Krishna District Latest News
-
బండ్ల తొలగింపు దారుణం
రోడ్ల పక్కనే మార్జిన్ స్థలంలో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల తోపుడు బండ్లను తొలగించడం దారుణం. పెద్ద వ్యాపా రులు రోడ్లను అక్రమించుకుంటున్నారు. వారిపై ఏ చర్యలూ తీసుకోని అధికారులు ఇలా చిన్న వ్యాపారస్తులపై పడడం సరైంది కాదు. వారిని అక్కడే కొనసాగించేలా మద్దతు అందిస్తాం. – లింగం ఫిలిప్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పేదలపై కక్ష తగదు బతుకుదెరువు కోసం 20 ఏళ్లకు పైగా రోడ్ల పక్కనే బండ్లు, ఫుట్ పాత్ పైనే కూరగాయలు, ఆకుకూరలు విక్రయించుకుంటున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉదయం 9 గంటల్లోపు వ్యాపారాలు చేసుకునే వారిపై కత్తికట్టడం సరికాదు. ప్రజలకు ఇబ్బందిగా ఉంటే కాస్త వెనక్కి జరిగి వ్యాపారాలు చేసుకోవాలని చెప్పాలి. తొలగించే చర్యలను విరమించుకోవాలి. – బూర సుబ్రహ్మణ్యం, సీపీఎం నగర కార్యదర్శి -
బతుకుబండిపై పగ
● బందరులో చిరు వ్యాపారులపై పగబట్టిన కూటమి నాయకులు ● ఎన్నికల్లో కూటమికి సహకరించలేదని అక్కసు ● రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లు తొలగింపు ● గతంలో ఈట్ స్ట్రీట్, జెడ్పీ సెంటర్, బస్టాండ్ వద్ద ఇదే తరహా చర్యలు ● తాజాగా రైతుబజార్, కోనేరుసెంటర్‌లో దుకాణాల తొలగిపునకు యత్నం ● ఉపాధి కోల్పోయి కూరగాయలు, పండ్ల వ్యాపారులు విలవిల ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు కోట వెంకటేశ్వరమ్మ. బందరు మండలం మంగినపూడి వాసి. 30 ఏళ్లకు పైగా బందరు ప్రధాన రహదారి మార్జిన్లో ఉదయం పూట కూరగాయలు, పూలు, ఆకుకూరలు విక్రయిస్తోంది. మూడు రోజుల క్రితం మునిసిపల్ అధికా రులు ట్రాక్టర్లతో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేయకూడదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతుగా రావడంతో దుకా ణాలను తొలగించలేదని వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఆశీలును రద్దుచేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు సుంకర ఏసు. బుట్టాయిపేటలో నివసిస్తున్నారు. టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు. మార్కెట్లో కోళ్ల వ్యాపారం చేస్తున్నారు. వైఎస్ జగన్ పాలన నుంచి కోళ్లకు ఆశీలు వసూలు చేయలేదని, టీడీపీ పాలనలో రశీదు ఇవ్వకుండా కోడికి రూ.20 నుంచి రూ.30 చొప్పున ఆశీలు వసూలు చేస్తున్నారని చెబుతు న్నారు. మునిసిపల్ ఉద్యోగి మల్లేశ్వరరావు మరో ఇద్దరు కోళ్ల వ్యాపారుల వద్ద ఆశీలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు దృష్టికి ఏసు తీసుకెళ్లారు. ● -
సెపక్ తక్రా క్రీడలను విజయవంతం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న అండర్ –14 బాలబాలికల సెపక్తక్రా జాతీయ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని డీఆర్వో లక్ష్మీ నరసింహం పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి 27 వరకు జరిగే సెపక్ తక్రా పోటీల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమస్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, నగరపాలకసంస్థ, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ క్రీడలకు 12 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్నారు. డీఈఓ సుబ్బారావు, స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ భానుమూర్తి రాజు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పాలిట కల్పవృక్షం ఆయిల్‌పామ్
పమిడిముక్కల: ఆయిల్‌పామ్ రైతుకు కల్పవృక్షంగా మారిందని జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. మండలంలోని పమిడిముక్కల గ్రామంలో 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ నిర్వహిస్తున్న నర్సరీని కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం సందర్శించారు. నర్సరీలో జరిగే కార్యక్రమాలను వారికి 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ జీఎం విజయప్రసాద్ వివరించారు. అనంతరం నర్సరీలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ పంటకు రాబోయే కాలంలో డిమాండ్ ఉంటుందని, గిట్టుబాటు ధర పొందొచ్చని సూచించారు. ఆయిల్‌పామ్ పంటకు కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోందని, వరి, మినుముతో పాటు ఈ పంట కూడా సాగు చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ పంట రైతుకు లాభసాటిగా ఉంటుందన్నారు. జీఎం విజయప్రసాద్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగును జిల్లాలోని రైతులకు పరిచయం చేసేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ ప్రాంతీయ కార్యాలయాన్ని వీరంకిలాకులో ఏర్పాటు చేశామన్నారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ఉద్యాన శాఖ, 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ సంయుక్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పమిడిముక్కల, మొవ్వ, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి మండలాలను ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైనవిగా గుర్తించామని, నూనె గింజల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాల్సిందిగా రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జె.జ్యోతి, సర్పంచ్ ముళ్లపూడి సునీత, కృష్ణాపురం డీసీ చైర్మన్ నాదెళ్ల సుబ్రహ్మణ్యం, ఏజీఎం చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలి
కంకిపాడు: వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందించాలని కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు డిమాండ్ చేశారు. ఏపీ కౌలురైతు సంఘం కృష్ణాజిల్లా కమిటీ ప్రత్యేక సమావేశం కంకిపాడులోని ఎంబీ భవన్లో సోమవారం నిర్వహించారు. రంగారావు మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్లో సంభవించిన వరదలు, భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రబీలో నష్టాన్ని అధిగమించేందుకు సమాయత్తమవుతున్న రైతులకు రెండు గంటల వ్యవసాయ విద్యుత్ కోత పెనుభారంగా మారుతుందన్నారు. పంటపై పెట్టిన లక్షల రూపాయల పెట్టుబడి కోల్పోయినా ప్రభుత్వం అరకొరగానే ఆదుకుందని చెప్పారు. పూత, పిందె దశలో ఉన్న అపరాలు, మొక్కజొన్న తోటలకు నీటి తడులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరి నాట్లు సజావుగా సాగటం లేదన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వి.శివశంకర్‌రావు, జిల్లా కమిటీ ప్రతినిధులు సీహెచ్ శ్రీహరి, కౌలురైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు జె.రవి, వి.మరియదాసు, వై.జోజి పాల్గొన్నారు. -
నీరసించి.. ‘ఓపీ’క నశించి..
● ఓపీ చీటీ రావాలంటే గంట క్యూలో ఉండాల్సిందే ● ఓపీ పరీక్షల వద్దా అదే పరిస్థితి ● సరైన పర్యవేక్షణ లేక రోగుల అవస్థలు ● ఏసీ గదులకే పరిమితమైన ఆర్‌ఎంఓలు లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఓపీ చీటీ తీసుకునే వద్ద నుంచి, ఓపీ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. ఇలా ప్రతి చోటా గంటల కొద్దీ క్యూలో నిల్చొని రోగులు నీరశించి పోతున్నారు. రోగులకు సత్వరమే సేవలు అందేలా చూడాల్సిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్(ఆర్ఎంఓ)లు ఏసీ గదులకే పరిమితమవుతున్నారు. దీంతో ఇక్కడ నాణ్యమైన వైద్యం అందుతుందనే ఆశతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఇదేమి దయనీయ స్థితి అంటూ తమ పేదరికాన్ని నిందించుకుంటున్నారు. రోగులపై ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఓపీ చీటీకే కుస్తీ.. విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ఓపీ చీటీ తీసుకోవాలంటేనే కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల కొద్దీ క్యూలో నిల్చోవడం, కౌంటర్ వద్ద తోపులాటలు ఇలా ఓపీ చీటీ చేతికందాలంటే కుస్తీ పట్టాల్సిందే. ప్రతిరోజూ కొత్తాస్పత్రికి 1500 నుంచి 1800 వరకూ అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. వారికి చీటీలు ఇచ్చేందుకు గతంలో 8 కౌంటర్లు ఉండేవి. ప్రస్తుతం కంప్యూటర్లు రిపేర్లు కావడంతో మూడు కౌంటర్ల వద్దనే చీటీలు ఇస్తున్నారు. అంతేకాక మధ్యలో ప్రింటర్లు మొరాయిస్తున్నాయి. దీంతో రోగులు బారులు తీరుతున్నారు. ఓపీ చీటీ చేతికి వచ్చే సరికి 45 నిమిషాల నుంచి గంటసేపు క్యూలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో కొందరు నీరశించి కుప్పకూలిన ఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాక రక్త పరీక్షలు చేయించుకునేందుకు నంబరు వేయాలన్నా, రిపోర్టులు తీసుకోవాలన్నా క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఓపీ వద్ద అంతే.. ఓపీ చీటీ తీసుకుని వారు పరీక్షలు చేయించుకునే ఓపీ వద్దకు వెళ్తే అక్కడ కూడా చాంతాడంత క్యూ ఉంటోంది. అక్కడ విధులు నిర్వర్తించే స్టాఫ్ ఓపీ చీటీలు తీసుకుని, వరుస క్రమంలో పిలిస్తే ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని విభాగాల్లో పట్టించుకోకపోవడంతో గంటల పాటు క్యూలో నిల్చోవాల్సిన పరి స్థితి నెలకొంటోంది. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ విభాగాలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీల వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు సైతం వారిని చూస్తూ వెళ్లిపోతారే కానీ, సరిచేసే ఆలోచన మాత్రం చేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ఓపీ కౌంటర్ల వద్ద బారులు తీరిన రోగులు రోగులకు సౌకర్యాలు కల్పించాలి.. ప్రభుత్వాస్పత్రిలో రోగులు గంటల కొద్దీ క్యూలో నిల్చోవడం దయనీయం. అధికారులు పర్యవేక్షణ సరిగా లేక పోవడం దుర దృష్టకరం. రోగులకు సత్వరమే వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్అధికారులు ఉన్నది సంతకాలకేనా? రోగులకు వైద్యం అందించడంలో ఎక్కడైనా ఇబ్బంది ఎదురవుతుందా, వైద్యులు ఓపీల్లో ఉన్నారా వంటి విషయాలను పర్యవేక్షించేందుకు కొత్తాస్పత్రిలో ఒక సివిల్‌సర్జన్ ఆర్ఎంఓ, ఒక డెప్యూటీ సివిల్‌సర్జన్ ఆర్ఎంఓ విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి సహాయకారిగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఏఆర్‌ఎంఓగా ఉంటున్నారు. వీరంతా ఏసీ గదులకే పరిమితం అవడం, ఇండెంట్లపై సంతకాలు చేయడం మినహా రోగులు పడుతున్న ఇబ్బందులు వీరికి పట్టడం లేదు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆటోలో తీసుకు వస్తే, లోపలికి తీసుకు వచ్చేందుకు ఎవరూ సహయం చేయడం లేదంటూ ఆటో డ్రైవర్ ఆర్ఎంఓ వద్దకు వచ్చి తనగోడు వెళ్లబోసుకున్నాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు. -
తిరువూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి
తిరువూరు: గిరిజన మహిళపై దాడి చేసి ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకుడైన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు డిమాండ్ చేశారు. ఇటీవల ఏకొండూరు మండలం గోపాలపురంలో స్థల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఒక గిరిజన మహిళపై దాడికి పాల్పడగా, ఆ మహిళ కుటుంబాన్ని స్వామి దాసు సోమవారం పరామర్శించారు. గిరిజనుల సొంత స్థల వివాదంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం సరికాదని, గతంలో కూడా ఎమ్మెల్యే తీరుతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారని స్వామిదాసు గుర్తు చేశారు. గత 30 ఏళ్లలో తిరువూరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు జరగలేదని, కొలికపూడి గెలిచిన నాటి నుంచీ తిరువూరులో సామాజిక సమస్యలు పెచ్చుమీరుతున్నా యని విమర్శించారు. తెలుగుదేశం అధిష్టానం సైతం ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోవడం గమనార్హమన్నారు. ఇకనైనా కొలికపూడి తన పనితీరు మార్చుకోవాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు నరెడ్ల వీరారెడ్డి, చలమాల సత్యనారాయణ, తిరు మలశెట్టి వేణు, గత్తం నాగేశ్వరరావు, సురేష్, భూక్యా గన్యా, రేగళ్ల మోహనరెడ్డి, అంజన్‌రెడ్డి, కాలసాని గోపాలనాగేశ్వరరావు, మోదుగు ప్రసాద్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి స్వామిదాసు డిమాండ్ -
విధిగా హెల్మెట్ ధరించాలి
విజయవాడస్పోర్ట్స్: ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ) ఎ.మోహన్ సూచించారు. 36వ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని ఎంజీ రోడ్డులో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీటీసీ మోహన్ ప్రారంభించి మాట్లాడారు. ఊహించని రీతిలో జరిగే రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను హెల్మెట్ రక్షిస్తుందన్నారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నామని, సీట్ బెల్ట్, త్రిబుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీఓ కె.వెంకటేశ్వరరావు, ఎంవీఐలు కె.శివరామ్‌గౌడ్, ఉదయ్శివప్రసాద్, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్మొవ్వ: స్థానిక శ్రీ మండవ కనకయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డి.కె.బాలాజీ పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాతో కలిసి సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తమ వేతనాలు పెంచాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కోరగా, ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి, వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల సంఖ్య, సంక్రాంతి సెలవుల అనంతరం వచ్చిన విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. భోజనం మెనూను పరిశీలించి, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల గణిత ల్యాబ్, కంప్యూటర్ (ఏటీఎల్) ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్‌ను పరిశీలించారు. పాఠశాల హెచ్ఎం సూర్యదేవర శ్రీదేవి, ఉపాధ్యాయులు పసుపులేటి శివ కోటేశ్వరరావు, మేకా రాణి, జాకీర్ అహ్మద్‌తో సంబంధిత అంశాలపై చర్చించారు. శాప్ ఏఓగా వెంకటరమణనాయక్ విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) పరిపాలన అధికారి(ఏఓ)గా ఆర్.వెంకటరమణనాయక్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా, చైర్మన్ అనిమిని రవినాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏఓ వెంకటరమణనాయక్‌కు కార్యాలయంలోని స్పోర్ట్స్ ఆఫీసర్లు, కోచ్‌లు, ఉద్యోగులు స్వాగతం పలికారు. యువతరం చేతుల్లోనే దేశ భవిష్యత్ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉంగుటూరు: భారత దేశ భవిష్యత్ యువతరం చేతుల్లోనే ఉందని తాను విశ్వసిస్తానని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న యువతతో సోమవారం ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కుటుంబ విలువలను కాపాడుకొని ముందు తరాలకు అందజేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ విలువలను కాపాడుకుని ఆదర్శనీయమైన యువతరంగా ఎదగాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి ట్రస్ట్ ఆవరణలో శిక్షణ కేంద్రాలను సందర్శించి, యువతతో కొద్ది సేపు ముచ్చటించారు. డైరెక్టర్ పరదేశి పాల్గొన్నారు. -
కోర్టు కేసులపై దృష్టిసారించాలి
మచిలీపట్నంటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం’లో వచ్చిన అర్జీల్లో గడువు దాటిన అర్జీలు, పెండింగ్ కోర్టు కేసులపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జేసీ అధ్యక్షతన సోమవారం మీ కోసం కార్యక్రమం జరిగింది. జేసీ గీతాంజలిశర్మ మాట్లా డుతూ.. గడువులోగా అర్జీలు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసులు సమీక్షించారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు సమీక్షించి, సకాలంలో కోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకో వాలని సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, కలెక్టర్ ప్రసంగాన్ని సిద్ధం చేయాలని, వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం చేసేందుకు వెంటనే పేర్లు పంపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమంపై ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు. జిల్లాలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఇంటింటి సర్వే ప్రారంభించి ఫిబ్రవరి రెండో తేదీ వరకు నిర్వహిస్తామని, వివిధ శాఖల అధికారులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బందరు ఆర్డీఓ కె.స్వాతి, సివిల్ సప్లయీస్ డీఎం పద్మాదేవి, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు ప్రజల నుంచి 142 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె.కన్నమనాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, డ్వామా పీడీ కె.వి.శివప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జేసీ గీతాంజలిశర్మ -
తిరుపతమ్మకు రూ.2.31 కోట్ల ఆదాయం
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ వేలం పాటల ద్వారా ఆలయానికి రూ.2,31,40,444 ఆదాయం సమకూరినట్లు ఈఓ బి.హెచ్.వి.ఎస్.ఎన్.కిషోర్‌కుమార్ తెలిపారు. ఏడాది పాటు ఆలయం వద్ద ఫొటోలు విక్రయించుకునే లైసెన్స్ హక్కును రూ.5,12,000కు నూతలపాటి రాంబాబు, క్యాంటీన్ నిర్వహణను రూ.11,18,000కు కె.అజయ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అలాగే చిన్న తీర్థం విక్రయం, చిన్న తీర్థం శుభ్ర పరుచుట, భద్రపరుచు లైసెన్స్‌ను రూ.4,44,444కు ఎ. గోపి, దేవస్థాన ప్రాంగణంలో మిఠాయి, బొంగు బియ్యం విక్రయించుకునే హక్కును రూ.10,16,000కు ఎస్. శ్రీకాంత్ దక్కించుకున్నారు. భక్తులు సమర్పించే వస్త్రాలు పోగు చేసుకునే హక్కును రూ. 66,00,000కు పి. సీతారామారావు, భక్తులు సమర్పించే కొబ్బరి చెక్కలు పోగు చేసుకునే హక్కును రూ.24,52,000కు బి. సుబ్బారావు, వాహనాల పార్కింగ్ రుసుం వసూలు చేసుకునే హక్కును రూ.46,53,000కు ఎల్.వినయ్ దేవస్థాన ప్రాంగణంలో పూలు, పూల దండలు విక్రయించు లైసెన్స్ హక్కును రూ.3,11,000కు టి. సోమయ్య, దేవస్థానం సత్రాల నిర్వహణ, టెంట్ హౌస్ నిర్వహణను రూ.49,15,000కు జి. సుధాకర్, శ్రీగోకులం వద్ద పచ్చగడ్డి విక్రయించునే లైసెన్స్‌ను ఎల్.కోటిరెడ్డి హెచ్చు పాటదారుగా నిలిచి దక్కించుకున్నారు. ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ ఎమ్మార్పీఎస్ అమరావతి అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు
ఇబ్రహీంపట్నం: ఏపీ ఎమ్మార్పీఎస్ అమరావతి అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నానికి చెందిన మందా నాగమల్లేశ్వరరావు నియమితులయ్యారు. ఏపీ ఎమ్మార్పీఎస్ విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ నాగమల్లేశ్వరరావును అమరావతి అధ్యక్షుడిగా నియమించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఫిబ్రవరి 5న విజయవాడలో జరగనున్న ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశం విజయవంతం చేయాలని నేతలకు సూచించారు. వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కాకినాడ వాసుల దుర్మరణం
పమిడిముక్కల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి గోడను ఢీ కొన్న ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై మంటాడ ఫ్లై ఓవర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా పాత ఇసుకపల్లికి చెందిన దాసరి నిమ్స్ చంద్ర(21) తన బైక్‌పై కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన ముక్తా నాగవీరదుర్గ(20)తో హైదరాబాద్ బయలు దేరాడు. మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వస్తుండగా మంటాడ ఫ్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చొన్న నాగవీరదుర్గ అక్కడికక్కడే మృతి చెందాడు. నిమ్స్ చంద్రకు తీవ్ర గాయాలవడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ శ్రీను తెలిపారు. బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం.. వ్యక్తి మృతికృష్ణలంక(విజయవాడతూర్పు): బైక్ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణా జిల్లా నిడమానూరు చెందిన యార్లగడ్డ విజయ సాయిచౌదరి(55) గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని ఓ యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రతి రోజు ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతను తన ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం 6.30 గంటలకు వారధి 39వ కానా వద్దకు చేరుకోగానే అతని ద్విచక్ర వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. దీంతో సాయిచౌదరి కిందపడిపోయాడు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం అతని తలమీదుగా వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శిక్ష పడుతుందనే భయంతో యువకుడి ఆత్మహత్యగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓ కేసులో కోర్టు శిక్ష విధిస్తుందన్న భయంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఊర్మిళానగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఊర్మిళానగర్‌కు చెందిన షేక్ బాజీ షరీఫ్(26) ఆటోనగర్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓ బాలిక వెంట పడి ఏడిపించాడని, ఆమె మరణానికి కారణమయ్యాడని అతనిపై 2018లో భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో బాజీ షరీఫ్ కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. త్వరలో కోర్టులో కేసు ట్రయల్‌కు వస్తుందని, తనకు శిక్ష పడే అవకాశం ఉందని పలుమార్లు తల్లి వద్ద వాపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం బాజీ షరీఫ్ తల్లి కూలీ పనులకు ఐరన్ యార్డుకు వెళ్లింది. ఆరోగ్యం బాగోలేక ఆమె మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చింది. అప్పటికే బాజీ షరీఫ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై అతని తల్లి షేక్ ఆదాం బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఉన్న కేసులో శిక్ష పడుతుందని పదే పదే చెబుతూ మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెయ్యదూడల ఉత్పత్తికి వీర్యం సరఫరా
గొట్టుముక్కల(కంచికచర్ల): పశు సంవర్ధక శాఖ ద్వారా గోకులాలు, బహు వార్షిక పశుగ్రాస పెంపకం, మేలు జాతి పెయ్యదూడల ఉత్పత్తికి లింగ నిర్ధారణ వీర్యం సరఫరా చేస్తామని జిల్లా పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం.హనుమంతరావు పేర్కొన్నారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో పశువైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు గేదెల గోకులం షెడ్డుకు రూ.1.80 లక్షలు, ఆరు గేదెల గోకులం షెడ్డుకు రూ.2.30 లక్షల నిధులు కేంద్ర ప్రభుత్వ ఉపాధిహామీ పధకం నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. పశు సంవర్ధక శాఖ ద్వారా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, సైలేజీ ఉత్పత్తి కోసం 50 శాతం రాయితీపై మినీ సైలేజ్ యూనిట్లను రైతులకు అందజేస్తామన్నారు. పశువుల గర్భకోశ వ్యాధులకు అవసరమైన చికిత్స చేసి మందులు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలు, దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీ కోరారు. అనంతరం గ్రామంలోని 830 గొర్రెలు, మేకలు, పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు. పశు సంవర్ధక శాఖ నందిగామ ఉప సంచాలకులు జి.మోజెస్ వెస్లీ, కంచికచర్ల సహాయ సంచాలకులు కె.వెంకట్రావు, కృష్ణమూర్తి, వెటర్నరీ వైద్యుడు ఎం.నవీన్‌కుమార్, గోపాలమిత్ర అనిల్‌కుమార్, రైతులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై బినామీ అర్చకుడి చేతివాటం
హుండీలో నుంచి కానుకల చోరీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై చేతివాటం ప్రదర్శించిన బినామీ అర్చకుడు కటకటాలపాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో త్వరలో రిటైర్ కాబోతున్న సీనియర్ అర్చకుడు.. కిశోర్ అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద విధులు నిర్వహిస్తుంటాడు. సోమవారం తెల్లవారుజామున కామథేను అమ్మవారికి బాలభోగం తీసుకువచ్చేందుకు మహా మండపం ఆరో అంతస్తులోని దేవస్థాన నివేదనశాల వద్దకు వచ్చాడు. అయితే ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించే వేదిక వద్ద ఉన్న 48వ నంబర్ హుండీపై కిశోర్ కన్ను పడింది. అసలే చీకటి.. పైగా తెల్లవారుజాము కావడంతో చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత హుండీ లోపల చెయ్యి పెట్టి కానుకలు, ముడుపులను బయటకు తీశాడు. అయితే ఈ విషయం అక్కడే ఉన్న స్వీపర్ గమనించి సెక్యూరిటీ అధికారికి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని వెంటనే ఆలయ డీఈఓ రత్నరాజు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజీతో తీసుకుని దేవస్థాన ప్రాంగణంలోని పోలీసు అవుట్ పోస్ట్‌కు సమాచారం అందించారు. పోలీసులు దేవస్థాన అధికారుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. హుండీ నుంచి ఎంత చోరీ చేసింది విచారణలో తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. -
బైక్ చోరీ చేసిన వ్యక్తికి జైలుశిక్ష, జరిమానా
గన్నవరం: బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదు నెలలు జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ గన్నవరం 8వ అడిషనల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. బాపులపాడు మండలం బొమ్ములూరుకు చెందిన చిన్నం అమరేష్ తాపీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది ఫిబ్రవరి 4న గన్నవరంలోని టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన అమరేష్ తన బైక్‌ను రీచ్ స్కూల్ రోడ్డులో నిలిపి తాళం వేశాడు. కొద్దిసేపటి తర్వాత పార్కింగ్ చేసిన బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు బైక్‌ను పెదపారుపూడి మండలం వెంట్రప్రగడకు చెందిన అప్పికట్ల రాజీవ్ దొంగిలించినట్లు గుర్తించారు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో రాజీవ్‌కు కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు జైలుశిక్ష అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో గన్నవరం పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.మాధవి వాదనలను వినిపించారు. -
భూముల రీ సర్వే ప్రారంభం
కంచికచర్ల: పైలట్ ప్రాజెక్టులో భాగంగా నందిగామ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని ఏడు గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రారంభించినట్లు నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని గండేపల్లిలో రెవెన్యూ అధికారులు సోమవారం భూముల రీ సర్వేను చేపట్టారు. ఈ మేరకు ఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లోని భూములను ఇప్పటికే బ్లాకులుగా విభజించి రీ సర్వే ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రతి బ్లాక్‌లో 200 నుంచి 250 ఎకరాల భూమి రీ సర్వే చేస్తామని చెప్పారు. ప్రతి బ్లాకుకు ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, వీఆర్ఏలను బృందాలుగా నియమించామన్నారు. భూ యజమానులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హద్దుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రీ సర్వే చేసే సమయంలో భూ యజమాని భూమి వద్దకు రాకపోయినా వాట్సాప్ గ్రూప్ ద్వారా భూముల హద్దులు తెలియజేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన తర్వాత రాజముద్రతో క్యూఆర్ కోడ్‌తో కొత్త పాస్‌బుక్ జారీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.జాహ్నవి, వీఆర్వోలు కాంతారావు, రవికుమార్, రామారావు, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. -
దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవస్థానానికి చెందిన డిజిటల్ కీని అప్పగించడంలో నిర్లక్ష్యం వహించిన దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ డీవీవీజీకే ప్రసాద్(వేణు)పై ఆలయ ఈవో రామచంద్ర మోహన్ సస్పెన్షన్ వేటు వేశారు. దుర్గగుడి ఈవోగా రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించి తర్వాత దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఫైల్‌ను ఈ ఫైల్లో అప్లోడ్ చేయాలని సంబంధిత విభాగాల ఏఈవోలు, సూపరిండెంటెంట్‌లను ఆదేశించారు. దేవస్థాన ఈవోకు సంబంధించిన కీ సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్(వేణు) వద్దే పెట్టుకున్నారు. అంతే కాకుండా ఎఫ్ఏసీ ఓచర్లపై పాత తేదీలలో సంతకాలు చేసి ఉండటాన్ని గుర్తించారు. దీనిపై వేణును ఈవో వివరణ కోరినప్పటికీ సమాధానం చెప్పకపోవడంతో అతనిపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. నేడు హుండీ కానుకల లెక్కింపు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం లెక్కించనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రతి మంగళవారం దేవస్థాన అధికారులు, సిబ్బందికి వీకాఫ్ ఉండగా, ఇకపై వీకాఫ్ ఉండబోదని తెలుస్తోంది. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రమోహన్ వీకాఫ్పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గణతంత్ర వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 26వ గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాతీయ సమైక్యతను చాటేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లను సీపీ రాజశేఖరబాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పేరెడ్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాకావిష్కరణ చేస్తారన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలోనే ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలో ప్రొటోకాల్ అనుసరించి ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలు వీక్షించేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంటింజెంట్ విభాగాల ప్రదర్శనలు, రాష్ట్ర ప్రగతిని చాటే శకటాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంప్‌ను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలన్నారు. పోలీస్ కమిషనర్ పి.రాజశేఖరబాబు మాట్లాడుతూ వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో డీసీపీ గౌతమిశాలీ, ఆర్డీఓ చైతన్య, ముఖ్యమంత్రి భద్రత, రాజ్ భవన్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా పండుగ రద్దీ నిర్వహణ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికులకు అవసరాల మేరకు విజయవంతంగా 90 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపి విశేషమైన మైలురాయిని సాధించిందని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఈ నెల 1 నుంచి ప్రయాణికుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సికింద్రాబాద్, తిరుపతి, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, కొల్లం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. అదనపు రైళ్లు ఉన్నప్పటికీ రైళ్ల నిర్వహణలో 88 శాతం సమయపాలనతో డివిజన్ సరికొత్త రికార్డు నమోదు చేయడం గర్వకారణమని చెప్పారు. రద్దీ దృష్ట్యా డివిజన్ వ్యాప్తంగా అదనపు సిబ్బంది, సూపర్వైజర్ల ఏర్పాటు, ప్రధాన స్టేషన్లలో 30 యూటీఎఫ్, పీఆర్ఎస్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విజయవంతంగా రైళ్ల నిర్వహణకు కృషి చేసిన సీనియర్ డీఓఎం నరేంద్ర వర్మ, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, ఇతర అధికారులను, సిబ్బందిని డీఆర్ఎం ప్రత్యేకంగా అభినందించారు. -
జీజీహెచ్‌లో నిలిచిన వైద్యసేవలు
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులపాలు కావాల్సి వస్తోంది. వివిధ రకాల దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల సదరం ధ్రువీకరణ పత్రాలను రీ–వెరిఫికేషన్ చేసేందుకు జీజీహెచ్‌లో పనిచేస్తున్న నలుగురు కీలక వైద్యులను ఇతర ప్రాంతాలకు నియమిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి సూచించిన ప్రాంతాలకు సోమవారమే వెళ్లి విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొనటంతో నలుగురు వైద్యులు ఆస్పత్రిలో వైద్యసేవలను పక్కనపెట్టి పయనమయ్యారు. దీంతో ఈ విభాగాల్లో వైద్యసేవల్లో నిలిచిపోయాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు పడిగాపులు పడి నిరాశతో వెనుతిరిగారు. ఇతర ప్రాంతాల విధులకు వెళ్లిన వైద్యులు జీజీహెచ్‌లోని నేత్ర విభాగంలో పనిచేస్తున్న విభాగాధిపతి జి.భానుమూర్తి నూజివీడుకు, డాక్టర్ అమృత ఏలూరుకు, ఈఎన్టీ విభాగాధిపతి సి.అనిత విజయవాడకు, మానసిక వైద్యుడు నిరంజన్‌కుమార్ కాకినాడకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాల మేరకు సోమవారమే హుటాహుటిన విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వటంతో వైద్యులు నలుగురు వెళ్లారు. నలుగురు వైద్యులు సదరం సర్టిఫికెట్ల రీ–వెరిఫికేషన్ విధులకు వెళ్లటంతో ఆయా విభాగాల్లో వైద్యసేవలు నిలిచిపోయాయి. ఈ వైద్యసేవలు వచ్చే మే వరకు కూడా కొనసాగే పరిస్థితి లేదు. దీంతో జీజీహెచ్‌లో ఈ విభాగాలు మూతపడనున్నాయి. ఆస్పత్రికి ఈ విభాగాల్లో వైద్యం కోసం వచ్చే వారు వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. రోగుల అవస్థలు వర్ణనాతీతం.. నేత్ర విభాగంలో శస్త్రచికిత్సల కోసం సోమవారం 20 మంది రోగులు వచ్చారు. వీరికి ఉదయం శస్త్రచికిత్సలకు సంబంధించి ముందస్తు పరీక్షలు సైతం నిర్వహించారు. వైద్యుడు భానుమూర్తి శస్త్రచికిత్సలు చేసేందుకు ఉపక్రమించే సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డి.ఆషాలత నుంచి ఈ ఆదేశాలు అందాయి. దీంతో హుటాహుటిన సదరు విధులకు హాజరయ్యేందుకు వెళ్లారు. నేత్ర శస్త్రచికిత్సలు నిలిచిపోవటంతో రోగులు నిరాశతో వెనుతిరిగారు. అలాగే నేత్ర, ఈఎన్టీ విభాగాల ఓ.పి.ల వద్దకు వైద్యసేవల కోసం వచ్చిన రోగులు సైతం నిరాశతో వెళ్లాల్సి వచ్చింది. దీంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మూడు నెలలుగా తిరుగుతున్నా.. కంటి శస్త్రచికిత్స కోసం ఆస్పత్రికి మూడు నెలలుగా తిరుగుతున్నాను. శనివారం వచ్చి అడిగితే మళ్లీ వాయిదా వేశారు. ఇంటికి వెళ్లిన తరువాత ఫోన్ చేసి సోమవారం రమ్మన్నారు. ఉదయం 7 గంటల కల్లా వచ్చాను. వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తారని చూస్తున్న సమయంలో నర్సు వచ్చి డాక్టర్ రావటం లేదు. వేరే డ్యూటీ పడిందని చెప్పి వెళ్లిపోమన్నారు. – తలుపుల శ్రీనివాసరావు, భోగిరెడ్డిపల్లి ఆపరేషన్ చేస్తామంటే వచ్చాను.. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా జరగలేదు. గతంలో ఒక కంటికి ఈ ఆస్పత్రిలోనే ఆపరేషన్ చేయించుకున్నాను. మరో కంటికి చేయించుకునేందుకు రెండు నెలలుగా తిరుగుతున్నాను. సోమవారం ఆపరేషన్ చేస్తామంటే వచ్చాను. ఇంతలోనే డాక్టర్ లేరు వేరే డ్యూటీకి వెళ్లారని చెప్పారు. ఇలా అయితే ఎలా.. పేద రోగులకు ఈ ప్రభుత్వంలో ఇచ్చే మర్యాద ఇదేనా. – జి.వెంకటేశ్వరమ్మ, జీలగలగండి సదరం రీ–వెరిఫికేషన్ విధుల్లోకి మచిలీపట్నం వైద్యులు ఇతర ప్రాంతాల్లో విధులకు నలుగురు వైద్యులు ఐదు నెలల పాటు నాలుగు విభాగాల్లో నిలిచిపోనున్న సేవలు నేత్ర శస్త్రచికిత్సల కోసం క్యూ కట్టిన రోగులు -
ఫస్ట్ ఇంటర్ పరీక్షల రద్దు సరికాదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంటర్మీడియెట్‌లో ప్రస్తుతం అమలవుతున్న విధానాన్నే కొనసాగించాలని ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. విద్యాశాఖ ఇంటర్ విద్యలో సంస్కరణల పేరుతో చేస్తున్న మార్పులపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని శారద కళాశాలలో ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారంసెమినార్ జరిగింది. ఈ సెమినార్లో పాల్గొన్న విశ్రాంత అధ్యాపకులు, అధికారులు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అమల్లో విధానాన్నే కొనసాగించాలని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షను రద్దు చేసి, రెండో ఏడాది పబ్లిక్ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి అప్లికేషన్స్ దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో కూడా సిలబస్‌లో చేర్చాలన్నారు. ఒక సబ్జక్ట్‌లో ఫెయిలయ్యి మిగిలిన ఐదు సబ్జెక్టుల్లో పాస్ అయితే మొత్తంగా పాస్ అయినట్లు పరిగణించాలని సంస్కరణలు చేస్తున్నట్లు తెలిసిందని, దీని వల్ల ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ విలువ తగ్గిపోతుందని చెప్పారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాధా కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ఎల్.శ్రీధర్, కె.క్రిస్టోఫర్, ఫైనాన్స్ సెక్రటరీ ప్రభాకర్, సంపూర్ణరావు, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్స్ సంక్షేమ సంఘం -
జెడ్పీ సహకారంతో అందించేందుకు కృషి..
పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ సాఫ్ట్ కాపీ రూపంలో వచ్చింది. దీనిని ఎంఈఓలు, హెచ్ఎంలకు పంపించి, మోడల్ పత్రాలను సంబంధిత సబ్జెక్టు టీచర్లతో బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా పరిషత్ సహకారంతో ప్రింటెడ్ మెటీరియల్ అందించేందుకు కృషి చేస్తున్నాం. డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్చి 10 వరకు వంద రోజుల ప్రణాళికతో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తూ, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాం. – పీవీజే రామారావు, డీఈఓ -
కార్పొరేట్ లబ్ధి కోసమే..
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. పరీక్షలు సమీపిస్తున్నా.. ఇప్పటి వరకు స్టడీ మెటీరియల్‌ను అందజేయకపోతే ఉత్తీర్ణతా శాతం తగ్గుతుంది. కార్పొరేట్ సంస్థల్లో ఫలితాలు మెరుగ్గా ఉంటే వారి అడ్మిషన్లు పెరుగుతాయి. స్టడీ మెటీరియల్ ప్రింట్ చేయించుకోవాలంటే పేద విద్యార్థులపై భారం పడుతుంది. ఇది సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రింటెడ్ మెటీరియల్‌ను ఉచితంగా అందించాలి. – ఎస్. సమరం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
ఇంద్రకీలాద్రిపై తగ్గిన భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చి తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకునే భక్తులతో గత మూడు రోజులుగా రద్దీ నెలకొంది. ఆదివారం కూడా ఇదే విధంగా కొనసాగుతుందని ఆలయ అధికారులు భావించారు. అయితే ఉదయం నుంచి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత క్యూలైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. దుర్గమ్మ సేవలో.. దుర్గమ్మను దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కె. సత్యనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సత్యనారాయణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకోగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈఈ కోటేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను బహూకరించారు. సూర్యోపాసన సేవ.. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
శివాలయంలో ప్రత్యేక పూజలు
పెదకాకాని: పెదకాకాని శివాలయంలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. జిల్లా నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటిలో పొంగళ్ళు చేసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రభలతో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ఓం నమః శివాయ అని స్మరిస్తూ ప్రదక్షిణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అంత్రాలయ అభిషేకాలు, దర్శనాలు, ఏకవారాభిషేక పూజలు, తలనీలాలు సమర్పణ, నామకరణలు, అన్నప్రాసనలు, రాహుకేతు పూజలు, నవగ్రహ పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. -
అమిత్‌షా రాజీనామా చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపైన, అంబేడ్కర్‌పై గౌరవం లేదన్నారు. దేశమంతా అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తుంటే, మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు డి.హరినాథ్, పోలారి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో అంబేడ్కర్‌ను అవమానిస్తూ అమిత్‌షా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన నిరసనలో జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవీంద్రనాథ్, కె.రామాంజనేయులు, నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కీ లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి బి.నాసర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ