ఫిబ్రవరి 14న వన్‌బిలియన్ రైసింగ్
Published Sat, Oct 22 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
కోటి గొంతుకలొక్కసారి గర్జిస్తాయ్
హైదరాబాద్ : స్త్రీ, పురుష సమానత్వం కోసం, మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా, స్త్రీలపై జరిగే అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా మొత్తంగా పురుషాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న జరిగే వన్‌బిలియన్ రైసింగ్ కార్యక్రమంలో మహిళలంతా భాగం కావాలని అంతర్జాతీయ ఫెమినిస్ట్, వన్‌బిలియన్ రైసింగ్ ఇండియా కోఆర్డినేటర్ కమలా భాసిన్ పిలుపునిచ్చారు. అర్బన్ యాక్షన్ స్కూల్ నిర్వహించిన ఫెమినిస్ట్ వర్క్‌షాప్ కి హాజరైన కమలాభాసిన్ యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భేటీ బచావో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 207 దేశాల్లో ఫిబ్రవరి 14వ తేదీన వందకోట్లమంది మహిళల పక్షాన కోట్లాది గొంతుకలొక్కసారి స్త్రీ విముక్తి కోసం గర్జిస్తాయని తెలిపారు. 2013లో వన్‌బిలియన్ రైసింగ్ పేరుతో ప్రారంభమైన ఈ అంతర్జాతీయ మహిళా పోరాటం వరుసగా ఐదేళ్ళనుంచి కొనసాగుతోందని వివరించారు. అణచివేతకు, వివక్షకు గురవుతోన్న దళితులు, ఆదివాసీలు, మైనారిటీలతో కలిసి స్త్రీ విముకి పోరాటాన్ని కొనసాగించడమే మహిళా ఉద్యమాల ముందున్న తక్షణ కర్తవ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తమ యుద్ధం పురుషులకు వ్యతిరేకంగా కాదని, పురుషాధిపత్యభావజాలానికి వ్యతిరేకంగానే అని స్పష్టం చేశారు. ఢిల్లీ అత్యాచారాలకు రాజధానిగా చెపుతున్నారని, కానీ అత్యాచారాల పై వెల్లువెత్తిన ఉద్యమాలకు ఢిల్లీ కేంద్రమని స్పష్టం చేశారు.
ఢిల్లీ యువతులపై జరిగిన అత్యాచారాలపై వెల్లువెత్తిన ప్రజానిరసన, యువతరం స్ఫూర్తేనన్నారు. అందుకే సమానత్వాన్ని కాంక్షించే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని స్త్రీల హక్కులకోసం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. అంతిమంగా పెట్టుబడీదారీ విధానం, పితృస్వామ్యం, మతం సంకెళ్ళను తెంచుకోకుండా స్త్రీ విముక్తి అసాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. బేటీ బచావో కార్యక్రమ నిర్వాహకురాలు కల్పన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రుక్మిణీ రావ్, ఆశాలత, సుధ, సజయ, ఆంజనేయులు, కొండవీటి సత్యవతి, రచయిత విమల, షాహీన్ జమీలా తదితర మహిళా ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement