Kakara Shyam Kumar
-
శ్యామ్ కుమార్‌కు పతకం ఖాయం
ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 3–2తో సహెన్ సమిక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత్‌కే చెందిన శశి చోప్రా (57 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరింది. -
శ్యామ్ కుమార్ ‘పసిడి’ పంచ్
న్యూఢిల్లీ: గల్యమ్ జరిల్‌గపోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు మెరిశారు. మూడు స్వర్ణాలతోపాటు ఒక్కో రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కజకిస్తాన్‌లోని కరాగండ పట్టణంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించే వైజాగ్ బాక్సర్ శ్యామ్ ఫైనల్లో 3–0తో జన్‌సెతోవ్ (కిర్గిస్తాన్)పై... సెమీఫైనల్లో 4–1తో అయితోజనోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన నమన్ తన్వర్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు. నమన్ తన్వర్‌కు టోర్నమెంట్ బెస్ట్ బాక్సర్ పురస్కారం కూడా లభించింది. మనీశ్ కౌశిక్ (60 కేజీలు) రజతం... మన్దీప్ జాంగ్రా (75 కేజీలు) కాంస్య పతకం సాధించారు. రన్నరప్ భారత్ న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–15 బాలికల చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఢాకాలో జరిగిన ఫైనల్లో భారత్ 0–1 గోల్‌తో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తరఫున షమ్సున్ నహర్ 41వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. -
పసిడి ‘పంచ్’కు చేరువలో శ్యామ్ కుమార్
జాతీయ సీనియర్ పురుషుల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 49 కేజీల విభాగం సెమీఫైనల్లో శ్యామ్ కుమార్ 5–0తో విపిన్ కుమార్ (చండీగఢ్)పై గెలిచాడు. ఫైనల్లో ఎన్టీ లాల్‌బియకిమా (మిజోరం)తో శ్యామ్ తలపడతాడు. ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ బాక్సర్లు మనోజ్ కుమార్ (69 కేజీలు), మన్దీప్ జాంగ్రా (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. -
సెమీస్‌లో శ్యామ్‌కుమార్, హుస్సాముద్దీన్
► కనీసం కాంస్యాలు ఖాయం ► క్వార్టర్స్‌లో మేరీకోమ్ ఓటమి న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ కప్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్... తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్‌లు పతకాలను ఖాయం చేసుకున్నారు. మంగోలియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో వీరికి కనీసం కాంస్య పతకం దక్కనుంది. క్వార్టర్స్‌లో శ్యామ్ కుమార్ (49 కేజీలు) మంగోలియాకు చెందిన ఎన్‌కాందాఖ్ కర్కూపై గెలుపొందగా... హుస్సాముద్దీన్ (56 కేజీలు) చైనా బాక్సర్ మా జిన్ మింగ్‌ను ఓడించాడు. వీరితో పాటు క్వార్టర్స్‌లో భారత్‌కు చెందిన అంకుశ్ దహియా (60 కేజీలు) డుల్గన్ (మంగోలియా)పై, ప్రియాంక చౌదరి (60 కేజీ) అలెక్సాండ్రా ఓర్డినా (రష్యా)పై నెగ్గి సెమీస్‌లో అడుగు పెట్టారు. మరోవైపు ఏడాది తర్వాత రింగ్‌లో అడుగుపెట్టిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు)కొరియాకు చెందిన చోల్ మి బంగ్ చేతిలో ఓటమి పాలై క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.