Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన' | Heavy Rains All Over Telangana State | Sakshi
Sakshi News home page

Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన'

Published Sun, Sep 1 2024 4:29 AM | Last Updated on Sun, Sep 1 2024 4:29 AM

నారాయణపేట జిల్లా అభంగాపూర్‌ – బండగొండ మధ్యలో వాగు దాటుతున్న ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు.. పలుచోట్ల కుండపోత

ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. ఆదివారం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్లు 
శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 16.38, బోమన్‌దేవిపల్లిలో 13.75, వరంగల్‌ జిల్లా రెడ్లవాడలో 12.35, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 10.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల 5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మొత్తంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. 

సీజన్‌ సగటులో అధిక వర్షపాతం 
నైరుతి సీజన్‌లో ఆగస్టు చివరినాటికి రాష్ట్రంలో 57.59 సెం.మీ. సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 66.37 సెం.మీ. కురిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్‌ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం.. జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. 

పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. 
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏకబిగిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన పుట్ట మహేశ్‌ (17) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుతో మృతి చెందాడు. 

ములుగు జిల్లా జగ్గన్నగూడెం సమీపంలోని బొగ్గులవాగు, పస్రా–ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలాల మధ్య జలగలంచవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పస్రా– తాడ్వాయి మధ్య కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల వాగు ఉప్పొంగడంతో.. వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి.  

⇒ ఖమ్మం జిల్లా మధిర పట్టణం జలదిగ్బంధమైంది. బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. భారీ వర్షాల నేపథ్యంలో హుటాహుటిన మధిరకు బయలుదేరారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు–పెగళ్లపాడు మధ్య రహదారిపై చేరిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్కలవాగులో భవానిపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు(19) గల్లంతయ్యాడు. 

⇒ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. 

⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా రాజాపేటలో, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో పొలాలు నీటమునిగాయి. 

⇒ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా బండగొండలో ఇద్దరు యువకులు వాగులో పడి కొట్టుకుపోగా.. స్థానికులు గమనించి కాపాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దుందుభి, వర్నె వాగు ఉధృతంగా పారుతున్నాయి. జడ్చర్లలో ఏరియా ఆస్పత్రి జలదిగ్బంధమైంది వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం దావాజీపల్లి సమీపంలో కేఎల్‌ఐ కాల్వకు గండిపడటంతో పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో ఓ ఇంటి పైకప్పు కూలింది. 

⇒ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్‌ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. అధికారులు ప్రజలను జేసీబీ సహాయంతో వాగును దాటిస్తున్నారు. 

గ్రేటర్‌ సిటీకి ముసురు 
హైదరాబాద్‌ మహానగరానికి ముసురు పట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీనితో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ట్రాఫిక్‌ చాలా నెమ్మదిగా సాగింది. లో తట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. హై దరాబాద్‌ జిల్లా పరిధిలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. 

విస్తారంగా వానలతో హిమాయత్‌నగర్, గండిపేట జంట జలాశయాల్లోకి వరద పెరిగింది. దీ నితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా తరలించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్‌ 
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారిని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో శనివారం ఆయన సీఎస్‌తో సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాల గేట్లు ఎత్తేసే నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. 

ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష 
భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని జిల్లా కలెక్టరేట్లు, జీహెచ్‌ఎంసీ, సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్‌ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని.. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారిని నియమించి.. జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పరిస్థితికి అనుగుణంగా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

బొగత జలపాతం సందర్శన నిలిపివేత 
వాజేడు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేంజర్‌ శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారనేది మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు.

సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్త
వైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్‌ రవీందర్‌ నాయక్‌ను ఆదేశించారు. 

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.

డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్‌ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్‌ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్‌ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్‌ (128) కేసులు నమోదయ్యాయి.

చికున్‌ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్‌ అయిన వాటిలో చికున్‌ గున్యా కేసులు 167. చికున్‌ గున్యా హైరిస్క్‌ జిల్లాల్లో హైదరాబాద్‌ (74), మహబూబ్‌నగర్‌ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్‌ (11) కేసులు నమోదయ్యాయి.

మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement