భారత బాక్సర్ల పసిడి పంచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. చెక్ రిపబ్లిక్‌లో ముగిసిన ఉస్తీ నాద్ లాబెమ్ గ్రాండ్‌ప్రి బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు ఎనిమిది పతకాలను సొంతం చేసుకున్నారు. ఇందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం విశేషం. ఢిలీ కామన్వల్త్ గేమ్స్ చాంపియన్ మనోజ్ కుమార్ (69 కేజీలు), ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత శివ థాపా (60 కేజీలు), అమిత్ ఫంగల్ (52 కేజీలు), గౌరవ్ బిధురి (56 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) పసిడి పతకాలను సాధించారు.
కవీందర్ బిష్త్ (52 కేజీలు), మనీశ్ పన్వర్ (81 కేజీలు) రజతాలు నెగ్గగా... సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) కాంస్య పతకం గెలిచాడు. ఫైనల్స్‌లో అమిత్ 3–2తో కవీందర్‌పై, గౌరవ్ 5–0తో ఇవనోవ్ జరోస్లావ్ (పోలాండ్)పై, శివ థాపా 5–0తో ఫిలిప్ మెస్‌జరోస్ (స్లొవేకియా)పై, మనోజ్ 5–0తో డేవిడ్ కొటార్సి (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా... మాక్స్ కెల్లర్ (జర్మనీ)పై సతీశ్ విజయం సాధించాడు. మరో ఫైనల్లో బజుయేవ్ (జర్మనీ) చేతిలో మనీశ్ ఓడిపోయాడు.