బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కీమోథెరపీ చికిత్సకు స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పీలేను పాలియేటివ్ కేర్‌కు తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా గతేడాది అతని పెద్ద పేగు నుంచి కణతిని తొలగించారు. అప్పటినుంచి పీలే క్రమం తప్పకుండా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు.
కాగా ఇటీవలే పీలే ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబసభ్యులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్‌లో చేర్చారు. శరీరం పై వాపులు రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. పీలే కూతురు స్పందించారు. చికిత్స కోసమే తన తండ్రి పీలేను ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదని, భయపడాల్సింది కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు.
కానీ ఇంతలోనే ఇలా కీమోథెరపీకి స్పందించడం లేదని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పీలే వయసు 82ఏళ్లు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచారు. తన కెరీర్‌లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డ్. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. పీలే.. మూడు వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment