
న్యూఢిల్లీ: గల్యమ్ జరిల్‌గపోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు మెరిశారు. మూడు స్వర్ణాలతోపాటు ఒక్కో రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కజకిస్తాన్‌లోని కరాగండ పట్టణంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించే వైజాగ్ బాక్సర్ శ్యామ్ ఫైనల్లో 3–0తో జన్‌సెతోవ్ (కిర్గిస్తాన్)పై... సెమీఫైనల్లో 4–1తో అయితోజనోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన నమన్ తన్వర్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు. నమన్ తన్వర్‌కు టోర్నమెంట్ బెస్ట్ బాక్సర్ పురస్కారం కూడా లభించింది. మనీశ్ కౌశిక్ (60 కేజీలు) రజతం... మన్‌దీప్ జాంగ్రా (75 కేజీలు) కాంస్య పతకం సాధించారు.
రన్నరప్ భారత్
న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–15 బాలికల చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఢాకాలో జరిగిన ఫైనల్లో భారత్ 0–1 గోల్‌తో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తరఫున షమ్సున్ నహర్ 41వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment