ఓ మహిళకు సేవలు అందిస్తూ..
అంత్యదశలో ఏ బాధా లేకుండా ప్రశాంతంగా నిష్క్రమించాలనేది ప్రతి మనిషి ఆశ. కానీ చావు పుట్టుకల మధ్యలో పుట్టుకొస్తున్న రోగాలు మరణానికి ముందే నరకాన్ని చూపెడుతున్నాయి. అలా కాకుండా... చివరి దశలో ఉన్న రోగుల ముఖాలకు చిరునవ్వులు అద్దుతోంది నగరంలోని స్పర్శ్ హోస్పైస్. దశాబ్దకాలంగా ఉచిత పాలియేటివ్ కేర్ (చివరి రోజుల్లో ఉన్న మనిషికి అందించే సేవ)కు చిరునామాగా నిలుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: తీవ్రవ్యాధులతో చావుబతుకులమధ్య ఉన్న నిరుపేద రోగుల పట్ల సమాజమూ నిర్దయగానే ప్రవర్తిస్తుంటుంది. ఈ పరిస్థితిని గమనించే ఈ ప్రత్యేక సేవల్ని ప్రారంభించామంటున్నారు స్పర్శ్ నిర్వాహకులు. రోటరీ క్లబ్ బంజారాహిల్స్ శాఖ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛంద సేవ.. ప్రభుత్వం, దాతల సహకారంతో ఎప్పటికప్పుడు అత్యాధునిక హంగులతో రోగులకు అద్భుత సేవలందిస్తోంది. మరిన్ని కొత్త సేవలతో ఇటీవలే కొత్త ప్రాంగణంలోకి మారింది. ఈ సందర్భంగా స్పర్శ్ ట్రస్టీలు డా.సుబ్రహ్మణ్యం, ఎన్.సురేష్‌రెడ్డి, రోటరీ క్లబ్ బంజారాహిల్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్, సెంటర్ హెడ్ శశిధర్‌లు సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సేవల వివరాలు వారి మాటల్లోనే..
‘చికిత్స కన్నా చిరునవ్వులే మిన్న...
ఆసుపత్రుల్లో మెడికల్ కేర్ ఎక్కువ ఉంటుంది. అయితే అవసాన దశలో ఉన్న రోగుల కోసమే స్పర్శ్ ఏర్పాటైంది కాబట్టి.. ఇక్కడ మెడికల్ కేర్ 25 శాతం మాత్రమే. రోగులకు మానసిక, సాంఘిక, ఆధ్యాత్మికపరమైన ఆలంబన అందుతుంది. నెలకు 50 నుంచి 100 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఇక్కడ 82 బెడ్స్ ఉన్నాయి. మహిళలకు, పురుషులకు వేర్వేరు విభాగాలున్నాయి.
రోగులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పచ్చిక, చెట్లు పెంచుతున్నాం. పిల్లల కోసం మరొక వార్డ్ సిద్ధమవుతోంది. వాళ్ల ఆటపాటలకోసం ప్లే ఏరియానూ ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు సహాయంగా మరొకరు ఉండేందుకు ఉచిత వసతి అందిస్తాం. చివరిరోజుల్లో ఉన్నవారు ఏవైనా ప్రత్యేకంగా తినాలనుకుంటే వండి వడ్డించేందుకు వంటగది ఏర్పాటు చేశాం. మినీ లైబ్రరీ ఉంది.
సినిమా స్క్రీనింగ్, పండుగ, పుట్టినరోజు వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలను విశాలమైన యాంఫీ థియేటర్‌లో నిర్వహిస్తాం. చివరినిమిషం వరకూ ఉల్లాసంగా ఉంచేందుకే ఈ తపన. అత్యాధునిక వసతులతో మార్చురీ ఉంది. అంతిమ సంస్కారాలకూ సహకారమందిస్తాం. ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబానికి అండగా నిలబడతాం.
హోమ్ విజిట్స్ కోసం వ్యాన్లు
అంతిమ ఘడియల్ని అయినవారి మధ్యే గడపాలనుకునే రోగుల ఇళ్లకు వెళ్లి హోమ్ కేర్‌కోసం 6 వ్యాన్లు ఏర్పాటు చేశాం. రోగిని తీసుకురాలేని పరిస్థితి ఉంటే మనవాళ్లు వెళతారు. ప్రతీ వ్యాన్‌కీ నర్స్, సోషల్ వర్కర్, ఫిజీషియన్, అసిస్టెంట్ ఉంటారు. ఈ వ్యాన్స్‌తో గత నెల 696 విజిట్స్ జరిగాయి. రోగి పరిస్థితిని బట్టి వారానికి ఒక్కసారి, రెండుసార్లు వారి ఇంటికెళ్లి చూస్తాం. ఒక్కో రోగి దగ్గర పావుగంట నుంచి రెండు, మూడు గంటలవరకూ ఉంటారు. నగరం నుంచి 80కి.మీ. పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సేవలుంటాయి.
చిరునవ్వు నడిపిస్తోంది..
స్పర్శ్ నిర్వహణలో ఎన్ని వ్యయ ప్రయాసలున్నా రోగుల ముఖాల్లోని చిరునవ్వు అన్నింటినీ మరిపిస్తోంది. మమ్మల్ని నడిపిస్తోంది. నెలకు రూ.40లక్షల వ్యయమవుతుంది. ఎస్‌బీఐ, పలు కార్పొరేట్ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి. ప్రాంగణంలోని కొంత భాగాన్ని ప్రభుత్వ అనుమతితో అద్దెకివ్వడం వల్ల కొంత ఆదాయం వస్తోంది. ఏటా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment