![Sakshi Special Story About Female radio jockeys](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Keerthi-RJ.jpg.webp?itok=RrIFSGCC)
వరల్డ్ రేడియో డే
రేడియో లేడీస్
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్‌ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్‌తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
క్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదు
నచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్‌కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం.
ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్‌గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్‌ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను.
– ఆర్‌జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణి
నవరసాలు గొంతులో పలికించాలి
రేడియో (Radio) అనగానే క్యాజువల్‌గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్‌పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్‌గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను.
ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్‌తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్‌లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి.
– ఆర్‌జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియో
నన్ను నేను మార్చుకున్నాను
ఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్‌సిటీస్ అని రెయిన్‌బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్‌డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్‌గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.
– ఆర్‌జె కృష్ణ కీర్తి, వివిధభారతి
ఉన్నతంగా తీర్చిదిద్దింది
ప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్‌ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని చేసింది. యాంకర్‌గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది.
– ఆర్‌జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియో
ప్రతిరోజూ హుషారే!
నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్‌కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్‌జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.
అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్‌ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్‌లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్‌జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది.
– ఆర్‌జె స్వాతి, రేడియో మిర్చి
రేడియోతో ప్రేమలో పడిపోయా!
‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో.
– ఆర్‌జె సునీత, రేడియో సిటీ
చదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?
క్రమశిక్షణ నేర్పించింది
చిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్‌కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్‌ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్‌లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్‌లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో.
– ఆర్‌జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో
Comments
Please login to add a commentAdd a comment