palliative care
-
దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం..
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కీమోథెరపీ చికిత్సకు స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పీలేను పాలియేటివ్ కేర్‌కు తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా గతేడాది అతని పెద్ద పేగు నుంచి కణతిని తొలగించారు. అప్పటినుంచి పీలే క్రమం తప్పకుండా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు. కాగా ఇటీవలే పీలే ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబసభ్యులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చేర్చారు. శరీరం పై వాపులు రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. పీలే కూతురు స్పందించారు. చికిత్స కోసమే తన తండ్రి పీలేను ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదని, భయపడాల్సింది కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే ఇలా కీమోథెరపీకి స్పందించడం లేదని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పీలే వయసు 82ఏళ్లు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచారు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డ్. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. పీలే.. మూడు వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు FIFA WC: నరాలు తెగే ఉత్కంఠ.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా -
‘స్పర్శ్’లో పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ని ప్రారంభించిన రానా (ఫొటోలు)
-
ఏడాదికోసారైనా గుడికి రావాలని మా అమ్మ కోరింది
సాక్షి, హైదరాబాద్: ఏటా ఒక్కసారైనా తనతోపాటు దేవాలయానికి రావాలని తల్లి కోరిందని, దీర్ఘకాలిక వ్యాధులతో జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఉచితంగా ఉపశమన(హాస్పీస్–పాలియేటివ్ కేర్) సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సెంటరే ఆ దేవాలయమని సినీ నటుడు రానా తెలిపారు. వరల్డ్ హాస్పైస్ అండ్ పాలియే టివ్ కేర్ డే వేడుకలను గచ్చిబౌలిలోని స్పర్శ్ హాస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పదేళ్లలోపు చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పది పడకల పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ వార్డును రానా ప్రారంభించారు. స్పర్శ్ బృందాన్ని, సహకారం అందిస్తున్న బంజారాహిల్స్ రోటరీ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. స్పర్శ్ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానన్నారు. తల్లి స్పర్శను ప్రతిబింబించేలా నగరంలో సేవలు అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ కృషి అభినందనీయమని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా స్పర్శ్ సౌకర్యాలు అందిస్తోందని రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రశంసించారు. ప్రపంచ స్థాయి కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తాం... చివరిదశ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కోసం రెయిన్బో హాస్పిటల్స్ సహకారంతో పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ వార్డును ప్రారంభించామని బంజారాహిల్స్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రభాకర్ ధూళిపూడి తెలిపారు. శిక్షణ పొందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫిజియో థెరపిస్ట్‌లు, కౌన్సెలర్లు, ఆధ్యాత్మిక మార్గదర్శకుల బృందం సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. మహిళల్లో గర్భాశయ, రొమ్ము తదితర కేన్సర్లను గుర్తించడానికి నూతనంగా మొబైల్ కేన్సర్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచస్థాయి కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని, ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 4 ఎకరాల భూమిని అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రెయిన్బో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కంచర్ల రమేష్, స్పర్శ్ బృందం, రోటరీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
అంతిమ దశలో ఆత్మీయ ‘స్పర్శ’
అంత్యదశలో ఏ బాధా లేకుండా ప్రశాంతంగా నిష్క్రమించాలనేది ప్రతి మనిషి ఆశ. కానీ చావు పుట్టుకల మధ్యలో పుట్టుకొస్తున్న రోగాలు మరణానికి ముందే నరకాన్ని చూపెడుతున్నాయి. అలా కాకుండా... చివరి దశలో ఉన్న రోగుల ముఖాలకు చిరునవ్వులు అద్దుతోంది నగరంలోని స్పర్శ్ హోస్పైస్. దశాబ్దకాలంగా ఉచిత పాలియేటివ్ కేర్ (చివరి రోజుల్లో ఉన్న మనిషికి అందించే సేవ)కు చిరునామాగా నిలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్రవ్యాధులతో చావుబతుకులమధ్య ఉన్న నిరుపేద రోగుల పట్ల సమాజమూ నిర్దయగానే ప్రవర్తిస్తుంటుంది. ఈ పరిస్థితిని గమనించే ఈ ప్రత్యేక సేవల్ని ప్రారంభించామంటున్నారు స్పర్శ్ నిర్వాహకులు. రోటరీ క్లబ్ బంజారాహిల్స్ శాఖ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛంద సేవ.. ప్రభుత్వం, దాతల సహకారంతో ఎప్పటికప్పుడు అత్యాధునిక హంగులతో రోగులకు అద్భుత సేవలందిస్తోంది. మరిన్ని కొత్త సేవలతో ఇటీవలే కొత్త ప్రాంగణంలోకి మారింది. ఈ సందర్భంగా స్పర్శ్ ట్రస్టీలు డా.సుబ్రహ్మణ్యం, ఎన్.సురేష్‌రెడ్డి, రోటరీ క్లబ్ బంజారాహిల్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్, సెంటర్ హెడ్ శశిధర్లు సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సేవల వివరాలు వారి మాటల్లోనే.. ‘చికిత్స కన్నా చిరునవ్వులే మిన్న... ఆసుపత్రుల్లో మెడికల్ కేర్ ఎక్కువ ఉంటుంది. అయితే అవసాన దశలో ఉన్న రోగుల కోసమే స్పర్శ్ ఏర్పాటైంది కాబట్టి.. ఇక్కడ మెడికల్ కేర్ 25 శాతం మాత్రమే. రోగులకు మానసిక, సాంఘిక, ఆధ్యాత్మికపరమైన ఆలంబన అందుతుంది. నెలకు 50 నుంచి 100 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఇక్కడ 82 బెడ్స్ ఉన్నాయి. మహిళలకు, పురుషులకు వేర్వేరు విభాగాలున్నాయి. రోగులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పచ్చిక, చెట్లు పెంచుతున్నాం. పిల్లల కోసం మరొక వార్డ్ సిద్ధమవుతోంది. వాళ్ల ఆటపాటలకోసం ప్లే ఏరియానూ ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు సహాయంగా మరొకరు ఉండేందుకు ఉచిత వసతి అందిస్తాం. చివరిరోజుల్లో ఉన్నవారు ఏవైనా ప్రత్యేకంగా తినాలనుకుంటే వండి వడ్డించేందుకు వంటగది ఏర్పాటు చేశాం. మినీ లైబ్రరీ ఉంది. సినిమా స్క్రీనింగ్, పండుగ, పుట్టినరోజు వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలను విశాలమైన యాంఫీ థియేటర్లో నిర్వహిస్తాం. చివరినిమిషం వరకూ ఉల్లాసంగా ఉంచేందుకే ఈ తపన. అత్యాధునిక వసతులతో మార్చురీ ఉంది. అంతిమ సంస్కారాలకూ సహకారమందిస్తాం. ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. హోమ్ విజిట్స్ కోసం వ్యాన్లు అంతిమ ఘడియల్ని అయినవారి మధ్యే గడపాలనుకునే రోగుల ఇళ్లకు వెళ్లి హోమ్ కేర్‌కోసం 6 వ్యాన్లు ఏర్పాటు చేశాం. రోగిని తీసుకురాలేని పరిస్థితి ఉంటే మనవాళ్లు వెళతారు. ప్రతీ వ్యాన్‌కీ నర్స్, సోషల్ వర్కర్, ఫిజీషియన్, అసిస్టెంట్ ఉంటారు. ఈ వ్యాన్స్‌తో గత నెల 696 విజిట్స్ జరిగాయి. రోగి పరిస్థితిని బట్టి వారానికి ఒక్కసారి, రెండుసార్లు వారి ఇంటికెళ్లి చూస్తాం. ఒక్కో రోగి దగ్గర పావుగంట నుంచి రెండు, మూడు గంటలవరకూ ఉంటారు. నగరం నుంచి 80కి.మీ. పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సేవలుంటాయి. చిరునవ్వు నడిపిస్తోంది.. స్పర్శ్ నిర్వహణలో ఎన్ని వ్యయ ప్రయాసలున్నా రోగుల ముఖాల్లోని చిరునవ్వు అన్నింటినీ మరిపిస్తోంది. మమ్మల్ని నడిపిస్తోంది. నెలకు రూ.40లక్షల వ్యయమవుతుంది. ఎస్బీఐ, పలు కార్పొరేట్ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ప్రాంగణంలోని కొంత భాగాన్ని ప్రభుత్వ అనుమతితో అద్దెకివ్వడం వల్ల కొంత ఆదాయం వస్తోంది. ఏటా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. -
క్యాన్సర్ వైద్య కిరణాలు.. రాష్ట్రంలోనే తొలిసారిగా
సాక్షి, గుంటూరు: క్యాన్సర్ సోకితే ప్రాణాలు పోవటమే అనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది ఏ మాత్రం నిజం కాదని, ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైద్య రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని పేర్కొంటున్నారు. ప్యాలెటివ్ కేర్ ప్రత్యేక వార్డు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నిరకాల క్యాన్సర్లను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్ సెంటర్లను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికీ ఉపశమన చికిత్స అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో ప్యాలేటివ్ కేర్ ట్రీట్మెంట్ ప్రత్యేక వార్డును ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చారు. చదవండి: (రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి) ఉచితంగా శస్త్రచికిత్సలు గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అన్నిరకాల క్యాన్సర్లకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ వైద్య సేవలు ప్రస్తుతం ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి సేవలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడూ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం, నాట్కో ట్రస్ట్ సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ.50 కోట్లతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఇక్కడ సుమారు రూ.70 లక్షలతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌ను నిర్మించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. చివరి దశపైనా ప్రత్యేక దృష్టి క్యాన్సర్‌ను చివరి దశలో గుర్తిస్తే చికిత్స అందించటం కష్టంతో కూడిన పని. ఇలాంటి రోగులకు ఉపశమన చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుంది. అందుకే రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు నాట్కోసెంటర్‌లో ప్యాలేటివ్ కేర్(ఉపశమన చికిత్స) వార్డు ఏర్పాటు చేశారు. దీనికోసం గుంటూరు బొంగరాలబీడులోని రెండు ఎకరాల స్థలంలో శాశ్వత భవనం నిర్మించేందుకూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ ఈ విషయాన్ని గతనెలలో వెల్లడించారు. తాత్కాలికంగా నాట్కో సెంటర్లో ఉపశమన చికిత్స అందుతోంది. క్యాన్సర్ రోగులకు సహాయకులుగా వచ్చే వారికీ ఉచితంగా అత్యాధునిక పరీక్షలు చేస్తున్నారు. కార్పొరేట్ వైద్యసేవలు క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నాం. ఇక్కడ పీజీ సీట్లు మంజూరు చేయడంతోపాటు స్పెషాలిటీ క్యాన్సర్ వైద్యులను ప్రభుత్వం నియమించింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికి ఉపశమన చికిత్స కోసం ప్రత్యేక వార్డును అందుబాటులోకి తీసుకొచ్చాం. శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నాం. మందులూ ఉచితంగా ఇస్తున్నాం. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ వైస్ చైర్మన్ -
ప్రైవేటు భాగస్వామ్యంతో పాలియేటివ్‌కేర్
రాయదుర్గం: పాలియేటివ్ కేర్‌లోకి ప్రవేశించడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీరామారావు పేర్కొన్నారు.ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సేవలు అందజేయాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడలో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘స్పర్శ్ హోస్పిస్’ఆస్పత్రి భవనాన్ని మంత్రి కేటీరామారావు శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 2016లో స్పర్శ్ హోస్పిస్ని మొదటిసారి సందర్శించినప్పుడు పాలియేటివ్‌కేర్ అంటే ఏమిటో తెలియదని, మానవత్వానికి ఇది గొప్ప సేవ అని ఆ తర్వాత తెలిసిం దని అన్నారు. ఇలాంటి ఆస్పత్రుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని, ముందుకొచ్చే వారికి పూర్తిగా సహకరిస్తామన్నారు. స్పర్శ్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటిపన్నుల మినహాయింపు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఒక రాజకీయ నాయకునిగా అనేక కార్యక్రమాలకు వెళ్తామని, కానీ కొన్ని కార్యక్రమాలు ఆత్మ సంతృప్తి కలిగిస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు. పదేళ్ళుగా మానవతా దృక్పథంతో వైద్యం అందించిన స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రి కల నెరవేరి సొంత భవనానికి నోచుకోవడం సంతోషంగా ఉందన్నారు. పన్ను మినహాయింపు ఇవ్వాలి: వరప్రసాద్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఉచితంగా సేవలందిస్తున్న స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని శాంతాబయోటెక్ సంస్థ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆస్పత్రి సీఈఓ రామ్మోహన్రావు మాట్లాడుతూ, దేశంలోనే రెండు అతిపెద్ద పాలియేటివ్‌కేర్ సదుపాయాలలో ఇది ఒకటని, దేశంలో అత్యంత అధునాతన అల్ట్రా మోడ్రన్ పాలియేటివ్‌కేర్ ఇదేనని గుర్తు చేశారు. తుదిదశ కేన్సర్ రోగులలో బాధను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. పదేళ్లుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన నాలుగు వేల మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఉండే గదుల్లోకి వెళ్ళి వారితో ముచ్చటించి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేశ్కోట్బాగీ, ఫీనిక్స్ చైర్మన్ చుక్కపల్లి సురేష్, అధ్యక్షుడు వికాస్, ట్రస్టీలు సుబ్రహ్మణ్యం సురేష్‌రెడ్డి, జగదీశ్, ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఎదులతోపాటు పలువురు డాక్టర్లు, దాతలు, వైద్యబృందం పాల్గొన్నారు. -
ఆఖరి మజిలీలో ఆత్మీయ స్పర్శ
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి, చికిత్స లేని వ్యాధులతో అవసాన దశలో ఉన్న వారికి ఇచ్చే శారీరక, మానసిక ఉపశమన చికిత్సే ‘హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్’గా పేర్కొంటారు. చివరి దశలో ఉన్న కేన్సర్ బాధితులకు 9 సంవత్సరాలుగా నగరంలోని ‘స్పర్శ్ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ సెంటర్’ అందిస్తున్న ఉచిత సేవలపై నేడు వరల్డ్ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ డే సందర్భంగా కథనం.. ఆస్పత్రిలో ఉన్నా నయం కాదు.. అలాగని ఇంటి దగ్గర వారి నొప్పులకు ఉపశమనం దొరకదు. ఈ పరిస్థితుల్లో జీవితం నరకప్రాయంగా మారిన కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బాధితులు ఎందరో.. అలాంటి వారికి శారీరక, మానసిక సాంత్వనకు ప్రత్యేకంగా అందించే చికిత్స పేరే ‘పాలియాటివ్ కేర్ ట్రీట్మెంట్’. అయితే ప్రత్యేకంగా పాలియాటివ్ కేర్ సేవలు ఉంటాయని తెలియక ఎందరో అవస్థలతో, నొప్పులతోనే తుది శ్వాసకు చేరువవుతున్నారు. కేవలం నగరంలోనే ప్రతినెలా 20 వేల వరకు ఇలాంటి కేసులు బయటపడుతున్నాయని డాక్టర్ల అంచనా.. వీటిలో కేవలం 1 శాతం మంది మాత్రమే పాలియాటివ్ కేర్ సేవలు పొందగలుగుతున్నారు. రోగుల సేవలో తొమ్మిదేళ్లుగా.. కేన్సర్ మహమ్మారితో పోరాడుతూ చివరి దశలో ఉన్న వారికి ఉపశమన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 2011లో రోటరీ క్లబ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ‘స్పర్శ్ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ సెంటర్’ ఏర్పాటైంది. ఈ ఆస్పత్రి పూర్తి ‘ఉచితంగా’ హస్పీస్ అండ్ పాలియాటివ్ కేర్ సేవలను అందిస్తోంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 3,100 మందికి సేవలను అందించారు. నగరం నుంచే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పాలియాటివ్ కేర్, కేన్సర్ మహమ్మారిపై మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అన్ని రకాల సదుపాయాలూ... ఈ సెంటర్లో పేషెంట్లకు కావాల్సిన అన్ని రకాల మెడికల్ సదుపాయాలతో పాలియాటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్లు, కౌన్సెలింగ్ స్పెషలిస్ట్, నర్స్‌లు, సోషల్ వర్కర్స్ నిత్యం సేవలు అందిస్తుంటారు. దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేశారు. నొప్పులు, ఆయాసం నుంచి స్వస్థతకు మెడికల్ ట్రీట్మెంట్తో పాటు వారికి నిర్ధేశించబడిన అనువైన ఆహారాన్ని అందిస్తారు. దుర్భరప్రాయమైన అవసానదశలో ఎదురయ్యే వాంతులు, రక్తస్రావాలకు ప్రేమతో సపర్యలు చేస్తారు. అంతేగాకుండా అవసాన దశలో ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని కౌన్సెలింగ్ ద్వారా అందిస్తారు. మేమే వస్తాం.. వివిధ కారణాల వలన ఈ సెంటర్‌కి రాలేని వారి కోసం స్పర్శ్ టీం బృందాలుగా వారి ఇళ్లకే వెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా అవసరమైన మెడికల్ కిట్స్ ఇతర అవసరాలైన డైపర్స్, హెల్త్ న్యూట్రియంట్స్ తదితరాలను అందిస్తారు. ఇలా నగర పరిధిలో 40 కిలో మీటర్ల వరకు ఎక్కడికైనా వెళ్లి సేవలు అందిస్తారు. మరికొందరు ఔట్‌పేషెంట్ సేవలు పొందుతున్నారు. అన్నీ తామై.. కుల మతాలకతీతంగా అన్ని పండగలను నిర్వహిస్తారు. రోగుల పుట్టిన రోజులు జరుపుతూ, చివరి కోరికలు తీరుస్తూ ఆటలు పాటలతో నచ్చిన పని చేసుకునేందుకు అన్నీ సమకూరుస్తారు. ఇక్కడికి వచ్చే పేషంట్లకు, వారి అటెండర్లకు వసతి, భోజన సౌకర్యాలు అందిస్తారు. ఈ సేవలో ఎందరో దాతలు, స్వచ్ఛంద సేవకులు భాగం పంచుకుంటున్నారు. గౌరవప్రదమైన మరణం సాంత్వనతో కూడిన జీవితం, గౌరవప్రదమైన మరణం అనే లక్ష్యాలతో స్పర్శ్ సిబ్బంది పనిచేస్తున్నాం. చివది దశలో ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనేదే మా ధ్యేయం.. మరికొన్ని రోజుల్లోగచ్చిబౌలిలో 75 పడకలతో పాలియాటివ్ కేర్ సెంటర్లో సేవలు అందించే దిశగాముందుకెళ్తున్నాం. – రామ్మోహన్రావు, సీఈఓ -
జిల్లా కేంద్రాల్లో ‘పాలియేటివ్ కేర్’ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల్లో పాలియేటివ్ కేర్ యూనిట్లు ప్రారంభించా లని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇప్పటికే 8 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవం తంగా నడుస్తుండటంతో, మిగతా అన్ని జిల్లాల్లోనూ నెలకొల్పేందుకు సన్నాహా లు ప్రారంభించింది. దీనికి అవసరమైన నిధులను సమకూర్చాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కోరింది. ప్రస్తుతం ఆదిలాబాద్, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ (రూరల్), జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాల్లో పాలియేటివ్ కేర్ సేవలు ప్రయోగాత్మకంగా కొనసాగుతున్నాయి. జీవిత చరమాంకంలో ఉండే వయో వృద్ధులు, కేన్సర్‌కు గురై చివరి దశలో ఉన్నవాళ్లు తుదిశ్వాస వరకూ నొప్పి, బాధ తెలియకుండా సంతోషంగా గడిపేందుకు అవసరమైన సపర్యలు చేయడాన్నే వైద్య పరిభాషలో ‘పాలియేటివ్ కేర్’గా పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది ఎప్పటి నుంచో అమలవుతోంది. ఖర్చుతో కూడుకున్న వ్యవహా రం కావడంతో ఈ సేవలను పొందడం అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలామం ది అంతిమ దశలో బాధను అనుభవిస్తూ తనువు చాలిస్తారు. ఇలాంటి వారికి కావాల్సిన వైద్య సేవలు, మందులు ఇవ్వగలిగితే వారి జీవిత కాలాన్ని పొడిగించడంతోపాటు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించొచ్చు. ఎన్హెచ్ఎం కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచాన పడ్డవారికి వారి ఇంటికే వెళ్లి సేవలందించాలని కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఎన్హెచ్ఎం అధికారి డాక్టర్ మాధవి తెలిపారు. జిల్లాకు ఒక ప్రత్యేక వైద్య బృందం.. పాలియేటివ్ కేర్ కింద ఎంపికైన జిల్లాకు ప్రత్యేక వైద్య బృందాన్ని, ఓ వాహనాన్ని కేటాయిస్తారు. వైద్య బృందం రోజూ కనీసం 12 మంది రోగుల ఇంటికి వెళ్లి సేవలు చేయాల్సి ఉంటుంది. స్టాఫ్ నర్సులు, ఫిజియోథెరపిస్టులకు ఇప్పటికే ఆయా జిల్లాల్లో అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. త్వరలో జిల్లా ఆస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తారు. నిమ్స్‌లోనూ వృద్ధుల కోసం (జెరియాట్రిక్) ప్రత్యేక వార్డు సిద్ధం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? అని ఆశ వర్కర్లు ఆరా తీస్తున్నారు. అలాంటి వారి వివరాలు తీసుకుని ఏఎన్ఎంలకు సమాచారమిస్తారు. వారు రోగి ఇంటికి వెళ్లి ‘పాలియేటివ్ కేర్’అవసరమా లేదా? అవసరమైతే ఎలాంటి సేవలు అవసరమన్న సమాచారం సేకరించి మెడికల్ ఆఫీసర్‌కు నివేదిస్తారు. డాక్టర్ వెళ్లి ఆ రోగికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతోపాటు సదరు రోగికి ఎలా వైద్యం చేయా లన్న దానిపై కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తారు. అవసరాన్ని బట్టి వారానికి ఒకట్రెండు సార్లు లేదా రెండ్రోజులకోసారి రోగి ఇంటికి వైద్య బృందం వెళ్లి సేవలు చేస్తుంది. రోగి మానసిక ఉల్లాసానికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తారు. ఇంట్లో సేవలు అందించలేని పరిస్థితి ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానలో ‘పాలియేటివ్ కేర్’వార్డుల్లో ఉంచి సపర్యలు చేస్తారు. -
చివరి మజిలీకి.. కేరళ అనువైన ప్లేస్
తిరువనంతపురం: కేరళ పేరు వినగానే ప్రకృతి సౌందర్యం, అందమైన బీచ్‌లు, బోటింగ్ గుర్తుకొస్తాయి. దేశ, విదేశాల నుంచి లక్షలాదిమంది టూరిస్టుల రాకతో కేరళ నిత్యం కళకళలాడుతుంటుంది. కేరళ విహార యాత్రకే గాక మరణించడానికి కూడా దేశంలో అత్యుత్తమ స్థలం. కేన్సర్ సహా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కేరళ ఆపన్నహస్తం అందిస్తోంది. కేరళలో పాలియేటివ్ కేర్ (ఉపశమనం కలిగించే వైద్యశాల)ను ఓ ఉద్యమంలా విస్తరిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులకు ఉపశమనం కలిగించడం పాలియేటివ్ కేర్ లక్ష్యం. అవసానదశలో ఉన్న రోగుల్లో శారీరక అలసట, మానసిక ఒత్తిడి తగ్గించి జీవన ప్రమాణాలను పెంపొందించడం ఈ థెరఫీ ప్రత్యేకత. వైద్య నిపుణులు, నర్సులు, వాలంటీర్లతో కలసి చికిత్స అందిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, వైద్య నిపుణులు, పౌర సమాజ ఉద్యమకర్తలు సహకారం అందిస్తున్నారు. పాలియేటివ్ కేర్‌లో భారత్‌లో కేరళ అగ్రస్థానంలో ఉంది. పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ డైరెక్టర్ ఏసీ కురియన్ మాట్లాడుతూ.. ఈ థెరఫీ విజయవంతం కావడంలో టీమ్ వర్క్, ప్రాథమిక సదుపాయాలే కారణమని వివరించారు. నలుగురు డాక్టర్లను, 10 మంది నర్సులను, వాలంటీర్లను, ఓ వార్డును ఉచితంగా కేటాయించినట్టు తెలిపారు. నయంకాని రోగాలతో బాధపడే పేదలకు చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా రోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు సాయం చేస్తారు. కేరళలో ఇలాంటి పాలియేటివ్ కేర్లు చాలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు. -
కేన్సర్ నొప్పి నివారణకు పాలియేటివ్ కేర్
ఏపీ, తెలంగాణల్లో అమలు చేయడానికి ఏర్పాట్లు పాలియేటివ్ కేర్ సదస్సులో ఇరు రాష్ట్రాల వైద్య శాఖ ముఖ్య కార్యదర్శులు సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారి సోకిన రోగులు నొప్పిని భరించలేరు. ఈ నొప్పి నివారణకు సరికొత్త వైద్య పద్ధతులు వచ్చాయి. దీన్నే పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ అంటారని, కొత్తగా తెలంగాణ, ఏపీల్లోని కేన్సర్ ఆస్పత్రుల్లో ఈ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ, తెలంగాణల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు ఎల్వీ సుబ్రమణ్యం, డాక్టర్ సురేష్చందాలు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఓ హోటల్లో గురువారం జరిగిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ 22వ అంతర్జాతీయ సదస్సు సన్నాహక కార్యక్రమంలో ఇరువురూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతి, కర్నూలు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే, కేన్సర్ రోగులకు వాడే నార్కొటిక్ డ్రగ్స్ వాడకానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు పాసైందని, ఈ మందుల వాడకంపై నిబంధనలు సడలిస్తే రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. న్యూరోపతి, హెచ్ఐవీ, కేన్సర్ తదితర జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం కేరళలో పాలియేటివ్ కేర్ బాగా అమలు చేస్తున్నారని, ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వైద్య పద్ధతులను ప్రవేశ పెట్టనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 600 మంది విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్ సింహ, హైదరాబాద్ ఐఏపీసీ అధ్యక్షులు డాక్టర్ మంజుల, ఐఏపీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.