సాక్షి, గుంటూరు: ఏపీలో టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ మాటలేనని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై స్పందించారు. ఈ క్రమంలో అంబటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి మా బలం 33 మంది కార్పొరేటర్లు. ప్రలోభాలకు గురి చేసి కొంత మందిని చేర్చుకున్నారు. దీంతో మాకు 28 వాళ్ళకు 28 కార్పొరేటర్ల మద్దతు ఉంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం మమ్మల్ని తీవ్రంగా కలిచి వేసింది. నలుగురు కార్పొరేటర్లు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి.
టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు. తిరుపతిలో కిడ్నాప్ చేసి, దాడి చేసి, ప్రలోభాలకు గురి చేసి పార్టీ మార్చుకున్నారు. గుంటూరు కార్పోరేషన్‌లో అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నాం. అవిశ్వాస తీర్మానానికి భయపడం.. ఎదుర్కొంటాం. చంద్రబాబు అన్ని దొంగ మాటలు చెబుతున్నారు. తిరుపతిలో ఒక్క సీటు గెలిచిన జనసేన ఎలా డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. పవన్ తన నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చొన్నాడు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి పవన్ కల్యాణ్. రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ప్రోత్సహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ వీడాలి’ అని హితవు పలికారు.
నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో, కార్పోరేషనుల్లోనూ అవిశ్వాసం పెట్టడానికి సిద్దమవుతున్నారు. కార్పోరేషన్‌లలో వెలుగు చూసిన బుడమేరు స్కాంపై పోరాటం చేస్తాం. పెమ్మసానికి నేనెప్పుడూ ఫోన్ చేయలేదు. కష్టపడి సంపాదించాడు. ఆయన చాలా గొప్పవాడు. స్థాయి సంఘం ఎన్నికల్లో స్థాయి తగ్గించుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్ల కోసం వేటాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు, మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ..‘కార్పోరేషన్‌లో వైఎస్సార్‌సీపీకి మెజారిటీ ఉన్నా స్టాండింగ్ కమిటీలోని ఆరు స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇదేదో అతి పెద్ద విజయం అన్నట్లు కూటమి నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఖాళీ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. 2014లో వైఎస్సార్‌సీపీకి 63 సీట్లు వస్తే.. 2019లో 151 సీట్లు వచ్చాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది.. దీనిపై సమీక్ష చేస్తాం. నేను చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు’ అని స్పష్టంచేశారు.
అలాగే, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ..‘లోపాయికారీ ఒప్పందంతో కొంతమంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. మాతో పాటే ఉంటూ కొంత మంది వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిని ఉపేక్షించం. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీ నేతలకు అలవాటు. మేము ప్రజల కోసం మాత్రమే పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment