డెంగ్యూ వ్యాధి నిర్ధారణ, చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నవే. అనేక దఫాలుగా రక్త పరీక్షలు, ఔషధాలు, ఇంజెక్షన్లు... ఈ ట్రీట్‌మెంట్ అంతా ఖరీదైనదే. అందుకే బీమా సంస్థలు ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ కోసం హెల్త్ పాలసీలను ప్రవేశపెట్టాయి. ఇన్–పేషంట్ హాస్పిటలైజేషన్‌తో పాటు ప్రీ– హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ దాకా ఇవి కవరేజీని అందిస్తున్నాయి. పేద, గొప్ప తారతమ్యం లేకుండా ఎవరికైనా డెంగ్యూ సోకే ప్రమాదముంది కనక.. ఈ వర్షాకాలంలో డెంగ్యూ నుంచి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు సమగ్రమైన కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు చాలా అంశాలు చూసుకోవాలి. మొత్తం కుటుంబానికి కవరేజీ ఉంటుందా లేదా, సమ్ అష్యూర్డ్.. ప్రీమియం ఎంత? అప్పటికే ఉన్న వ్యాధులకు కవరేజీ ఇచ్చేందుకు వెయిటింగ్ పీరియడ్ ఎంత? నెట్‌వర్క్ ఆస్పత్రుల వివరాలు, క్యాష్‌లెస్ సదుపాయం, ప్రీ–పోస్ట్ హాస్పిటలైజేషన్, రూమ్ రెంటు పరిమితులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. డెంగ్యూ పాలసీలోనూ ఇలాంటివి ఉండేలా చూసుకోవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాల్లో కొన్ని ఇవి..
తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజీ
ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు కట్టే ప్రీమియానికి తగినంత విలువ లభిస్తోందో లేదో చూసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉండాలి. అత్యధిక కవరేజీ లభించాలి. ఇటు హాస్పిటలైజేషన్, అటు అవుట్‌పేషంట్ ట్రీట్‌మెంట్‌కూ పనికొచ్చేదిగా చూసుకోవాలి.
ఓపీడీ కవరేజీ..
డయాగ్నస్టిక్ టెస్టుల నుంచి కన్సల్టేషన్, హోమ్ నర్సింగ్, ఫార్మసీ దాకా అన్నింటికి కవరేజీనిచ్చేలా డెంగ్యూ పాలసీ ఉండాలి. సాధారణంగా డెంగ్యూ చికిత్స ఇంటి వద్దే పొందవచ్చు.
కొనుగోలు ప్రక్రియ సులభంగా
పాలసీ ఎంత సరళతరంగా ఉంటే అంత మంచిది. ఏ వయస్సు వారైనా çఏడాది మొత్తానికి ఒకేసారి ప్రీమి యం కట్టేసే పాలసీ తీసుకోవాలి. ముందస్తు వైద్య చికిత్సలు తదితర బాదరబందీ లేకుండా పాలసీ నిబంధనలు సరళంగా ఉన్నది ఎంచుకోవాలి. వెయి టింగ్ పీరియడ్ కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇతరత్రా సాధారణ ఆరోగ్య బీమా పాలసీలకు రిజెక్ట్ చేసిన వారికి సైతం డెంగ్యూ కేర్ పాలసీ వర్తించేలా ఉండాలి. ఆస్పత్రిలో చేరాకా.. గది అద్దె వంటి వైద్యయేతర ఖర్చులకు కూడా కవరేజీ ఉండాలి.
భారీగా చికిత్స ఖర్చులు..
డెంగ్యూ పాలసీని తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నవారు ఒకసారి దీని చికిత్స వ్యయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా డెంగ్యూ వైద్య పరీక్షలకే చాలా ఖర్చవుతుంటుంది. ఇక తీవ్రమైన కేసు అయిన పక్షంలో అప్పటికప్పుడు ఆస్పత్రిలో చేర్చి, ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి. వైద్య పరీక్షలకే దాదాపు రూ.5,000 నుంచి రూ. 10,000 దాకా ఖర్చవుతుంది. ఇక ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సా వ్యయాలు సుమారు రూ. 35,000 నుంచి రూ.70,000 దాకా ఉంటున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే బీమా సంస్థలు డెంగ్యూ కేర్ పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. వైద్య పరీక్షల నుంచి చికిత్స వ్యయాల దాకా అన్నింటికీ కవరేజీ అందించేవిగా ఇవి ఉన్నాయి.
ఇప్పటికే హెల్త్ పాలసీ ఉంటే...
ఒకవేళ ఇప్పటికే మీకో హెల్త్ పాలసీ ఉన్నా.. డెంగ్యూ పాలసీని ప్రత్యేకంగా తీసుకోవడం మంచిదే. తద్వారా మీ ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చే బోనస్‌ను యథాతథంగా అందుకోవచ్చు. సాధారణంగా ఏ క్లెయిమూ చేయని పాలసీదారుకు బీమా సంస్థలు కొంత బోనస్ ఇస్తుంటాయి. సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో లేదా ప్రీమియంలో డిస్కౌంటు ఇవ్వడం రూపంలోనో ఇది ఉంటుంది. ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ తీసుకోవడం వల్ల.. పాలసీదారు తన ప్రైమరీ హెల్త్ పాలసీలో దీన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా బోనస్‌లను కాపాడుకోవచ్చు. కాబట్టి.. ఈ వర్షాకాలంలో.. ప్రాణాంతకమైన డెంగ్యూ నుంచి మీకు, మీ కుటుంబసభ్యులందరికీ రక్షణ కల్పించేలా స్వల్ప ఖర్చుతో డెంగ్యూ పాలసీ తీసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం.
ఆంటోనీ జేకబ్
సీఈవో, అపోలో మ్యూనిక్ హెల్త్
Comments
Please login to add a commentAdd a comment