రాష్ట్రంపై డెంగీ పంజా
ఈ ఏడాది ఇప్పటివరకు వెయ్యికి చేరువలో కేసులు
ఒక్క హైదరాబాద్‌లోనే 327 కేసులు నమోదు
ఖమ్మం జిల్లాలో 161 కేసుల నమోదుతో ఆందోళన
‘ఈ సీజన్‌లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.
లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిట
రాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.
దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్‌గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.
రక్తస్రావం జరిగితే ప్రమాదకరం
డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం.
మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్‌లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్‌లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.
– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment