international boxing championship
-
గీతిక, అల్ఫియా ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. కజకిస్తాన్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు లభించాయి. ఫైనల్లో గీతిక 4–1తో కలైవాణి (భారత్)పై, అల్ఫియా 5–0తో లజత్ కుంగిబయెవా (కజకిస్తాన్)పై నెగ్గారు. గీతిక, అల్ఫియా 700 డాలర్ల (రూ. 55 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. మరో ఫైనల్లో జమున బోరో (54 కేజీలు) 0–5తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. రజతాలు నెగ్గిన కలైవాణి, జమునాలకు 400 డాలర్ల (రూ. 31 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. -
ప్రపంచ నంబర్ వన్ బాక్సర్‌గా అమిత్ పంఘాల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత బాక్సర్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్ ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. 52 కేజీల విభాగంలో 420 పాయింట్లతో అమిత్ అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో 2009 అనంతరం బాక్సింగ్‌లో నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకున్న తొలి భారత బాక్సర్‌గా నిలిచాడు. గతంలో విజేందర్ సింగ్ (75 కేజీలు) వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలవగా... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 22వ ర్యాంకును సాధించింది. మహిళల 69 కేజీల విభాగంలో లొవ్లీనా బొర్గోహైన్ మూడో ర్యాంకును దక్కించుకుంది. -
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
వోజ్వోదినా (సెర్బియా): ‘గోల్డెన్ గ్లవ్ ఆఫ్ వోజ్వోదినా’ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడితో మెరిసింది. సెర్బియాలోని సుబోటికా వోజ్‌వోదినాలో జరిగిన ఈ పోటీల్లో నిఖత్ 54 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె ఆర్ఎస్సీ (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్)తో ఫెరెన్జ్ జూడిత్ (హంగేరీ)ని చిత్తు చేసింది. తొలి రౌండ్లోనే జరీన్ పంచ్‌లను తట్టుకోలేక ప్రత్యర్థి కుప్పకూలడంతో బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. గతంలో కూడా సెర్బియాలోనే జరిగిన నేషన్స్ కప్‌లో ఈ బాక్సర్ విజేతగా నిలిచింది. ‘ఈ విజయం ఎంతో ప్రత్యేకం. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సెర్బియాలో మరోసారి స్వర్ణం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది’ అని జరీన్ ఆనందం వ్యక్తం చేసింది.