డెంగీ విజృంభణ
-
జిల్లాలో పెరుగుతున్న కేసులు
-
పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
-
ఇప్పటికే జిల్లాలో ఐదుగురు మృతి
-
లెక్కలు తక్కువ చూపే యత్నాల్లో వైద్యాధికారులు
-
జిల్లాలో 1586 డెంగీ పాజిటివ్ కేసులు
జ్వరం.. జ్వరం.. జ్వరం.. నేడు ఎవరి నోట విన్నా పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇదే మాట వినిపిస్తోంది. జిల్లా వాప్తంగా జనం విషజ్వరాలతో మంచం పడుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం, ప్రైవేటు ఆస్పత్రుల అడ్డగోలు దోపిడీతో జనం దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 1586 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్టు మెడాల్ హెల్త్‌కేర్ కంపెనీ ఇచ్చిన నివేదికలో స్పష్టం కావటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
సాక్షి, గుంటూరు : విషజ్వరాలు జిల్లాను వణికిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా జ్వరాలు అంతటా వ్యాపించాయి. జిల్లా వాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనం విష జ్వరాల బారినపడి మంచాలపై మూలుగుతున్నారు. ఈ సీజన్‌లో జ్వరాలు రావడం సాధారణమైనప్పటికీ, డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. జిల్లాలో ఇప్పటికే డెంగీ జ్వరంతో బాధపడుతూ ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం ప్రభుత్వాస్పత్రుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 24 వరకు 11,078 మందికి నిర్వహించిన పరీక్షల్లో 1,586 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి అధికారికంగా ఇచ్చిన నివేదిక ఇది.
తప్పుదోవ పట్టించే యత్నం...
డెంగీ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం లెక్కలు తక్కువ చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరగడంతో కృష్ణా నదిలో నీరు సైతం కలుషితమైంది. వైద్య శిబిరాల్లో చికిత్సలు పొందినవారిలో జ్వరపీడితులే అధికంగా ఉండటం గమనార్హం. గుంటూరు వైద్య కళాశాల మైక్రో బయాలజీ విభాగంలో ప్రభుత్వం తరఫున అధికారికంగా చేస్తున్న డెంగీ నిర్ధారణ పరీక్షల నివేదికలను బయటకు రానీయకుండా తొక్కిపెడుతూ జిల్లాలో డెంగీ కేసులు లేవంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే నివేదికల్లో సైతం డెంగీ కేసులను తక్కువ చేసి చూపి వారిని సైతం తప్పుదోవ పట్టించారు.
జ్వరం మూడు రోజులకు మించితే...
నేడు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్లా విషజ్వరాల కేసులు ఉన్నాయి. ఈ జ్వరం మూడు రోజుల నుంచి వారం రోజులు ఉంటుంది. వారానికి మించి జ్వరం ఉంటే తప్పక అన్ని రకాల పరీక్షలు చేయించాలి. జ్వరంతో పాటు వచ్చే నొప్పులు సాధారణంగా 15 రోజుల నుంచి నాలుగు నెలల పాటు ఉంటాయి. దీనిని వైద్య పరిభాషలో ‘వైరల్ ఆర్థ్రాలజీ’గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు.
దోమల నివారణ చర్యలేవీ?
దోమలు, వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవని విమర్శలు వస్తున్నాయి. ఏటా జూన్ నుంచి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సర్వే నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని జనం మండిపడుతున్నారు. జిల్లా మలేరియా అధికారి అనారోగ్యం కారణంగా తరచూ సెలవులు పెడుతుండటంతో ఆ విభాగం పనితీరు పడకేసింది. జ్వరాలు వ్యాపించిన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు చేయాల్సి ఉండగా వైద్యాధికారులు ఆ మేరకు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలకు ఇంటింటా తిరిగి అవగాహన కల్పించే కార్యక్రమాలూ చేపట్టడం లేదు. మరోపక్క ప్లేట్‌లెట్లు తగ్గిపోయాయంటూ ప్రైవేటు వైద్య శాలల్లో జనం నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. జనం జేబులు గుల్ల చేస్తున్నారు. సాధారణంగా ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్లు తగ్గడం సహజమని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి.
ప్లేట్‌లెట్లపై అపోహలు వీడండి..
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్లు తగ్గటం సహజం. అంతమాత్రానికే కంగారు పడకూడదు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్లు ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉన్నా ఎలాంటి ప్రమాదం సంభవించదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి వాటి ద్వారా రక్తం వస్తే, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు, ఫైలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దోమల నుంచి రక్షణకు దోమ తెరలు వాడటం చాలా మంచిది.
డాక్టర్ కె.రాజేంద్రకుమార్, జ్వరాల ఆస్పత్రి ప్రొఫెసర్