లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా ప్రజలను వింత జ్వరాలు వేధిస్తున్నాయి. జ్వరం ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతున్నా ఆ తరువాత కీళ్ల వాపులు, శరీరంపై ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉండేది. కానీ ప్రస్తుతం జ్వరం ఒక్కరోజు మాత్రమే ఉంటోంది. 103 నుంచి 104 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. కానీ దుష్ఫలితాలు పది నుంచి 15 రోజుల పాటు వెంటాడుతూనే ఉన్నాయి.
మలేరియా, డెంగీ అనుమానిత కేసులు
విజయవాడ నగరంలోని మొగల్రాజపురం, మారుతీనగర్, గుణదల, పాతబస్తీలోని చిట్టినగర్, కేఎల్‌రావు నగర్ వంటి ప్రాంతాల్లో డెంగీ, మలేరియా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో డెంగీ ఎన్‌ఎస్1 పరీక్షలో పాజిటివ్ వస్తూ, ప్లేట్‌లెట్స్ కూడా తగ్గుతున్నాయి. అలాంటి వారిలో డెంగీ ఎలీజా పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తోంది. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు సోకగా, పదిహేను రోజులుగా నగరంలో కూడా జ్వర బాధితులు పెరుగుతున్నారు. దోమకాటుతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కూడా జ్వరాలు పెరుగుతున్నాయి.
దోమల నివారణ ప్రచార ఆర్భాటమే
విజయవాడ నగరంలో వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారమే కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు జరగడం లేదు. ఏదైనా అనుమానిత కేసు వచ్చిన ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది వెళ్లి చుట్టు పక్కల ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలు సైతం యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసేందుకు రెండు, మూడు ప్రాంతాల్లో పర్యటించి సరిపెడుతున్నారు. దోమల నియంత్రణ క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు. దీంతో నగర ప్రజలు దోమకాటు వ్యాధులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు.
కనిపిస్తున్న లక్షణాలు ఇవీ..
⇒ తొలుత జ్వరం వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది.
⇒ ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతున్నాయి.
⇒ క్రమేణా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు వస్తున్నాయి.
⇒ ఇలాంటి వారిలో కొందరు రెండు మూడు రోజులు మంచం మీద నుంచి కిందకు దిగి నడవలేని పరిస్థితి తలెత్తుతోంది.
⇒ కొందరిలో కాళ్ల వాపులు సైతం ఎక్కువగా వస్తున్నాయి.
⇒ వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
⇒ ఈ లక్షణాలు పది రోజుల నుంచి 15 రోజులు పాటు ఉంటూ ప్రజలను బాధిస్తున్నాయి.
⇒ కొంత మందిలో జ్వరం తక్కువగా ఉండి గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
⇒ ఇలాంటి వారు తీవ్రంగా నీరసించి పోతున్నారు. రెండు మూడు రోజులకు దగ్గు కూడా ప్రారంభమవుతుంది. వారం నుంచి పది రోజుల పాటు దగ్గు ఇబ్బంది పెడుతోంది.
జ్వరాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి..
ప్రస్తుతం ప్రబలిన జ్వరాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక రోజు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఆ తర్వాత చాలా మందిలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. కొందరైతే, రెండు, మూడు రోజులు మంచంపై నుంచి దిగలేని పరిస్థితి ఏర్పడుతోంది. పది నుంచి పదిహేను రోజుల పాటు నొప్పులు ఉంటున్నాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నారు. డెంగీ ఎన్‌ఎస్1 పాజిటివ్ వచ్చి, ప్లేట్‌లెట్స్ తగ్గినా, ప్రమాదకరంగా మారడం లేదు. వాటికవే పెరుగుతున్నాయి. కొందరిలో భరించలేని తలనొప్పి, బాడీపెయిన్స్ కూడా ఉంటున్నాయి. నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్యం పొందితే మంచిది.
– డాక్టర్ ఎస్.డి.ప్రసాద్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment