సాక్షి, సంగారెడ్డి : చినజీయర్ స్వామి తన వద్దకు వచ్చే ధనిక భక్తుల ద్వారా క్యాన్సర్ పేషెంట్లను ఆదుకునేలా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. డెంగ్యూ, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకోమని చినజీయర్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజల ఆరోగ్యం కోసం మహా ఉద్యమం చేపడతానన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో డెంగ్యూ, క్యాన్సర్ వ్యాధులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి.
స్లమ్ ఏరియాలోని ప్రజలకు ఎక్కువగా డెంగ్యూ వస్తోంది. సంగారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా అందుబాటులో లేవు. ఆసుపత్రికి వెళితే దాదాపు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతూ ప్రజలు అప్పులపాలవుతున్నారు. మరోవైపు క్యాన్సర్ చికిత్సకు రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. డెంగ్యూను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కేసీఆర్‌కు లేఖ రాస్తా. ప్రజలకు ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’ అని జగ్గారెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment