బ్యాంకాక్: ఈ ఏడాది మరో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. శనివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. 37 దేశాల నుంచి పలువురు మేటి బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. భారత్‌కే చెందిన దీపక్ సింగ్ (48 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకంతో అదరగొట్టాడు.
సెమీఫైనల్లో ఓడిన మంజు రాణి (48 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), భాగ్యబతి కచారి (75 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిన్‌లాండ్‌లో జరిగిన ‘గీ–బీ’ టోర్నీలో, పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్ స్టామ్ టోర్నీలో రజత పతకాలు నెగ్గిన హుసాముద్దీన్ మూడోసారీ రజతంతో సరిపెట్టుకున్నాడు. చట్‌చాయ్ డెచా బుత్‌దీ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో హుసాముద్దీన్ 0–5తో ఓడిపోయాడు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ సింగ్ 0–5తో మిర్జాఖెమెదోవ్ నోదిర్‌జోన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... బ్రిజేశ్ యాదవ్ 1–4తో అనావత్ థోంగ్‌క్రాటోక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 0–5తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 75 కేజీల ఫైనల్లో ఆశిష్ 5–0తో కిమ్ జిన్‌జే (కొరియా)పై నెగ్గి పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు.
తొమ్మిది స్వర్ణాలపై గురి...
ఇండోనేసియాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మోనిక (48 కేజీలు)... పురుషుల విభాగంలో గౌరవ్ బిధురి (56 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు), అంకుశ్ (64 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) నేడు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment