indian boxers
-
భారత బాక్సర్లకు 17 పతకాలు
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏకంగా 17 పతకాలు కొల్లగొట్టారు. ముఖ్యంగా టీనేజ్ మహిళా బాక్సర్లు పార్థవి, వన్షిక స్వర్ణాలు సాధించారు. మహిళల 65 కేజీల ఫైనల్లో పార్థవి 5–0తో ఆలియా హోపెమా (నెదర్లాండ్స్)ను కంగుతినిపించింది. ప్లస్ 80 కేజీల కేటగిరీలో వన్షిక గోస్వామి ముష్టిఘాతాలకు జర్మనీ బాక్సర్ విక్టోరియా గాట్ విలవిల్లాడింది. దీంతో రిఫరీ నిమిషం 37 సెకన్లకు ముందే బౌట్‌ను నిలిపేసి వన్షికను విజేతగా ప్రకటించాడు. మిగతా మహిళల్లో క్రిషా వర్మ (75 కేజీలు) బంగారు పతకం నెగ్గగా, నిషా (51 కేజీలు), సుప్రియా (54 కేజీలు), కృతిక (80 కేజీలు), చంచల్ (48 కేజీలు), అంజలి (57 కేజీలు), వినీ (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) రజతాలతో సంతృప్తి చెందారు. పురుషుల్లో ఏకైక పసిడి పతకాన్ని హేమంత్ తెచ్చి పెట్టాడు. రాహుల్ కుందు (75 కేజీలు) రజతం నెగ్గగా, రిషి సింగ్ (50 కేజీలు), క్రిష్ పాల్ (55 కేజీలు), సుమిత్ (70 కేజీలు), ఆర్యన్ (85 కేజీలు), లక్షయ్ రాఠి (ప్లస్ 90 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
అమిత్, జైస్మిన్ అవుట్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు నిరాశ పరిచారు. పురుషుల 51 కేజీల విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న అమిత్ పంఘాల్ మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 1–4తో పాట్రిక్ చిన్యెంబా (జాంబియా) చేతిలో ఓటమి చవిచూశాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే నిష్క్రమించిన అమిత్ ఈసారి కూడా అదే ప్రదర్శన పునరావృతం చేశాడు. మహిళల 57 కేజీల విభాగం తొలి రౌండ్లో జైస్మిన్ (భారత్) 0–5తో నెస్తీ పెటిసియో (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయింది. -
పారిస్ ఒలింపిక్స్‌కు అమిత్, జైస్మిన్ అర్హత
బ్యాంకాక్: భారత బాక్సర్లు అమిత్ పంఘాల్, జైస్మిన్ లంబోరియా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీలో ఆదివారం పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ ... మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి ‘పారిస్’ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. పురుషుల 57 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో చువాంగ్ లియు (చైనా)పై... జైస్మిన్ 5–0తో మరీన్ కమారా (మాలి)పై గెలుపొందారు. మరోవైపు ‘బాక్స్ ఆఫ్’ మ్యాచ్‌లో సచిన్ సివాచ్ 0–5తో మునార్బెక్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. హరియాణాకు చెందిన 28 ఏళ్ల అమిత్ వరుసగా రెండో సారి ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అమిత్ 52 కేజీల విభాగంలో పాల్గొని రెండో రౌండ్లో ఓడిపోయాడు. 2019 ప్రపంచ చాంపియన్íÙప్లో రజతం, 2019 ఆసియా చాంపి యన్íÙప్లో స్వర్ణం నెగ్గిన అమిత్ 2018 ఆసియా క్రీడల్లో, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు గెలిచాడు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం తొమ్మిది మంది బాక్సర్లు బరిలోకి దిగగా... ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో ఆరుగురు భారత బాక్సర్లు మాత్రమే పోటీపడనున్నారు. మహిళల విభాగంలో నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు)... పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అస్తానా (కజకిస్తాన్): ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), పూనమ్ పూనియా (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు)... విశ్వనాథ్ సురేశ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్ఖా (60 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.ఫైనల్స్‌లో ప్రీతి 3–0తో బజరోవా ఎలీనా (కజకిస్తాన్)పై, పూనమ్ 4–1తో సకిష్ అనెల్ (కజకిస్తాన్)పై, ప్రాచి 4–1తో అనర్ తుసిన్బెక్ (కజకిస్తాన్)పై, ముస్కాన్ 3–2తో జకిరోవా అజీజియా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు.విశ్వనాథ్ సురేశ్ 5–0తో కరాప్ యెర్నర్ (కజకిస్తాన్)పై, సబీర్ యెర్బోలత్ (కజకిస్తాన్)పై నిఖిల్, ఆకాశ్ 4–1తో రుస్లాన్ (కజకిస్తాన్)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా ఆసియా అండర్–22, యూత్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 43 పతకాలు సంపాదించారు. -
భారత బాక్సర్లకు మూడు రజతాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత బాక్సర్లు హార్దిక్ (80 కేజీలు), అమిశా (54 కేజీలు), ప్రాచీ (80 ప్లస్ కేజీలు) రజత పతకాలు నెగ్గారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫైనల్స్‌లో హార్దిక్ 2–3తో అశురోవ్ (రష్యా) చేతిలో, అమిశా 0–5తో అయాజాన్ (కజకిస్తాన్) చేతిలో, ప్రాచి 0–5తో షఖోబిద్దినొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మరో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్లో పోటీపడనున్నారు. -
భారత్ తీన్మార్ పంచ్...
విశ్వ వేదికపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా మూడు పతకాలతో తిరిగి రానున్నారు. పతక వర్ణాలు (స్వర్ణ, రజత, కాంస్య) ఇంకా ఖరారు కాకపోయినా పతకాలు మాత్రం ఖాయమయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా బాక్సర్లు దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించి సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్లో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజతాల కోసం పోటీపడతారు. ఓడితే మాత్రం కాంస్య పతకాలతో తమ పోరాటాన్ని ముగిస్తారు. తాస్కాంట్: ప్రత్యర్థి ఎవరైనా తమ పంచ్‌లతో అదరగొడుతున్న భారత బాక్సర్లు ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపక్ 5–0తో నుర్జిగిత్ దిషిబయేవ్ (కిర్గిస్తాన్)పై, హుసాముద్దీన్ 4–3తో దియాజ్ ఇబానెజ్ (బల్గేరియా)పై, నిశాంత్ దేవ్ 5–0తో జార్జి టెరీ క్యూలార్ (క్యూబా)పై గెలుపొందారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. ప్రపంచ పురుషుల బాక్సింగ్‌లో పవర్ హౌస్‌గా పేరున్న క్యూబా దేశ బాక్సర్‌పై భారత బాక్సర్ విజయం సాధిస్తాడని ఊహకందని విషయం. కానీ పట్టుదలతో పోరాడితే క్యూబా బాక్సర్‌ను కూడా ఓడించే సత్తా భారత బాక్సర్లలో ఉందని బుధవారం నిశాంత్ దేవ్ నిరూపించాడు. జార్జి క్యూలార్‌తో జరిగిన బౌట్లో నిశాంత్ ఆద్యంతం దూకుడుగా ఆడి పైచేయి సాధించాడు. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన నిశాంత్ ఈసారి సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మూడో పతకాన్ని ఖాయం చేశాడు. 10 ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాలు. అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించగా... విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ (2017), మనీశ్ కౌశిక్ (2019), ఆకాశ్ (2021) కాంస్య పతకాలు గెలిచారు. తాజా ఈవెంట్లో హుసాముద్దీన్, దీపక్, నిశాంత్ దేవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. -
World Boxing Championships: ప్రిక్వార్టర్స్‌లో సచిన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సచిన్ సివాచ్ (54 కేజీలు) శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... నవీన్ కుమార్ (92 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. తొలి రౌండ్ బౌట్లో ప్రపంచ మాజీ యూత్ చాంపియన్ సచిన్ 5–0తో సెర్గీ నొవాక్ (మాల్డొవా)పై గెలుపొందగా... నవీన్ 0–5తో రేయస్ (స్పెయిన్) చేతిలో... గోవింద్ 0–5తో అల్ఖావెర్దోవి సాఖిల్ (జార్జియా) చేతిలో ఓడిపోయారు. -
World Boxing Championships 2023: క్వార్టర్స్‌లో ఆకాశ్, నిశాంత్
తాష్కెంట్: పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆకాశ్ సాంగ్వాన్, నిశాంత్ దేవ్ ముందంజ వేశారు. 67 కేజీల విభాగంలో ఆకాశ్ 5–0తో ఫు మింగ్కే (చైనా)పై... 71 కేజీల విభాగంలో నిశాంత్ 5–0తో లీ సంగ్మిన్ (కొరియా)పై ఘన విజయాలు సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తర్వాతి మ్యాచ్‌లలో దులాత్ బెక్బావ్ (కజకిస్తాన్)తో ఆకాశ్... ఫొఖాహా నిదాల్ (పాలస్తీనా)తో తలపడతారు. -
కేవలం 12 సెకెన్లలో ప్రత్యర్ధిని మట్టికరిపించిన భారత బాక్సర్
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు జాస్మిన్ లంబోరియా, శశి చోప్రా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి పోరులో జాస్మిన్ (60 కేజీల విభాగం) రిఫరీ స్టాపింగ్ ద కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) ద్వారా ఎన్యాంబెగా ఆంబ్రోస్ (టాంజానియా)ను చిత్తు చేసింది. బౌట్ మొదలైన 12 సెకన్లలోనే జాస్మిన్ విసిరిన పంచ్‌లకు ఆంబ్రోస్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ ఆటను ఆపివేసి జాస్మిన్ను విజేతగా ప్రకటించారు. 63 కేజీల కేటగిరీలో శశి చోప్రా 5–0 స్కోరుతో ఎంవాంగీ టెరిసియా (కెన్యా)పై ఘన విజయం సాధించింది. తర్వాతి రౌండ్లో సమడోవా (తజికిస్తాన్)తో జాస్మిన్... కిటో మై (జపాన్)తో శశి తలపడతారు. అయితే 70 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత బాక్సర్ శ్రుతి యాదవ్ 0–5తో జో పాన్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. నేడు భారత బాక్సర్లు నీతూ ఘంఘాస్, మంజు బంబోరియా తొలి రౌండ్లో ఆడతారు. -
World Boxing Championships 2023: ‘పంచ్’ సమరానికి వేళాయే..
న్యూఢిల్లీ: మూడోసారి ప్రపంచ మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు భారత్ సిద్ధమైంది. న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు సాయంత్రం జరిగే ప్రారంభోత్సవానికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. గురువారం నుంచి బౌట్లు మొదలవుతాయి. 23న సెమీఫైనల్స్ జరుగుతాయి. 24న విశ్రాంతి దినం. 25, 26వ తేదీల్లో జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది. గతంలో 2006, 2018లలో భారత్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిచి్చంది. మూడోసారీ న్యూఢిల్లీ వేదికగానే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తుండటం విశేషం. మొత్తం 12 వెయిట్ కేటగిరీల్లో (48 కేజీలు, 50, 52, 54, 57, 60, 63, 66, 70, 75, 81, ప్లస్ 81 కేజీలు) బౌట్లు ఉంటాయి. 65 దేశాల నుంచి 300కుపైగా బాక్సర్లు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు. పతక విజేతలకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. స్వర్ణ పతక విజేతకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షలు)... రజత పతక విజేతకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), కాంస్య పతక విజేతలకు (ఇద్దరికి) 25 వేల డాలర్ల (రూ. 20 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తారు. గత ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం (నిఖత్ జరీన్), రెండు కాంస్య పతకాలు (మనీషా మౌన్, పర్వీన్ హుడా) సాధించింది. భారత బాక్సింగ్ జట్టు: నీతూ ఘణ్‌ఘాస్ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు), సనామాచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు), నుపుర్ షెరాన్ (ప్లస్ 81 కేజీలు). -
భారత బాక్సర్లకు మరో నాలుగు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పతకాలపైనే పంచ్ విసురుతున్నారు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ లో నలుగురు మహిళా బాక్సర్లు ముస్కాన్ (75 కేజీలు), తమన్నా (50 కేజీలు), కీర్తి (ప్లస్ 81 కేజీలు), దేవిక (52 కేజీలు) పతకాలు ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తమన్నా 5–0తో జుని తొనెగవా (జపాన్)పై, దేవిక 5–0తో అస్యా (జర్మనీ)పై... అజింబై (మంగోలియా)పై ముస్కా న్, బొటికా (రొమేనియా)పై కీర్తి గెలిచారు. చదవండి: భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి! అద్భుతాలు చేస్తాడు -
సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు.. బాక్సింగ్‌లో అరడజను పతకాలు ఖరారు
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ 18 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు) సాధించగా.. బాక్సింగ్‌లో మరో అరడజను పతకాలు ఖాతాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లవత్, మహిళల 60 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియ, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగల్ ఇవాళ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. మరోవైపు పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. స్క్వాష్‌లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. మెన్స్ డబుల్స్‌లో సెంథిల్ కుమార్-అభయ్ సింగ్ జోడీ, మహిళల డబుల్స్‌లో అనాహత్ సింగ్, సునన్య కురువిల్లా జోడీ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. ఇవే కాకుండా హ్యామర్ త్రో ఈవెంట్లో మంజు బాల ఫైనల్‌కు అర్హత సాధించగా.. స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ 200 మీటర్ల విభాగంలో సెమీస్‌కి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌లో స్టార్ షట్లర్లు సింధు, శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్‌కు చేరారు. చదవండి: స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్ -
గీతిక, అల్ఫియా ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. కజకిస్తాన్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు లభించాయి. ఫైనల్లో గీతిక 4–1తో కలైవాణి (భారత్)పై, అల్ఫియా 5–0తో లజత్ కుంగిబయెవా (కజకిస్తాన్)పై నెగ్గారు. గీతిక, అల్ఫియా 700 డాలర్ల (రూ. 55 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. మరో ఫైనల్లో జమున బోరో (54 కేజీలు) 0–5తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. రజతాలు నెగ్గిన కలైవాణి, జమునాలకు 400 డాలర్ల (రూ. 31 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. -
భారత బాక్సర్ లవ్లీనాకు చుక్కెదురు
టర్కీలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగియగా... పూజా రాణి (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలోని ఫెయిర్ చాన్స్ టీమ్ బాక్సర్ సిండీ విన్నర్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 1–4తో ఓడింది. పూజ 5–0తో టిమియా నాగీ (హంగేరి)పై గెలిచింది. -
క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒకవైపు నిశాంత్ దేవ్ (71 కేజీలు), సంజీత్ (92 కేజీలు) అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరగా... మరోవైపు రోహిత్, ఆకాశ్, సుమిత్, దీపక్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌ల్లో నిశాంత్ దేవ్ 3–2తో మార్కో అల్వారెజ్ వెర్డె (మెక్సికో)పై, సంజీత్ (92 కేజీలు) 4–1తో జియోర్జి చిగ్లాడ్జె (జార్జియా)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ (భారత్) 1–4తో సెరిక్ (కజకిస్తాన్) చేతిలో.... ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు) 0–5తో కెవిన్ బ్రౌన్ (క్యూబా) చేతిలో ... సుమిత్ (75 కేజీలు) 0–5తో యోన్లిస్ (క్యూబా) చేతిలో... దీపక్ 0–5తో సాకెన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
సూపర్ సంజీత్...
దుబాయ్: ప్రత్యర్థి రికార్డు ఘనంగా ఉన్నా... అవేమీ పట్టించుకోకుండా తన పంచ్ పవర్‌తో భారత హెవీవెయిట్ బాక్సర్ సంజీత్ సత్తా చాటుకున్నాడు. ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పురుషుల 91 కేజీల విభాగంలో సంజీత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 91 కేజీల ఫైనల్లో సంజీత్ 4–1తో 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, మూడుసార్లు ఆసియా చాంపియన్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్)పై సంచలన విజయం సాధించాడు. ► మరోవైపు 52 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్... 64 కేజీల విభాగంలో శివ థాపాలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తీవ్రంగా పోరాడినా చివరకు రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 2–3తో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ షఖోబిదిన్ జోయ్‌రోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... శివ థాపా 2–3తో బాతర్సుఖ్ చిన్‌జోరిగ్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. ► 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ జోయ్‌రోవ్ చేతిలో ఓడిన అమిత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చాడు. ఇద్దరూ ఎక్కడా జోరు తగ్గించుకోకుండా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. అమిత్ ఆటతీరు చూశాక విజయం అతడినే వరిస్తుందనిపించినా... బౌట్ జడ్జిలు మాత్రం జోయ్‌రోవ్ ఆధిపత్యం చలాయించాడని భావించారు. తుది ఫలితంపై భారత బృందం జ్యూరీకి అప్పీల్ చేసింది. అయితే భారత అప్పీల్‌ను జ్యూరీ తోసిపుచ్చింది. దాంతో జోయ్రోవ్కే స్వర్ణం ఖాయమైంది. ► ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్‌కు 15 పతకాలు వచ్చాయి. పురుషుల విభాగంలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు... మహిళల విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2019లో భారత్ అత్యధికంగా 13 పతకాలు సాధించింది. అమిత్, శివ థాపా -
గంట సేపు గాల్లోనే చక్కర్లు...
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌కి వెళ్లిన భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. సరైన అనుమతులు లేవనే కారణంతో శనివారం బాక్సర్లు వెళ్లిన ప్రత్యేక విమానాన్ని (స్పైస్ జెట్) అక్కడి విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. దాంతో గంటకు పైగా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఆటగాళ్లంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఇంధనం అయిపోవచ్చిదంటూ ‘ఫ్యూయల్ ఎమర్జెన్సీ’ని కూడా ప్రకటించింది. చివరకు విదేశాంగ శాఖ జోక్యంతో పరిస్థితి కుదుట పడింది. దీనిపై డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. కరోనా కారణంగా భారత్‌నుంచి వచ్చే విమానాలపై యూఏఈలో ఆంక్షలు ఉన్నాయి. సాధారణ ఫ్లయిట్లను ఆ దేశం అనుమతించడం లేదు. దాంతో ప్రభుత్వ అనుమతితో భారత బాక్సింగ్ సమాఖ్య ప్రత్యేక విమానం ద్వారా వారిని పంపించింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో సమన్వయ లోపం కారణంగా కిందకు దిగేందుకు అనుమతి దక్కలేదు. దాంతో యూఏఈలో ఉన్న భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన తర్వాత అధికారులు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే మరో గంట పాటు అన్ని పత్రాల తనిఖీ పూర్తయ్యే వరకు బాక్సర్లు విమానంనుంచి బయటకు రాలేదు. సోమవారం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా... భారత్ నుంచి 19 మంది బాక్సర్లు (10 మంది మహిళలు, 9 మంది పురుషులు) బరిలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి మేజర్ బాక్సింగ్ టోర్నీ. మహిళల విభాగంలో మేరీ కామ్ తదితరులు, పురుషుల 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ బరిలో ఉన్నాడు. -
భారత్ పంచ్ అదిరింది
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో వచ్చిన విరామం తర్వాత పాల్గొన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. జర్మనీలోని కొలోన్ పట్టణంలో ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అమిత్‌కు ఫైనల్లో తన ప్రత్యర్థి బిలాల్ బెన్నమ్ (ఫ్రాన్స్) నుంచి వాకోవర్ లభించగా... సిమ్రన్‌జిత్ కౌర్ 4–1తో మాయా క్లీన్హాన్స్ (జర్మనీ)పై, మనీషా 3–2తో భారత్‌కే చెందిన సాక్షిపై గెలుపొందారు. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఫైనల్లో సతీశ్ తన ప్రత్యర్థి నెల్వీ టియాఫాక్ (జర్మనీ)కి వాకోవర్ ఇచ్చాడు. సెమీఫైనల్లో ఓడిన సోనియా (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), గౌరవ్ (57 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జర్మనీ, బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, మాల్డోవా, నెదర్లాండ్స్, పోలాండ్, ఉక్రెయిన్ దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొన్నారు. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే భారత బాక్సర్లు అదరగొట్టారు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన అలెక్సిస్ వాస్టిన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో అమిత్ పంఘాల్ (52 కేజీలు), సంజీత్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరుల్లో అమిత్ 3–0తో రెనె అబ్రహం (అమెరికా)పై... సోహెబ్ బౌఫియా (అమెరికా)పై సంజీత్ గెలుపొందారు. 75 కేజీల విభాగంలో జోసెఫ్ జెరోమ్ హిక్స్ (అమెరికా)తో ఆశిష్ కుమార్ తలపడాల్సి ఉండగా... గాయం కారణంగా జోసెఫ్ వైదొలిగాడు. అయితే 57 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్ బౌట్లో కవీందర్ సింగ్ బిష్త్ 1–2తో సామ్యుల్ కిష్టోరి (ఫ్రాన్స్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత బాక్సర్లలో శివ థాపా (63 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (+91 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
ఇటలీ పర్యటనకు మేరీకోమ్ దూరం
న్యూఢిల్లీ: భారత బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలు మొదలు కానున్నాయి. నాణ్యమైన ప్రాక్టీస్ కోసం బాక్సర్లను ఇటలీ పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 28 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసింది. 10 మంది పురుషులు, ఆరుగురు మహిళా బాక్సర్లతో పాటు సహాయ సిబ్బంది వచ్చే వారం ఇటలీకి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు 52 రోజుల శిక్షణకు అవసరమయ్యే రూ. 1.31 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు ఇటలీలోని అసిసి నగరంలో జరిగే ఈ శిబిరానికి దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తోపాటు మరో ఇద్దరు బాక్సర్లు పాల్గొనడం లేదు. డెంగ్యూ కారణంగా మేరీకోమ్, గాయం నుంచి కోలుకుంటోన్న మనీశ్ కౌశిక్ (63 కేజీలు) ... అమెరికాలో ప్రాక్టీస్ చేస్తోన్న కారణంగా వికాస్ (69 కేజీలు) ఈ పర్యటనకు గైర్హాజరు కానున్నారు. అనారోగ్యం తగ్గాక ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తానని మేరీకోమ్ చెప్పింది. ‘డెంగ్యూతో బాధపడుతున్నా. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ప్రయాణించే ఉద్దేశం లేదు. వచ్చే ఏడాది విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తా’ అని మేరీ తెలిపింది. ఒలింపిక్స్ పతకావకాశాలున్న అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు), సిమ్రన్ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. -
భారత్ ‘పంచ్’ పవర్
అమ్మాన్ (జోర్డాన్): క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమిస్తూ భారత బాక్సర్లు వికాస్ కృషన్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ యాదవ్ (ప్లస్ 91 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇక్కడ జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో పురుషుల విభాగంలో వికాస్, ఆశిష్, సతీశ్... మహిళల విభాగంలో పూజా రాణి, లవ్లీనా సెమీఫైనల్ చేరుకొని ‘టోక్యో’ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3–2తో సెవోన్‌రెట్స్ ఒకజవా (జపాన్)ను ఓడించగా... ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై... సతీశ్ 5–0తో దైవీ ఒట్కోన్‌బాయెర్ (మంగోలియా)పై గెలిచారు. పూజా రాణి 5–0తో పోర్నిపా చుటీ (థాయ్‌లాండ్)పై, లవ్లీనా 5–0తో మెలియెవా (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గారు. పురుషుల 81 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో సచిన్ కుమార్ చైనా బాక్సర్ డాక్సియాంగ్ చెన్ చేతిలో ఓడిపోయాడు. విజేందర్ తర్వాత భారత్ తరఫున మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో బాక్సర్‌గా వికాస్ కృషన్ గుర్తింపు పొందగా... ఆశిష్, సతీశ్, పూజా రాణి, లవ్లీనా తొలిసారి ఒలింపిక్స్ బరిలో నిలువనున్నారు. -
మన బాక్సర్ల పసిడి పంచ్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 12 పతకాలు సాధించి తమ సత్తా చాటుకుంది. ఆదివారం మహిళల విభాగంలో బరిలో నిలిచిన ఐదుగురు బాక్సర్లు పసిడి పంచ్‌లతో సత్తా చాటగా... పురుషుల విభాగంలో ఇద్దరు బాక్సర్లు తుది పోరులో ఓడి రజతాలతో సంతృప్తి చెందారు. మహిళల ఫైనల్స్‌లో పూనమ్ (54 కేజీలు) వికి కాయ్ (చైనా)పై, సుష్మా (81 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బకీత్జాన్‌కిజీపై, నోరెమ్ చాను (51 కేజీలు) అనెల్ బార్కీపై (కజకిస్తాన్)పై, వింకా (64 కేజీలు) హైని నులాతైయాలి (చైనా)పై, సనమచ చాను (75 కేజీలు) నవ్బఖోర్ ఖమిదోవ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు. పురుషుల ఫైనల్స్‌లో సెలాయ్ సోయ్ (49 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బజార్‌బే ఉల్లూ ముఖమెద్‌సైఫీ చేతిలో, అంకిత్ నర్వాల్ (60 కేజీలు) జపాన్ బాక్సర్ రెటో త్సుత్సుమె చేతిలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. వీరితో పాటు అరుంధతీ చౌదరి (69 కేజీలు), కోమల్‌ప్రీత్ కౌర్ ( ప్లస్ 81 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సతేందర్ సింగ్ (91 కేజీలు), అమన్ (91+ కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
రెండో రౌండ్లో దుర్యోధన్ సింగ్
ఎకతెరీన్‌బర్గ్ (రష్యా): ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో భారత్‌కు చెందిన మరో బాక్సర్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 69 కేజీల బౌట్లో జాతీయ చాంపియన్ దుర్యోధన్ సింగ్ నేగి 4–1తో కొర్యున్ అస్టోయన్ (అర్మేనియా)ను మట్టి కరిపించాడు. ప్రత్యర్థి బలహీనమైన డిఫెన్సును తనకు అనుకూలంగా మార్చుకున్న దుర్యోధన్ పంచ్‌లతో విరుచుకుపడటంతో విజయం ఖాయమైంది. ఇప్పటికే భారత్‌కు చెందిన ఐదుగురు బాక్సర్లు (మనీశ్ కౌశిక్, బ్రిజేశ్ యాదవ్, అమిత్, కవీందర్ సింగ్, ఆశిష్ కుమార్) రెండో రౌండ్‌కు చేరగా తాజా విజయంతో దుర్యోధన్ వారి సరసన చేరాడు. రెండో రౌండ్లో ఆరో సీడ్ జైద్ ఎశాశ్ (జోర్డాన్)తో దుర్యోధన్ తలపడతాడు. -
పసిడి కాంతలు
అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు మళ్లీ తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. శనివారం థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఏడు పతకాలతో భారత బాక్సర్లు అదరగొట్టగా... ఆదివారం ఇండోనేసియాలో ముగిసిన ప్రెసిడెంట్స్ కప్‌లో మనోళ్లు ఏకంగా ఏడు స్వర్ణాలు, రెండు రజతాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అద్భుతం చేశారు. ఈ క్రమంలో టోర్నమెంట్లో ఉత్తమ జట్టు పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. న్యూఢిల్లీ : వేదిక మారింది. టోర్నమెంట్ పేరు మారింది. కానీ భారత బాక్సర్లు జోరు మాత్రం కొనసాగింది. ప్రత్యర్థులు ఎవరైనా... తమ పంచ్ ప్రతాపాన్ని చాటుకుంటూ మన బాక్సర్లు పతకాల పంట పండించారు. 24 గంటలు గడవకముందే మరో అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఇండోనేసియాలోని లాబువాన్ బాజోలో ముగిసిన ప్రెసిడెంట్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు గెల్చుకున్నారు. ఏడు స్వర్ణాల్లో నాలుగు మహిళా బాక్సర్లు అందించగా... మిగతా మూడు పురుష బాక్సర్లు సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలోనే మరో రెండు రజతాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)తోపాటు జమున బోరో (54 కేజీలు), మోనిక (48 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) విజేతలుగా నిలిచారు. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా సాధన చేస్తున్న మేరీకోమ్‌కు ఈ టోర్నీలో ఎదురులేకుండా పోయింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ మణిపూర్ మెరిక పసిడి కాంతులు విరజిమ్మింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 36 ఏళ్ల మేరీకోమ్ 5–0తో ఏప్రిల్ ఫ్రాంక్స్ (ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించింది. రెండు నెలల క్రితం ఇండియా ఓపెన్‌లో స్వర్ణం నెగ్గిన మేరీకోమ్ ఆ తర్వాత విరామం తీసుకొని ఈ టోర్నీ బరిలోకి దిగింది. ఇతర ఫైనల్స్‌లో అస్సాంకు చెందిన జమున బోరో 5–0తో గియులియా లమాగ్న (ఇటలీ)పై, పంజాబ్ అమ్మాయి సిమ్రన్‌జిత్ 5–0తో హసానా హుస్‌వతున్ (ఇండోనేసియా)పై, హరియాణా అమ్మాయి మోనిక 5–0తో ఎన్‌డాంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించి బంగారు పతకాలను దక్కించుకున్నారు. గౌరవ్, దినేశ్‌లకు రజతాలు పురుషుల విభాగంలో ఐదుగురు బాక్సర్లు పసిడి కోసం బరిలోకి దిగారు. అంకుశ్ దహియా (64 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) స్వర్ణాలు నెగ్గగా... గౌరవ్ బిధురి (56 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అంకుశ్ 5–0తో లెయుంగ్ కిన్ ఫాంగ్ (మకావు)పై, అనంత ప్రహ్లాద్ 5–0తో రహమాని రామిష్ (అఫ్గానిస్తాన్)పై, నీరజ్ స్వామి 4–1తో మకాడో జూనియర్ రామెల్ (ఫిలిప్పీన్స్)పై గెలిచారు. గౌరవ్ బిధురి 2–3తో మాన్‌డాగి జిల్ (ఇండోనేసియా) చేతిలో, దినేశ్ 0–5తో సమాద సపుత్ర (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. ఓవరాల్‌గా తొమ్మి ది పతకాలు నెగ్గిన భారత్‌కు ఈ టోర్నీలో ఉత్తమ జట్టు అవార్డు లభించింది. -
నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు
బ్యాంకాక్: ఈ ఏడాది మరో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. శనివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. 37 దేశాల నుంచి పలువురు మేటి బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. భారత్‌కే చెందిన దీపక్ సింగ్ (48 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకంతో అదరగొట్టాడు. సెమీఫైనల్లో ఓడిన మంజు రాణి (48 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), భాగ్యబతి కచారి (75 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిన్లాండ్లో జరిగిన ‘గీ–బీ’ టోర్నీలో, పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్ స్టామ్ టోర్నీలో రజత పతకాలు నెగ్గిన హుసాముద్దీన్ మూడోసారీ రజతంతో సరిపెట్టుకున్నాడు. చట్‌చాయ్ డెచా బుత్‌దీ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో హుసాముద్దీన్ 0–5తో ఓడిపోయాడు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ సింగ్ 0–5తో మిర్జాఖెమెదోవ్ నోదిర్‌జోన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... బ్రిజేశ్ యాదవ్ 1–4తో అనావత్ థోంగ్‌క్రాటోక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 0–5తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 75 కేజీల ఫైనల్లో ఆశిష్ 5–0తో కిమ్ జిన్జే (కొరియా)పై నెగ్గి పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. తొమ్మిది స్వర్ణాలపై గురి... ఇండోనేసియాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మోనిక (48 కేజీలు)... పురుషుల విభాగంలో గౌరవ్ బిధురి (56 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు), అంకుశ్ (64 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) నేడు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.