జ్వర భద్రం | dengue chikungunya is growing in hyderabad: Telangana | Sakshi
Sakshi News home page

జ్వర భద్రం

Published Sat, Aug 31 2024 4:31 AM | Last Updated on Sat, Aug 31 2024 4:31 AM

dengue chikungunya is growing in hyderabad: Telangana

డెంగీకి తోడు చికున్‌గున్యా, ఇతర విష జ్వరాల దాడి

‘మిక్స్‌డ్‌ ఇన్ఫెక్షన్ల’తో అల్లాడిపోతున్న జనం 

నీరసం, ఒళ్లు నొప్పులతో సొంత పనులూ చేసుకోలేనంతగా సతమతం...

రోగులతో ఆస్పత్రులు ఫుల్‌.. పలు ఆస్పత్రుల్లో మందుల కొరత 

చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కరువు.. 

ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే వేలు, లక్షల్లో ఫీజుల వసూళ్లు 

‘నిలువు దోపిడీ’ సమర్పించుకోలేక అల్లాడుతున్న జనం 

దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని విజ్ఞప్తులు

ఈ ఏడాది ఇప్పటికే 6,050 డెంగీ కేసులు నమోదు.. ‘లెక్క’లోకి రానివి మరెన్నో!

డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్‌డ్‌ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్‌లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్‌పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. 

పెరుగుతున్న డెంగీ తీవ్రత 
రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్‌గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్‌ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. 

రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు 
ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్‌ చేస్తున్నా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 

నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు 
శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్‌ ఎంజీఎంకు 2,385 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.

ప్లేట్‌లెట్స్‌ టెస్టు కోసం బయటికి.. 
నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్‌లెట్‌ టెస్ట్‌ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి 

మందులు సరిగా ఇవ్వడం లేదు 
నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్‌ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్‌కర్నూల్‌

మిక్స్‌డ్‌ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావం
సీరో టైప్‌–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్‌.. కోవిడ్‌ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువ
అడిషనల్‌ డీఎంఈ రాజారావు వెల్లడి  

‘‘ఏ వైరల్‌ జ్వరం అయినా వీక్‌నెస్‌ ఉంటుంది. కోవిడ్‌ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్‌ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్‌–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్‌డ్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్‌–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్‌–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్‌ ఇన్‌ఫెక్షన్‌ క్రాస్‌ రియాక్షన్‌ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్‌ అవుతుంది. 

ఇక డెంగీలో ప్లేట్‌లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్‌ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్‌లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్‌లెట్‌ టెస్టులను పెథాలజిస్ట్‌ చూసి నిర్ధారించాలి. మిషన్‌లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్‌ ఉంటుంది. – ప్రొఫెసర్‌ ఎం.రాజారావు, అడిషనల్‌ డీఎంఈ

ఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. 
    ⇒ మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రితోపాటు పీహెచ్‌సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్‌ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్‌ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. 
నాగర్‌కర్నూల్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. 
నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. 
బోధన్‌ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్‌ వేసి వైద్యం అందిస్తున్నారు.

డెంగీతో ఇద్దరి మృతి
పాపన్నపేట(మెదక్‌)/సిద్దిపేట అర్బన్‌: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్‌కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్‌చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్‌కు తరలించగా.. హర్షిత్‌ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్‌ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం 
‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
అడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు 
బాధితులు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ ఆఫీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు 
‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్‌్కఫోర్స్‌ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్‌ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. 

కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్‌ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్‌ ఎస్టాబ్లి‹Ùమెంట్‌ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్‌ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. 
కోఠి ఆస్పత్రిలోని వెక్టార్‌ బార్న్‌ డిసీజెస్‌ విభాగం కంట్రోల్‌ రూం నంబర్‌ 94404 90716 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement