. మండలానికి ఇద్దరిని పీకండి. చేతకాకపోతే చెప్పండి. నేను మనుషులను పంపిస్తా. కండువా వేసుకుని మన పార్టీలో చేరితే మనకు అభ్యంతరం లేదు. లేదంటే తోలు తీయడమే’ అని ఆ పార్టీ వాళ్లను రెచ్చగొట్టారు. 

మండలానికి ఇద్దరిని చంపండి.. దాడులు చేయండి.. కేసులు, పోలీసులు నేను చూసుకుంటా.. అంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మీటింగ్‌లు పెట్టి ఇంత దారుణంగా చంపమని చెబుతుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు? చంపిన వారిపై మాత్రమే కాదు.. వారికి రక్షణ ఇచ్చే వారిపై కూడా కేసులు పెడితేనే లా అండ్‌ ఆర్డర్‌ నిలబడుతుంది.  

ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించకూడదనే.. 
ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేసి.. వారి మనసులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచనే  ప్రభుత్వంలో కన్పి0చడం లేదు. రెండు నెలలుగా రాష్ట్రంలో అరాచకం, మారణహోమం సృష్టించే పాలన నడుస్తోంది. ఎన్నికలప్పుడు  చంద్రబాబునాయుడు ఏం మాటలు చెప్పారో, ప్రజలను ఎలా మోసం చేస్తూ ఓట్లు వేయించుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రశ్నించకూడదనే ఆలోచనతో భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తున్నారు. 

ఎన్నికలప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు క్యాంపెయిన్‌ చేస్తూ చిన్న పిల్లలు కన్పిస్తే చాలు ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు’ అని చెప్పి ప్రలోభ పెట్టారు. అక్క చెల్లెమ్మలు కన్పిస్తే ‘ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు సంతోషమేనా?’ అని అడిగారు. నిరుద్యోగి కన్పిస్తే ‘రూ.3 వేల నిరుద్యోగ భృతి సంతోషమా?’ అని.. రైతులు కన్పిస్తే ‘మీకు రూ.20 వేలు సంతోషమా?’ అని అడిగారు. ఇలాంటి ఆలోచనలు, మాటలతో ఇంటింటికీ టీడీపీ శ్రేణులను పంపించి చంద్రబాబు ప్రచారం చేయించారు. 

ఎన్నికల తర్వాత చిన్న పిల్లలను మోసం చేశారు. అదే జగనన్న ఉండి ఉంటే ఇప్పటికే రూ.15 వేలు అమ్మ ఒడి అంది ఉండేది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామం పెట్టారు. వ్యవసాయ సీజన్‌ మొదలైంది. రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తున్నారు. జగన్‌ ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము అందేది. ఆ సొమ్మూ పోయింది. చంద్రబాబు ఇస్తామన్న రూ.20 వేలు పోయింది. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని చెప్పి అడ్డగోలుగా మోసం చేశాడు.

జగనే ఉండి ఉంటే ఈ పథకాలు రావడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద ఫీజులు కూడా కట్టేవాడు. ఇవి కూడా ఇవ్వకుండా, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడు. ఇలా రైతులు, చిన్న పిల్లలు, అక్క చెల్లెమ్మలు అందరినీ మోసం చేశారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు.. రోడ్డుపైకి రాకూడదు.. నిలదీయకూడదు.. అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు.  

దారి పొడవునా ఘన స్వాగతం  
ఉదయం 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఓర్వకల్లు మీదుగా హుస్సేనాపురం, తమ్మరాజుపల్లె, పాణ్యం డొంక, బలపనూరు, వెంకటేశ్వరపురం, టోల్‌గేట్, నంద్యాల బైపాస్, అయ్యలూరి మెట్ట, నందిపల్లె మీదుగా సీతారామాపురం చేరుకున్నారు. ఓర్వకల్లు నుంచి సీతారామాపురం చేరుకోవడానికి మామూలుగా గంట పడుతుంది. అలాంటిది అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తడంతో 5 గంటలకు పైగా పట్టింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ 3.20 గంటలకు సీతారామాపురం చేరుకున్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, ఇసాక్, ఎమ్మెల్యే విరూపాక్షి, జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, మేయర్‌ బీవై రామయ్య, మాజీ ఎంపీలు పోచా బ్రహా్మనందరెడ్డి, బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్‌ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement