ఇటలీ పర్యటనకు మేరీకోమ్‌ దూరం | Mary Kom to skip training next week due to illness | Sakshi
Sakshi News home page

ఇటలీ పర్యటనకు మేరీకోమ్‌ దూరం

Published Thu, Oct 8 2020 5:39 AM | Last Updated on Thu, Oct 8 2020 5:39 AM

Mary Kom to skip training next week due to illness - Sakshi

న్యూఢిల్లీ: భారత బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహాలు మొదలు కానున్నాయి. నాణ్యమైన ప్రాక్టీస్‌ కోసం బాక్సర్లను ఇటలీ పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 28 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసింది. 10 మంది పురుషులు, ఆరుగురు మహిళా బాక్సర్లతో పాటు సహాయ సిబ్బంది వచ్చే వారం ఇటలీకి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు 52 రోజుల శిక్షణకు అవసరమయ్యే రూ. 1.31 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 5 వరకు ఇటలీలోని అసిసి నగరంలో జరిగే ఈ శిబిరానికి దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌తోపాటు మరో ఇద్దరు బాక్సర్లు పాల్గొనడం లేదు.

డెంగ్యూ కారణంగా మేరీకోమ్, గాయం నుంచి కోలుకుంటోన్న మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు) ... అమెరికాలో ప్రాక్టీస్‌ చేస్తోన్న కారణంగా వికాస్‌ (69 కేజీలు) ఈ పర్యటనకు గైర్హాజరు కానున్నారు. అనారోగ్యం తగ్గాక ఢిల్లీలోనే ప్రాక్టీస్‌ చేస్తానని మేరీకోమ్‌ చెప్పింది. ‘డెంగ్యూతో బాధపడుతున్నా. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ప్రయాణించే ఉద్దేశం లేదు. వచ్చే ఏడాది విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి ఢిల్లీలోనే ప్రాక్టీస్‌ చేస్తా’ అని మేరీ తెలిపింది. ఒలింపిక్స్‌ పతకావకాశాలున్న అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు), ఆశిష్‌ (75 కేజీలు), సతీశ్‌ (ప్లస్‌ 91 కేజీలు), సిమ్రన్‌ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement