Dengue
-
డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్
పాట్నా: డెంగ్యూ వ్యాధి నుంచి ప్రజలకు త్వరలో విముక్తి లభించనుంది. బీహార్‌లోని పట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. దేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైందని ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్, పనాసియా బయోటెక్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.వ్యాక్సిన్ పరీక్షల కోసం 10 వేల మందికి ముందుగా వ్యాక్సిన్ వేసి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 19 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ ఒకటి. ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి ట్రయల్ వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా బీహార్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది 4,416 కేసులు నమోదయ్యాయి. 12 మంది డెంగ్యూ బాధితులు మృతిచెందారు. ఒక్క పట్నాలోనే 2,184 కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి -
బీహార్‌లో డెంగ్యూ విజృంభణ.. ఒక్కరోజులో 90 కేసులు
పట్నా: బీహార్‌లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్నాలో వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పాట్నాలో ఒక్కరోజులో అత్యధికంగా 90 మంది డెంగ్యూ బారినపడ్డారు.పాట్నా జిల్లాలో మొత్తం డెంగ్యూ బాధితుల సంఖ్య 1,147కి చేరింది. కంకర్‌బాగ్ ప్రాంతం డెంగ్యూ కేసులకు హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ ప్రతీ ఇంటిలోనూ డెంగ్యూ బాధితులు కనిపిస్తున్నారు. తానాలోని కంకర్‌బాగ్, అజీమాబాద్ తర్వాత బంకీపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. 28 మంది కంకర్‌బాగ్‌లో డెంగ్యూతో బాధపడుతున్నారు. బంకీపూర్‌లో 23 మంది, పాటలీపుత్రలో 13 మంది, అజీమాబాద్‌లో ఏడుగురు డెంగ్యూ బారినపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. బీహార్‌లో మొత్తం 2,419 మంది డెంగ్యూ బారినపడినట్లు వైద్యాధికారులు గుర్తించారు.డెంగ్యూతో ఇప్పటివరకు బీహార్‌లో ఎనిమిది మంది మృతిచెందారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఎంసీహెచ్‌లోని మెడిసిన్ విభాగం సీనియర్ వైద్యుడు డాక్టర్ రాజన్ కుమార్, ఎన్ఎంసీహెచ్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ సోకకుండా ఉండాలంటే దోమలను నివారించాలన్నారు. ఇది కూడా చదవండి: ఏడడుగుల గోడ దూకి మేకను ఎత్తుకెళ్లిన తోడేళ్లు -
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. ఆదివారం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్లు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 16.38, బోమన్‌దేవిపల్లిలో 13.75, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.35, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 10.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల 5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మొత్తంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సీజన్ సగటులో అధిక వర్షపాతం నైరుతి సీజన్లో ఆగస్టు చివరినాటికి రాష్ట్రంలో 57.59 సెం.మీ. సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 66.37 సెం.మీ. కురిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్లలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏకబిగిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన పుట్ట మహేశ్ (17) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుతో మృతి చెందాడు. ⇒ ములుగు జిల్లా జగ్గన్నగూడెం సమీపంలోని బొగ్గులవాగు, పస్రా–ఎస్ఎస్ తాడ్వాయి మండలాల మధ్య జలగలంచవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పస్రా– తాడ్వాయి మధ్య కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల వాగు ఉప్పొంగడంతో.. వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఖమ్మం జిల్లా మధిర పట్టణం జలదిగ్బంధమైంది. బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. భారీ వర్షాల నేపథ్యంలో హుటాహుటిన మధిరకు బయలుదేరారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు–పెగళ్లపాడు మధ్య రహదారిపై చేరిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్కలవాగులో భవానిపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు(19) గల్లంతయ్యాడు. ⇒ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా రాజాపేటలో, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా బండగొండలో ఇద్దరు యువకులు వాగులో పడి కొట్టుకుపోగా.. స్థానికులు గమనించి కాపాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి, వర్నె వాగు ఉధృతంగా పారుతున్నాయి. జడ్చర్లలో ఏరియా ఆస్పత్రి జలదిగ్బంధమైంది వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజీపల్లి సమీపంలో కేఎల్ఐ కాల్వకు గండిపడటంతో పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ⇒ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. అధికారులు ప్రజలను జేసీబీ సహాయంతో వాగును దాటిస్తున్నారు. గ్రేటర్ సిటీకి ముసురు హైదరాబాద్ మహానగరానికి ముసురు పట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీనితో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. లో తట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. హై దరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విస్తారంగా వానలతో హిమాయత్‌నగర్, గండిపేట జంట జలాశయాల్లోకి వరద పెరిగింది. దీ నితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో శనివారం ఆయన సీఎస్‌తో సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాల గేట్లు ఎత్తేసే నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని జిల్లా కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని.. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారిని నియమించి.. జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పరిస్థితికి అనుగుణంగా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.బొగత జలపాతం సందర్శన నిలిపివేత వాజేడు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేంజర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారనేది మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు.సీజనల్ వ్యాధులపై జాగ్రత్తవైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
మంకీపాక్స్‌పై సర్కారు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మంకీపాక్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకాన్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చలి, అలసట, చర్మంపై పాపుల్స్గా మారే మాక్యులోపాపులర్ దద్దుర్లు వంటివి ఉంటే అనుమానిత కేసులుగా పరిగణిస్తారు. మంకీపాక్స్ సాధారణంగా రెండు నుండి నాలుగు వారాల వరకు ఉండే వ్యాధి. పిల్లలలో ఎక్కువగా సంభవిస్తాయి. మంకీపాక్స్ కేసు మరణాలు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. గత 21 రోజులలో మంకీపాక్స్ ప్రభావిత దేశాల నుంచి వచి్చన ఏ వ్యక్తి అయినా తీవ్రమైన దద్దుర్లతో బాధపడుతుంటే అనుమానించాలని పేర్కొంది. వారితో కలిసివున్న వారిని కూడా గుర్తించాలి. మంకీ పాక్స్ అనేది మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలతో ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తద్వారా మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవగాహన, వేగంగా కేసులను గుర్తించడం, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు అవసరమని పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అనుమానిత కేసులు గుర్తిస్తే గాం«దీకి పంపాలి మంకీ పాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. మెడికల్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్‌కు సంబంధించిన రోగుల కోసం ఐసోలేషన్ బెడ్లను కేటాయించాలని ఆదేశించారు. ఇప్పటికే గాం«దీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను కేటాయించిన సంగతి తెలిసిందే. అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా వైద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. అనుమానిత కేసులు ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స కోసం గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలి. అలాగే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చే అంతర్జాతీయ అనుమానిత ప్రయాణీకులుంటే వారిని రంగారెడ్డి డీఎంహెచ్‌వోతో సమన్వయం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. కాగా 1970లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ మొదటి మానవ కేసు నమోదైంది. వణికిస్తున్న డెంగీ రాష్ట్రంలో డెంగీ విస్తరిస్తోంది. గతేడాది కంటే ఇప్పుడు అధికంగా సీజనల్ వ్యాధులు సంభవిస్తున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో 1.42 కోట్ల ఇళ్లను వైద్య బృందాలు సందర్శించాయి. 4.40 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారని ఆయన తెలిపారు.అందులో 2.65 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు రవీంద్ర నాయక్ వెల్లడించారు. వర్షాల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దోమల సంతానోత్పత్తి పెరిగి డెంగీ విజృంభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మొత్తం 81,932 మంది రక్త నమూనాలను పరీక్షించగా, అందులో 5,372 మంది డెంగీ సోకినట్లు వెల్లడించారు. పాజిటివిటీ 6.5 శాతంగా ఉందని వెల్లడించారు. డెంగీ హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ 1,872 కేసులతో మొదటిస్థానంలో ఉంది. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్లగొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్ జిల్లాల్లో 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ పది జిల్లాలను రాష్ట్రంలో హైరిస్క్ జిల్లాలుగా ప్రకటించారు. చికున్‌గున్యా కేసుల్లోనూ హైదరాబాద్ టాప్ మరోవైపు చికున్‌గున్యా కేసులు కూడా నమోదవు తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,673 మంది రక్తనమూనాలను పరీక్షించగా, 152 మందికి చికున్‌గున్యా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివిటీ రే టు 5 శా తంగా ఉండటం గమనార్హం. చికున్‌గున్యా హైరిస్క్ జిల్లాలుగా హైదరాబాద్ 61 కేసులతో మొ దటిస్థానంలో ఉంది. వనపర్తి 17, మహబూబ్‌నగర్ జిల్లా లో 19 నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా కోసం 23.19 లక్షల మంది నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా, అందులో 191 మలేరియా కేసులు నమోదయ్యాయి. పాజిటి విటీ రేటు 0.008 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో టీ æ– హబ్ ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. వాటిల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 53 బ్లడ్‌బ్యాంకులు అవసరమైన బ్లడ్ యూనిట్లతో సిద్ధంగా ఉన్నాయని డీహెచ్ రవీంద్రనాయక్ తెలిపారు. మొత్తం 33 జి ల్లాల్లో 108 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులన్నీ ఆసుపత్రుల్లో ఉన్నాయన్నారు. కట్టడిలో వైఫల్యం... సీజనల్ వ్యాధులను కట్టడి చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దోమల నియంత్రణకు ఇతర శాఖలను సమన్వయం చేయటంలో వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో దోమలు పెరిగాయని చెప్తున్నారు. వానాకాలం మొదలయ్యే సమయానికి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. కానీ అవేవీ చేయలేదు. పైగా కీలకమైన సమయంలో బదిలీలు జరగడం, అవి కూడా సక్రమంగా నిర్వహించకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలు చేయాల్సి రావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై దృష్టిసారించలేకపోయారు. మరో వైపు పారిశుధ్యం లోపించిందని అంటున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయలేదని, నివారణ చర్యల పట్ల ప్రచారం చేయలేదని మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మందుల కొరత నెలకొందనీ, సాధారణంగా సీ జనల్ వ్యాధులకు ముందే అన్ని ఆసుపత్రుల్లో బఫర్ స్టాక్ ఉంచుకో వా లని సూచిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ కూడా పూర్తిస్థాయిలో జరగడంలేదనీ, నిల్వ నీటిల్లో స్ప్రేయింగ్ చేయడంలేదని వైద్యనిపుణులు ఆరోపిస్తున్నారు. -
దోమల అంతానికి లేజర్ ఫిరంగి!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన వర్షాల కారణంగా దోమలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో డెంగ్యూ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా ఇంట్లో దోమలను నాశనం చేసే ఓ చిన్న యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ యంత్రాన్ని 'ఇంటికి ఐరన్ డోమ్' అని ఆయన పేర్కొన్నారు.వర్షాల కారణంగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమయంలో వాటిని నియంత్రించడానికి ఈ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చైనీస్ వ్యక్తి కనిపెట్టిన ఈ యంత్రం ఓ చిన్న ఫిరంగి మాదిరిగా ఉంది.వీడియోలో కనిపించే ఈ చిన్న యంత్రం లేజర్ కిరణాల ద్వారా దోమలను కనిపెట్టి నాశనం చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మిషన్ లెక్కకు మించిన దోమలను అంతం చేస్తోంది. ఇలాంటి మిషన్ కొనటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.With dengue on the rise in Mumbai, I’m trying to figure out how to acquire this miniature cannon, invented by a Chinese man, which can seek out & destroy mosquitoes! An Iron Dome for your Home…pic.twitter.com/js8sOdmDsd— anand mahindra (@anandmahindra) August 24, 2024 -
అప్పుడు కరోనా.. ఇప్పుడు డెంగీ
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్‌లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరంభారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్‌లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి. అలాగే థాయ్‌లాండ్‌లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు. ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులుసోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా. కాగా, ఇన్‌ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్‌లో 2023 ఆగస్టులో, థాయ్‌లాండ్‌లో అక్టోబర్‌లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్‌లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఆ సంస్థపైనే ఆధారం.. ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. 2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది. అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్‌లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ -
కేంద్ర మంత్రి జుయల్ ఓరం భార్య మృతి
భువనేశ్వర్: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం భార్య జింగియా ఓరం మృతి చెందారు. డెంగ్యూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జుయల్ ఓరం సైతం డెంగ్యూ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జింగియా ఓరం మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. సీఎంతో పాటు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, స్పీకర్ సూరమా పాడి, ఇతర బీజేపీ నేతలు కూడా జింగియా ఓరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్..
-
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. సాధారణం కంటే 20 శాతం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముందస్తు చర్యలు లేకే డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్వరాల బాధితుల సంఖ్య. పెరుగుతోంది. ఎంజిఎంలో రోజుకు 30 జ్వరం కేసులు నమోదు అవుతుండగా.. రెండు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో 20 పడకల ప్రత్యేక ఫీవర్ వార్డ్ ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుత రోజులకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని.. డెంగ్యూ ఇమేజింగ్ ఫీవర్, డెంగ్యూ షాట్ సిండ్రోమ్ వస్తే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కావాలని సూపరిండెంట్ మురళి తెలిపారు.భాగ్యనగరవాసులకు అలర్ట్.. విషజ్వరాల కారణంగా రోగులతో దవాఖానాలు బిజీ (ఫొటోలు) -
డెంగీ నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్లో డెంగీ వ్యాప్తి అనేది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో దోమల పెరుగుదల, పారిశుధ్య నిర్వహణ లోపాలతో డెంగీ వ్యాప్తికి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఈ కేసులు పెరగగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ డెంగీ కేసుల్లో పెరుగుదల నమోదు కావడం ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. దీంతో డెంగీ టెస్టింగ్, దీని ట్రీట్మెంట్కు సంబంధించిన సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయనే దానిపై ఆన్లైన్లో ప్రజలు వెతకడం పెరిగిపోయింది. ఈ జనవరి–మార్చి నెలల మధ్యలో పోల్చితే ఏప్రిల్– జూన్‌ల మధ్య డెంగీకి చికిత్సలో నిపు ణులైన డాక్టర్లకు 20 శాతం మేర డిమాండ్ పెరిగినట్టు స్పష్టమైంది. భారత్‌లో స్థానిక సెర్చ్ ఇంజిన్ ‘జస్ట్ డయల్’ విడుదల చేసిన ‘కన్జూమర్ సెర్చ్ ట్రెండ్స్ డేటా’లో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. అంతేకాదు.. దోమ కాటు నివారణ కోసం దోమ తెరలకు కూడా భారీగా డిమాండ్ పెరిగినట్టు వెల్లడైంది. జాతీయ స్థాయిలో వీటి అమ్మకాలు ఒక్క సారిగా 64 శాతం పెరగగా...ఢిల్లీలో 709 శాతం, పుణెలో 216 శాతం, అహ్మదాబాద్‌లో 160 శాతం, బెంగళూరులో 122 శాతం, కోల్‌కతాలో 96 శాతం, ముంబైలో 31 శాతం, హైదరాబాద్‌లో 27 శాతం పెరుగుదల నమోదైనట్టుగా తెలుస్తోంది. దోమల సమస్య నియంత్రణకు ‘పెస్ట్‌కంట్రోల్ సర్వీసెస్’ను కూడా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా చూస్తే... దేశవ్యాప్తంగా పెస్ట్ కంట్రోల్ కేటగిరీలో ఆన్లైన్లో సెర్చింగ్ 24 శాతం పెరగగా, మెట్రోనగరాల్లో 25 శాతం, నాన్ మెట్రోనగరాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది.ఈ విషయంలో ఢిల్లీ 97 శాతం వృద్ధితో ప్రథమస్థానంలో నిలవగా, కోల్‌కతా 68శాతంతో, అహ్మదాబాద్ 45 శాతంతో, బెంగళూరు 19 శాతం, ముంబై 13 శాతం వృద్ధి సాధించింది.బల్లులు, నల్లుల నివారణకూ ఆన్లైన్ సెర్చింగ్దోమలతో పాటు బల్లులు, తేనెటీగలు, నల్లులు, పాము లు వంటి వాటి నియంత్రణకు అవసరమైన సర్వీసుల గురించి కూడా ఆన్లైన్ సెర్చింగ్ పెరిగింది. డెంగీ కేసుల వృద్ధి నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, దోమలు రాకుండా రెపెల్లెంట్ల వినియోగం, వేగంగా వైద్యసహాయం తీసుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో అవగా హన వంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. -
డేంజర్ బెల్స్.. ఫీవర్ హాస్పిటల్
-
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?'
ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొద్ది రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు హాజరవడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయంగా మరేదైనా బాంబు పేల్చబోతున్నారా..? అనే అనుమానాలకు తావిచ్చాయి. అయితే.. ఈ పుకార్లకు తెరదించుతూ ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ స్పందించారు. అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతున్నారని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యం కుదుటపడగానే అజిత్ పవార్ ప్రజల ముందుకు వస్తారని ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. 'ప్రజా కార్యక్రమాల్లో అజిత్ పవార్ కనిపించటం లేదని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. డెంగ్యూతో బాధపడుతున్న అజిత్ పవార్.. నిన్నటి నుంచే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరాను.' అని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఇదీ చదవండి: నోరు జారిన రాహుల్.. అదానీ కోసం పనిచేయాలని పార్టీ నేతకు సూచన -
మెదడుపై డెంగీ దాడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ప్రజలు ఓవైపు సీజనల్ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా మరోవైపు డెంగీ వ్యాధిలో తీవ్రమైన, అరుదైన రకానికి చెందిన డెంగీ ఎన్సెఫలైటిస్ వ్యాధి (రోగి మెదడును దెబ్బతీయడం ఈ వ్యాధికారక వైరస్ లక్షణం) బారినపడి ఏకంగా ఒక పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. నగరంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో 3వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ గోపికి ఈ నెల 24న డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ శనివారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ గోపి మృతి చెందారు. వెయ్యి మందిలో ఒక్కరిలోనే... డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డ రోగులు కోలుకొనే అవకాశాలు అత్యంత తక్కువని వైద్యులు అంటున్నారు. సాధారణ డెంగీ సోకిన ప్రతి 1,000 మంది రోగుల్లో కేవలం ఒక్కరిలోనే డెంగీ వైరస్ మెదడు దాకా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ వైరస్‌తో బ్రెయిన్లోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. దీంతో రోగులు బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం’అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తెలంగాణ) సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల చెప్పారు. వైద్యుల్లో ఆందోళన..: నగరంలో సీజనల్‌గా ప్రభావం చూపే డెంగీ వ్యాధి ఈ ఏడాది ఆలస్యంగా ప్రతాపం చూపడం ప్రారంభించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా దీంతోపాటు పలు రకాల ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు నగరవాసుల్ని ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ వైరల్ ఫీవర్ సంబంధిత కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక వైద్య విద్యార్ధి సైతం డెంగీ ఎన్‌సెఫలైటిస్‌తో మృతి చెందడం నగరంలోని వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలి కేసు కాదని, ఇప్పటికే కనీసం అరడజను మంది వైద్యులు డెంగీబారిన పడ్డారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ‘మన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగీ వార్డులు లేవు. అలాగే దోమ తెరలు సైతం ఉండవు. ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రొటోకాల్‌ను ఆసుపత్రుల్లో పాటించడం లేదు’అని ఓ వైద్య విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర పరి స్థితులు దోమల విజృంభణ, డెంగీ వ్యాప్తికి అను కూలంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే వైద్య విద్యార్థులే డెంగీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సైతం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి?లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది. DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంది. దోమలు కుట్టిన 5-8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణం కాగా, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (ప్రమాదకరమైనది). డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి కండరాలు, కీళ్ళ నొప్పి వాంతులు అవుతున్నట్లు అనిపించడం డీహ్రైడ్రేషన్‌కు గురి కావడం పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లోని హాస్పిటల్లో చూపించుకోవాలి. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. వ్యాధి వ్యాపించే విధానం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పగలు కుట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచిఉన్నా దోమలు వృద్ది చెందుతాయి. ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్,పూలకుండీలు, టైర్లు, మూత పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తుంది. డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. ♦ప్లేట్లెట్లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు. ♦ 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు. ♦ 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ♦ 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్లెట్ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం. ♦ డాక్టర్లు సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూకు ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క, ఉమ్మెత్త మొక్క సారాన్ని జ్వరం, నొప్పులు తగ్గడానికి వాడతారు. తులసీ, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని జ్వరం తగ్గడానికి వాడతారు. ► ఊద రంగులో ఉండే చిలకడదుంపల కషాయం డెంగ్యూని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చిలకడదుంపల ఆకుల్లో డెంగ్యూని నివారించే యాంటీ ఆక్సిడైజింగ్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ ఆకుల్లో ఉన్న సహజమైన ఫోలిఫినోలిక్ అందుకు కారణం అని తేల్చారు. ► బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం బొప్పాయి చెట్టు ఆకులు, కాండము లేకుండా మెత్తగా దంచి పసరు తీయాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు (గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికే. డాక్టర్ల సలహాతోనే వాటిని పాటించాలి. ) -
CWC 2023: షాకింగ్ న్యూస్.. హాస్పిటల్లో అడ్మిట్ అయిన శుభ్‌మన్ గిల్..?
టీమిండియాకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ కోసం టీమిండియా న్యూఢిల్లీకి బయల్దేరగా గిల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయాడు. ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగాక అతను తిరిగి భారత శిబిరంలో జాయిన్ కానున్నట్లు సమాచారం. గిల్ పూర్తిగా కోలుకునేంత వరకు టీమిండియాతోనే ఉండాలని నిర్ణయించకున్నాడని, అతను విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదని బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి ఒకరు తెలిపారు. గిల్.. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని సదరు అధికారి ధీమాగా చెప్పాడు. కాగా, డెండ్యూ ఫీవర్ కారణంగా శుభ్‌మన్ గిల్ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే ఆసీస్‌తో కీలక మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అతను రేపు (అక్టోబర్ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా దూరమయ్యేలా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత పాక్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజులు గ్యాప్ ఉండటంతో గిల్ పూర్తిగా కోలుకుంటాడని భారత క్రికెట్ అభిమానులంతా ఆశిస్తున్నారు. ఇటీవలికాలంలో భీకర ఫామ్‌లో ఉన్న గిల్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అయినప్పటికీ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు ఆ లోటును పూడుస్తున్నారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుపోయిన టీమిండియాను విరాట్, రాహులే గట్టెక్కించారు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో గిల్ ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏదిఏమైనప్పటకీ గిల్ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని త్వరలో బరిలోకి దిగాలని ఆశిద్దాం. ఇదిలా ఉంటే, ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 10) రెండు మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయం 10:30 గంటల నుంచి ఇంగ్లండ్-బంగ్లాదేశ్‌లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు
పశ్చిమబెంగాల్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను బ్యాగ్‌లో నింపి వాటిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ విచిత్ర సంఘటన పుర్బా బర్దామన్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళకోట్‌లోని కుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్.. తనను కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డెంగీ కేసులతో ఆందోళన చెందిన మన్సూర్.. భయంతో తనను కుట్టిన 25, 30 దోమలను చంపి వాటన్నింటిని ఓ పాలిథిన్ బ్యాగ్‌లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ మన్సూర్‌ను చూసి ఎమర్జెన్సీ కేసు అనుకున్నాడు. కానీ అతని బ్యాగులో దోమలను చూసి వైద్యుడితోపాటు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తన పరిస్థితిపై మన్సూర్ మాట్లాడుతూ.. ‘నా దుకాణం పక్కనలో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో వాటి బారి నుంచి రక్షించుకునేందుకు నన్ను కుట్టిన దోమలను చంపి కవర్లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాను. డాక్టర్లు ఆ దోమలను పరీక్షించి సరైన వైద్యం అందిస్తారని ఇలా చేశాను’ అంటూ పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలోని డ్రెయిన్‌ను వెంటనే శుభ్రం చేయాలని కోరాడు. ఈ ఘటనపై మంగళకోట్ అధికారి సయ్యద్ బసీర్ స్పందిస్తూ.. తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ ప్రాంతంలో దోమల సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిలిచిపోయిన నీటి నివారణకు, దోమల నివారణ మందులను, బ్లీచింగ్ పౌడర్‌ను పంపిణీ చేస్తామని చెప్పారు. -
‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు!
మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో డెంగ్యూ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో డెంగ్యూ బారిన పడి 1000 మందికి పైగా మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అల్ జజీరా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్‌లో 2023లో డెంగ్యూ జ్వరం కారణంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. 2023 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్ వరకు) కనీసం 1,017 మంది మరణించారని నివేదిక పేర్కొంది. దాదాపు 2,09,000 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. బంగ్లాదేశ్‌లోని పలు ఆసుపత్రులు డెంగ్యూ బాధితులతో నిండిపోయాయి. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమెజాన్‌లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? -
దడ పుట్టిస్తున్న డెంగీ
బనశంకరి: రాష్ట్రంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో రోగకారకమైన ఈడీస్ దోమల ఉత్పత్తి పెరిగింది. దీంతో రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా కేసులు హెచ్చుమీరుతున్నాయి. జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిస్తున్నాయి. డెంగీ కేసుల సంఖ్య 10 వేలకు సమీపిస్తుండగా చికెన్‌గున్యా కేసులు వెయ్యికి దగ్గరలో ఉంది. ఇప్పటివరకు 68 వేల మందికిపైగా డెంగీ అనుమానితుల రక్త నమూనాలు సేకరించగా 9,559 మందిలో డెంగీ కేసులు వెలుగుచూశాయి. 22 వేల మందికి పైగా చికెన్‌గున్యా అనుమానితుల రక్త నమూనా సేకరించి పరీక్షించగా 982 మంది వ్యాధి బారినపడినట్లు తెలిసింది. డెంగీ లక్షణాలు విపరీతమైన జ్వరం, కంటి కిం నొప్పి, తీవ్రమైన తలనొప్పి, చేతులు కాళ్లు, కీళ్లు నొప్పులు, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, నోరు, ముక్కులో రక్తస్రావం, చర్మంపై ఎరుపురంగులో గుల్లలు ఏర్పడటం, రక్తస్రావం గుర్తులు, ఎరువు రంగులో మలవిసర్జన, విపరీతమైన దాహం, స్పృహకోల్పోవడం, బీపీ పెరగడం. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు బెంగళూరు నగరంలో 5,511, మైసూరులో 454, ఉడుపిలో 429 డెంగీ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ 232, కలబురిగి 219, దక్షిణకన్నడ 210, విజయపుర 188, చిత్రదుర్గ 167, బెళగావి 154, దావణగెరె 152, హాసన 145, చిక్కమగళూరు 143, తుమకూరు 136, కొడగు 119, ధారవాడ 115, చామరాజనగర 113, మండ్య 108, కోలారులో 106 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఉచిత చికిత్స... ఎలాంటి జ్వరం బారినపడినప్పటికీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో చికిత్స లభిస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితరక్తపరీక్షలు, చికిత్స పొందవచ్చు. ఆరోగ్యశాఖ సూచన కేంద్రమార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవడం, ప్రజల్లో డెంగీ, చికెన్‌గున్యా గురించి అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖఅధికారులకు సూచిస్తూ ఆరోగ్యశాఖ కమిషనర్ డీ.రందీప్ ఆదేశాలు జారీచేశారు. చికెన్‌గున్యా లక్షణాలు ఇది కూడా ఈడీస్ జాతీయ దోమ కాటుతో ఒకరినుంచి మరొకరికి ప్రభలుతుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కానీ ఇది మరణాంతకం కాదు. జ్వరం, కీళ్లలో తీవ్రమైన నొప్పులు, వాపు కనబడుతుంది. రోగలక్షణాలు కనబడిన తక్షణమే డాక్టర్లును సంప్రదించాలి. -
డెంగీతో విద్యార్థిని మృత్యువాత?
కర్ణాటక: టీబీ డ్యాం ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక డెంగీతో మృతి చెందిన ఘటన జరిగింది. నగరంలోని విజ్ఞాన్ ఈ టెక్నో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాహ్నవి(13)కి డెంగీ జ్వరం సోకింది. జాహ్నవి టీబీ డ్యాం వంకాయ క్యాంపునకు చెందిన తిరుమలేష్ కుమార్తె. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విద్యార్థిని హొసపేటెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఈనెల 18న దావణగెరె బాపూజీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక ఆసుపత్రిలో బుధవారం మృతి చెందింది. జాహ్నవి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనగర జిల్లాలో ఈ ఏడాది డెంగీతో మృతి చెందిన మొట్టమొదటి వ్యక్తి విద్యార్థిని జాహ్నవి. బాలిక మృతికి వైరల్ ఫీవరా లేక డెంగీ కారణమా అనే విషయంపై విజయనగర జిల్లా ఆరోగ్య శాఖ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
గోదావరి పరీవాహక ప్రాంతంలో విజృంభిస్తున్న డెంగీ, విషజ్వరాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఊరి పేరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని ప్రేమ్‌నగర్. ఈ గ్రామ జనాభా 300 మంది కాగా, వీరిలో 50 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఇక్కడ 30 మంది జ్వరాల బారిన పడగా, గ్రామానికి చెందిన యువకుడు అవినాష్ రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఇదే గ్రామంలో తీవ్ర జ్వరంబారిన పడిన ఒకే కుటుంబానికి చెందిన రాంసింగ్, ఓంసింగ్, శారన్భాయ్లను కుటుంబసభ్యులు బుధవారం మెరుగైన వైద్యానికి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడా గ్రామం జ్వరాలతో విలవిల్లాడుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: జూలై ,ఆగస్టు మాసాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు గోదావరి పరీవాహక ఏజెన్సీ పల్లెలను కుదిపేశాయి. ఇప్పుడా ప్రాంతాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు అనేక గ్రామాలు డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎనిమిదిమంది వృద్ధులు, మహిళలు, బాలురు మృత్యువాత పడగా, 15 నుంచి 25 రోజులైనా తగ్గని జ్వరాలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇంటింటా జ్వరపీడితులే... వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు.. ఇప్పుడు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో విలవిలలాడుతున్నాయి. మహా ముత్తారం, గణపురం, తాడిచర్ల, రేగొండ, కాటారం, మొగుళ్లపల్లి పీహెచ్‌సీల్లో రోజుకు 150 నుంచి 250 మంది ఔట్పేòÙంట్లుగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట, వాజేడు, ఏటూరునాగారం మండలాల్లోని పల్లెలు మంచం పట్టాయి. జిల్లాలో గత జనవరి నుంచి 51 మలేరియా, 18 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం తదితర మండలాల్లోని 39 గ్రామాల్లో డెంగీ, విషజ్వరాలు జనాలను జడిపిస్తున్నాయి. ముత్తారం మండలంలో బేగంపేటకు చెందిన ఓ మహిళ మృతి చెందగా... డెంగీ బాధితుల సంఖ్య 89కి చేరినట్టు అధికారులు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, దంతాలపల్లి, మరిపెడ, కొత్తగూడ, గంగారం, కేసముద్రం, గార్ల తదితర మండలాల్లో డెంగీ, విషజ్వరాలు జడలు విప్పాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, విషజ్వరాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 162, డెంగీ 273, విషజ్వరాలు 2,35,835 కేసులు నమోదయ్యాయి. ఈ ఫొటోలో ఉన్న బాబు పేరు వర్షిత్‌కుమార్. ములుగు జిల్లా మంగపేట. రెండు రోజులనుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్నాడు. మలేరియా పాజిటివ్ వచి్చంది. రక్తం చాలా తక్కువ ఉందని వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. తల్లి రమ్య పక్కనే ఉంటూ సపర్యలు చేస్తోంది. వారం రోజులుగా జ్వరం తగ్గడం లేదు మాది ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట. నేను మూడు నెలల గర్భవతిని. వారం రోజుల నుంచి జ్వరం వస్తోంది. తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చా. చాలా నీరసంగా ఉంటోంది. – సరిత, రమణక్కపేట, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ఇద్దరు మహిళలు, డెంగీతో ఆరు నెలల పాప మృతి వాజేడు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని (35), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో నివాసి మనీష (30) విషజ్వరంతో మృతిచెందారు. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప కూడా డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
జ్వరం తగ్గడం లేదా? డెంగ్యూ ఉండొచ్చు జాగ్రత్త! ఈ లక్షణాలు..
వర్షాకాలం సీజన్ కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ లక్షణాలు త్వరగా బయటపడవు. ఆరోగ్యంగానే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అసలు డెంగ్యూ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ ఎలా వస్తుంది? డెంగ్యూ దోమల వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఏజిప్టి అనే ఆడదోమల కారణంగా వ్యాపిస్తుంది.ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. పగలు కుట్టే దోమలతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. దీంతో పాటు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లూ లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ వైరస్‌లో నాలుగు సెరోటైప్స్ ఉన్నాయి. వీటిని DENV-1, DENV-2, DENV-3, DENV-4 అని పిలుస్తారు. మన దేశంలో DENV-2 కారణంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తపడండి.. వర్షాకాలం మొదలైన జూన్, జులై మాసంలో ప్రారంభమయ్యే విషజ్వరాల తాకిడి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొనసాగుతుంది. డెంగ్యూ వచ్చిన వారిలో సహజంగానే 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు. మరికొందరిలో మాత్రం జ్వరం వచ్చిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ► డెంగ్యూ వచ్చిన వారికి 104 ఫారెన్‌హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ► వికారం, వాంతులు మరో ప్రధాన లక్షణం. కళ్లు మండటం, వికారం, వాంతులు,తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, విసుగు డెంగ్యూ జ్వరం లక్షణాలు. ► డెంగ్యూ జ్వరం ఉంటే శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. అందుకే ఈ లక్షణాలను బట్టి ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేల కంటే పడిపోతే ప్రమాదకర స్థాయిలో ఉందని అర్ధం. ఈ పరిస్థితుల్లో తక్షణం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. డెంగ్యూ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే ఆహారాలు డెంగ్యూ వచ్చిన జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూ జ్వరంతో బాధపడతున్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆరెంజ్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.నారింజలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ జ్వరం అటాక్ చేస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే కొబ్బరినీళ్లను ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోరోలైట్లు ఇందులో అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఓ కివి పండు తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కివి జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. పాలకూరలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే పాలకూరలోని పోషకాలు డెంగ్యూ జ్వరాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వీట్ గ్రాస్ డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. -
14 ఏళ్లకు కలిగిన సంతానం..
మెదక్ మున్సిపాలిటీ: దేవుళ్లకు మొక్కులు మొక్కంగా 14 ఏళ్లకు ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క మగబిడ్డపుట్టాడు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. డెంగీతో మృత్యువాతపడటంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణంలోని వెంకట్రావు కాలనీకి చెందిన చింతకింది చిన్న శ్రీనివాస్‌గౌడ్, మాధవి దంపతులకు 14 ఏళ్లకు బాబు పుట్టాడు. పార్థసాయిగౌడ్ నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శ్రీనివాస్ అన్నదమ్ములకు కూడా మగ సంతానం లేకపోవడంతో బాబును ఎంతో అప్యాయంగా చూసేవారు. అందరూ కలిసి బాబును కంటికి రెప్పలా కాపాడుకునేవారు. స్థానికంగా ఉన్న సిద్ధార్థ్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో బాలుడిని ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. జ్వరం తగ్గక పోవడంతో వైద్య పరీక్షలు చేయగా డెంగీగా తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ప్లెట్లెట్స్ తగ్గి బ్రెయిన్‌డెడ్ కావడంతో బుధవారం మృతి చెందాడు.