అనారోగ్యంతో నేత కార్మికుడి మృతి
అంబులెన్స్‌లోనే మృతదేహంతో కుటుంబీకులు
రాత్రంతా చలిలోనే పడిగాపులు
స్పందించిన కలెక్టర్.. బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇల్లు
ముస్తాబాద్(సిరిసిల్ల): గూడు లేక.. అద్దె ఇంటికి వెళ్లలేక.. మృతదేహంతో ఓ కుటుంబం రాత్రంతా అంబులెన్స్‌లో ఉన్న హృదయ విదారకర సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఖరీదైన వైద్యం పొందలేని నేత కార్మికుడు మృతిచెందగా.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి భర్త మృతదేహంతో రాత్రంతా చలిలోనే ఉండటం చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్‌కు చెందిన బిట్ల సంతోష్(48) వార్పిన్ నేత కార్మికుడిగా పని చేసేవాడు.
కేన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో సిరిసిల్లకు తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతిచెందాడు. అద్దె ఇంట్లో ఉంటూ భార్య శారద, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషిస్తున్న సంతోష్ మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లలేక పూర్తిగా శిథిలమైన తమ పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లి, రాత్రంతా చలిలో ఉన్నారు. ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు స్పందించారు. చందాలు పోగు చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
బాధిత కుటుంబానికి ఇల్లు..
నేత కార్మికుడు సంతోష్ కుటుంబ దీనగాథ తెలుసుకున్న కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి విషయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన.. బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని తహసీల్దా ర్ సురేశ్, ఎంపీడీవో బీరయ్యలను ఆదేశించారు. వారు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి చేతులమీదుగా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇంటి తాళాలు అందజేశారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని, చిన్నారుల చదువులకు సహకరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment