రాష్ట్రానికి చలిజ్వరం! | viral fever cases on rise in hyderabad | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి చలిజ్వరం!

Published Tue, Nov 26 2024 1:27 AM | Last Updated on Tue, Nov 26 2024 1:27 AM

viral fever cases on rise in hyderabad

పెరిగిన చలి, వాతావరణంలో మార్పులతో పీడిస్తున్న జ్వరాలు 

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందిపెడుతున్న న్యుమోనియా, శ్వాస సంబంధ సమస్యలు 

డెంగీ, చికున్‌గున్యా కేసులు తగ్గినా... ఇతర విషజ్వరాల పంజా 

హైదరాబాద్‌లోని ఫీవర్, నీలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పెరిగిన రోగులు 

ఎంజీఎం సహా జిల్లా ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో ఓపీ నమోదు 

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్‌ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్‌ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్‌ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 

కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు 
హైదరాబాద్‌లోని ఒక్క ఫీవర్‌ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్‌ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. 

  ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్‌కు సోమవారం 1,600 మంది ఔట్‌ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్‌ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. 
ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్‌ మెడిసిన్‌ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్‌పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్‌ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. 
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. 

తగ్గిన డెంగీ, చికున్‌గున్యా... 
ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు.. నవంబర్‌ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్‌లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్‌లో 1,542, అక్టోబర్‌లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్‌గున్యా కేసులు సెప్టెంబర్‌లో 183, అక్టోబర్‌లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. 

పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు 
ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.

ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్‌కు టైఫాయిడ్‌. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

చలిజ్వరంతో బాధపడుతున్నా..
చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురం

శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి 
కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్‌రే, ఈసీజీ, ట్రెడ్‌మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్‌ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు.     – డాక్టర్‌ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగు

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త 
శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి.      – డాక్టర్‌ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్‌ భూపాలపల్లి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement