చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య కేసును పట్టించుకోని సర్కారు
నిందితుల ఆచూకీ కనుక్కోవడంలో అంతులేని నిర్లక్ష్యం
జగన్ వస్తున్నారనగానే సర్కారు హడావుడి
మంత్రుల పర్యటన.. నిందితులు దొరికినట్లు ప్రకటన
ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం హైడ్రామా
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు.
వస్తూనే.. నిందితులు దొరికినట్లు ప్రకటించేశారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని కాగితాలు తగలబడినట్లు తెలియగానే హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో డీజీపీని, అధికారులను అక్కడికి పంపించి గంట గంటకు సమీక్ష చేసిన∙ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు... పుంగనూరులో చిన్నారి కిడ్నాప్.. ఆపై హత్య ఘటన అంత ప్రాధాన్యత కలిగినదిగా కనిపించలేదు. కనీసం ఈ ఘటన జరిగిన ఎనిమిదో రోజు వరకు∙స్పందించాలని కూడా ఆయనకు అనిపించలేదు.
కానీ, మాజీ సీఎం పరామర్శకు వస్తున్నారని తెలియగానే పెద్ద హైడ్రామాకు తెరతీశారు. ఒక్కసారిగా ముగ్గురు మంత్రులను పుంగనూరు పంపారు. బాలిక తండ్రిని ఆయన ఫోన్‌లో పరామర్శించారు. తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ నిస్సిగ్గుగా ఈ ఘటనను కూడా తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. బాలిక కిడ్నాప్, హత్య గురించి ప్రశ్నించిన ప్రతిపక్షంపై పుంగనూరులో మంత్రులు అడ్డగోలు ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం.
హడావుడిగా ముగ్గురు మంత్రులు ప్రత్యక్షం..
నిజానికి.. చిన్నారి అంజుమ్ గత నెల 29న కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్నామని చెప్పినప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో ఈ నెల 2న బాలిక విగతజీవిగా కనిపించింది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులూ ధ్రువీకరించారు. అయితే, హత్యకు గల కారణాలు, నిందితుల గురించి విచారిస్తున్నామని అప్పట్లో వారు చెప్పారు.
కానీ, రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతోపాటు నిందితుల ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9న పుంగనూరు రానున్నారని తెలియడంతో ముగ్గురు మంత్రులు ఆదివారం హడావుడిగా పుంగనూరులో ప్రత్యక్షమయ్యారు.
కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు ప్రకటించారు. దీంతో ఎనిమది రోజులుగా కనిపించని నిందితులు మాజీ సీఎం వస్తున్నారనే సరికి దొరికిపోయారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారు?
ఇక కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల చిన్నారి ఆచూకీని కనిపెట్టలేని ప్రభుత్వం.. ఎనిమిది రోజుల తరువాత నిందితులను పట్టుకున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాలిక ఆచూకీ కోసం 12 బృందాలను ఏర్పాటుచేశామని వెల్లడించిన హోంమంత్రి.. అశ్వియను ప్రాణాలతో తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి.. చిన్నారి కిడ్నాప్ అయిన రోజు నుంచి ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. పైగా.. హత్యకు ముందు పట్టణ పరిధిలోనే చిన్నారిని దాచి ఉంచారనే ప్రచారం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా.. సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముగ్గురు మంత్రులు అనిత, రాంప్రసాద్‌రెడ్డి, ఫరూక్ పుంగనూరుకు చేరుకుని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా మాట్లాడించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే.. చిన్నారి ఎందుకు హత్యకు గురైందన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. వైఎస్ జగన్ పుంగనూరుకు వస్తే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే సీఎం, మంత్రులు హడావుడి చేస్తూ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment