
కోవిడ్ రోజులు
క్యాన్సర్‌తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్‌లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.
‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.
నేరుగా వారి ఇళ్లకే..
క్యాన్సర్ పేషంట్స్‌కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్‌కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్‌తో కాదు క్యాన్సర్‌తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.
వీడియోలలో దహన సంస్కారాలు..
ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్‌తో చనిపోయాడనే లెటర్‌తో పాటు అంబులెన్స్‌ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.
ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..
ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది.
డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్‌లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment