
న్యూఢిల్లీ: ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. కజకిస్తాన్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు లభించాయి. ఫైనల్లో గీతిక 4–1తో కలైవాణి (భారత్)పై, అల్ఫియా 5–0తో లజత్ కుంగిబయెవా (కజకిస్తాన్)పై నెగ్గారు. గీతిక, అల్ఫియా 700 డాలర్ల (రూ. 55 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. మరో ఫైనల్లో జమున బోరో (54 కేజీలు) 0–5తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. రజతాలు నెగ్గిన కలైవాణి, జమునాలకు 400 డాలర్ల (రూ. 31 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.