![2025 Valentines Day Love Horoscope..Sakshi Special](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/valenta.jpg.webp?itok=zhIzXUdk)
వాలెంటైన్స్ వాణి
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే
జన్మ జాతకం ఎలా ఉన్నా ప్రేమ జాతకం బాగుంటే మంచి ఆత్మిక భాగస్వామి దొరుకుతారు. సవాళ్లు విసిరే జీవితంలో ప్రేమ నిండిన బంధం చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ వారిని ఉత్సాహంగా ముందుకు నడవడానికి కారకం అవుతుంది. జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. సౌరమానం ప్రకారం ఆ రోజు దిన ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఫలితాలు సంవత్సరమంతా ప్రభావం చూపిస్తాయి...
మేషం (21 మార్చి–19 ఏప్రిల్)
ఈ రాశి వారికిప్రాకృతిక శక్తి సహకరిస్తుంది. అంగారక గ్రహ ప్రభావం వలన ప్రేమ వృద్ధి చెందుతుంది. వీరు తాము ప్రేమించినవారి కోసం ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్ ఏర్పాటు చేసి వారి మన్ననలు అందుకుంటారు. చాలా రొమాంటిక్ గా కాలం గడుస్తుంది. ఈ రాశి ప్రేమికులు ఈ సంవత్సరం దంపతులవుతారు. దంపతులుగా ఉన్నవారు తల్లిదండ్రులవుతారు.
వృషభం (20 ఏప్రిల్– 20 మే)
శుక్ర గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు పెరుగుతాయి. ప్రేమించిన వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు అధికమవుతాయి. స్థిరపడుతాయి. ప్రేమ విషయంలో కొత్త విధానాలు అవలంబిస్తారు. ఆ కొత్త విధానాల వలన ప్రేమ సఫలీకృతం అవుతుంది. పెద్దలు మీ ప్రేమను అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మంచి జీవితాన్ని గడుపుతారు.
మిథునం (21 మే– 20 జూన్)
బుధ గ్రహ ప్రభావం వల్ల మీరు ప్రేమించిన వారి పట్ల ప్రేమను సూటిగా చక్కగా అర్థవంతంగా తెలుపగలుగుతారు. మీ మాటలకు మీరు ఇష్టపడినవారు ప్రభావితులవుతారు. మిథునం అంటేనే జంట, ఈ సంవత్సరం ప్రేమికుల జంట పంట పండినట్టే. ఆదర్శమైన జంటగా పేరు పొందుతారు.
కర్కాటకం (21 జూన్– 22 జూలై):
చంద్ర గ్రహప్రభావం వల్ల మీలో ప్రేమాభిమానాలు ఉప్పొంగి మీ ప్రేమికుల పట్ల సుహృద్భావం కలిగిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో తెగిన బంధాలు ఇప్పుడు అతుకుతాయి.
సింహం (23 జూలై– 22 ఆగస్టు)
సూర్యగ్రహ ప్రభావం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించినవారికి ఆకర్షించగలుగుతారు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. మీ ప్రేమను స్పష్టంగా తెలియజేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు తిరుగు ఉండదు. అన్నిటిలో విజయమే లభిస్తుంది. మీ ప్రేమ ఫలిస్తుంది.
కన్య (23 ఆగస్టు– 22 సెప్టెంబర్)
ఆత్మ పరిశీలన చేసుకొని సంబంధ బాంధవ్యాలను విశ్లేషిస్తారు. మీ భావాలను బాగా తెలియజేస్తారు. ప్రేమికుల మధ్య బంధాలు బలపడతాయి. ఈ సంవత్సరం మీకు మహోన్నతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. చేతిలో ధనం బాగా నిలుస్తుంది. దైవబలం మీకు తోడుగా ఉంది.
తుల ( 23 సెప్టెంబర్- 22 అక్టోబర్)
శుక్ర గ్రహ ప్రభావం వల్ల ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాల సమతుల్యత పెరిగి ప్రేమ వికసిస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్‌లు తగ్గుతాయి. ప్రేమికులు సామరస్యంగా ఉంటారు. ప్రేమలోను, వ్యాపార రంగంలోను మీదే పైచేయి అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరంప్రారంభించి లాభాలు పొందుతారు.
వృశ్చిక (23 అక్టోబర్– 21 నవంబర్)
అంగారక ప్రభావం వల్ల ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. మీరు ప్రేమించిన వారిని ఈ రోజు మీరు అయస్కాంతంలా ఆకర్షిస్తారు. లోతైన ప్రేమ గొప్ప అనుభవాలను తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మీ కష్టాలు తొలగిపోయి, ఆనందం ఐశ్వర్యం లభిస్తాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు.
ధనుస్సు (22 నవంబర్- 21 డిసెంబర్)
గురు గ్రహ ప్రభావం వల్ల మీలో ఆశావాదం పెరుగుతుంది. దాంతో సాహస ప్రవృత్తి పెరిగి అది ప్రేమించినవారిని ఆకర్షించి కట్టిపడేసేలా చేస్తుంది.. ఆనందం వెల్లివిరుస్తుంది. సింగిల్‌గా ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి ప్రేమైక భాగస్వామి తారసపడతారు. ఈ సంవత్సరం గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ప్రేమించిన వారి వల్ల మంచి జరుగుతుంది.
మకరం (22 డిసెంబర్–19 జనవరి)
శనిగ్రహ ప్రభావం వల్ల మీ ప్రేమ వ్యవహారం బలపడుతుంది. ప్రేమలో మీరు గతంలో ఇచ్చిన మాట, హామీలు నెరవేరుస్తారు. సింగిల్‌గా ఉన్నవారికి తగిన జోడు లభిస్తుంది. స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలు లాభం పొందుతారు. ఈ సంవత్సరం ఏలిననాటి శని తొలగి గొప్ప ఉన్నతిని సాధిస్తారు.
కుంభం (20 జనవరి– 18 ఫిబ్రవరి)
శుక్ర, యురేనస్ గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు ఉద్దీప్తమవుతాయి. మీలోని అసాధారణ శక్తి బంధాలను బలపరుస్తుంది. ప్రేమ విషయంలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. సింగిల్‌గా ఉన్నవారు సంప్రదాయేతర స్థలాలలో వింత పరిచయాలను ఎదుర్కొంటారు. ప్రేమికుల వల్ల ఈ సంవత్సరం మీకు వృత్తి పరంగా మంచి అవకాశాలు వచ్చి రాణిస్తారు.
చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
మీనం (19 ఫిబ్రవరి– 20 మార్చి)
నెప్ట్యూన్ ప్రభావం వల్ల అసాధారణ భావోద్వేగం మీ హృదయానికి సరైన దారి చూపిస్తుంది. ఈరోజు మీలో సున్నితమైన ప్రేమ సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం పెరిగి కలలు సాకారమవుతాయి. సింగిల్‌గా ఉన్నవారు అనుకోకుండా సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. ఎంతో కాలంగా ఉన్న అభిలాషలు ఈ సంవత్సరం తీరుతాయి. పది సంవత్సరాల వరకు మీకు తిరుగు ఉండదు.
– డా. మహమ్మద్
దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment