సొంత పత్రం.. రోత నాటకం! | TDP Chandrababu Naidu Govt Fake Comments On YSRCP YS Jagan Govt, More Details Inside | Sakshi
Sakshi News home page

సొంత పత్రం.. రోత నాటకం!

Published Fri, Jul 26 2024 4:49 AM | Last Updated on Fri, Jul 26 2024 10:32 AM

TDP Chandrababu Govt Fake Comments On YSRCP YS Jagan Govt

నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు, వక్రీకరణలు

జగన్‌ క్యాంపు కార్యాలయం ఫర్నీచర్‌ ఫైల్‌ను నెల రోజులుగా తొక్కిపెట్టింది బాబే.. తీసుకెళ్లాలని పదేపదే చెబుతున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలు 

నెలన్నరగా సాగుతున్న దారుణాలు, నరమేధంపై మౌనం 

ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్‌ చేయడం కనపడలేదా? 

వైఎస్సార్‌సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు 

ఎన్‌సీఆర్‌బీ నివేదికలే తిరుగులేని నిదర్శనం 

గంజాయి నిర్మూలనకు ఆపరేషన్‌ పరివర్తన్, 11,500 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసింది గత సర్కారు కాదా బాబూ? 

దిశ యాప్‌ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత.. ఏకంగా 19 జాతీయ అవార్డులు  

జీరో ఎఫ్‌ఐఆర్, సచివాలయాల్లో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్‌ ప్రభుత్వం   

సాక్షి, అమరావతి: శాసనసభ వేదికగా సీఎం చంద్రబాబు మరోసారి తన కపట నాటకాన్ని ప్రదర్శించారు. శాంతి భద్రతలపై శ్వేతపత్రం ముసుగులో టీడీపీ రూపొందించిన ఓ కరపత్రాన్ని చదివి వినిపించారు. తాను ముఖ్యమంత్రిననే విషయాన్ని విస్మరించి టీడీపీ అధ్యక్షుడి పాత్ర పోషించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై నిస్సిగ్గుగా నిరాధార ఆరోపణలు, వక్రీకరణలతో సభను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కళ్లెదుటే పచ్చమూకలు యథేచ్ఛగా సాగిస్తున్న హత్యలు, విధ్వంస కాండపై మౌనముద్ర వహిస్తూ నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోనంటూ గాంభీర్యంగా ప్రకటించారు.

చంద్రబాబు ఆరోపణలు – వాస్తవాలు
వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దాడులు, మహిళలపై వేధింపులు అమాంతం పెరిగాయి. చంద్రబాబు కాకి లెక్కలతో చట్టసభను పక్కదారి పట్టించేందుకు యత్నించడం విస్తుగొలుపుతోంది. సర్కారు సొంత లెక్కలు ఎలా ఉన్నా దేశంలో ఏటా నేరాల వివరాలను వెల్లడించే జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు మాత్రం వాస్తవాలను కళ్లకు కట్టినట్లు వెల్లడిస్తున్నాయి. 2014–19 వరకు టీడీపీ హయాంతో పోలిస్తే 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ పాలనలో ఏపీలో అన్ని రకాల నేరాలు తగ్గాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు ప్రభుత్వాల పాలన చివరి ఏడాదిలో నేరాలు, దాడులు, ప్రమాదాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అధికారిక నివేదికలే నిదర్శనం.

వైఎస్సార్‌సీపీ హయాంలో గంజాయి, డ్రగ్స్‌ దందా విచ్చలవిడిగా పెరిగింది.
రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి దందాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసింది. గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా జరిగాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవోబీలో గంజాయి సాగును కూకటి వేళ్లతో పెకలించింది. రెండు దశల్లో నిర్వహించిన ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ ద్వారా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది.

మహిళల భద్రతలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విఫలమైంది. దిశ యాప్‌తో ప్రయోజనం లేదు.
మహిళా భద్రత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. దిశ మొబైల్‌ యాప్, దిశ పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం తదితర చర్యలతో నెలకొల్పిన వ్యవస్థలు మహిళల భద్రతకు గట్టి భరోసానిచ్చాయి. అందుకే దిశ యాప్‌ను ఏకంగా 1.56 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలు దిశ యాప్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా, ఫోన్‌ను షేక్‌ చేసినా నిమిషాల వ్యవధిలోనే సాయం అందించి పోలీసులు కాపాడిన ఘటనలు అనేకం ఉన్నాయి.  

2024 ఏప్రిల్‌ నాటికి యాప్‌ ద్వారా వచ్చిన 31,607 ఎస్‌వోఎస్‌ కాల్స్‌పై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు భద్రత కల్పించారు. దిశ యాప్‌ జాతీయ స్థాయిలో ఏకంగా 19 అవార్డులు సాధించడం మహిళల భద్రత పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. నేరం ఎక్కడ జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా తక్షణమే బాధితులకు భరోసా కల్పించి కేసులు నమోదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించి అక్క చెల్లెమ్మల భద్రత పట్ల అత్యంత శ్రద్ధ వహించారు.

చంద్రబాబుతో సహా టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టారు. వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నారు.
చంద్రబాబుపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయలేదు. 2014–19లో టీడీపీ సర్కారు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో నిధులు కొల్లగొట్టిన విషయాన్ని 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఏసీబీకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం తొక్కి­పెట్టింది. అనంతరం పుణేకు చెందిన ఓ సామా­జికవేత్త ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తేవడంతో సీఐడీ విచారణ మొదలైంది. 

నాడు ఏకంగా 13 చోట్ల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసి మరీ స్కిల్‌ నిధులు కొల్లగొట్టారని ఆధారాలతో నిరూపితమైంది. అందువల్లే సీఐడీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది. సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో చంద్రబాబు 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. అదే రీతిలో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు, అసైన్డ్‌ భూముల కుంభకోణాల్లో చంద్రబాబు పాత్రను  సీఐడీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.  ఇందులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అక్రమంగా వేధించడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.

వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును వైఎస్‌ జగన్‌ ప్రభావితం చేశారన్నది పూర్తి అవాస్తవం. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆ కేసును దర్యాప్తు చేస్తోందనే విషయాన్ని విస్మరించి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు.

కోడెలపై ఫర్నిచర్‌ దొంగతనం కేసు పెట్టారు. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఫర్నిచర్‌ను వెనక్కి ఇవ్వకున్నా పట్టించుకోలేదు.
స్పీకర్‌ కార్యాలయం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను కోడెల శివప్రసాద్‌ గుంటూరు లోని తమ కుటుంబానికి చెందిన ఆటోమొబైల్‌ షోరూమ్‌కు అక్రమంగా తరలించారు. అందుకే అప్పట్లో శాసన సభ స్పీకర్‌ ఆదేశాలతో పొలీ­సులు కేసు నమోదు చేశారు. కానీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఫర్నిచర్‌ను వైఎస్‌ జగన్‌ ఎక్కడికి తరలించుకుపోలేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జ్‌ రెండు సార్లు సాధారణ పరిపాలన శాఖ (జీ ఏడీ) ముఖ్య కార్యదర్శికి లేఖలు రాశారు. 

క్యాంపు కార్యాల­యంలో ఉన్న ఫర్నిచర్‌ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ జూన్‌ 15, 19వ తేదీల్లో రెండుసార్లు ఈ మెయిల్‌ ద్వారా లేఖలు పంపారు. అయినా సరే కూటమి ప్రభుత్వం స్పందించ లేదు. దాంతో జూలై 1న మరో లేఖ రాశారు. ఆ ఫర్నిచర్‌ను వెనక్కి అయినా తీసుకోండి.. లేదంటే ఆ ఫర్నిచర్‌ విలువ చెబితే ఆమేరకు డబ్బులు చెల్లిస్తా­మని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వమే ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక వైఎస్‌ జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పది దఫాలకుపైగా జీఏడీ ముఖ్య కార్యదర్శికి ఫోన్‌ చేసి ఆ ఫర్నిచర్‌ను వెనక్కి తీసు­కెళ్లాలని సూచించారు. అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు. ఇలా ఉంటే బాబు వక్రీకరించి బురదజల్లేందుకు యత్నించడం విడ్డూరంగా ఉంది. దీని వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. 

ఇంతకీ ఆ కుట్ర ఏమిటంటే... 
ఫర్నిచర్‌ను తీసుకెళ్లాలని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జీ పంపిన లేఖపై జీఏడీ అధికారులు సమీక్షించారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సలహా కోసం సంబంధిత ఫైల్‌ను ఆర్థిక శాఖ పరిశీలనకు పంపారు. దాన్ని పరి­శీలించిన ఆర్థిక శాఖ.. ముఖ్యమంత్రి కార్యా­లయం అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిం­చింది. 

ఈ నేపథ్యంలో ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి చంద్ర­బాబు కార్యాలయానికి పంపింది. సంబంధిత ఫైల్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో నెల రోజులుగా పెండింగ్‌లో ఉంది. అంటే ఆ ఫర్ని­చర్‌ను వెనక్కి తీసుకెళ్లడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చంద్ర­బాబు కార్యాల­యమే ఉద్దేశ­పూర్వకంగా జాప్యం చేస్తోందని స్పష్టంగా తెలు­స్తోంది. 

చంద్రబాబే ఉద్దేశపూర్వకంగా ఆ ఫైల్‌ను తొక్కి పెట్టారు. మరో­వైపు శాసనసభ వేదికగా వైఎస్‌ జగన్‌పై అసత్య ఆరో­పణలు చేస్తున్నారు. దుష్ప్రచారం కుట్రతో దిగ­జారుడు రాజకీయా­లకు పాల్పడు­తున్నారు. చంద్ర­బాబూ...!  ఇప్ప­టి­కైనా సరే సీఎంమ స్థాయికి తగ్గ­ట్టుగా హుం­దాగా వ్యవహరించండి.  శాసనస­భలో మంది బలాన్ని చూసుకుని అడ్డగోలు ఆరో­పణలు చేయాలనే మీ కుట్రలను సమర్థంగా తిప్పికొడతాం అని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

దేశమంతా నిరసిస్తున్నా పట్టదా?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న నరమేధం,దమనకాండపై మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపలేదు. శ్వేతపత్రం పేరుతో వైఎస్సార్‌సీపీ సర్కారుపై బురద చల్లడం మినహా తన హయాంలో కొనసాగుతున్న మారణహోమంపై స్పందించాలనే ధ్యాసే లేకుండా వ్యవహరించారు. నెలన్నరలో 36 హత్యలు, 20 అత్యాచారాలు, వెయ్యికిపైగాగా దాడులతో రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 

తాజాగా వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో ఆ మారణహోమం ఫోటోలు, వీడియోలను పరిశీలించిన వివిధ జాతీయ పార్టీ నేతలు నివ్వెరపోయారు. దేశమంతా దీన్ని తీవ్రంగా ఖండించి నిరసిస్తున్నా సీఎం చంద్రబాబు శాసనసభలో కనీసం స్పందించకపోవడం ద్వారా టీడీపీ రౌడీ మూకల దమనకాండకు వత్తాసు పలికినట్లు స్పష్టమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement