నెవర్ అగైన్.. దేశంలో ఎక్కడ ఏ మహిళపై ఏ నేరం జరిగినా ప్లకార్డ్ మీద కనిపించే స్లోగన్! కానీ ఆ నేరాలూ అగైన్ అండ్ అగైనే.. ఈ ప్లకార్డూ అగైన్ అండ్ అగైనే! లేకపోతే నిర్భయ ప్రజాగ్రహానికి పార్లమెంట్ దద్దరిల్లి.. ప్రత్యేక చట్టం, మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక ఫండ్, హెల్ప్ లైన్స్, అలర్ట్ యాప్స్.. ఎన్ని వచ్చాయి! అయినా కోల్‌కతా ఆర్జీ కర్ దారుణం జరిగింది.. మనమంతా మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది.
పనిచేసే చోటే డాక్టర్ లైంగిక దాడికి.. హత్యకు గురైంది. దోషి సంజయ్ రాయ్ అనే వలంటీరని తేల్చిన సియల్దా జిల్లా సెషన్స్ కోర్ట్ అతనికి జీవిత ఖైదు విధించింది. ఇలాంటివి జరిగినప్పుడల్లా అల్టిమేట్ శిక్షలను చేర్చుకుంటూ చట్టాలను మార్చుకుంటున్నాం! అయినా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో హెచ్చరిస్తూనే ఉంది ఏ ఏటికా ఏడు మహిళలపై పెరుగుతున్న నేరాలతో! కారణం మనం విక్టిమ్‌కే సుద్దులు చెబుతున్నాం.
విక్టిమ్‌కే హద్దులు పెడుతున్నాం. విక్టిమ్‌నే బ్లేమ్ చేస్తున్నాం! అంటే నేరాన్ని ప్రేరేపించే భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాం! ఆ సుద్దులేవో అక్యూజ్డ్‌కి చెప్పడం మొదలుపెడితే, తన హద్దులేంటో అక్యూజ్డ్ గుర్తించేలా చేయగలిగితే, అమ్మాయి అంటే సెక్సువల్ ఆబ్జెక్ట్ కాదు, వ్యక్తిత్వమున్న తనలాంటి మనిషే అనే అవగాహన కల్పించగలిగితే... నెవర్ అగైన్ ప్లకార్డ్ అవసరం రాదు!
శిక్షల మీద మొమెంటరీ కామెంట్స్‌కి స్పేస్ ఉండదు! మహిళ హాయిగా పనిచేసుకుంటుంది. ఎన్‌సీఆర్‌బీ ఆశ్చర్యపోతుంది. ఆర్జీ కర్ డాక్టర్ సంఘటనలో కోర్టు జీవితఖైదు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శిక్ష సరే మహిళకు రక్షణేది అంటూ తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు.
ఒక్కటి నెరవేరక పోయినా..
ఆర్జీ కర్ సంఘటన తర్వాత ఆ హాస్పిటల్లోని జూనియర్ డాక్టర్లు నిరహార దీక్ష చేశారు. సీసీటీవీ కెమెరాలు, ట్రాన్స్‌పోర్టేషన్, వాష్ రూమ్స్, ఇంటర్నల్ కంప్లయింట్ సెల్ వంటి వాటికోసం డిమాండ్ చేశారు. అవన్నీ నేరవేరాయో లేదో తెలియదు. ఒక్కటి నేరవేరకపోయినా ఉద్యమించాల్సిందే. మళ్లీ ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండటానికి! ఇక నేరస్థుడి శిక్ష విషయానికి వస్తే సంజయ్ రాయ్ నిజంగా దోషే అయితే అతనికి శిక్ష అవసరమే! అది అతనిలో పరివర్తన తీసుకురావాలి. అందులో అనుమానమే లేదు. అయితే అంతకన్నా ముందు అలాంటి నేరాలను ప్రేరేపించే పురుషాధిపత్య భావజాలాన్ని రూపు మాపాలి. ఆ మార్పు కోసం అందరం పాటుపడాలి.
– బి. జ్యోతి, రాష్ట్ర కన్వీనర్, చైతన్య మహిళా సంఘం.
రియాక్షన్స్ మాత్రమే ఉంటాయి
ఆర్జీ కర్ కేస్ జడ్జిమెంట్ రాగానే దోషికి డెత్ పెనాల్టీ విధించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్షణికావేశాలు, కోపాల వల్లే లాంగ్ టర్మ్ సొల్యుషన్ వైపు వెళ్లనివ్వకుండా మహిళా భద్రత, రక్షణ విఫలమవుతూ వస్తోంది. మన దగ్గర నివారణ చర్యలుండవు. రియాక్షన్సే ఉంటాయి. న్యాయం కోసం పోరాడేవాళ్లనే వేధిస్తుంటారు. నేరస్థులను పూజిస్తారు. మ్యారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించడాన్ని ప్రభుత్వాలే అడ్డుకుంటున్నాయి. ఇక ట్రాన్స్ విమెన్‌పై జరిగే నేరాలనైతే నేరాలుగానే చూడట్లేదు. మార్పును మతం మీదో, సంస్కృతి మీదో దాడిలాగా చూస్తున్నంత కాలం ఈ నేరాలు ఆగవు. నేరం జరిగిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి శిక్షలు పడాలి అని కాకుండా అసలు నేరాలు జరగకుండా ఏం చేయాలి, ఎలాంటి సిస్టమ్స్‌ను డెవలప్ చేయాలనే దాని మీద దృష్టిపెట్టాలి. ప్రాథమిక స్థాయిలోనే జెండర్ సెన్సిటైజేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ మొదలవ్వాలి. సమానత్వం, పరస్పర గౌరవం, కన్‌సెంట్ గురించి పిల్లలకు నేర్పాలి.
– దీప్తి సిర్ల, జెండర్ యాక్టివిస్ట్
తల్లిదండ్రులే కల్పించాలి
పైశాచికంగా ప్రవర్తించిన ఒక వ్యక్తికి న్యాయస్థానం సరైన శిక్షనే విధించింది. స్త్రీ–పురుష సమానత్వం, స్త్రీల మీద గౌరవం లేకనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంతటా ఇలాంటి పరిస్థితే! సామాజిక మార్పే దీనికి పరిష్కారం. స్త్రీ–పురుషులు ఇద్దరూ సమానమనే అవగాహన వస్తే స్త్రీల పట్ల పురుషులకు గౌరవం ఏర్పడుతుంది. తల్లిదండ్రులే ఆ అవగాహన కల్పించాలి.
– డా.రుక్మిణీరావు, సామాజిక కార్యకర్త
ఆ ప్రయత్నం లేకపోతే రక్షణ ఎండమావే!
సంజయ్ రాయ్‌కి పడిన శిక్ష గురించి అసంతృప్తి వినిపిస్తోంది మరణ శిక్ష విధిస్తే బాగుండేదంటూ! రేప్ చేసిన వాళ్లను ఎన్‌కౌంటర్ చేసిన దాఖలాలున్నాయి. లైంగిక
దాడులు, హత్యలు ఆగలేదే! దీన్ని బట్టి పురుషాధిపత్య సమాజానికి సైకలాజికల్ ట్రీట్‌మెంట్ అవసరమని అర్థమవుతోంది. విచ్చలవిడి శృంగారం, క్రైమ్ సినిమాలు, డ్రగ్స్‌ను కట్టడి చేయాలి. మహిళలను సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూసే తీరును సంస్కరించాలి. మగపిల్లలకు చిన్నప్పటి నుంచే జెండర్ సెన్సిటివిటీని బోధించాలి. ఇందుకోసం పౌర సంస్థలు, విద్యావంతులు, ఎన్జీవోలు ఉద్యమించాలి. ఈ ప్రయత్నం లేకుండా ఎంతటి కఠిన శిక్షలు విధించినా మహిళా రక్షణ ఎండమావే! కార్యాచరణ మహిళా భద్రత, రక్షణ లక్ష్యంగా ఉండాలి తప్ప శిక్షల ధ్యేయంగా కాదు!
– జూపాక సుభద్ర, రచయిత్రి, అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ రిటైర్డ్
నేరాలు పుట్టకుండా ఆపాలి
శిక్ష ఉద్దేశం నేరాన్ని తొలగించడం కానీ నేరస్థుడిని కాదు. ఇక్కడ మనం నేరస్థుడి గురించే మాట్లాడుతున్నాం. కానీ నేరం జరగకుండా ఉండే వాతావరణ కల్పన గురించి ఆలోచించట్లేదు. చర్చించట్లేదు. మాట్లాడట్లేదు. నేరస్థుడిని శిక్షించడం ఒక ఎత్తు. మరోవైపు మహిళల పట్ల జరుగుతున్న నేరాలను నిరోధించగలగాలి, నేరాలు పుట్టకుండా ఆపగలగాలి, నేరప్రవృత్తి ప్రబలకుండా చేయగలగాలి. ఇది సమాజం బాధ్యత. అయితే లోపమెక్కడంటే.. నువ్విలా ఉండు, ఇలా నడుచుకో అంటూ విక్టిమ్‌నే డిక్టేట్ చేస్తున్నాం. ఆర్డర్ వేస్తున్నాం. అక్యూజ్డ్‌ని అడ్రస్ చేయం. ఈ ఆలోచనలో, ఆచరణలో మార్పు రావాలి. పురుషుడి లైంగిక స్వేచ్ఛకి హద్దులున్నాయని నేర్పాలి. మగ పిల్లలకు జెండర్ కాన్షస్ కల్పించాలి. మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత రావాలి. ఇవన్నీ సాధ్యమైతేనే స్త్రీలపై జరిగే నేరాలు తగ్గుతాయి.
– జహా ఆరా, సీనియర్ అడ్వకేట్, విశాఖపట్టణం
పెద్ద తలకాయల కుట్ర
ఆర్జీ కర్ కేస్ ఒక వ్యవస్థాగత హత్య. ఆ దారుణానికి పాల్పడిన నేరస్థుల్లో సంజయ్ రాయ్ ఒకడు తప్ప కేవలం అతనొక్కడే నేరస్థుడు కాదు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక కూడా చెప్పింది.. మల్టిపుల్ డీఎన్‌ఏ ఆనవాళ్లున్నాయని తేల్చి! అందుకే సంజయ్ రాయ్ ఒక్కడికే శిక్ష పడటం పట్ల అంతటా అసంతృప్తి కనపడుతోంది. ఇందులో రూలింగ్ పార్టీ ఇన్‌వాల్వ్ అయినట్టు తోస్తోంది. బాధిత కుటుంబాన్ని రకరకాలుగా మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాలే అందుకు నిదర్శనం. అసలు నేరస్థులు వెలుగులోకి రాకుండా సాక్ష్యాలను మాయం చేయడం, ఒక్కడినే దోషిగా నిలబెట్టడం వంటివన్నీ చూస్తే నిజంగా దీని వెనక పెద్ద తలకాయలున్నట్లు, వాళ్లే ఈ నేరానికి కుట్ర పన్నినట్టు అనిపిస్తోంది.
– మోక్ష, నటి
ప్రధాన సమస్య
ఖైదీకి ఉరి శిక్ష నుంచి లైఫ్ పడిందంటే దీని వెనకాల ఎంత మంది ప్రమేయం ఉందో! ఇది దోషిని బతికించే ప్రయత్నమే. మెడికల్ కాలేజీలలో సెక్యూరిటీ అనేది ప్రధాన సమస్య. సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లందరికీ ఒక్కటే విశ్రాంతి గది ఉంటుంది. లేడీ డాక్టర్లు తెల్లవారు జామున రెండు–మూడు గంటలకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తే బోల్ట్ లేని ఆ గదిలోని పడుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ బ్లాక్‌లలో సెక్యూరిటీ ఉండదు.
లేడీ డాక్టర్లకు అనుకోని అవాంతరం ఎదురైనప్పుడు ఒక అలారం కోడ్ ఉంటే బాగుంటుంది. దానికి వెంటనే ఆ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు నైట్ షిఫ్టుల్లోనూ అమ్మాయిలు ధైర్యంగా పనిచేయగలుగుతారు. అప్రమత్తంగా ఉండాల్సిన విషయాల పట్ల అమ్మాయిలకు అవగాహన పెంచాలి.
– డాక్టర్ మనోరమ, గైనకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment