ఆకాశ్‌ బొబ్బ.. వీడు మాములోడు కాదు! | Who is Akash Bobba Why Elon musk Choose Indian Origin For DOGE | Sakshi
Sakshi News home page

మస్క్‌ టీంలో ఆకాశ్‌ బొబ్బ.. వీడు మాములోడు కాదు!

Published Tue, Feb 4 2025 4:47 PM | Last Updated on Tue, Feb 4 2025 5:03 PM

Who is Akash Bobba Why Elon musk Choose Indian Origin For DOGE

ఆకాశ్‌ బొబ్బ.. ఎవరీ కుర్రాడు? ఇప్పుడు ఇంటర్నెట్‌ అంతా అతని గురించే వెతికే పనిలో ఉంది. ఇలాన్‌ మస్క్‌ నేతృత్వంలో నడవబోయే యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌)  విభాగంలో ఈ భారత సంతతికి చెందిన కుర్రాడికి చోటు దక్కింది. అందుకే అతని గురించి ఆరా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు.

అకాశ్‌ బొబ్బ(Akash Bobba).. 22 ఏళ్ల యువ ఇంజినీర్‌. డోజ్‌ నిర్వహణ కోసం మస్క్‌ ఆరుగురు యువ ఇంజినీర్లను ఎంచుకోగా.. అందులో ఆకాశ్‌ ఒకడు. అయితే డోజ్‌కు ఇతన్ని మస్క్‌ ఎంచుకున్నాడని తెలియగానే.. లింక్డిన్‌ సహా ఎక్కడా అతని గురించి సమాచారం లేకుండా చేశారు. కానీ, ఈలోపే సిలికాన్‌ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో అతని ప్రయాణం గురించి బయటకు వచ్చేసింది.

కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్‌, ఎంట్రాప్రెన్యూర్‌షిప్‌, టెక్నాలజీ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్‌ చేశాడు ఆకాశ్‌. ఆపై మెటాలో ఏఐ మీద, పలాన్‌టిర్‌లో డాటా అనలైటిక్స్‌ మీద, బ్రిడ్జ్‌వాటర్‌ అసోషియేట్స్‌లో ఫైనాన్షియల్‌ మోడలింగ్‌ మీద ఇంటర్న్‌ చేశాడు. అయితే అతని పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్నా.. ఆ మాజీ క్లాస్‌మేట్‌ ఒకరు పంచుకున్న విషయం ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది. 

కాలేజీ రోజుల్లో బృందంలోని సభ్యుడి తప్పిదంతో ప్రాజెక్టు మొత్తం డిలీట్‌ అయ్యిందట. సమయం పెద్దగా లేకపోవడంతో బృందం మొత్తం కంగారుపడుతోందంట. ఆ టైంలో .. ఆ రాత్రి రాత్రే సోర్స్‌ కోడ్‌ను ఉపయోగించకుండానే తిరిగి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని .. అంతకు ముందు కంటే బెటర్‌గా రూపొందించాడు ఆకాశ్‌. ఆ టైంలో అతని కోడింగ్‌ సామర్థ్యం చర్చనీయాంశమైందని అతని స్నేహితుడు చెబుతున్నారు . 

ప్రభుత్వ ఖర్చులున గణనీయంగా తగ్గించేందుకు ఇలాన్‌ మస్క్‌(Elon Musk) సారథ్యంలో ఏర్పాటైందీ విభాగం.  డోజ్‌లో కీలక బాధ్యతల కోసం ఆకాశ్‌తో ఆరుగురిని మస్క్‌ ఎంచుకున్నాడు. అయితే ఆకాశ్‌ తల్లిదండ్రులెవరు? భారతీయ మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాళ్లంతా 19-24 ఏళ్లలోపు కుర్రాళ్లే. అందులో ఓ విద్యార్థి సైతం ఉన్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం.. అందునా కీలకమైన బాధ్యతలకు ఏమాత్రం అనుభవం లేనివాళ్లను ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. యూఎస్‌ ఎయిడ్‌ నుంచి కీలక సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారంటూ డోజ్‌ సిబ్బందిపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇక.. ఇలాన్‌ మస్క్‌ తీసుకున్న నిర్ణయాలు అంతిమం కాదని, వాటికి తమ అనుమతి తప్పనిసరి అని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రకటించడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement