![Valentines week 2025 shopping in Hyderabad full details here](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Happy-Valentines-Day.jpg.webp?itok=qk_b0RM_)
హైదరాబాద్ నగరంలో వాలంటైన్స్ వీక్ హడావుడి
వాస్తవ రూపం దాల్చుతున్న ప్రేమికుల వారం
అధునాతన జీవనశైలికి ప్రతిబింబంగా ఈ తరం
సోషల్ మీడియా వేదికగా గిఫ్ట్స్ వీడియోలు వైరల్
పలు మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్లు, సెలిబ్రిటీల సందడి
వీచే చిరుగాలిని వెలివేస్తా..
పారే నదినావిరి చేస్తా..
నేనున్న నేలంతా మాయం చేశా
లేనేలేదే అవసరమే..
నువ్వే నాకు ప్రియవరమే..
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నువ్వైనా నమ్మవుగా
చెలియా నేనెవరంటూ
ఎవరూ గుర్తించరుగా
నా ప్రేమవు నువ్వంటూ
నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా
నువ్వుంటే నా జతగా అంటూ రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) అందించిన స్వరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ పాట వింటున్నప్పుడు ఎంత ఫీల్ ఉంటుందో.. ప్రేమికుల దినోత్సవానికి ముందు జరుపుకునే వాలంటైన్స్ వారంలో అంతటి ఫీల్ ఉంటుందని తెలుస్తోంది.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో హడావుడి చూస్తోంటే.. వ్యాపార వర్గాల మొదలుకుని పర్యాటక రంగం వరకూ వాలంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా అనేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు.. దీనికితోడు యువత హడావుడీ మామూలుగా లేదనేలా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు..
ఫిబ్రవరి నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వాలంటైన్స్ వీక్ (Valentine week) సందడి కనబడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే సందడి అన్నట్లుంది హడావుడి. అయితే ఈ వాలంటైన్ వీక్ కొత్తదేం కాదు.. ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రేమికుల వారం నగర సంస్కృతిలో మరింత భాగమైన సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వాలంటైన్స్ వీక్ సంబంధించిన పోస్టులు, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
యానిమేటెడ్, విఎఫ్‌ఎక్స్ వీడియోలు కాకుండా చాలమంది యువతరం స్వయంగా వీడియోలు చేసి నెట్టింట పెట్టడంతో వైరల్‌గా మారుతున్నాయి. దీనికి సంబంధించి వాలంటైన్ వీక్‌లో మొదటి రోజైన రోజ్ డే ప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ఓ ఫ్లవర్ బొకే షాపు యజమాని జలీల్‌తో ముచ్చటించగా.. ఈ నెల 6న చిన్న సైజు గులాబీ పువ్వుల కోసం చాల ఆర్డర్లు వచ్చాయని, అంతేకాకుండా రోజ్ డే అయిన 7వ తేదీన విడి రోజా పూలను అధిక సంఖ్యలో అమ్మానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా బొకేలు తప్ప విడిగా ఒక్కొక్క గులాబీ పువ్వులు అంతగా అమ్ముడుపోవు.. ఈ రోజ్ డే ప్రభావమే దీనికి కారణమని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
ప్రేమను పంచుకోవాలి కదా!
ఏళ్ల తరబడి వాలంటైన్స్ వీక్ అని చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప వాస్తవంగా అంతగా జరుపుకోలేదు. కానీ ప్రస్తుతం ఈ సంస్కృతి మెల్లమెల్లగా పెరుగుతోంది. చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇవ్వడం, హగ్ డే రోజు హగ్ చేసుకోవడం, ప్రపోజ్ డే రోజు కచ్చితంగా తమ ప్రేమను మళ్లీ ఒకసారి వ్యక్తపరచడం.. ఇలా ఈ తరం ‘ప్రేమికుల వారాన్ని’ స్వయంగా ఆస్వాదిస్తున్నారు. విదేశాల్లోనో, స్థానికంగానో ఉండి కలవడానకి వీలుకాని ప్రేమికులు.. డెలివరీ యాప్స్‌లో గులాబీ పూలను, చాక్లెట్లను ఆయా ప్రత్యేక రోజుల్లో తమ భాగస్వాములకు డోర్ డెలివరీ చేస్తుండటం విశేషం.
చదవండి: అంతా ప్రేమమయం...
ఇందులో భాగంగా వాలంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే, రోజ్ డే, చాక్లెట్ డే రోజున వీటి ఆర్డర్ల సంఖ్య నగరంలో భారీగా పెరిగిందని డెలివరీ సంస్థల యాజమాన్యాలు చెబుతున్న మాట. హగ్ డే, ప్రామిస్ డే వంటివి వర్చువల్ వేదికగా సరిపెట్టుకుంటున్నారు. తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఇచ్చిన ఈ గిఫ్టులకు మంచి లవ్ మెలోడీ ట్రాక్‌ని జోడించి వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టా పోస్టులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ వాలంటైన్స్ వీక్‌లో ప్రముఖ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలిబ్రిటీలు కూడా ఉండటం విశేషం.
ప్రేమికుల దినోత్సవం కోసం ప్యార్ బజార్..
వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ ఆన్‌లైన్ విపణి.. అమెజాన్ ‘ప్యార్ బజార్’ పేరిట సరికొత్త ఫ్యాషన్ ఉత్పత్తులు, ఫోన్ యాక్సెసరీలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ జహీద్ ఖాన్ తెలిపారు. ఓ చక్కని రొమాంటిక్ డేట్ ఎంజాయ్ చేసేందుకు వీలైన ఉత్పత్తుల, గిఫ్ట్ ఆర్టికల్స్ జ్యువెలరీ మొదలుకుని, మనసును హత్తుకునేలా వాలంటైన్స్ డే కోసం ప్యార్ బజార్ విభాగంలో లభిస్తాయని వివరించారు.
– సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment